మనీ మ్యాజిక్‌!

ఎక్కాలు నేర్చుకుంటే ఎంత కష్టమైన లెక్క అయినా చిటికెలో పని. వ్యాకరణం తెలిస్తే భాష బాదుషాలా మారిపోతుంది. ఫార్ములాలు బట్టీపడితే ఫిజిక్స్‌తో ఫీట్లు చేయించొచ్చు. మరి, డబ్బు సంగతీ? పొదుపు-మదుపు కోసమూ అనేక సూత్రాలున్నాయి.

Updated : 04 Jul 2024 13:17 IST

ఎక్కాలు నేర్చుకుంటే ఎంత కష్టమైన లెక్క అయినా చిటికెలో పని. వ్యాకరణం తెలిస్తే భాష బాదుషాలా మారిపోతుంది. ఫార్ములాలు బట్టీపడితే ఫిజిక్స్‌తో ఫీట్లు చేయించొచ్చు. మరి, డబ్బు సంగతీ? పొదుపు-మదుపు కోసమూ అనేక సూత్రాలున్నాయి. ఎలా సంపాదించాలో, ఎంత  దాచుకోవాలో అవి బోధిస్తాయి. ఖర్చుల్ని ఎలా విభజించుకోవాలో, పెట్టుబడుల్ని ఎంత లాభదాయకంగా మలుచుకోవాలో విశ్లేషిస్తాయి. ఆ చిట్కాలను కనుక పట్టేస్తే, మనీ మ్యాజిక్‌ మహాసులభం.

ఓ  మంచి ఇల్లు కట్టుకోవాలి... కట్టుకోండి.
కొత్త కారు కొనాలి... కొనండి.
పిల్లల్ని బాగా చదివించాలి... చదివించండి.
ప్రపంచాన్ని చుట్టేసిరావాలి... చుట్టేసిరండి. కాకపోతే, ఈ కలలన్నీ నిజం చేసుకోడానికి చాలా డబ్బు కావాలి. రెండుచేతులా సంపాదించాలి. తొలి ఉద్యోగంలో, తొలి జీతం నుంచే పొదుపు మొదలు పెట్టాలి. మదుపు ఆరంభించాలి. అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలి. మనదైన సంపదను సృష్టించుకోవాలి. ఏ విషయంలో అయినా.. ఇరవైశాతం కృషితో ఎనభై శాతం ఫలితాలు సాధించవచ్చనీ, మిగతా ఇరవై శాతం కోసం ఎనభై శాతం కష్టం తప్పదనీ నిపుణులు చెబుతారు. ఈ మాట డబ్బుతో ముడిపడిన వ్యవహారాలకూ వర్తిస్తుంది. మనం తీసుకునే ఇరవై శాతం నిర్ణయాలు ఎనభై శాతం ఫలితాలను ఇవ్వాలన్నా, మిగతా ఇరవై శాతం ఫలితాల కోసం ఎనభై శాతం కృషిని సమర్థంగా కొనసాగించాలన్నా.. మనకంటూ ఓ వ్యూహం అవసరం. ఆ వ్యూహ రచనలో ముడిసరుకుగా ఉపయోగపడే కొన్ని సూత్రాలు..

‘ఫిష్‌’ ఫార్ములా

కొందరికి చికెన్‌ లేకపోతే ముద్ద దిగదు. కొందరికి బ్రేక్‌ఫాస్ట్‌లోనూ మటన్‌ ఉండాల్సిందే. పళ్లెంలో చేపలు పడకపోతే.. కొంపలు మునిగినట్టు రంకెలేసేవారూ ఉంటారు. నిజానికి, ఓ పూట ఫిష్‌ తినకపోతే కొంపలేం మునిగిపోవు. కానీ, ఆర్థిక ప్రణాళికలో ‘ఫిష్‌’ మాయమైతే మాత్రం కష్టాలు తప్పవు.
ఎఫ్‌.ఐ.ఎస్‌.హెచ్‌- ఫిష్‌!
ఎఫ్‌.ఐ.. ఫిక్స్‌డ్‌ ఎక్స్‌పెన్సెస్‌ ఎవ్రీ మంత్‌.
ఎస్‌.. సేవింగ్స్‌.
హెచ్‌.. హ్యాపీ టు స్పెండ్‌.
‘చేప’ ఫార్ములాలో మొత్తం మూడు సూత్రాలు ఇమిడి ఉన్నాయి. ఈ పద్ధతిలో.. ఒకటో తేదీన ‘యువర్‌ శాలరీ ఈజ్‌ క్రెడిటెడ్‌..’ అంటూ బ్యాంకు నుంచి మెసేజ్‌ రాగానే జీతాన్ని మూడు భాగాలుగా విభజించుకోవాలి.

ఒకటో భాగం..

నెలవారీ స్థిర వ్యయాల కోసం (ఎఫ్‌ఐ). ఇంటి అద్దె, ఇంటర్నెట్‌ బిల్లు, ఫోన్‌ బిల్లు, పాల బిల్లు, కిరాణా సరుకులు, పనిమనిషి జీతం వగైరా వగైరా ఖర్చులు చాలావరకు స్థిరంగానే ఉంటాయి. ఏ కూరగాయల ధరలో అమాంతం పెరిగిపోయినా బడ్జెట్‌లో లోటు తెలియకుండా, ఓ పదిశాతం మొత్తాన్ని అదనంగా జోడించుకోవచ్చు. అయితే ఒక షరతు. అసలు మొత్తం, అదనపు సొమ్ము.. అన్నీ కలిపినా జీతంలో యాభైశాతానికి మించడానికి వీల్లేదు.

రెండో భాగం..

పొదుపు-మదుపు కోసం (ఎస్‌).ఎవరి ఆర్థిక లక్ష్యాలు వారివి. ఇంటి నిర్మాణం, రిటైర్మెంట్‌ ప్లాన్‌, పిల్లల చదువులు.. మొదలైనవి దీర్ఘకాలికం. కారు కొనడం, వేసవిలో సింగపూర్‌ ట్రిప్‌ వెళ్లడం, పాతింటికి మరమ్మతులు చేయించడం.. తదితరాలు స్వల్పకాలికం. ఈ రెండు లక్ష్యాలకూ కలిపి జీతంలో ముప్పై శాతం (పదిహేను శాతం + పదిహేను శాతం) కేటాయించాలి. నిపుణుల సలహాతో ఆ సొమ్మును వివిధ మార్గాల్లో మదుపు చేయాలి.

మూడో భాగం..
ఇష్టంగా ఖర్చు పెట్టుకోడానికి (హెచ్‌). ఈ పద్దు కింద మనకు జీతంలో ఇరవైశాతం డబ్బు అందుబాటులో ఉంటుంది. ఆ మొత్తాన్ని మన ఆనందాలకు, అభిరుచులకు ఖర్చు చేసుకో వచ్చు. సినిమాలు చూస్తారో, షికార్లకు వెళ్తారో మీ ఇష్టం. పిల్లలకు పిజ్జా ఆర్డర్‌ ఇస్తారో, శ్రీమతి కోసం చీర షాపింగ్‌ చేస్తారో మీ ఇష్టం. కాకపోతే, నెలంతా ఆ మొత్తంతోనే సర్దుకుపోవాలి. దీర్ఘకాలిక, స్వల్పకాలిక లక్ష్యాల సొమ్మును నిత్యావసరాలకు వాడుకోడానికి వీల్లేదు. ఒక్కసారి ‘ఫిష్‌’ సూత్రాన్ని సూత్రప్రాయంగా ఆమోదించగానే.. సగం ఒత్తిడి తగ్గిపోతుంది. ఇక నుంచీ నెలనెలా తర్జనభర్జనలు ఉండవు. జీతం రాళ్లు పడగానే.. యాభై శాతం ఇంటి అవసరాలకు, ముప్పై శాతం పొదుపు-మదుపు కోసం, ఇరవై శాతం విందూవినోదాలకూ కేటాయించేస్తాం. ఆర్థిక విజయానికి స్పష్టతే తొలిమెట్టు.

ఆయన్ని చూస్తే వణికిపోయేవాణ్ని!

మరొక్కమాట..

ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల రూపంలో సంపాదన పెరిగినప్పుడు.. దీర్ఘకాలిక పొదుపు-మదుపు ఖాతాకు ఇంకొంత సొమ్ము మళ్లించుకోవచ్చు. అదనంగా జోడించే ఐదుశాతం కూడా సుదూర భవిష్యత్తులో పెద్ద ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు మీ నెల జీతం లక్ష రూపాయలు అనుకుందాం. ఏటా ఐదు శాతం ఇంక్రిమెంటును పరిగణనలోకి తీసుకుందాం. మన ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పది శాతం వార్షిక రాబడి ఉంటుందనే అంచనాకు వద్దాం. అప్పటి దాకా కొనసాగిస్తున్న దీర్ఘకాలిక మదుపును పదిహేను శాతం నుంచి ఇరవై శాతానికి పెంచుకోవడం వల్ల జీవనశైలిలో పెద్దగా మార్పు ఉండదు. రోజువారీ ఖర్చుల విషయంలో రాజీ పడాల్సిన అవసరమూ రాదు. కానీ, ముప్పై ఏళ్ల తర్వాత.. రూ.5.3 కోట్ల స్థానంలో అక్షరాలా రూ.7.1 కోట్లు అందుకుంటారు. అంటే, నలభై లక్షల అదనపు సొమ్ము రూ.1.8 కోట్లు కురిపి స్తుంది. చిన్న మొత్తాల్లోని చిత్రమే అది.

‘5-5-ఆర్‌’ ఫ్రేమ్‌వర్క్‌

జీవితం అనూహ్యం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఊహించలేం. తీవ్ర అనారోగ్యం తలుపుతట్టొచ్చు? పెను ప్రమాదం చుట్టుముట్టొచ్చు? దేన్నీ తప్పించుకోలేం. మనం చేయగలిగిందల్లా ఒకటే. ఆ సవాళ్లను ఎదుర్కోడానికి అన్నివిధాలా సిద్ధంగా ఉండాలి. ఆర్థిక ప్రణాళికలో భాగంగా.. అత్యవసర నిధిని సృష్టించుకోవాలి. కుటుంబానికంతా ఆరోగ్యబీమా తీసుకోవాలి. ఇంటిపెద్ద హోదాలో మన పేరు మీద ఓ పెద్ద మొత్తానికి టర్మ్‌ పాలసీ కొనితీరాలి. ఇదొక రక్షణ కవచం. విస్మరించంలేం. నిర్లక్ష్యం చేయలేం. అప్పటి వరకూ బీమా ధీమా లేనివారు, అత్యవసర నిధి గురించి అస్సలు ఆలోచించనివారు.. ‘ఫిష్‌’ ఫార్ములా ప్రకారం స్వల్పకాలిక లక్ష్యాలకు మళ్లించే పదిహేను శాతాన్ని.. పరిస్థితులకు తగినట్టు ‘5-5-ఆర్‌’ ఫ్రేమ్‌వర్క్‌ ప్రకారం విభజించుకోవచ్చు.
మొదటి ఐదు శాతాన్ని.. అత్యవసర నిధికి కేటాయించాలి.
రెండో ఐదు శాతాన్ని..ఆరోగ్య, జీవిత బీమాలకు కేటాయించాలి.
ఆర్‌.. మిగిలిన మొత్తాన్ని (రిమెయినింగ్‌).. దీర్ఘకాలిక లక్ష్యాలకు కేటాయించుకోవాలి.
ఏడాది సంపాదనకు సమానమైన మొత్తాన్ని పక్కన పెట్టినప్పుడే.. మనకంటూ ఓ అత్యవసర నిధి ఉన్నట్టు. అంత సొమ్ము సమకూరే వరకూ జీతంలోంచి ఐదు శాతం మొత్తాన్ని నెలనెలా పోగేస్తూ వెళ్లాలి. ఎమర్జెన్సీ ఫండ్‌ ఏర్పడిన తర్వాత, ఆ డబ్బును స్వల్పకాలిక లక్ష్యాలకు మళ్లించుకోవచ్చు. ఏటా బీమా ప్రీమియం చెల్లించగా మిగిలిన డబ్బును కూడా స్వల్పకాలిక లక్ష్యాల ఖాతాకే బదిలీ చేసుకోవచ్చు. మిగిలిన మొత్తం ఎలాగూ దీర్ఘకాలిక లక్ష్యాల ఖాతాకు జమ అవుతూనే ఉంటుంది.  
ఇక్కడో షరతు. అత్యవసర నిధికి మళ్లించిన సొమ్ముపై భారీ లాభాలు ఆశించకూడదు. ఏ అవాంతరమో ఎదురైనప్పుడు.. ఇరవై నాలుగు గంటల్లోపు డబ్బు చేతికి అందేలా జాగ్రత్తపడితే చాలు. జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలు ఎంచుకుంటున్నప్పుడు.. క్లెయిమ్‌ రేటు, సెటిల్‌మెంట్‌ హిస్టరీలను గమనించాలి. ఆయా పాలసీల పరిమితులను అర్థం చేసుకోవాలి. హెల్త్‌ డిక్లరేషన్‌లో దాపరికమూ మంచిది కాదు. మన ఆరోగ్య చరిత్రనంతా చెప్పేయాలి. దీనివల్ల ప్రీమియం పెరిగితే పెరగొచ్చు కానీ, సంక్షోభ సమయంలో తక్షణ చికిత్స అందుతుంది.

