Updated : 07 Nov 2021 14:29 IST

బాలవినోదం


అసలుకే ఎసరు!

రామాపురంలో రంగన్న అనే వ్యాపారి నివసించేవాడు. అతడు స్వార్థపరుడు. నోరు తెరిస్తే చాలు అన్నీ అబద్ధాలే. అతడి దుకాణంలో గోపన్న పనిచేసేవాడు. అతడు కష్టజీవి. నిజాయతీపరుడు. ఓ రోజు రాత్రి కొట్టు కట్టేసి ఇంటికి వెళుతుండగా రంగన్న సంచి దుకాణం ముందున్న రోడ్డు మీద పడిపోయింది. అదృష్టం కొద్దీ అది గోపన్న భార్యకు దొరికింది. ఆమె దాన్ని తీసుకెళ్లి భర్తకు ఇచ్చింది. ఆ సంచి తన యజమానిదని గుర్తించి గోపన్న దాన్ని రంగన్నకు అందజేసి విషయం చెప్పాడు. మొదట అతడు సంతోషించినా... వెంటనే అతనిలో ఓ దురాలోచన పుట్టింది. దాంతో ‘ఈ సంచిలో వంద వెండినాణేలు ఉండాలి. ఇందులో ఇప్పుడు కేవలం అరవై మాత్రమే ఉన్నాయి. మిగతా నలభై నువ్వూ, నీ భార్య కలిసి కాజేశారు కదూ. నన్నే మోసం చేస్తారా?’ అన్నాడు దౌర్జన్యంగా. ‘అయ్యా... ఎన్ని నాణేలు ఉన్నాయో మాకు తెలియదు. నేనూ, నా భార్య అసలు సంచి విప్పనేలేదు. ఒక వేళ మాకు నిజంగా దురుద్దేశమే ఉంటే అసలు మీకు సంచిని ఎందుకు ఇస్తాం. మొత్తం మేమే తీసుకునేవాళ్లం కదా’ అన్నాడు. ఈ సమాధానంతో రంగన్నకు కోపం వచ్చింది. ‘నీ యజమానిని అయిన నాకే ఎదురు చెబుతావా? పద రాజు దగ్గరకు’ అని రాజదర్బారుకు తీసుకెళ్లాడు. సమస్య మొత్తం విన్న అక్బర్‌ కాసేపు ఆలోచించి, తర్వాత బీర్బల్‌ వైపు చూసి... ‘ఈ సమస్యేంటో మీరు పరిష్కరించండి’ అన్నాడు. బీర్బల్‌ గోపన్ననూ, అతని భార్యనూ విచారించాడు. వారు తమకు దొరికిన సంచిలో అసలు ఎన్ని నాణేలు ఉన్నాయో... అవి వెండివో, బంగారానివో, రాగివో తమకు తెలియదని, ఆ సంచి తన యజమానిదిలా ఉందని గుర్తించి నేరుగా తీసుకుని ఆయనకే అప్పగించామని ఎంతో నమ్మకంగా చెప్పారు. రంగన్న మాత్రం ‘లేదు... లేదు... ఈ సంచిలో నిజానికి వంద వెండి నాణేలు ఉండాలి. కానీ అరవై మాత్రమే ఉన్నాయి. అంటే నలభై వీళ్లే కాజేసి ఉంటారు’ అని మొండిగా వాదించాడు. బీర్బల్‌ ఒక్క క్షణం ఆగి... ‘జహాపనా..! నాకు ఓ వారం గడువు ఇప్పిస్తే ఈ సమస్య పరిష్కరిస్తా’ అన్నాడు. అందర్నీ ఓ వారం ఆగి రమ్మని అక్బర్‌ ఆజ్ఞాపించాడు. వారం తర్వాత... రంగన్న, గోపన్న, గోపన్న భార్య హాజరయ్యారు. ‘రంగన్న మీద నాకు చాలా నమ్మకం ఉంది. అతడు అసలు అబద్ధాలు ఆడడు. అతడు చెప్పినట్లు అతడి సంచిలో నిజంగా వంద నాణేలు ఉండాలి. కాబట్టి... అరవై నాణేలున్న సంచి అతనిది కానేకాదు. మన రాజ్య నియమం ప్రకారం ఏదైనా విలువైన వస్తువు ఎవరికైనా దొరికితే.. సగం దొరికిన వాళ్లు తీసుకుని... మరో సగం రాజుకు ఇవ్వాల్సి ఉంటుంది. వారం రోజులు గడిచినా ఎవరూ ఈ సంచి కోసం రాలేదు... కాబట్టి ముప్పై వెండినాణేలు గోపన్నకు ఇచ్చి... మిగతా ముప్పై మన ధనాగారంలో జమచేయడమే న్యాయం... జహాపనా!’ అన్నాడు బీర్బల్‌. ‘శభాష్‌... అద్భుతంగా తీర్పు చెప్పారు’ అంటూ బీర్బల్‌ను అక్బర్‌ మెచ్చుకున్నారు. రాజుకు ఎదురు చెప్పలేక తన అత్యాశ వల్లే అసలుకు ఎసరు వచ్చిందని బాధపడుతూ అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయాడు రంగన్న.Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని