Published : 18 Dec 2021 23:08 IST

  బాలవినోదిని

ఈర్ష్య తెచ్చిన తిప్పలు!

దుర్గాపురంలో ధనంజయ, రామాంజనేయ అనే స్నేహితులుండేవారు. వీరు కిరాణా వ్యాపారం చేసేవారు. రామాంజనేయ నిజాయతీపరుడు, ధనంజయ మాత్రం అందరినీ మోసం చేస్తుండేవాడు. అందుకే చాలా మంది రామాంజనేయ దగ్గర సరకులు తెచ్చుకునేవారు. ఇది ధనంజయకు కన్ను కుట్టేలా చేసింది. తాను రామాంజనేయ అంత ధనవంతుణ్ని కాలేకపోయాను అని ఈర్ష్యతో ఉండేవాడు. ఓ రోజు ధనంజయ, రామాంజనేయ సరకులు తేవడానికి పట్నానికి వెళ్లారు. దారిలో రామాంజనేయ డబ్బుల సంచి మాయమైంది. పట్నం వెళ్లాక ఆ విషయాన్ని గుర్తించాడు. ధనంజయ సాయం చేయకపోగా తనకు వేరే పని ఉందని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే స్థానిక న్యాయాధికారికి తన డబ్బు సంచి పోయిన విషయమై ఫిర్యాదు చేశాడు రామాంజనేయ. తనకు ధనంజయ మీద అనుమానంగా ఉందని చెప్పాడు. న్యాయాధికారి రామాంజనేయకు బస ఏర్పాట్లు చేశాడు. కానీ ఎంత ప్రాధేయపడినా... ధనంజయను విచారణకు పిలిపించలేదు. తర్వాత న్యాయాధికారి ఏకాంతంగా రామాంజనేయను కలుసుకొని కాసేపు ఏదో మాట్లాడాడు. మరుసటి రోజు మధ్యాహ్నం న్యాయాధికారి ధనంజయను పిలిపించాడు. దొంగతనం గురించి అడిగితే ఏమని సమాధానం ఇవ్వాలో ముందే మనసులో అనుకుని సిద్ధంగా ఉన్నాడు. కానీ... న్యాయాధికారి మాత్రం ‘ఎన్నాళ్ల నుంచి సాగుతోంది ఈ భాగోతం. మీ ఇద్దరూ తోడు దొంగలే కదా!’ అన్నాడు. ధనంజయ బిక్కమొహం వేసుకుని నిలబడ్డాడు. ‘నిన్న మా సైనికులకు రామాంజనేయ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపిస్తే  తీసుకొచ్చి నాలుగు తగిలించారు. తాను నకిలీ బంగారు నాణేలు చలామణి చేస్తున్నానని నిజం ఒప్పుకొన్నాడు. నిన్న తన నకిలీ నాణేల సంచిని నువ్వే కొట్టేశావని చెప్పాడు. నిజం ఒప్పుకొంటే తక్కువ శిక్ష. అదే నకిలీ నాణేలు నీ దగ్గర దొరికాయో... రాజద్రోహంగా పరిగణించి, రామాంజనేయతోపాటు నీకూ, దేశ బహిష్కరణ శిక్ష పడేలా చేస్తా’ అన్నాడు న్యాయాధికారి. వెంటనే ధనంజయ తాను సంచిని దొంగిలించిన విషయం ఒప్పుకున్నాడు. అప్పుడు ఇదంతా నాటకమనీ, దొంగను పట్టుకునేందుకు ఇలా చేశాననీ అసలు విషయం చెప్పాడు న్యాయాధికారి. తర్వాత ధనంజయకు మూడునెలల కారాగార శిక్ష విధించాడు. తన ఈర్ష్యే తనకు ఈ అవస్థ తెచ్చి పెట్టిందని చాలా బాధపడ్డాడు ధనంజయ.



 

 


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని