ఎడారిలో నీటి సొరంగాలు!

నీరున్నచోట పంటలు పండించడంలో గొప్పతనం ఏమీ లేదు. కానీ సుమారు పదిహేను వందల ఏళ్ల క్రితమే ఎడారి ప్రాంతంలో నీటిని ఒడిసిపట్టి అది కాస్తా ఆవిరైపోకుండా భూగర్భంలో సొరంగాలు ఏర్పాటు

Published : 19 Jun 2022 00:24 IST

ఎడారిలో నీటి సొరంగాలు!


నీరున్నచోట పంటలు పండించడంలో గొప్పతనం ఏమీ లేదు. కానీ సుమారు పదిహేను వందల ఏళ్ల క్రితమే ఎడారి ప్రాంతంలో నీటిని ఒడిసిపట్టి అది కాస్తా ఆవిరైపోకుండా భూగర్భంలో సొరంగాలు ఏర్పాటు చేసుకుని పంటలు పండించిన నాజ్కా వాసుల ఇంజినీరింగ్‌ పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఇక్కడ మీరు చూస్తోన్న రాళ్ల బావులన్నీ ఆనాటివే మరి. దక్షిణ పెరూలోని నాజ్కా ప్రాంతంలోనూ ఉత్తర చిలీలోనూ క్రీ.శ. 200-700 మధ్య కట్టినట్లుగా భావిస్తున్న ఈ నీటి బావుల్నే పుక్వియోస్‌ లేదా కాంటాలక్‌ ఆక్విడక్ట్‌లనీ పిలుస్తారు. అక్కడ ఉన్న 46 ఆక్విడక్టుల్లో 43 నేటికీ వాడుకలో ఉండటం విశేషం. వర్తులాకారంలో రాళ్లను పేర్చుకుంటూ నిర్మించిన ఈ బావుల్లో- పై నుంచి కిందకి వెళ్లే కొద్దీ వెడల్పు తగ్గుతూ ఉంటుంది. అయితే అలా నిర్మించడం వెనకున్న రహస్యమేమిటనేది చాలా కాలం వరకూ శాస్త్రవేత్తలకు అంతుబట్టలేదు. ఎట్టకేలకు శాటిలైట్ల ద్వారా చిత్రాలు తీసి పరిశీలించినప్పుడు ఈ బావులన్నీ ఒకదాంతో ఒకటి అనుసంధానమై ఉన్నాయనీ, రాళ్లూ చెట్ల మొద్దులతో భూమిలోపల టన్నెల్‌ మాదిరిగా నిర్మించి నీరు ప్రవహించేలా చేశారనీ తెలిసిందట. అంతేకాదు, ఈ వర్తులాకారపు బావులకు కొద్ది దూరంలో సన్నని కాలువల్లాంటివీ ఉన్నాయి. అంటే- ఆ బావుల్లోని నీరు భూగర్భం గుండా ప్రవహిస్తూ ఈ కాలువల్లోకి వస్తుంది. ఆ నీటిని పంట పొలాలకీ జీవనానికీ వాడుకునేవారన్నమాట. స్థానికులు ఇప్పటికీ ఈ నీటితో పంటలు పండించుకుంటున్నారు. అయితే ఆ రోజుల్లోనే అలా ఎలా కట్టారనేది నేటికీ అంతుబట్టడం లేదట. గొప్ప విషయమే కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..