50-40-10 టెక్నిక్‌

జీవితమేం సెంటిమెంటు సినిమా కాదు. ‘ది ఎండ్‌’ వరకూ అన్నీ కష్టాలే ఉండవు. మధ్యమధ్యలో ఆనందాలూ వెల్లివిరుస్తాయి. ఎవరికి తెలుసు? మన కంపెనీ యాజమాన్యం హఠాత్తుగా బోనస్‌ ప్రకటించొచ్చు. ఊళ్లో అమ్మకానికి పెట్టిన తాతలనాటి పొలానికి మంచి బేరం రావచ్చు. ఆ లావాదేవీలో మన వాటాగా ఎంతోకొంత సొమ్ము చేతికి అందొచ్చు. అదే జరిగితే.. ‘అంతపెద్ద మొత్తాన్ని ఏం చేయాలి?’ అనే ప్రశ్న ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తర్జనభర్జన అవసరం లేదు. దీనికి కూడా ఓ సూత్రం ఉంది. 50-40-10 ఫార్ములాను అనుసరిస్తే సరిపోతుంది.
ఆ డబ్బులో సగానికి సగం మీ కలల్ని నిజం చేసుకోడానికి ఖర్చుపెట్టండి. అప్పులేమైనా ఉంటే తీర్చుకోండి. మరీ పెద్ద మొత్తమైతే స్థిరాస్తుల కొనుగోలు గురించీ ఆలోచించండి. ఇక్కడ మీ కంఫర్ట్‌ ముఖ్యం. గుండెల మీదున్న బరువు దిగిపోవాలి. ఎప్పటి నుంచో వెంటాడుతున్న వెలితి దూరం కావాలి. మిగతా సొమ్ములో నలభై శాతాన్ని దీర్ఘకాలిక లక్ష్యాలకు పక్కనపెట్టండి. పది శాతాన్ని స్వల్పకాలిక లక్ష్యాల ఖాతాకు మళ్లించండి. భిన్న మార్గాల్లో ఇన్వెస్ట్‌ చేయండి. అంతలోనే మరో సందేహం..‘ఈక్విటీ మార్కెట్‌కు ఎంత కేటాయించాలి?’. దీనికో సూత్రం ఉంది.. ఫార్ములా 100.
ఈక్విటీ కేటాయింపు = 110 - ప్రస్తుత వయసు.
ఉదాహరణకు మీ వయసు ముప్పై అయితే.. మీ దీర్ఘకాలిక మదుపు సొమ్ములో ఎనభై శాతం వరకూ స్టాక్‌ మార్కెట్‌కు మళ్లించుకోవచ్చు. ఆ వయసులో రిస్క్‌ తీసుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. నష్టభయాన్ని తట్టుకోగలరు కూడా. దీనికి సంబంధించి ఓ ఉదాహరణ.. రాజ్‌కుమార్‌ ఐటీ ఉద్యోగి. జీతం నలభై వేలు. వయసు పాతిక. ఆ ప్రకారంగా, 110-25= 85 అవుతుంది. అంటే, తన దీర్ఘకాలిక పొదుపు సొమ్ములో ఎనభై అయిదు శాతం వరకూ ఈక్విటీ మార్కెట్‌కు మళ్లించుకోవచ్చు. మిగిలిన పదిహేను శాతాన్ని.. పెద్దగా రిస్క్‌లేని డెట్‌ ఫండ్స్‌లాంటి వాటికి కేటాయించుకోవచ్చు. అంతలోనే ఓ శుభవార్త! రాజు పనిచేస్తున్న కంపెనీకి అద్భుతమైన లాభాలొచ్చాయి. దీంతో ప్రతి ఉద్యోగికీ లక్ష రూపాయల బోనస్‌ ప్రకటించారు. 50-40-10 ఫార్ములా ప్రకారం.. యాభైశాతాన్ని తన కోసం తాను ఖర్చు చేసుకున్నాడు. ఆ యాభైవేలతో మంచి సెల్‌ఫోన్‌ కొన్నాడు. తనకు ఇతరత్రా ఆర్థిక బాధ్యతల్లేవు. మిగిలిన మొత్తంలో నలభైశాతం దీర్ఘకాలిక పెట్టుబడిగా ఈక్విటీకి మళ్లించాడు. చివరి పదివేలనూ డెట్‌ఫండ్స్‌కు కేటాయించాడు. ఈ సొమ్ము స్వల్పకాలిక లక్ష్యమైన.. కారు కొనుగోలు కోసం. ఓ దశలో అతనికి మొత్తం లక్ష రూపాయలనూ ఎక్కడైనా ఇన్వెస్ట్‌ చేయాలనే ఆలోచన వచ్చింది. కానీ, కొత్త ఫోను కావాల్సిందే నంటూ మనసు మారాం చేసింది. నిజమే, మనం సంపాదిస్తున్నది సుఖంగా బతకడానికి, సంతోషంగా జీవించడానికి. పొదుపు-మదుపు- ఆనందం సమాంతరంగా సాగాలి. సంపాదించాక ఆనందించడం కాదు, ఆనందిస్తూ సంపాదించాలి. 50-40-10 ఫార్ములా ఉద్దేశమూ అదే. రూల్‌ 7-5-3-1 మదుపు దీర్ఘకాలికంగా ఉండాలి. వ్యూహాత్మకంగా కొనసాగాలి. ఏ దశలోనూ దుందుడుకు నిర్ణయాలు తీసుకోకూడదు. చిన్నాచితకా అవసరాల కోసమో, నష్టభయంతోనో పెట్టుబడుల్ని మధ్యలోనే ఉపసంహరించుకోవడం అతిపెద్ద తప్పు. అలాంటి చెత్త ఆలోచన వచ్చినప్పుడు.. 7-5-3-1 సూత్రాన్ని గుర్తు చేసుకోవాలి.

