అశ్వగంథ... ఎంతో మేలు!

భారతీయ జిన్‌సెంగ్‌గా పిలిచే అశ్వగంథను వేల సంవత్సరాల నుంచీ ఆయుర్వేదంలో వాడుతున్నారు. అది అద్భుతమైన ఔషధమనీ,

Updated : 06 Feb 2022 16:57 IST

అశ్వగంథ... ఎంతో మేలు!

భారతీయ జిన్‌సెంగ్‌గా పిలిచే అశ్వగంథను వేల సంవత్సరాల నుంచీ ఆయుర్వేదంలో వాడుతున్నారు. అది అద్భుతమైన ఔషధమనీ, ముఖ్యంగా స్త్రీలలో బరువు తగ్గేందుకూ ఒత్తిడిని తగ్గించేందుకూ తోడ్పడుతుందనీ, దీన్ని వాడటం వల్ల శారీరకంగానూ మానసికంగానూ కూడా ఆరోగ్యంగా ఉండొచ్చనీ ఆధునిక నిపుణులూ పేర్కొంటున్నారు.

* ఒత్తిడి కారణంగా ఆహారం ఎక్కువగా తీసుకుంటారు అనేది ఇప్పటికే అనేక పరిశీలనల్లో స్పష్టమైంది. అయితే అశ్వగంథ వల్ల ఆందోళన, ఒత్తిడి వంటివి తగ్గుతాయనీ తద్వారా ఫుడ్‌ క్రేవింగ్‌ కూడా తగ్గడంతో బరువు అదుపులో ఉంటుందనీ తాజా పరిశోధనలూ చెబుతున్నాయి.
* హార్మోన్ల అసమతౌల్యంతో తలెత్తే మధుమేహ సమస్యల్నీ ఇది నిరోధిస్తుంది. కాబట్టి పీసీఓడీ, ఇతరత్రా నెలసరి సమస్యలతో బాధపడేవాళ్లకి ఇది ఎంతో మేలు చేస్తుంది. మెనోపాజ్‌ సమయంలో తలెత్తే అనేక సమస్యలకు ఇది మందులా పనిచేస్తుంది.
* రక్త ప్రసరణను పెంచడం ద్వారా స్త్రీ, పురుషులిద్దరిలోనూ లైంగిక శక్తి పెరిగేలా చేస్తుందట. ముఖ్యంగా సంతానలేమితో బాధపడుతున్న పురుషులు దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శుక్ర కణాల శాతం పెరిగి సంతానం కలిగే అవకాశాలు ఎక్కువని అధ్యయనంలో తేలింది. అదేసమయంలో టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌      శాతం పెరగడంతో కండరాలూ శక్తిమంతమవుతాయి.
* నిద్రలేమినీ కీళ్లనొప్పుల్నీ తగ్గించే గుణం కూడా దీనికి ఉంది. మతిమరుపుతో బాధపడుతోన్నవాళ్లకీ అశ్వగంథ మంచి మందే. కాబట్టి దీన్ని సప్లిమెంట్లు లేదా టీ రూపంలో తీసుకుంటే అన్ని విధాలా ఆరోగ్యానికి మేలు చేస్తుంది అంటున్నారు నిపుణులు.


ముఖానికి ఎర్ర కందిపప్పు

ర్మసమస్యల్ని మన ఇంట్లో ఉన్న పప్పుదినుసులతోనూ చక్కగా నివారించుకోవచ్చు. ఉదాహరణకు ఎర్ర కందిపప్పుతో రకరకాల ప్యాక్‌లు వేసుకోవడం ద్వారా ముఖాన్ని అందంగా మెరిసేలా చేయవచ్చు.

* అరకప్పు ఎర్ర కందిపప్పుని రాత్రంతా నాననిచ్చి ఉదయాన్నే మెత్తగా రుబ్బాలి. ఆ తరవాత అందులో పావుకప్పు పచ్చిపాలు పోసి కలపాలి. ఇప్పుడు దీన్ని ముఖానికి మర్దించినట్లుగా పూసి ఇరవై నిమిషాల తరవాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ఇది ట్యాన్‌ని తొలగించి, చర్మరంధ్రాలు తెరచుకునేలా చేసి ముఖం మెరిసేలా చేస్తుంది. జిడ్డునీ తొలగిస్తుంది. తద్వారా మెటిమల్నీ రాకుండా అడ్డుకుంటుంది.
* టేబుల్‌స్పూను ఎర్ర కందిపప్పు పొడికి 2 టేబుల్‌స్పూన్ల పాలు,చిటికెడు పసుపు, మూడు చుక్కల కొబ్బరి నూనె కలిపి పేస్టులా చేసి ముఖానికి పట్టించాలి. రెండు నిమిషాల తరవాత వేళ్లతో రుద్దుతూ కడిగేయాలి. ఇలా రోజూ చేస్తే ముఖం ఎంతో తేటగా మచ్చల్లేకుండా ఉంటుంది.
* అరకప్పు ఎర్ర కందిపప్పుని రాత్రంతా నాననిచ్చి ఉదయాన్నే రుబ్బి టీస్పూను పచ్చిపాలు, టీస్పూను బాదం నూనె కలిపి పేస్టులా చేసి ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తరవాత కడిగేస్తే ముఖం కాంతిమంతంగా మెరవడమే కాదు, మచ్చలూ, మొటిమలూ కూడా తగ్గుతాయి.


బ్రష్‌ సరిగ్గానే చేస్తున్నారా?

రోజూ ఒకటికి రెండుసార్లు అందరూ దంతధావనం చేస్తూనే ఉంటారు. కానీ చాలామందికి దంత సమస్యలు వస్తూనే ఉన్నాయి. దీనికి కారణం వాళ్లు పళ్లని బ్రష్‌తో సరిగ్గా రుద్దకపోవడమేనట. అందుకే జామిగో అనే కంపెనీ ఏకంగా కెమెరా ఉన్న టూత్‌బ్రష్షుల్ని రూపొందించింది. అయితే ఇది దంతాలు రుద్దే ఎలక్ట్రిక్‌ బ్రష్‌లాంటిది కాదు. కృత్రిమ మేధతో తయారుచేసిన ఈ బ్రష్షులో బ్రిజ్‌ల్స్‌ స్థానంలో వాటర్‌ప్రూఫ్‌ డిజిటల్‌ కెమెరా ఉంటుంది. కాబట్టి బ్రష్‌ చేసుకోవడం పూర్తయిన తరవాత ఈ జామిగోని నోట్లో పెట్టుకుంటే చాలు... అది నోటిలో అన్ని వైపులా ఫొటోలు తీసి ఆప్‌ ద్వారా ఫోన్‌కి పంపిస్తుంది. దాంతో మనం సరిగ్గా బ్రష్‌ చేస్తున్నామా లేదా... చిగుళ్లు ఆరోగ్యంగానే ఉన్నాయా లేదా... అన్న విషయాన్ని ఎవరికి వాళ్లే తెలుసుకుని ముందుగానే జాగ్రత్తపడొచ్చు. అంతేకాదు, ఆ ఫొటోల ద్వారా బ్రష్‌ చేయడంలోని లోపాలని ఎత్తి చూపించి ఎలాచేయాలో కూడా సూచిస్తుందట. లేదూ వాటిని చూపించి డెంటిస్టు సలహాలూ తీసుకోవచ్చు. ఎందుకంటే- అనేక రోగాలకు మూలం దంతాలూ చిగుళ్లూ ఆరోగ్యంగా లేకపోవడమే అన్నది తెలిసిందే.


 

టూకీగా...

కస్మిక హృద్రోగాలతో ఆసుపత్రి పాలవుతున్నవాళ్లలో ఎక్కువశాతం బీపీ పెరగడం వల్లేననీ అదీ బ్లడ్‌ప్రెషర్‌ని తగ్గించుకునేందుకు తగిన మోతాదులో మందులు వాడకపోవడమేననీ స్మిత్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన పరిశోధకులు చెబుతున్నారు.
* 10 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలతో అక్క లేదా అన్నలు తరచూ గొడవపడటం, తిట్టడం, కొట్టడం... వంటివి చేయడం వల్ల ఆ పిల్లల్లో ఆత్మవిశ్వాసం లోపిస్తుందనీ, దాంతో వాళ్లు కౌమార దశలో రకరకాల మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లు యార్క్‌ యూనివర్సిటీ నిపుణుల పరిశీలనలో వెల్లడైందట.


మీకు తెలుసా!

పొలోనియం, రేడియంలాంటి మూలకాలను కనిపెట్టిన మేరీక్యూరీ నోటు పుస్తకాలు ఇప్పటికీ రేడియో యాక్టివ్‌గానే ఉన్నాయట. పరిశోధన సమయంలో వెలువడిన రేడియో ధార్మికత ఆమె ప్రాణాలను బలిగొనడంతో పాటు, ఆమె వాడిన వస్తువులన్నిటి మీదా పడింది. ప్రస్తుతం లెడ్‌ బాక్సుల్లో దాచిన ఆమె పుస్తకాల మీది అణు ధార్మికత మరో 1500 ఏళ్ల వరకూ ఉంటుందట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..