అదిగో జనం.. ఇదిగో భయం! సోషల్‌ ఫోబియా

కొందరికి కొండలంటే భయం. అలాంటివారు, ఎత్తుల జోలికి వెళ్లకపోతే సరిపోతుంది. కొందరికి నీళ్లంటే ముచ్చెమటలు. ఈ తరహా వ్యక్తులు, జలాశయాలకు దూరంగా ఉండగలిగితే ఏ సమస్యా ఉండదు. ‘సోషల్‌ ఫోబియా’ అలా కాదే!  తోటి మనుషులు కూడా వీరికి దెయ్యాల్లా కనిపిస్తారు. చుట్టూ ఉన్న సమాజం భూత్‌ బంగ్లాలా అనిపిస్తుంది.

Updated : 07 Jul 2024 08:36 IST

కొందరికి కొండలంటే భయం. అలాంటివారు, ఎత్తుల జోలికి వెళ్లకపోతే సరిపోతుంది. కొందరికి నీళ్లంటే ముచ్చెమటలు. ఈ తరహా వ్యక్తులు, జలాశయాలకు దూరంగా ఉండగలిగితే ఏ సమస్యా ఉండదు. ‘సోషల్‌ ఫోబియా’ అలా కాదే!  తోటి మనుషులు కూడా వీరికి దెయ్యాల్లా కనిపిస్తారు. చుట్టూ ఉన్న సమాజం భూత్‌ బంగ్లాలా అనిపిస్తుంది. జనం మధ్యకు రాలేరు. నలుగురితో మాట్లాడలేరు. ఈ ‘సోషల్‌ యాంగ్జయిటీ డిజార్డర్‌’ బాధితులు మన చుట్టూ ఉన్నారు, మనలోనూ ఉంటారు.

వరైనా, ఎప్పుడో ఒకప్పుడు మొహమాటపడతారు.
వాళ్లు మాత్రం నిత్య మొహమాటస్థులు.ఎవరైనా, కొన్ని విషయాల్లో జంకుతారు.
వాళ్లు మాత్రం ప్రతిదానికీ జంకేస్తుంటారు.
ఎవరైనా, అనివార్య పరిస్థితుల్లో ముసుగేసుకుంటారు.
వాళ్లు మాత్రం జీవితమంతా మొహానికి ముసుగేసుకునే బతికేస్తారు.
డిజిటల్‌ ప్రపంచంలో పరిచయాలు పెరుగుతున్నాయి కానీ, స్నేహాలు వికసించడం లేదు. కాంటాక్ట్‌ లిస్ట్‌లో వందల పేర్లు కనిపిస్తున్నా.. మనసు విప్పి మాట్లాడుకునేంత చనువు ఏ ఒక్కరితోనూ ఉండటం లేదు. దీంతో మనిషి మరీ ఒంటరి అవుతున్నాడు. ఏకాకితనం అనుభవిస్తున్నాడు. సోషల్‌ యాంగ్జయిటీ డిజార్డర్‌కు ఇవన్నీ కారణాలే. దీన్నే సోషల్‌ ఫోబియా అనీ అంటారు. ఆధునిక ప్రపంచాన్ని వేధిస్తున్న మానసిక సమస్యల్లో ఇదీ ఒకటి. సోషల్‌ ఫోబియా బాధితులకు గుంపుల్ని చూస్తేనే వణుకు. మంద పెరిగేకొద్దీ బీపీ ఎక్కువైపోతుంది. పదిమంది మధ్యకు రావడానికి అస్సలు ఇష్టపడరు. వచ్చినా, టచ్‌ మీ నాట్‌ ఆకులా.. ఇబ్బందిగా ముడుచుకుపోతారు. నూటికి పదిమందికి కౌమారంలో ఈ సమస్య ఉంటుంది. కానీ, క్రమంగా అదే సర్దుకుంటుంది. కొందరిలో మాత్రం, వయసుతోపాటు ఎక్కువ అవుతుంది. దీంతో బంధువుల పెళ్లిళ్లూ, స్నేహితుల పుట్టినరోజులూ.. ఇలా నలుగురూ ఓ చోట చేరే వేడుకలకు ఉద్దేశపూర్వకంగా దూరం అవుతారు. నెగెటివ్‌ కామెంట్స్‌ వినాల్సి వస్తుందనే భయంతోనో, తమను అందరూ టార్గెట్‌ చేస్తారనే అనుమానంతోనో.. సామాజిక మాధ్యమాలకూ దూరంగా బతుకుతారు. తప్పనిసరై జనాల మధ్యకు వెళ్లాల్సి వచ్చినా తెగ ఇబ్బంది పడిపోతారు. మనసులోని ఆ కల్లోలం శరీరాన్నీ ప్రభావితం చేస్తుంది. హృదయ స్పందనల వేగం పెరుగుతుంది. ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి. ఛాతీ బిగబట్టినట్టు అనిపిస్తుంది. పొట్టలో గడబిడ మొదలవుతుంది. గొంతెండిపోతుంది.
స్వరం గద్గదంగా మారుతుంది. తలనొప్పి వచ్చేస్తుంది. చూపు మసకబారుతుంది. అకస్మాత్తుగా కుప్పకూలిపోవచ్చు కూడా.

ఎందుకిలా...

బుర్ర ఆలోచనల కార్ఖానా. ఆ అద్భుతాల డబ్బాలోంచి రోజుకు డెబ్భైవేల ఆలోచనలు పుట్టుకొస్తాయని అంచనా. అవేవీ ఎక్కువ సేపు నిలబడవు. చెట్టు మీది పిట్ట తుర్రుమన్నట్టు.. నిమిషాల్లో మాయమైపోతాయి. కానీ సోషల్‌ ఫోబియా వ్యక్తులు మాత్రం.. ఆ చెత్తను వదిలించుకోరు. ఆస్తిలా పోగేసుకుంటారు. ఇంకొంత, మరికొంత జోడిస్తారు. కోతిపుండు బ్రహ్మరాక్షసి చందంగా తయారవుతుంది పరిస్థితి. నియంత్రణలేని ఆలోచనలు ఆ మనిషిని ఎటువైపు అయినా లాక్కెళ్లొచ్చు. దీంతో అతిగా స్పందిస్తారు. అతిగా భయపడతారు. అతిగా బాధపడతారు.

అదే మా డ్రీమ్‌రోల్‌ అంటున్న కథానాయికలు

చిన్న విషయాల్ని కూడా భూతద్దంలోంచి చూస్తారు. కొద్దిపాటి లోపాల్ని సైతం తీవ్రంగా పరిగణిస్తారు. సద్విమర్శల్ని స్వీకరించలేరు. కించిత్‌ వ్యంగ్యాన్నీ ఆస్వాదించలేరు. ‘అయినా, వాళ్ల విషయంలోనే ఎందుకిలా జరుగుతోంది?’ అనే ప్రశ్నకు కచ్చితమైన సమాధానం
లేదు. జన్యుపరమైన కారణాల్ని కూడా కొట్టిపారేయలేం. బలమైన సంఘటనలు, కుటుంబ నేపథ్యం, సామాజిక వాతావరణం మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. సోషల్‌ ఫోబియా వ్యక్తుల మెదడు పనితీరులోనూ స్పష్టమైన వ్యత్యాసాన్ని గమనించారు నిపుణులు. ‘అమిగ్డాలా’లో తీవ్ర స్పందనల్ని గుర్తించారు. మనిషిలో భయాల్నీ, ఆందోళనల్నీ రేకెత్తించే బాధ్యత ఆ భాగానిదే. సోషల్‌ ఫోబియా అనేక రకాలు. అందరిలోనూ ఒకే రకమైన లక్షణాలు కనిపించక పోవచ్చు.