కథలో రాయని పాత్ర

ఓ ఇన్వెస్టర్‌గా మనం పక్కా ప్రొఫెషనల్‌గా వ్యవహరించాలంటే.. ప్రతి నిత్యం స్టాక్‌ మార్కెట్ కదలికల్ని గమనిస్తూ ఉండాలి. లోతైన అధ్యయనమూ అవసరమే. ఇంకేవో వృత్తి, ఉద్యోగాల్లో స్థిరపడిన వారికి ఇదంతా సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు, సిస్టమెటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ (సిప్‌) వైపు మొగ్గు చూపడమే ఉత్తమం. ఇక్కడ కూడా కొన్ని ఆర్థిక నియమాలు పాటించాల్సిందే. గత పాతికేళ్ల మార్కెట్ పరిణామాలను విశ్లేషించుకుంటే..
-ఈక్విటీ సిప్స్‌ విషయంలో ఏడాది అనేది అతి తక్కువ సమయం. నష్టాలకే ఆస్కారం ఎక్కువ. 24 శాతం మేర ప్రతికూల ఫలితాలు రావచ్చు
- కొందరు మూడేళ్ల గడువును సిఫారసు చేస్తుంటారు. ఇది కూడా ఏమంత తెలివైన నిర్ణయం కాదు. 10 శాతం మేర ప్రతికూల ఫలితాలకు ఆస్కారం ఉంటుంది.
- ఐదేళ్ల కాలపరిమితి ఫర్వాలేదు కానీ, రాబడులు మరీ తక్కువగా ఉండొచ్చు. ఆరేడు శాతంతో సర్దుకుపోవాల్సి ఉంటుంది.
.. వీటన్నిటి కంటే, ఏడేళ్ల లక్ష్మణరేఖ ఉత్తమం. నష్టభయం తక్కువ. 96 శాతం సందర్భాల్లో రాబడి ఏడు శాతానికి మించి ఉండొచ్చు. 79 శాతం సందర్భాల్లో పదిశాతం దాటిపోనూవచ్చు. ఆ సప్తవర్ష చక్ర భ్రమణంలో.. మార్కెట్ తీవ్రమైన కుదుపులనూ, ఓ మోస్తరు కష్టనష్టాలనూ తట్టుకుని స్థిరంగా నిలబడి ఉంటుంది.

 

ఎమోషన్స్‌ 1..2..3

కొన్ని స్నేహాలు కుబేరుల్ని కూడా బికారులుగా మార్చేస్తాయి. కొన్ని ఉద్వేగాలు దుర్జన సాంగత్యం కంటే కూడా ప్రమాదకరం. భయం, అభద్రత, నెగెటివ్‌ ఆలోచనలు.. మనల్ని స్థిరమైన నిర్ణయాలు తీసుకోనివ్వవు. నిజానికి, ఏ పెట్టుబడీ రాత్రికి రాత్రే లాభాలు కురిపించదు. ఆ సంక్షోభ సమయంలో మూడురకాల ఉద్వేగాలు మదుపరిని ముప్పుతిప్పలు పెడతాయి. వాటిని మూడు గండాలతో పోలుస్తారు నిపుణులు.
ఒకటి- నిరాశ.. రాబడి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఏడు నుంచి పదిశాతం మధ్య తారట్లాడుతూ ఉంటుంది. దీంతో తీవ్ర నిస్పృహకు గురవుతారు. ‘ఇంతకంటే ఎక్కువ రాబడినే ఊహించామే’ అంటూ నిరాశపడిపోతారు.
రెండు- ఉక్రోషం.. కొన్నిసార్లు మార్కెట్‌ నేలచూపులు చూస్తుంది. దీంతో  బెంబేలెత్తి పోతారు. ‘దీనికంటే బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లే నయం’ అంటూ హైరానా పడతారు.
మూడు- బాధ.. మార్కెట్‌ కుప్పకూలుతుంది. ‘రాబడి సంగతి దేవుడెరుగు. పెట్టుబడి సొమ్మూ కరిగిపోతోంది’ అంటూ ఘొల్లుమంటారు.
ప్రతి ఇన్వెస్టర్‌ ఈ మూడు దశలనూ దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఆ కీలక సమయంలో నిబ్బరంగా వ్యవహరించాలి. స్థితప్రజ్ఞత ప్రదర్శించాలి. అర్థంలేని భయాల్ని దూరం పెట్టినవారే, అంతిమంగా ఆర్థిక విజేతలు అవుతారు. ఐశ్వర్యాన్ని మూటగట్టుకుంటారు.


