Deepika padukone: పట్నం వైద్యాన్ని... పల్లెకు తెచ్చింది!

దీపికా పదుకొణె... తానో మానసిక సమస్య బాధితురాలినని బహిరంగంగా చెప్పుకున్న తొలి స్టార్‌ హీరోయిన్‌! చెప్పడమే కాదు... తనలాంటివాళ్ళని ఆదుకోవడం కోసం ‘లివ్‌-లవ్‌-లాఫ్‌’ అన్న సంస్థనీ ప్రారంభించింది. ఇప్పటిదాకా నగరాలకే పరిమితమవుతూ వచ్చిన ఈ సంస్థ ఇప్పుడిప్పుడే పల్లెల వైపు అడుగులేస్తోంది.

Updated : 13 Nov 2022 12:33 IST

Deepika padukone: పట్నం వైద్యాన్ని... పల్లెకు తెచ్చింది!

దీపికా పదుకొణె... తానో మానసిక సమస్య బాధితురాలినని బహిరంగంగా చెప్పుకున్న తొలి స్టార్‌ హీరోయిన్‌! చెప్పడమే కాదు... తనలాంటివాళ్ళని ఆదుకోవడం కోసం ‘లివ్‌-లవ్‌-లాఫ్‌’ అన్న సంస్థనీ ప్రారంభించింది. ఇప్పటిదాకా నగరాలకే పరిమితమవుతూ వచ్చిన ఈ సంస్థ ఇప్పుడిప్పుడే పల్లెల వైపు అడుగులేస్తోంది. అందులో భాగంగా ఆరునెలల కిందట తమిళనాడు తిరువళ్ళూరులో సేవల్ని మొదలుపెట్టింది. ఇటీవల అక్కడికొచ్చిన దీపిక... తన సంస్థ అక్కడి జీవితాలని మార్చిన తీరుని చూసి
ఎంతో మురిసిపోయింది!

పల్లె పేరు కరికాలవాక్కం. ఆ ఊరికున్న ఒకే ఒక్క ఇరుకైన సీసీ రోడ్డులో వచ్చి నిలబడింది ఓ ఎస్‌యూవీ. అందులో నుంచి దీపిక పదుకొణె దిగుతుందని తెలియగానే... అక్కడ చేరిన కుర్రకారంతా కేకలేయడం మొదలుపెట్టారు. కానీ ఆ రోజు దీపిక మేకప్‌ ముఖంతో రాలేదు. సినిమా ప్రమోషన్‌లప్పుడు చేసినట్టు కారు దిగగానే గాల్లోకి చేతులు ఊపలేదు, కనీసం నవ్వలేదు. మౌనంగా, పక్కన ఉన్న
ఓ గుడిసె వైపు దారితీసింది. ఆ గుడిసె నుంచి బయటకొచ్చిన దేవి చేతుల్ని ఆప్యాయంగా పట్టుకుని లోనికెళ్ళింది. దేవి... మానసిక వికలాంగుడైన తన 22 ఏళ్ళ కొడుకుతో సమతమవుతున్న ఒంటరి తల్లి. ఓ బైకు ప్రమాదంలో తలకి గాయమై అలా అయ్యాడు తను. తల్లితప్ప ఇంకెవరు కనిపించినా మీదపడి కొరికేవాడు. దీపిక స్థాపించిన లివ్‌లవ్‌లాఫ్‌(ట్రిపుల్‌ ఎల్‌) అందించిన సాయంతో చికిత్స పొందుతూ ఇప్పుడిప్పుడే మామూలు మనిషవుతున్నాడు. అందుకే ఆ ఇంటిని చూడటానికి వచ్చింది దీపిక. ఆ రోజు దేవితోపాటే చాపమీద కూర్చుని చికిత్సతో ఆమె కొడుకులో వస్తున్న మార్పుల గురించి వివరంగా అడిగి తెలుసుకుంది.

ఆ ఇంట ముగ్గురు సంతానం... ఇద్దరు అన్నదమ్ముల తర్వాత ఓ చెల్లెలు.

ఎనిమిదేళ్ళ కిందట తల్లిదండ్రులిద్దరూ ఓ రోడ్డుప్రమాదంలో చనిపోయారు. అమ్మానాన్నల మృతిని తట్టుకోలేని ఆ కూతురు గోమతికి మతిభ్రమించింది... పిచ్చిగా మాట్లాడటం మొదలుపెట్టింది. విషాదమేంటంటే-చెల్లిని చూసుకోవాల్సిన ఆ ఇద్దరు అన్నదమ్ములూ అలాగే తయారయ్యారు.