‘నంబర్‌ వన్‌’ ఫోబియా

రాజన్‌ ఐటీ ఉద్యోగి. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ఆఫీస్‌. బాగా కష్టపడతాడు. మంచి జీతమూ వస్తుంది. టీమ్‌ లీడర్‌ స్థాయికి వెళ్లే అవకాశం వచ్చినా..
కుటుంబ బాధ్యతలు ఉన్నాయంటూ తప్పించుకున్నాడు. ఈ మధ్య తనకు తరచూ పొత్తికడుపులో నొప్పి వస్తోంది. అయినా పట్టించుకోడు.
ఏ అజీర్తి సమస్యగానో భావిస్తాడు. చిట్కా వైద్యంతో కాలక్షేపం చేస్తాడు. అతని స్వభావం తెలుసు కాబట్టి, భార్య పట్టుబట్టి యూరాలజిస్ట్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకుంది. ఆఫీసుకు సెలవు పెట్టించి మరీ క్లినిక్‌కు తీసుకెళ్లింది. వివిధ పరీక్షల తర్వాత.. యూరినరీ ట్రాక్‌ ఇన్ఫెక్షన్‌ ఉన్నట్టు నిర్ధారించారు. అదృష్టవశాత్తు ఆ నిపుణుడు చాలా సీనియర్‌. మానసిక రుగ్మతల గురించి కూడా అవగాహన ఉన్నవాడు. అతను గుచ్చిగుచ్చి అడిగేసరి రాజన్‌ నిజం ఒప్పుకున్నాడు. ‘నలుగురిలో వాష్‌రూమ్‌కు వెళ్లాలంటే నాకు భయం. ఎవరో నన్ను అనుసరిస్తున్నట్టు అనిపిస్తుంది. నా గురించే గుసగుసగా మాట్లాడుతున్నట్టు, నవ్వుకుంటున్నట్టు ఉంటుంది’ అంటూ మనసులోని మాట చెప్పేశాడు. సోషల్‌ యాంగ్జయిటీ డిజార్డర్‌ లక్షణాల్లో ఇదీ ఒకటి. దీన్నే ‘షై బ్లాడర్‌ సిండ్రోమ్‌’ అనీ అంటారు.
ఈ సమస్య ఉన్నవారు సామూహిక మూత్రశాలకు వెళ్లడానికి ఇష్టపడరు. బడివయసులో ఈ ఇబ్బంది ఎక్కువ. పిల్లలు చెప్పరు. పెద్దలు పట్టించుకోరు. టీచర్లు ఆ వైపు దృష్టి సారించరు. ఏ బంధువుల ఇంటికో వెళ్లినప్పుడు కూడా ఇలాంటి డోలాయమానమే. కొన్నిసార్లు, మనసుతో ముడిపడిన సోషల్‌ ఫోబియా శరీరానికీ విస్తరిస్తుంది. మూత్రాన్ని బిగబట్టడం వల్ల నాళాలు ఒత్తిడికి గురవుతాయి. మూత్రాశయం ఉబ్బిపోతుంది. పరిస్థితి అదుపుతప్పితే చికిత్స అసాధ్యం కావచ్చు. టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తుందనే భయంతో మంచినీళ్లు తాగడానికి కూడా జంకుతారు కొందరు. దీంతో డీహైడ్రేషన్‌ సమస్యలూ ఎదురవుతాయి.  

తినాలని ఉన్నా...

గోపాల్‌కు చికెన్‌ అంటే ఇష్టం. మూడుపూటలా వడ్డించినా వద్దనడు. ఈమధ్యే తనకు పెళ్లయింది. కాపురానికొచ్చిన అమ్మాయికి భర్త జిహ్వ చాపల్యం అర్థమైపోయింది. రోజూ లంచ్‌బాక్స్‌లో ఏదో ఓ చికెన్‌ ఐటమ్‌ సర్దుతోంది. కానీ, వారానికి ఐదు రోజులు పెట్టిన బాక్స్‌ పెట్టినట్టే తిరిగొస్తోంది. తెరిచిన పాపాన పోడు. ప్రేమగా వండిన కూరల్ని చేతులారా చెత్తపాలు చేయాల్సిన పరిస్థితి. ఇంట్లో ఆవురావురంటూ లాగించే మనిషి.. లంచ్‌బాక్సును మాత్రం ఎందుకు ముట్టుకోడు?..

వాక్కాయ తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..!

