Updated : 26 Dec 2021 04:22 IST

బాలవినోదం

భలే భలే బ్యాగులు..!

ఏంటి నేస్తాలూ! అలా చూస్తున్నారూ...కార్లు, టైర్లను పట్టుకొని బ్యాగులు అంటారేంటి అని ఆలోచిస్తున్నారు కదూ! అయితే మరొక్కసారి వాటిని సరిగ్గా చూడండి. ఇవి నిజంగా స్కూలు బ్యాగులే! అచ్చం కారు, టైర్లలా భలేగున్నాయ్‌ కదా! అవును మరి... మనలాంటి చిన్నారుల అభిరుచికి తగ్గట్టు ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా వస్తువులు తయారు చేస్తుంటారు తయారీదారులు. అలా ఈసారి ఈ సరికొత్త బ్యాగులు తయారు చేసేస్తున్నారు. వీటిని స్కూలుకు వెళ్లేటప్పుడు బ్యాగులా వాడుకోవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు ఆటవస్తువుగానూ ఉపయోగపడుతుంది. ఇంకా ఊరు వెళ్లేటప్పుడు మన లగేజ్‌ బ్యాగ్‌లా కూడా దీన్ని వాడుకోవచ్చన్నమాట. అన్నట్టు ఇవి వాటర్‌ ప్రూఫ్‌ కూడా. కాబట్టి వాన వచ్చినా పుస్తకాలు తడుస్తాయన్న బెంగలేదు. అలాగే కారు, టైరు ఆకారంలో ఉన్నాయి కదా కాస్త బరువుగా ఉంటాయేమో అనుకునేరు. అస్సలు కాదు. పిల్లల కోసమని వీటిని చాలా తేలిగ్గా ఉండే మెటీరియల్‌తో తయారు చేస్తున్నారు. కాబట్టి పుస్తకాల బరువే తప్ప బ్యాగు బరువు అస్సలుండదు. తెలుసా! మార్కెట్‌లో ఈ బ్యాగులే ఇప్పుడు ఎక్కువ ఆకర్షణగా నిలుస్తున్నాయి. అదన్నమాట సంగతి.  ఐకమత్యమే మహాబలం!

అనగనగా ఓ అడవి. ఆ అడవిలో నాలుగు దున్నపోతులు ఉండేవి. మంచి స్నేహితులు. బలంలో వేటికవే సాటిగా ఉండేవి. అవి నడిచి వస్తుంటే పెద్ద పెద్ద పర్వతాలే కదిలి వస్తున్నాయా... అన్నట్లు అనిపించేది. వాటిని చూస్తే సింహాలకే ముచ్చెమటలు పట్టేవి. ఈ నాలుగు దున్నపోతులు కలిసి ఉన్నంత వరకూ తమ పప్పులు ఉడకవని అవి గ్రహించాయి.
వాటిని ఎలా అయినా విడదీయాలనుకున్నాయి. కానీ ఎలానో అర్థం కాలేదు. ఓ రోజు సింహాలు ఇదే విషయం చర్చించు కుంటుండగా గుంటనక్క ఒకటి వింది. వెంటనే అది సింహాల ముందుకు వచ్చి ‘సింహాల్లారా! మీకు నేను సాయం చేస్తాను. ఆ నాలుగు దున్నపోతుల మధ్య గొడవలు పెట్టి వాటిని విడదీస్తాను. మీరు ఒక్కోదాన్ని చంపి తినేయండి. కాకపోతే...’ అని ఆగిపోయింది నక్క. ‘చెప్పు... ఏంటో... కాకపోతే... అని అలా మధ్యలోనే ఆగిపోతే ఎలా?’ అన్నాయి సింహాలు. ‘ఏం లేదు... మీరు తినగా మిగిలిన తృణమో... పణమో నేనూ, మా బంధువులం తిని బతుకుతాం. మేం బతికి ఉన్నంతకాలం మీకు ఇలా మంచి... మంచి... సలహాలు ఇస్తుంటాం...’ అంది. ‘సర్లే... ముందు వాటిని విడదీసే పనిచూడు’ అన్నాయి సింహాలు. దున్నపోతు మాంసం రుచిని తలుచుకుంటూ నక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఆ నాలుగు దున్నపోతులు గడ్డి మేస్తుంటే నక్క అక్కడికి వెళ్లి మెల్లిగా గొంతు సవరించుకుని... ‘మీ నలుగురూ మంచి స్నేహితులనుకుంటా. మంచిది... మంచిది. నలుగురూ చాలా బలంగా ఉన్నారు. కానీ మీలో ఆ నాలుగో దున్నపోతే ఇంకాస్త బలంగా కనిపిస్తోంది. నాకు తెలిసి మీ ముగ్గురి కన్నా... దానికే శక్తి ఎక్కువ అనుకుంటా’ అంది. అప్పుడు ఆ నాలుగో దున్నపోతు పొంగిపోయింది. ‘అవును నక్కా..! ఈ మూడింటి కంటే నేనే బలంగా ఉంటా’ అంది. అంతే వాటి మధ్య క్షణాల్లో గొడవ ప్రారంభమైంది. వాటిలో అవి పోట్లాడుకుని దేనికవే విడిపోయాయి. అదే రోజు సాయంత్రం సింహాలన్నీ కలిసి ఒక దున్నపోతు మీద దాడి చేశాయి. అది సులువుగానే సింహాల చేతిలో ఓడిపోయి ప్రాణాలు కోల్పోయింది. ఇలా కొద్దిరోజుల్లోనే మిగతా మూడు దున్నపోతులు కూడా సింహాల చేతిలో ప్రాణాలు కోల్పోయాయి. జిత్తులమారి నక్క ఉచ్చులో పడకుండా ఐకమత్యంగా ఉండి ఉంటే తమకు ఇంత దుస్థితి వచ్చేది కాదని పాపం...  అవి తెలుసుకోలేకపోయాయి. 


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని