బోనం... సమర్పయామి!

ఆషాఢం... పేరుకు ఇది శూన్యమాసమైనా ముల్లోకాలను పాలించే జగన్మాతను భక్తిశ్రద్ధలతో కొలిచే మాసంగా పిలుస్తారు. నవరాత్రుల తరువాత అమ్మవారిని పూజించే నెలగా ఆషాఢానికి పేరు.

Published : 06 Jul 2024 23:47 IST

ఆషాఢం... పేరుకు ఇది శూన్యమాసమైనా ముల్లోకాలను పాలించే జగన్మాతను భక్తిశ్రద్ధలతో కొలిచే మాసంగా పిలుస్తారు. నవరాత్రుల తరువాత అమ్మవారిని పూజించే నెలగా ఆషాఢానికి పేరు. ఈ సమయంలో తెలంగాణ ప్రాంతంలో అంగరంగవైభవంగా నిర్వహించే బోనాల ఉత్సవాల వెనుక ఉన్న అంతరార్థమేంటో తెలుసుకుందామా...

బోనం.. అంటే అమ్మవారికి సమర్పించే నైవేద్యం అని అర్థం. భోజనం ప్రకృతి అయితే బోనం వికృతి. శివసత్తుల పూనకాలతో, పోతురాజుల నృత్యాలతో, ఘటాల ఊరేగింపుల మధ్య తలపైన బోనం పెట్టుకుని ఆలయానికి తరలివచ్చే మహిళలు శక్తి స్వరూపిణిని భక్తిశ్రద్ధలతో కొలిచే సందర్భమే బోనాల పండుగ. ఆషాఢంలో ఎంతో విశేషంగా జరిగే ఈ వేడుకలకు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని జగదాంబిక ఆలయంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసేవాడనీ.. ఆ క్రమంలోనే బోనాల ఉత్సవాలూ మొదలయ్యాయనీ ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. అలాగే ఒకప్పుడు భాగ్యనగరంగా పిలిచిన హైదరాబాద్‌లో ఈ ఉత్సవాల ప్రారంభం వెనుక మరో ఆసక్తికరమైన కథనమూ ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి విపరీతంగా వ్యాపించడంతో ఎంతోమంది ప్రజలు చనిపోయారట. అమ్మవారు ఆగ్రహించడం వల్లే ఈ వ్యాధి వ్యాపించిందని భావించిన ప్రజలు జాతరలు జరిపిస్తే దేవి శాంతిస్తుందని నమ్మి ఈ బోనాల ఉత్సవాలను మొదలుపెట్టారని చెబుతారు. అప్పటి నుంచీ నేటి వరకూ ఏటా ఆషాఢంలో ఈ ఉత్సవాలను తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఈ సమయంలో జగన్మాత పుట్టింటికి చేరుకుంటుందట. అలా వచ్చే అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి బోనాన్ని సమర్పిస్తే.. సంతోషిస్తుందని భక్తుల విశ్వాసం.  

బోనం అంటే...

ఈ వేడుకలో భాగంగా ఆషాఢంలో వచ్చే ఆదివారాల నాడు... రాగి లేదా మట్టికుండకు పసుపు రాసి కుంకుమబొట్లు పెట్టి అందులోనే పసుపు అన్నం లేదా పొంగలిని వండి.. దానిపైన దీపాన్ని వెలిగించిన మరో పాత్రను ఉంచి వేపాకులతో అలంకరిస్తారు. ఇలా తయారుచేసిన బోనాన్ని మహిళలు తలపైన పెట్టుకుని డప్పుల చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి తల్లికి నివేదిస్తారు. తమ కుటుంబాన్నీ, ఊరినీ కాపాడమంటూ వేడుకుంటారు.  

ఎక్కడ మొదలవుతాయంటే...

ఈ ఉత్సవాలు తెలంగాణలో ఎక్కువగా జరిగినా రాయలసీమ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లోనూ చూడొచ్చు.  మొదట హైదరాబాద్‌లోని గోల్కొండలో ఉన్న జగదాంబికా ఆలయంలో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆ తరువాత బల్కంపేట రేణుకా ఎల్లమ్మ ఆలయం, సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి సన్నిధానంలో నిర్వహించే లష్కర్‌ బోనాలు, లాల్‌దర్వాజాలోని సింహవాహిని మహంకాళితోపాటు ధూల్‌పేట్‌.. ఇలా హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడతాయి. ఆఖరున మళ్లీ గోల్కొండ కోటలోనే చివరి బోనం సమర్పించడంతో ఇవి ముగుస్తాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రంగం పేరుతో చెప్పే భవిష్యవాణికీ ఎంతో ప్రాధాన్యమిస్తారు భక్తులు. అయితే ఈ బోనాలు నిర్వహించడం వెనుక మరో కోణమూ దాగుంది. ఆషాఢంలోనే వర్షాలు మొదలవుతాయి. ఈ సమయంలో అంటువ్యాధులతోపాటు విషజ్వరాలు వ్యాపించడం సర్వసాధారణం. పరిసరాలు శుభ్రంగా ఉంటే వాటిని కొంతవరకూ తగ్గించుకోవచ్చు అనే ఉద్దేశంతోనూ ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయనీ చెబుతారు. అందుకే బోనాల సమయంలో గుమ్మాలకు వేపమండల్ని కడతారు. వేప ఆకులకు క్రిమికీటకాలను దూరం చేసే గుణం ఉంటుంది. మహిళలూ ఉత్సవంలో భాగంగా కాళ్లకు పసుపు రాసుకుంటారు. తద్వారా పాదాలకు పగుళ్ల సమస్య రాకుండా నివారించినట్లు అవుతుందని నమ్ముతారు. కారణం ఏదయినా అమ్మవారిని కొలిచేందుకు ఇదీ ఓ అవకాశమని అర్థంచేసుకుంటే ఆధ్యాత్మిక ఆనందంతోపాటు ఆరోగ్యాన్నీ కాపాడుకున్నవాళ్లమవుతాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..