ఈ ప్రశ్నకు గోపాల్‌ కూడా సమాధానం చెప్పలేడు. ఇక, అతని భార్యకేం తెలుస్తుంది. ఇది కూడా సోషల్‌ సిండ్రోమ్‌ లక్షణమే. ఈ సామాజిక రుగ్మతకు గురైనవారు నలుగురి ముందూ తినడానికి ఇష్టపడరు. తప్పనిసరై ఏ ఫంక్షన్‌కో వెళ్లినా.. ఉపవాసమనో, అనారోగ్యమనో తప్పించుకుంటారు. మరీ తినాలనిపిస్తే.. పళ్లెంనిండా వడ్డించుకుని జన సందోహానికి దూరంగా వెళ్లిపోతారు. ఓ మూలన కూర్చుని గబగబా లాగిస్తారు. అప్పుడు కూడా, ఎవరైనా చూస్తే.. తెగ ఇబ్బందిపడిపోతారు. వైద్య పరిభాషలో దీన్ని ‘డీప్నోఫోబియా’ అంటారు. మనం ఆహారాన్ని కలుపుకునే పద్ధతి, తినే విధానం, జుర్రుకునే తీరు.. చుట్టుపక్కలవారికి నచ్చదేమో అనే సంకోచమే వాళ్లనలా తయారు చేస్తుంది. సమాజం తిండిపోతులుగా ముద్ర వేస్తుందనే జంకూ వెంటాడుతూ ఉంటుంది. తప్పనిసరై అందరి మధ్యా తింటున్నా.. తమ బాక్సులోని పదార్థాల్ని నలుగురితో పంచుకోడానికి ఇష్టపడరు. అందులోనూ ఊబకాయులకు బాల్యం నుంచీ తిండితో ముడిపడిన చేదు అనుభవాలు చాలానే ఉంటాయి. అవన్నీ మనసులో గుట్టలా పేరుకుపోయి ఆత్మన్యూనతకు దారితీస్తాయి. గోపాల్‌ విషయంలో జరిగిందీ ఇదే. తనతో పోలిస్తే రాధిక పరిస్థితి మరీ విచిత్రం. ఆ యువతి బెంగళూరులోని ఓ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ స్టార్టప్‌లో పనిచేస్తోంది. నలుగురి ముందూ ఏ చెక్‌ మీదో, డాక్యుమెంట్‌పైనో సంతకం చేయడానికి చాలా ఇబ్బంది పడిపోతుందామె. అందరూ తననే గమనిస్తున్నారనే ఊహను కూడా సహించలేదు. పెన్ను పట్టుకోగానే చేతులు వణికిపోతాయి. ధారాపాతంగా చెమటలు కారిపోతాయి. సంతకం మారిపోతుంది. రికార్డుల్లోని నమూనాతో సరిపోలడం లేదంటూ బ్యాంకులు చెక్కుల్ని తిరస్కరించిన సందర్భాలు అనేకం. చుట్టుపక్కల ఎవరూ లేనప్పుడు.. ఎన్ని సంతకాలైనా చేసేస్తుంది తను. ఇది కూడా సోషల్‌ ఫోబియా లక్షణమేనంటారు మానసిక నిపుణులు.

నో షాపింగ్‌ ప్లీజ్‌!

డిస్కౌంట్‌ సేల్స్‌, ఫుడ్‌ ఫెస్టివల్స్‌, కార్నివాల్స్‌.. షాపింగ్‌ మాల్స్‌లో రోజూ జాతరే! మాల్స్‌ అనే ఏమిటి, వరుసగా నాలుగు షోరూమ్స్‌ ఉన్న ఏ బజారుకెళ్లినా బోలెడంత సందడి కనిపిస్తుంది. సోషల్‌ ఫోబియా బాధితులకు ఆ జన సందోహాన్ని చూడగానే కంపరం పుట్టుకొస్తుంది. షాపింగ్‌కు వెళ్లాలంటేనే జంకుతారు. వెళ్లినా మనసు స్థిమితంగా ఉండదు. పార్కింగ్‌లో కారు సురక్షితంగా ఉందా? ఫలానా దుకాణంలో ధరలు సరిగానే ఉన్నాయా? మనం కొన్న సరుకు నాణ్యమైనదేనా?

