పుట్టినరోజు పండుగ చేద్దాం!

ఏడాది మొత్తంలో ‘ఇది నా రోజు’ అంటూ ప్రతి ఒక్కరూ చెప్పే పుట్టినరోజంటే- అందరికీ అమూల్యమే. అందుకే ఆ ఆనంద క్షణాల్ని ఆత్మీయులతో పంచుకుంటూ వేడుకలు చేసుకుంటారు.

Published : 23 Jun 2024 00:55 IST

ఏడాది మొత్తంలో ‘ఇది నా రోజు’ అంటూ ప్రతి ఒక్కరూ చెప్పే పుట్టినరోజంటే- అందరికీ అమూల్యమే. అందుకే ఆ ఆనంద క్షణాల్ని ఆత్మీయులతో పంచుకుంటూ వేడుకలు చేసుకుంటారు. కాస్త ముందు నుంచే ఆ సంబరానికి ఏర్పాట్లు మొదలుపెడతారు. అది తెలిసే ఎప్పటికప్పుడూ బోలెడన్ని బర్త్‌డే ట్రెండ్స్‌ పుట్టుకొస్తున్నాయి. అలాంటి వాటిల్లో కొత్తగా చేరినవివి...


అందమైన కేక్‌ పాప్స్‌!

బుజ్జాయిలకు ఇష్టమైన కార్టూన్‌ పాత్రలు- కేకుల్లో కనిపిస్తే ఎంతో మురిసిపోతారు. కానీ అంత చక్కని కేకును కట్‌ చేయగానే కార్టూన్‌ రూపం కనిపించకుండా పోతుంది. అలాకాకుండా దాన్ని అమాంతం అలాగే తినేలా ఉంటే భలేగా ఉంటుంది కదా. ఆ అనుభూతిని ఇవ్వడానికి చిన్నారుల కోసం బర్త్‌డే థీమ్డ్‌ కేక్‌ పాప్స్‌ వచ్చాయి. కేకు బొమ్మతోపాటూ చుట్టూ ఆ కార్టూన్‌ బొమ్మ థీమ్‌ కనిపించేలా కేక్‌పాప్స్‌ ఉంటాయి. అందంగా అలంకరించిన ఈ పాప్స్‌ చూడ్డానికీ భలేగా అనిపిస్తాయి, పైగా కట్‌ చేసే పనిలేకుండా తినడానికీ వీలుగా ఉంటాయి. మరి ఆలస్యం దేనికీ... ఈ వెరైటీ కేకు ట్రెండును మీరూ ఫాలో అయిపోయి నచ్చిన థీమ్‌ పాప్స్‌ను సిద్ధం చేసుకోండి!


స్టాండులన్నీ ఒకే సెట్‌!

కేకుతోపాటు కప్‌కేకులూ, చాక్లెట్లూ, ఇతర మిఠాయిల్నీ బర్త్‌డే వేడుకలో ఉంచుతుంటారు. అందుకు తగ్గట్టే వాటన్నింటినీ అందంగా అమర్చడానికి ఈమధ్య ‘కేక్‌ స్టాండ్‌ సెట్‌’ దొరుకుతోంది. స్టాండ్‌ దగ్గర్నుంచి కేకు ముక్కల్ని పంచే ట్రేల వరకూ అన్నీ దీంట్లోనే ఉంటాయి. గోల్డ్‌, సిల్వర్‌ మెటల్‌ కోటింగ్‌లతోపాటూ బోలెడన్ని రంగుల్లోనూ ఇవి అందుబాటులో ఉన్నాయి. స్టాండ్‌తోపాటు రకరకాల హోల్డర్లతో కలిపి మూడు నుంచి పది వస్తువుల సెట్లలా వస్తాయివి. ఇంట్లోకి అవసరమయ్యే ట్రేలూ, స్టాండ్లూ విడివిడిగా కొనుక్కునే బదులు మన అభిరుచికి తగ్గట్టు వీటిల్లో ఎంచుకోవచ్చు. బర్త్‌డేలతోపాటూ ఇతర వేడుకలకీ, పండుగలకీ వీటిని వాడుకోవచ్చు.


రంగుల్లో వెలిగే కొవ్వొత్తులు!

‘హ్యాపీ బర్త్‌డే టూ యూ’ అంటూ కొవ్వొత్తుల్ని ఊదడంతోనే కదా వేడుక మొదలవుతుంది. ఎందుకంటే పుట్టినరోజు సంబరంలో కేకుకు ఎంత స్థానం ఉంటుందో- అది ఎన్నో బర్త్‌డేనో అంకెల్లో చూపుతూ కేకుపైన కూర్చునే కొవ్వొత్తికీ అంతే ప్రత్యేకత ఉంటుంది. అందుకే మరి, క్యాండిల్స్‌లోనే పువ్వులా విరిసేవీ, మెరిసే అక్షరాలవీ, ఆకట్టుకునే ఆకారాల్లోవీ తయారయ్యాయి. కానీ ఇప్పుడు ఇంకాస్త థ్రిల్‌ ఇవ్వడానికి ‘కలర్‌ ఫ్లేమ్‌ హ్యాపీ బర్త్‌డే క్యాండిల్స్‌’ వచ్చాయి. చూడగానే వీటి ప్రత్యేకత ఏంటో అర్థం కాకపోయినా కేకుపైన వెలిగించగానే ఒక్కసారిగా ఆశ్చర్యంలో ముంచేస్తాయి. ఎరుపు, పసుపు, నీలం, గులాబీ, ఆకుపచ్చ... ఇలా ఎన్నెన్నో రంగుల్లో వెలిగిపోతూ బర్త్‌డే డెకరేషన్‌కు మరింత కొత్తదనం తెచ్చేస్తాయి. కొన్ని ప్రత్యేకమైన రసాయనాల్ని కలిపి చేయడం వల్లే వీటి మంటలకు ఆ రంగులొస్తాయి. అంతేకాదు, అసలు వెలిగించకుండానే కాంతులు వెదజల్లే ‘లెడ్‌ బర్త్‌డే క్యాండిల్స్‌’ కూడా ఉన్నాయి. వీటిల్లో చిన్న బటన్‌ నొక్కితే చాలు, నిజమైన కొవ్వొత్తుల్లా వెలుగుతాయి.


మెరుపుల బ్యానర్లు!

చిట్టిపాపాయిలవే కాదు, ఇంట్లో సరదాగా పెద్దల పుట్టినరోజులు జరిపినా... అలంకరణ తప్పనిసరి అయిపోయింది. ఆ కేకు కటింగ్‌ గుర్తుల ఫొటోల్ని- అందంగా చూపడానికి రకరకాల బ్యాక్‌డ్రాప్స్‌నీ, బ్యాక్‌గ్రౌండ్‌ కర్టెన్లనీ వాడుతున్నారు. కానీ అవి ఎప్పుడూ ఒకేలా ఉంటే ఏం బాగుంటుంది. ఇదిగో ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తూనే తక్కువ ఖర్చుతో సరికొత్త లుక్కును తెచ్చే బ్యాక్‌డ్రాప్స్‌ వస్తున్నాయి. వాటిల్లో ఒకటి ఇక్కడున్న ‘హాలోగ్రాఫిక్‌ హ్యాంగింగ్‌ బ్యాక్‌డ్రాప్‌ బ్యానర్‌’. రకరకాల ఆకారాల్లో మెరిసిపోయే ఈ బ్యానర్లను అలంకరణలో భాగం చేశామంటే... రాత్రిపూట కాంతులీనుతూ ఒక్కసారిగా పార్టీ లుక్కును తెచ్చేస్తాయి. కావాలంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఇతర రంగుల తెరల్ని ఉంచి వాటిమీద ఈ చమక్కుల బ్యానర్లతో కొత్తకొత్త డెకరేషన్లనూ తయారుచేసుకోవచ్చు కూడా. వస్తువు చిన్నదే అయినా అలంకరణలో మాత్రం దీని పాత్ర పెద్దదే మరి!


సర్‌ప్రైజ్‌ చేయాల్సిందే!