ఖర్చుపెట్టడమూ కళే!

ఖర్చులు అనివార్యం. ఎంత జాగ్రత్తగా ఉన్నా నెలాఖరు నాటికి మన పర్సు బక్కచిక్కుతుంది. ఆ సొమ్మంతా ఏమవుతోంది, ఎక్కడికిపోతోంది అనేది గమనించుకోవాలి. అలా అని, ప్రతి ఖర్చుకూ కోతలుపెడుతూ కూర్చోలేం. బడ్జెట్‌ పరిమితులకు లోబడి నచ్చిన వాటి కోసం సంతోషంగా ఖర్చు చేసుకోవచ్చు. భోజనప్రియులైతే.. నెలకోసారి మంచి రెస్టారెంట్‌కు వెళ్లొచ్చు. ఫిట్‌నెస్‌ వీరులైతే.. పేరున్న జిమ్‌లో సభ్యత్వం తీసుకోవచ్చు. ఖరీదైన వస్తువుల కోసం కాకుండా, నాణ్యమైన జీవితం మీద ఖర్చుపెట్టడమే తెలివైన ఆర్థిక నిర్ణయం. ‘రోజూ ఓ కప్పు టీ తగ్గించుకున్నా, నెలకు ఐదొందలు మిగులుతుంది. ఆ ఐదొందల్నీ తీసుకెళ్లి స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే.. పదేళ్లకు మూడులక్షలో, ఐదు లక్షలో అవుతుంది’ తరహా పిచ్చి లెక్కల్ని నమ్మేయకండి. జీవితాన్ని ఆస్వాదిస్తూ సంపాదించాలే కానీ, జీవితాన్ని పణంగా పెట్టి డబ్బు పోగేయకూడదు. మన ఇష్టాలు మనకు తెలిసినప్పుడు.. మన అయిష్టాలూ అర్థమైపోతాయి. ఇక వాటి జోలికి వెళ్లం. అలా మనకు ‘ఆర్ట్‌ ఆఫ్‌ స్పెండింగ్‌’ ఒంటబట్టినట్టే.

సంపదకు శత్రువులు..

కొన్ని ఊరింపులు ఎదుగుదలకు అవరోధాలు. కొన్ని ఆస్తులు అప్పుల ఊబిలో తోసేస్తాయి.  ఆర్థిక నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

  • ఇంటి కొనుగోలు మంచి నిర్ణయమే. కానీ స్తోమతకు మించిన ఆస్తుల జోలికి వెళ్లొద్దు. ముందు సంపద సృష్టికి ప్రాధాన్యం ఇవ్వండి. ఆ తర్వాతే, సొంతింటి ఆలోచన.
  • నెలసరి వాయిదాల మోత మనిషిని ప్రశాంతంగా ఉండనీయదు. విలాస వస్తువుల్ని డబ్బు పెట్టే కొనండి. డబ్బు ఉన్నప్పుడే కొనండి. క్రెడిట్‌ కార్డు వాడొద్దు.
  • బీమా వేరు, పెట్టుబడి వేరు. ఎవరైనా రెండూ కలగలిపిన స్కీమ్‌ను అంటగడుతున్నారంటే.. మీ ఆర్థిక అజ్ఞానాన్ని సొమ్ము చేసుకుంటున్నారని అర్థం. బీమాను బీమాగా చూడండి. పెట్టుబడిని పెట్టుబడిగానే పెట్టండి.
  • భరించలేనంత రిస్క్‌ వద్దు. అది మోయలేనంత సంపదనిచ్చినా సరే.
  • పూచీకత్తులు, శక్తికి మించిన చేబదుళ్లు చికాకు కలిగిస్తాయి.

ఓపిక లేనివాడు కోల్పోయిన సంపదను.. ఓపిక ఉన్నవాడు గెలుచుకుంటాడు - మార్కెట్‌ నానుడి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..