ఆ ముగ్గురూ కలిసి ఊళ్ళోని చెత్తంతా తీసుకొచ్చి ఇంట్లో నింపేవాళ్లు. అనాథలుగా వీధినపడి దొరికింది తినేవాళ్ళు. ఎనిమిదేళ్లపాటు అదే జీవితం వాళ్ళది! అలాంటివాళ్ళని ‘ట్రిపుల్‌ ఎల్‌’ వలంటీర్లు గుర్తించారు. వాళ్ళనీ వాళ్ళింటినీ శుభ్రంచేసి మానసిక చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు.

ఆ చికిత్సకి కావాల్సిన సమస్త ఖర్చుల్నీ ఆ సంస్థే భరించింది. ఆరునెలల కాలంలోనే... ఆ చెల్లెలు గోమతి మామూలు మనిషయింది. ఇంకా కోలుకోలేని తన అన్నల్ని చూసుకుంటోంది. కుట్టుపని నేర్చుకోవడమే కాదు... ఆ ఫౌండేషన్‌ ఏర్పాటుచేసిన కేర్‌టేకర్స్‌ స్వయంఉపాధి సంఘంలోనూ చేరింది. దీపిక పదుకొణె ఆరోజు గోమతినీ కలిసింది.

తను ఆ రోజు రెండు కుటుంబాలవాళ్ళనే కలిసినా ఆమె స్థాపించిన సంస్థ ఆ చుట్టుపక్కలున్న ఐదొందల మంది మానసిక సమస్యలున్న వాళ్లకి సేవలందిస్తోంది. వాళ్ళతోపాటూ వాళ్ళ బాగోగులు చూసే కేర్‌టేకర్స్‌ 480 మందికి ఉపాధి చూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరు జిల్లా సరిహద్దు నుంచి అరగంట దూరంలో ఉన్న తమిళనాడు తిరువళ్ళూరు జిల్లా పరిధిలోని కుగ్రామాల్లో ‘ట్రిపుల్‌ ఎల్‌’ పనిచేస్తోంది. సుమారు ఏడునెలల కిందట ఈ సేవలకి శ్రీకారం చుట్టింది. ఇక్కడ ఇదివరకే వికలాంగులకి సేవలందిస్తున్న ‘వసంతం ఫౌండేషన్‌’ అన్న ఎన్జీఓని నోడల్‌ సంస్థగా నియమించుకుంది.

మారుమూల పల్లెల్లో ఉన్న ఐదొందలమంది మానసిక వికలాంగుల్ని గుర్తించింది. తీవ్రత ఎక్కువగా ఉన్న 120 మందికి చుట్టూ ఉన్న ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందించింది. మిగతావాళ్ళకి ఎప్పటికప్పుడు సైకియాట్రిస్టుల ద్వారా చికిత్సా, మందులూ అందేలా చూస్తోంది. కోలుకున్నవాళ్ళ ఉపాధి కోసం తమిళనాడు ప్రభుత్వం నుంచి వికలాంగ పెన్షన్‌ కూడా ఇప్పిస్తోంది. అంతేకాదు,
ఆ వికలాంగుల్ని చూసుకునే(95 శాతం స్త్రీలేనట) వాళ్ళతో స్వయం ఉపాధి సంఘాలని ఏర్పాటుచేసి రకరకాల నైపుణ్యాలని నేర్పుతోంది. ఇవన్నీ మొదలై ఆరునెలలు పూర్తయిన సందర్భంగానే దీపిక ఇలా వచ్చింది!

‘పల్లెలకి ఎవరూ లేరు’

‘మనదేశంలోని సైకియాట్రిస్టులందరూ నగరాలకే పరిమితమవుతున్నారు. కాస్త డబ్బున్నవాళ్లు మాత్రమే పట్నాలకి వెళ్ళి చికిత్స తీసుకుంటున్నారు. మిగతావాళ్ళు మంత్రగాళ్ళనీ నమ్ముతూ మానసిక వికలాంగుల పరిస్థితిని దిగజారుస్తున్నారు. అందుకే మా సేవలు నగరాలకన్నా ఇక్కడే అవసర మనుకున్నాం’ అంటోంది దీపిక. త్వరలోనే దీన్ని దేశంలోని మిగతాపల్లెలకీ తీసుకెళ్తుందట. ఒడిశా, కర్ణాటకల్లోనూ ఇదే తరహా సేవల్ని మొదలుపెట్టింది. మూడు రాష్ట్రాల్లో ఐదువేలమందికిపైనా మానసిక వికలాంగులకి సేవలందిస్తోంది! పేరుకు తగ్గట్టే... వేల కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది దీపిక.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..