బిల్లు చెల్లించాక, చిల్లర తక్కువేమైనా ఇచ్చారా?.. ఇలా బుర్రనిండా అర్థంలేని సందేహాలే. షోరూమ్‌లో అత్యద్భుతంగా కనిపించిన వస్తువు, తీరా ఇంటికొచ్చాక అస్సలు నచ్చదు. తిరిగి ఇవ్వడానికేమో మొహమాటం అడ్డొస్తుంది. దీంతో, తమను తాము తిట్టుకుంటారు. తమ ఎంపికను తామే చిన్నచూపు చూస్తారు. ఫలితంగా, ప్రతి షాపింగ్‌ ఓ చేదు అనుభవంగానే మిగిలిపోతుంది. ఆ బాధంతా ఎందుకని, బయటికి వెళ్లడమే మానేస్తారు. ఈ విపరీత స్వభావానికి మరో కోణమూ ఉంది. డబ్బు ఖర్చు చేయడం వీళ్లకు అస్సలు నచ్చదు. షాపింగ్‌ తర్వాత, బిల్లు కట్టాల్సి వచ్చినప్పుడు కూడా.. కష్టపడి సంపాదించిన సొమ్ము ఎవరికో ఉదారంగా ఇస్తున్నట్టు బాధపడిపోతారు. ఈ సోషల్‌ యాంగ్జయిటీకి మానసిక నిపుణులు పెట్టినపేరు.. ‘క్రొమెటోఫోబియా’. ఆర్థిక సమస్యలతో ఆత్మీయుల దివాలాలు, ఆత్మహత్యలు కొందరి మనసులపై లోతైన గాయాలు చేస్తాయి. బాల్యంలో అనుభవించిన దుర్భర పేదరికం జ్ఞాపకాల్లో ఇంకా పచ్చిగానే ఉంటుంది. షాపింగ్‌ ఫోబియాకు ఇవన్నీ కారణాలు కావచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో డబ్బు పట్ల వ్యతిరేకత ఏర్పడి ఉంటుంది. ఆ కారణంగా సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోలేరు. భవిష్యత్తు ప్రణాళికలూ రచించుకోలేరు. క్రెడిట్‌ స్కోరూ అంతంత మాత్రమే. దీంతో ఓ పట్టాన బ్యాంకు రుణాలూ లభించవు. ఫలితంగా ఏదో ఓ దశలో సంక్షోభంలో కూరుకుపోతారు.

అడుగడుగునా సవాళ్లే...

సోషల్‌ ఫోబియా యువత కెరీర్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కొత్త వ్యక్తుల్ని కలవడానికి ఇబ్బంది పడతారు కాబట్టి, మార్కెటింగ్‌లో లక్ష్యాలు సాధించలేరు. ఉన్నతాధికారులతో మాట్లాడేందుకు జంకుతారు కాబట్టి, పదోన్నతుల విషయంలో వివక్షకు గురవుతారు. ఇంటర్వ్యూలో తమదైన వాదనతో నిపుణులను మెప్పించలేరు కాబట్టి, మంచి కొలువులు సంపాదించలేరు. మితిమీరిన భయం ఎలాంటి సాహసాలకూ ప్రోత్సహించదు. దీంతో ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ వైపు అడుగులు వేయలేరు. మిగిలినవారితో పోలిస్తే.. సోషల్‌ ఫోబియా వ్యక్తులు మద్యం, మాదకద్రవ్యాలు తదితర దురలవాట్లకు సులభంగా బానిసలు అవుతారు. ఈ అంతర్ముఖులకు స్నేహితులూ తక్కువే. ప్రేమాభిమానాల్ని వ్యక్తం చేయలేని విపరీత స్వభావం కారణంగా కుటుంబ బంధాలు బలపడవు. వేదికలు ఎక్కలేని బలహీనత వల్ల కళా సాంస్కృతిక రంగాల్లో రాణించలేరు. ఎక్కడికి వెళ్లినా ఓ తోడు కోరుకుంటారు. నలుగురిలో ఉన్నప్పుడు ఆ మనిషి చాటున దాక్కునే ప్రయత్నం చేస్తారు. తరచూ ఆత్మహత్య ఆలోచనలూ వెంటాడుతుంటాయి. ప్రతి పదిమందిలో ఒకరు ఏదో ఒక దశలో ఎంతోకొంత సోషల్‌ యాంగ్జయిటీకి గురవుతారని అంచనా. కానీ, ఆ ఆందోళన కాస్తా రుగ్మతగా ముదిరి పోకుండా జాగ్రత్తపడాలి. అవసరమైతే చికిత్సకు సిద్ధపడాలి. సమస్య తీవ్రతను బట్టి సెల్ఫ్‌హెల్ప్‌ టెక్నిక్స్‌, బిహేవియరల్‌ థెరపీ ద్వారా నిపుణులు వైద్యం అందిస్తారు. ఆలోచనలపై పట్టుకోసం ధ్యానాన్ని బోధిస్తారు. మరీ అవసరమైతే, యాంటీడిప్రెసెంట్స్‌ సిఫారసు చేస్తారు. సోషల్‌ ఫోబియా అనేది కొన్నిసార్లు ఇంకేదో తీవ్ర మానసిక వ్యాధికి సంకేతం కావచ్చు. డిప్రెషన్‌ లక్షణమైనా కావచ్చు. ఆ మాయ దారి మానసిక సమస్య కారణంగా మనం దూరం చేసుకునేది సమాజాన్నే కాదు.. మనలోని అసలైన మనల్ని కూడా! మనసు కూడా శరీరం లాంటిదే. అనారోగ్యాలు సహజమే. వాటి నుంచి బయటపడటమూ సులభమే. నిజానికి, సోషల్‌ ఫోబియా ఉన్నవాళ్లు కాదు.. ‘అసలు నాకెలాంటి సమస్యలూ లేవూ.. రావూ’ - అనుకునేవారే అసలైన మానసిక రోగులు!

సరికొత్తగా...

సోషల్‌ ఫోబియా.. పైపైకి పుట్టుకతో వచ్చిన అలవాటులా కనిపిస్తుంది. కించిత్‌ చాదస్తంలా అనిపిస్తుంది. కొన్నిసార్లు మనదైన ప్రత్యేకతలానూ గోచరిస్తుంది. ముదురుతున్నకొద్దీ రుగ్మత ప్రభావం తెలుస్తుంది. మనోబలంతో ఈ సమస్యను కొంతమేర అధిగమించొచ్చు.

స్వీయ సంభాషణలు మనల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ‘నేనెప్పుడూ అంతే’, ‘నాకు ఎవరి పేర్లూ గుర్తుండవు’, ‘నేను గొప్పగా మాట్లాడలేను’.. సోషల్‌ ఫోబియా వ్యక్తుల నెగెటివ్‌ సెల్ఫ్‌టాక్‌ ఇలానే ఉంటుంది. ముందుగా ఆ స్వర భేతాళాన్ని చెట్టెక్కించాలి.

దుటి మనిషి మనసులోకి దూరిపోయి మరీ.. అతను ఫలానా విధంగా ఆలోచిస్తూ ఉండొచ్చని ఊహించడం సరికాదు. ‘అతను నా ఎత్తుపళ్లను ఎగతాళి చేస్తున్నాడేమో’, ‘ఆమె నా పొట్టితనాన్ని ఎత్తిచూపుతోందేమో’, ‘బాస్‌ నన్ను చడామడా తిట్టిన విషయం గురించే క్యాంటీన్‌లో అందరూ మాట్లాడుకుంటున్నారేమో’.. ఇలా ఓ చిన్నపాటి ఊహను వాస్తవంలా విజువలైజ్‌ చేసుకోవడం సరికాదు.

నమ్మకాలు విత్తనాలైతే.. ఆలోచనలు మొలకలు. అర్థంలేని నమ్మకాల్నీ, వాటితోపాటు పుట్టుకొచ్చే తలాతోకా లేని ఆలోచనల్నీ వదిలించుకోవాలి. సమాజం నిండా దుర్మార్గులే, అపార్ట్‌మెంట్‌లో అంతా స్వార్థపరులే, బంధువర్గానికి డబ్బు పిచ్చి.. ఇలాంటి  అభిప్రాయాలు అపసవ్య ఆలోచనా ధోరణికి మూలాలు.

నేను, నాది, నా గుర్తింపు, నా మనుషులు.. సోషల్‌ ఫోబియా వ్యక్తుల ఆలోచనలన్నీ ‘నా’ చుట్టూనే తిరుగుతాయి. ఆ వలయంలోంచి బయటపడాలి. ‘మనం’ వైపుగా సాగాలి.

మన చుట్టూ మనం గీసుకున్న సరిహద్దు రేఖల్ని చెరిపేసుకుని.. సువిశాల ప్రపంచాన్నీ చూడాలి. హాబీ క్లబ్స్‌లో సభ్యత్వం తీసుకోవాలి. కొత్త భాష, కొత్త ఆట, కొత్త వ్యాపకం.. ఇలా సరికొత్త అభిరుచులతో మనల్ని మనం విస్తరించుకోవాలి.

రీర భాష మనసుకు అద్దం పడుతుంది. మనం ఆత్మవిశ్వాసంతో ఉన్నామనే సంకేతాన్ని బాడీలాంగ్వేజ్‌ ద్వారా మనసుకు పంపొచ్చు. నిటారుగా నిలబడండి. తడబడకుండా అడుగులేయండి. ఎదుటి మనిషి కళ్లలోకి చూస్తూ మాట్లాడండి.

శుభ్రమైన దుస్తులు ధరించండి. జుత్తు విషయంలో శ్రద్ధ తీసుకోండి. నోటి దుర్వాసన, చెమట కంపు ఎదుటి మనిషిని ఇబ్బంది పెడతాయి. అలాంటి సమస్యలుంటే వదిలించుకోండి. నాణ్యమైన పాదరక్షలు ధరించండి. రోజూ వ్యాయామం చేయండి. దీనివల్ల ఆనంద హార్మోన్‌.. డోపమైన్‌ ఊట పెరుగుతుంది.

ఈ వారం మీ రాశిఫలం ఎలా ఉందో చూసుకున్నారా?

ప్రతి పరిచయస్థుడూ స్నేహితుడు కాలేడు. ప్రతి చుట్టమూ ఆత్మబంధువు అనిపించుకోలేడు. మనసు విప్పి మాట్లాడు కోడానికి మీకంటూ ఓ చిన్నపాటి బృందాన్ని ఏర్పాటు చేసుకోండి.

జీవితానికి ఓ ఉన్నత లక్ష్యమంటూ ఉన్నప్పుడు.. చిన్నాచితకా విషయాలు పట్టించుకోం. ఎవరో ఏదో అనుకుంటున్నారని బాధపడిపోతూ కూర్చోం. ధ్యాసంతా లక్ష్యం మీదే ఉంటుంది.

భయాల చిట్టా పెద్దదే..

దో ఒక రూపంలో సమాజాన్ని తప్పించుకుని తిరగాలనుకోవడం, మనుషులకు దూరంగా బతకాలనుకోవడం సోషల్‌ ఫోబియా ప్రధాన లక్షణం. వ్యవస్థల పట్ల అనుమానాలూ, వైఫల్య భయాలూ అందులో భాగమే.

కినిసియోఫోబియా: ప్రమాద భయం.

గ్లోసోఫోబియా: నలుగురి ముందూ మాట్లాడాలంటే భయం.

అటైచీఫోబియా: వైఫల్య భయం.

డెసిడోఫోబియా: ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలంటే భయం.

గామోఫోబియా: వివాహ వ్యవస్థ పట్ల భయం.

ఆంత్రొపోఫోబియా: తోటి మనుషులంటేనే విపరీతమైన భయం.

అటెలోఫోబియా:  తాను అన్ని విషయాల్లోనూ అసమర్థుడిననే భయం.

ఆటోఫోబియా: ఒంటరితనమంటే ఎక్కడలేని భయం.

ఒబెస్టోఫోబియా: లావైపోతానేమో అనే భయం.

పాథోఫోబియా: అనారోగ్యమంటే భయం. రోగాల పేరు చెబితే హడల్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..