ర్‌ప్రైజ్‌ అంటేనే ఒక థ్రిల్‌. తెలియకుండా చేసే చిన్న పనైనా, ఇచ్చే చిట్టి వస్తువైనా సరే... కచ్చితంగా అవతలి వ్యక్తికి అది ఎంతో ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. అలాంటి అనుభూతిని మీరూ మీ ఆత్మీయుల బర్త్‌డే రోజున అందివ్వాలనుకుంటున్నారా... అయితే ఈ సర్‌ప్రైజ్‌ బాక్సుల్ని ప్రయత్నించొచ్చు. ‘హ్యాపీ బర్త్‌డే మనీ బాక్స్‌, మ్యాజిక్‌ ఫెయిరీ ఫ్లయింగ్‌ గిఫ్ట్‌ బాక్స్‌’ పేర్లతో మార్కెట్లో దొరుకుతున్నాయివి. కొన్ని బాక్సుల్లోనేమో డబ్బుల్నీ, సెల్‌ఫోన్‌నీ, ఇతర కానుకల్నీ దాచేసి- ఆ డబ్బా మొత్తాన్ని కేకు లోపల ఉంచి ప్రియమైనవారిని ఆశ్చర్యపరచొచ్చు. కేకు పైనున్న పేపర్‌ను పైకి లాగితే దాంతోపాటు సర్‌ప్రైజ్‌గా దాచిన బహుమతీ పైకి వస్తుంది. మరికొన్ని సర్‌ప్రైజ్‌ బాక్సుల్లోనేమో- బాక్స్‌ తెరిచీ తెరవగానే సీతాకోక చిలుకలు భలేగా ఎగురుతూ బయటకొస్తాయి. కేకూ, ఇతర గిఫ్టులతోపాటూ సరదా అనుభూతి కోసం వీటిని ఎంచుకోవచ్చు.


ఇది పార్టీ ఫన్‌!

లుగురు పిల్లలు ఒక దగ్గర చేరితేనే సందడి సందడిగా ఉంటుంది. మరి ఆ సందడి పుట్టినరోజు వేడుకలో ఓ భాగమైతే ఇంకెలా ఉంటుంది. అందుకే మరి, చిన్నారుల ఆ సరదాల్ని మరింత పెంచడానికి మార్కెట్లోకి బర్త్‌డే పార్టీ గేమ్స్‌ చాలానే వచ్చాయి. వాటిల్లో ఇంట్లోనే ఆడుకునేలా ఉండే ‘పిన్‌ ది బో’లాంటి రకరకాల ఆటలూ ఉన్నాయి. ఈ పేపర్‌ బోర్డుల్ని అలంకరణలో భాగంగా అతికించేయొచ్చు. ఆ తర్వాత కళ్లకు గంతలు కట్టుకుని గోడపైనున్న ఆ పేపర్‌మీద బొమ్మలోని భాగాన్ని సరిగ్గా పిన్‌ చేస్తూ ఆడుకోవచ్చు. ఇంకా ఈ ఆటలతోపాటూ బర్త్‌డే థీమ్‌ టెంపరరీ టాటూల్నీ సరదాగా వేసుకోవచ్చు. మనం కోరుకున్న టాటూ బొమ్మల్నీ తయారు చేయించుకోవచ్చు కూడా. చీకట్లో మెరిసిపోయే ఈ టాటూలు బుజ్జాయిలకు భలే నచ్చేస్తాయి!


అన్నింట్లోనూ వేడుక హంగులే!

వేసుకునే డ్రెస్సు, కట్‌చేసే కేకు మాత్రమేనా- వేడుకలో కనిపించే ప్రతి దాంట్లోనూ పుట్టినరోజు హంగామా చూపించాలనుకుంటున్నవాళ్లే ఎక్కువయ్యారు. అలాంటివారిని మెప్పిస్తూనే బర్త్‌డే థీమ్‌ పార్టీ డెకరేషన్స్‌ వచ్చాయి. వీటిల్లో బర్త్‌డే అక్షరాల బ్యానర్‌, టోపీలూ, టేబుల్‌ కవర్లూ, పేపర్‌ ప్లేట్లూ, చెంచాలూ, కప్పులూ... ఇలా అన్నీ ఒకే థీమ్‌తో ఉంటాయి. నచ్చిన కార్టూన్‌ పాత్రల దగ్గర్నుంచి చిన్నారుల ఫొటోల వరకూ కోరినట్టు కస్టమైజ్‌ చేయించుకోవచ్చు.

వీటితోపాటూ పుట్టినరోజు వేడుకను మెరిపించడానికి ఇన్‌ఫ్లాటబుల్‌ సెల్ఫీ ఫ్రేములూ, నాలుగు అడుగుల ఎత్తుండే ఇన్‌ఫ్లాటబుల్‌ కేకులూ ఇంకా మామూలు బుడగల్లోనూ వెలుగులు నింపే లెడ్‌ బెలూన్‌ లైట్లలాంటివీ ఎన్నో ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..