వ్యక్తులూ సమస్యలూ

ఈ పుస్తకంలోని నవలలు రెండు రకాల సమస్యల్ని చర్చిస్తాయి. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న రత్నమ్మ కొడుకు రమ్యని ఇష్టపడి అమెరికాలో పెళ్లి చేసుకున్నాడు.

Updated : 18 May 2022 15:40 IST

వ్యక్తులూ సమస్యలూ

పుస్తకంలోని నవలలు రెండు రకాల సమస్యల్ని చర్చిస్తాయి. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న రత్నమ్మ కొడుకు రమ్యని ఇష్టపడి అమెరికాలో పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమె అలవాట్లను తట్టుకోలేక చివరికి విడాకులకు సిద్ధమయ్యాడు. దాంతో అలిగి పుట్టింటికి వచ్చిన రమ్య భర్తతో రాజీకోసం మొదటిసారి అత్తమామల దగ్గరికి వెళ్తుంది. అబ్బాయి విషయంలో తాము జోక్యం చేసుకోలేమన్నారని ఏకంగా వారిమీద గృహహింస కేసు పెట్టి జైలుకు పంపుతుంది. పెద్దవాళ్లు ఇద్దరూ ఆ కేసు నుంచి ఎలా బయటపడ్డారూ, ఆ అమ్మాయి తప్పు తెలుసుకుందా అన్నది మొదటి నవలలో కథాంశం. ఇక రెండో దాంట్లో- సుబ్బమ్మ, వీరయ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతుర్ని బంధువుల అబ్బాయికే ఇచ్చి నానా అగచాట్లూ పడతారు. రెండో అమ్మాయి కులాంతర వివాహం చేసుకుంటుంది. ఆ ఇద్దరు అల్లుళ్ళతో అత్తమామల అనుభవాలను చర్చించిన విధానం బాగుంది.

- పద్మ

రత్నమ్మగారి కోడలు, సుబ్బమ్మగారి అల్లుళ్లు
రచన: రంగనాయకమ్మ
పేజీలు: 283; వెల: రూ. 80/-
ప్రతులకు: ఫోన్‌- 9440630378


మంచితనం కథలు

న చుట్టూ ఉన్న మనుషుల్లోని మంచితనాన్ని చాటే కథలివి. రోజూ పార్కులో కలుసుకునే వృద్ధులంతా స్నేహితులై కష్టసుఖాలు కలబోసుకునేవారు. తమలో ఒకరు వృద్ధాశ్రమానికి వెళ్లాల్సి వచ్చి నప్పుడు వారందరూ చేసిన ఆలోచనేమిటో చెప్పే కథ ‘ఏజ్డ్‌ బ్యాచిలర్స్‌’. రాజభవనంలా ఉన్న ఇంటిని చూసుకుని మురిసిపోతున్న అతడిని ఒక పేదపిల్ల కలిసింది. తన పొరపాటువల్ల పగిలిపోయిన కారు అద్దం బాగుచేయించుకోమని పాచిపని చేసి దాచుకున్న డబ్బు ఇచ్చింది. ఆ సంఘటన ఏ నిర్ణయానికి దారితీసిందో ‘నిజాయతీ’ చెబుతుంది. లైబ్రరీలో తెచ్చుకున్న పుస్తకంలో వెయ్యి నోటు కనబడితే దాని సొంతదారును వెతుక్కుంటూ వెళ్లిన వ్యక్తికి కలిగిన ఆనందం ఎలాంటిదో చెప్పే కథ ‘పుస్తకంలో పాతనోటు’. సూటిగా సాగే కథనం, ఫీల్‌గుడ్‌ ముగింపులతో  చాలా కథలు హాయిగా చదివిస్తాయి.

- శ్రీ

ఏజ్డ్‌ బ్యాచిలర్స్‌ (మరో 24 కథలు)
రచన: ప్రతాప వెంకట సుబ్బారాయుడు
పేజీలు: 152; వెల: రూ. 200/-
ప్రతులకు: ఫోన్‌- 9393981918


వ్యంగ్యకథనం

కొచ్చుకుట్టన్‌ బతుకుతెరువుకై సౌదీ వెళ్లడానికి సిద్ధమవుతున్న యువకుడు. ఓరోజు వాళ్ల ఊళ్లో ఉన్న తొంభై ఏళ్ల ముసలి నానియమ్మ ఇంటికి పోలీసులొచ్చారు. నానియమ్మ కోడిపుంజు తమ గోడ ఎక్కి అరుస్తోందని పక్కింటి చాక్కు ఫిర్యాదు. అలా మొదలైన కథ మలుపులు తిరుగుతూ కొచ్చుకుట్టన్‌ పీకకు చుట్టుకుంది. అతడు దాంట్లోనుంచి బయటపడ్డాడా, అసలు కోడి కుట్రదారు కావడం ఏమిటీ అన్నది తెలియాలంటే దేశ కాల పరిస్థితులపెనౖ వ్యంగ్యంగా రాసిన ఈ పుస్తకం చదవాలి. ప్రజలు ఊసుపోక చెప్పుకునే కబుర్లు పుకార్లుగా మారి ఎలా జీవితాలను నిర్దేశిస్తాయో, పితృస్వామ్యమూ భక్తీ కులమూలాంటివి బలవంతుల చేతుల్లో ఎలా ఆయుధాలుగా మారతాయో చెప్పిన ఈ రచన అనువాదం సహజంగా చదివించేదిగా ఉంది.

- విస్మయ

కుట్రదారు కోడి (నవలిక)
రచన: ఉన్ని ఆర్‌, తెలుగు: పద్మజా షా
పేజీలు: 120; వెల: రూ. 120/-
ప్రతులకు: సిక్కోలు బుక్‌ట్రస్ట్‌ ఫోన్‌- 9989265444


బాల్యస్మృతులు

బాల్యం ఎవరికైనా అపురూపమే. కవులకు ఆ అపురూప జ్ఞాపకాలు అక్షరాలై అందమైన భావాల్ని పొదువుకుంటాయి. గజల్‌ గాయని అయిన రచయిత్రి తవ్విపోసుకున్న బాల్య జ్ఞాప కాలివి. ‘గిన్నె బరువంతా కడుపుకెక్కాక/ అమ్మ చేతివేళ్లు/ ఉబ్బిన నా బొజ్జను ఓసారి తడిమితే/ అప్పుడెక్కేది పూర్తి మత్తు’ అని అమ్మని గుర్తుచేసుకుంటారు. అటో కాలూ ఇటో కాలూ వేసుకుని/ ఆ పొట్టమీద దర్జాలు పోతూ నేను/బనీను చిల్లుల్ని పెద్దగ చేసే నా వేలుని/ పట్టుకుని ఆపుతూ నాన్నగారు... ఆ మాటలు చాలవూ చదువరులు తమ బాల్యంలోకి జారిపోడానికి... ఇలాంటి ముచ్చట లెన్నో ఇందులో ఉన్నాయి.

- సుశీల

తవ్వకాలు(ఓ గజల్‌ గాయని బాల్యం)
రచన: జ్యోతిర్మయి మళ్ల
పేజీలు: 107; వెల: రూ. 100/-
ప్రతులకు: ఫోన్‌- 9959912541


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు