ఇత్తడి నుంచి పుట్టింది!

మనలాంటి పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ పిన్నీసు అవసరమైన వస్తువే. అసలు ఈ పిన్నీసు... అదే సేఫ్టీపిన్ను ఎలా పుట్టిందో తెలుసా! అమెరికాకు చెందిన వాల్టర్‌హంట్‌ దీన్ని కనిపెట్టాడు.

Updated : 14 Aug 2022 05:31 IST

ఇత్తడి నుంచి పుట్టింది!

నలాంటి పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ పిన్నీసు అవసరమైన వస్తువే. అసలు ఈ పిన్నీసు... అదే సేఫ్టీపిన్ను ఎలా పుట్టిందో తెలుసా! అమెరికాకు చెందిన వాల్టర్‌హంట్‌ దీన్ని కనిపెట్టాడు. దాని కోసం పెద్దగా ప్రయోగాలేమీ చేయలేదు. కొన్ని నిమిషాల్లోనే దానికి ఓ రూపం ఇచ్చాడు! అసలు ఏం జరిగిందంటే... మెకానిక్‌ అయిన వాల్టర్‌ చిన్న చిన్న పరికరాలు రూపొందిస్తూ, న్యూయార్క్‌లో మిల్లులకు అమ్ముతూ సొమ్ము చేసుకునేవాడు. ఓసారి ఎందుకో తెలియదుకానీ తన స్నేహితుడికి 15 డాలర్లు బాకీ పడ్డాడు. అవి చెల్లించడానికి వాల్టర్‌ దగ్గర డబ్బులు లేవు. అతడి బాకీ తీర్చడం కోసం ఏదైనా వస్తువును కనిపెట్టి అమ్మాలనుకున్నాడు. అప్పుడు అతడికి అక్కడ ఒక ఇత్తడి తీగ కనిపించింది. వెంటనే దాన్ని తీసుకుని అటూ, ఇటూ వంచాడు. ఓ వైపు కొనను పదునుగా చేశాడు. మరో వైపేమో కొక్కెంలా తయారు చేశాడు. దానికి ‘సేఫ్టీ పిన్ను’ అని పేరూ పెట్టాడు. దాన్ని డబ్ల్యు.ఆర్‌. గ్రేస్‌ అండ్‌ కంపెనీ వాళ్లకు 400 డాలర్లకు అమ్మాడు. ఆ డబ్బుల్లోంచి 15 డాలర్లతో తన స్నేహితుడి బాకీ తీర్చాడు. మిగిలిన మొత్తాన్ని తన ఖర్చుల కోసం వాడుకున్నాడు. ఆ ‘సేఫ్టీ పిన్ను’కు ఏప్రిల్‌ 10, 1849లో పేటెంట్‌ వచ్చింది. తర్వాత కొన్నేళ్లలోనే గ్రేస్‌ కంపెనీ వాళ్లు పిన్నీసుల్ని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి లక్షలాది డాలర్ల వ్యాపారాన్ని చేశారు. అలా పిన్నీసు ప్రపంచవ్యాప్తంగా పరిచయమైంది. ప్రస్తుతం ఏటా వందకోట్లకు పైగా పిన్నీసులు ఉత్పత్తి అవుతున్నాయి.


రైతు తెలివి!

రవీంద్రఖనిలో ఓ గుర్రపు రౌతు ఉండేవాడు. ఆ ఊళ్లో రైతు రాజయ్య తన కొడుకు పెళ్లిరోజున రౌతు దగ్గరి నుంచి గుర్రాన్ని అద్దెకు తీసుకువెళ్లాడు. పెళ్లి ఊరేగింపులో బాణసంచా శబ్దానికి ఆ ముసలి గుర్రం ప్రాణాలు వదిలింది. రౌతుకు గుర్రం ఖరీదు ఇచ్చుకుంటా అన్నాడు రైతు. రౌతు మాత్రం అది తనకు వంశపారంపర్యంగా వచ్చిందనీ, తనకు అదే కావాలనీ మొండికేశాడు. చనిపోయిన గుర్రాన్ని బతికించి ఇవ్వడం అసాధ్యమనీ, కావాలంటే మరి కాస్త ఎక్కువ మొత్తం ఇస్తానని రైతు ప్రాధేయపడ్డాడు. రౌతు ఒప్పుకోకపోగా తనను రాజయ్య మోసం చేస్తున్నాడని న్యాయాధికారికి ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి చెప్పిన సమయం కంటే ముందే వచ్చి న్యాయస్థానంలో కూర్చున్నాడు రౌతు. సమయం దగ్గర పడుతున్నా... రాజయ్య రాకపోవడంతో రౌతులో అసహనం పెరిగింది. రైతు రాజయ్య ఇల్లు ఆ పక్కనే కావడంతో, ఆయన్ను తీసుకురావడానికి వెళ్లాడు. ఇంటి తలుపు మూసి ఉంది. ‘రాజయ్యా... న్యాయాధికారి దగ్గరకు రాలేదేం?’ అని పిలిచాడు రౌతు. ఎంత పిలిచినా రాకపోవడంతో ఓపిక నశించి, తలుపును ఒక్క తోపు తోశాడు. అప్పటికే తలుపు వెనక కొన్ని కుండల్ని పేర్చి ఉంచాడు రాజయ్య. అవన్నీ పగిలిపోయాయి. అప్పుడు రాజయ్య న్యాయాధికారి దగ్గరకు పోయాడు. రౌతు న్యాయస్థానంలోనూ తనకు తన గుర్రమే కావాలని, అది తన తాతగారి నుంచి తన తండ్రికి, ఆయన నుంచి తనకు వచ్చిందని చెప్పాడు. న్యాయాధికారి నచ్చచెప్పినా వినలేదు. ‘మా తాతల కాలం నాటి నుంచి భద్రంగా దాచుకుంటూ వస్తున్న కుండల్ని పగలగొట్టాడు ఆ రౌతు. ఆ కుండల్నే నాకు ఇప్పిస్తే... నేను ఆయన గుర్రాన్ని ఎలాగైనా బతికించి తెచ్చిస్తాను’ అని చెప్పాడు రైతు. ఇద్దరి వాదనలూ విన్నాక... ‘తాతలకాలం నాటి గుర్రానికీ, తాతలనాటి కుండలకూ సరిపోయింది. ఇక మీరిద్దరూ ఇళ్లకు వెళ్లిపోండి’ అన్నాడు న్యాయాధికారి. రౌతు వెంటనే న్యాయాధికారి కాళ్ల మీద పడి, రాజయ్యను ఇబ్బంది పెట్టినందుకు మన్నించమని వేడుకున్నాడు. తన గుర్రానికి పరిహారం ఇప్పించమన్నాడు. రైతు తన కుండల డబ్బులు మినహాయించుకొని మిగతా మొత్తం చెల్లించాడు. ‘చాలా డబ్బులు లాగుదామనుకుంటే, ఇలా జరిగిందేంటి? ముందే రైతు ఇచ్చినంత తీసుకుని ఉంటే బాగుండేది’ అని రౌతు బాధపడ్డాడు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు