క్యాలెండర్‌ కథ తెలుసా?

మానవ జీవనానికీ ప్రకృతిలో మార్పులకీ దగ్గర సంబంధం ఉంది. ఈ మార్పులు గ్రహాల కదలికలపైన ఆధారపడి ఉంటాయన్న విషయాన్ని వేల సంవత్సరాల కిందటే గుర్తించారు.

Updated : 01 Jan 2023 12:46 IST

క్యాలెండర్‌ కథ తెలుసా?

మానవ జీవనానికీ ప్రకృతిలో మార్పులకీ దగ్గర సంబంధం ఉంది. ఈ మార్పులు గ్రహాల కదలికలపైన ఆధారపడి ఉంటాయన్న విషయాన్ని వేల సంవత్సరాల కిందటే గుర్తించారు. దాన్ని అర్థం చేసుకోవడంలో భాగంగా కాలాన్ని గణించే ప్రయత్నాలు మొదలయ్యాయి. అందులోంచి పుట్టిందే క్యాలెండర్‌.

2100, 2200, 2300, 2400 వీటిలో ఏది లీపు సంవత్సరం?

‘అన్నీ లీపు సంవత్సరాలేగా’ అంటారా! అయితే క్యాలెండర్‌ గురించి మీరింకా పూర్తిగా తెలుసుకోలేదన్నమాట.

సౌరమానం, చాంద్రమానం, చాంద్ర-సౌర మానం.. కాలాన్ని ఈ పద్ధతుల్లో కొలుస్తూ వచ్చారు మన పూర్వికులు. చంద్రుడి కదలికల్ని పట్టుకోవడం సులభం. అందుకే ఎక్కువగా చాంద్రమానాన్నే అనుసరించేవారు. కానీ రుతువులు సూర్యుడి గమనం పైన ఆధారపడి ఉంటాయి. మన దగ్గర చాంద్ర- సౌర మానం కనిపిస్తుంది. దీన్లో చంద్రకళలను అనుసరించి నెలలు నడుస్తాయి. వీటికి సూర్య గమనాన్ని కలపడానికి అనువుగా అధిక మాసాల్ని జోడిస్తుంటారు.

ప్రస్తుతం వాడుకలో ఉన్న క్యాలెండరు చరిత్ర ఈజిప్టులో మొదలైంది. క్రీ.పూ. ఆరువేల సంవత్సరాల కిందటే అక్కడ కాలాన్ని లెక్కించేందుకు ప్రయత్నించారు. చంద్రుడి గమనాన్ని బట్టి నెలకు 30 రోజులన్న నిర్ధరణకు వచ్చింది వారే. సూర్యోదయ స్థాన చలనాన్నిబట్టి ఏడాదికి 360 రోజులని తెలుసుకున్నదీ, తర్వాత దాన్ని 365 1/4 రోజులని సర్దుబాటు చేసిందీ, ఏడాదికి పన్నెండు నెలలని చెప్పిందీ వాళ్లే. నేటి ఇరాన్‌, ఇరాక్‌ ప్రాంతంలో వెలిసిన బాబిలోనియాలోనూ క్యాలెండర్‌పైన పరిశోధనలు జరిగాయి. సూర్యుడు నడిచే దార్లో ఉన్న ప్రధాన నక్షత్రాల్ని పన్నెండు రాశులుగా విభజించిన ఘనత వారిదే. వారానికి ఏడు రోజులు, రోజుకు 24 గంటలూ, గంటకు 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకన్లు.. ఈ విభజనా బాబిలోనియన్లూ ఈజిప్షియన్లదే. చాంద్ర-సౌర మానానికి మరింత శాస్త్రీయత తెచ్చిన ఘనత గ్రీకులది.

ఆధునిక క్యాలెండర్‌..

రోమ్‌ నగరంలో ప్రతి నెలా పాడ్యమి చంద్రుడు కనిపించగానే కొత్త నెల వచ్చిందని చాటించేవారు. లాటిన్‌లో క్యాలెర్‌ అంటే పిలుపు. నెలలో మొదటి రోజు క్యాలెండ్‌. అప్పుల చిట్టాలు రాసే పుస్తకం క్యాలెండర్‌. మామూలుగా ఆ పద్దులన్నీ ఒకటో తేదీనే రాసేవారు. ఆ పుస్తకమే క్రమంగా రోజులూ, వారాలూ, నెలలూ చూపే క్యాలెండర్‌ అయింది. అదే రోమన్‌ రిపబ్లికన్‌ క్యాలెండర్‌. దీన్లో మొదట పది నెలలు, 304 రోజులు ఉండేవి. అందులో మార్చి మొదటి నెల. తర్వాత కాలంలో జనవరి, ఫిబ్రవరి చేరి ఏడాదికి 365 రోజులయ్యాయి. కొన్నాళ్లకు జనవరి మొదటి నెలగా మారింది. సరి సంఖ్య దురదృష్టకరమని నెలలో 29 లేదంటే 31 రోజులు ఉండేవి. ఏడాదికి 365 రోజులు లెక్కిస్తూ రావడంవల్ల దీర్ఘకాలంలో ఏ రుతువులో రావాల్సిన పండగలు ఆ రుతువులో వచ్చేవి కాదు. దీన్ని సరిచేసే పనిని గ్రీకు ఖగోళ విద్వాంసుడు ‘సొసిజెనిస్‌’కు అప్పగించాడు రోమన్‌ పాలకుడు జూలియస్‌. దానిమీద అధ్యయనం చేసిన జెనిస్‌ ఏడాదికి 365 1/4 రోజులని చెప్పాడు. నాలుగేళ్లకోసారి ఆ పావు రోజుని సర్దుబాటు చేయడానికి లీపు సంవత్సరాన్ని తెచ్చాడు. ఈ మార్పులతో కొత్తగా జూలియన్‌ క్యాలెండర్‌ వచ్చింది. వాస్తవానికి భూపరిభ్రమణ(భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టే సమయం) కాలం 365 రోజుల, 5 గంటల, 48 నిమిషాల, 45.25 సెకన్లు. కానీ జూలియన్‌ క్యాలెండర్‌లో దీన్ని 365 రోజుల ఆరు గంటలుగా లెక్కించారు. అంటే 11 నిమిషాల 15 సెకన్లు ఎక్కువ. ఈ తేడా దాదాపు వందేళ్లలో ఒక రోజుగా ఉంటుంది. ఆ ప్రభావం 369 ఏళ్ల తర్వాత ఈస్టర్‌ పండగ మీద పడింది. దీంతో 1572లో పోప్‌ గ్రెగరీ-13 సూచనతో మరోసారి క్యాలెండర్‌ సంస్కరణ జరిగింది. రుతువుల దృష్ట్యా అప్పటికి అమల్లో ఉన్న జూలియన్‌ క్యాలెండర్‌ లోంచి పది రోజులను వదిలేయాలన్నారు నిపుణులు. అలాగే 400తో శేషం లేకుండా భాగించడం వీలుకాని శతాబ్ద సంఖ్యను లీపు సంవత్సరంగా పరిగణించకూడదన్నారు. ఆ లెక్కన 2400 లీపు సంవత్సరమే కానీ 2100, 2200, 2300 లీపు సంవత్సరాలు కావు. ఇది 1582లో అమల్లోకి వచ్చింది. ఆ ఏడాది అక్టోబరు 4 తర్వాత అయిదో తేదీగా కాకుండా 15వ తేదీగా లెక్కించారు. పోప్‌ పిలుపుతో ఇటలీ, పోర్చుగల్‌, పోలాండ్‌, స్పెయిన్‌లు ఆ క్యాలెండర్‌ని తక్షణమే అమలు చేశాయి. దీన్నే గ్రెగోరియన్‌ క్యాలెండర్‌గా పిలుస్తారు. తర్వాత మరికొన్ని ఐరోపా దేశాలూ దాన్ని పాటించడం మొదలుపెట్టాయి. ఆపైన వాటి వలస దేశాలూ, తరవాత ప్రపంచవ్యాప్తంగానూ ఈ క్యాలెండర్‌ వినియోగంలోకి వచ్చింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..