ఆహ్లాద కథలు

ఎంతోకొంత చైతన్యం కలిగిస్తూ ఆహ్లాదాన్నీ, ఉల్లాసాన్నీ అందించే కథల సంపుటి ఇది. శివయ్య అనే వ్యక్తిని మట్టుబెట్టాలన్నంత విద్వేషంతో రగిలిపోయి కూడా చివర్లో వివేచన మేల్కొన్న ఆదిరెడ్డి మానవీయత ‘పగ’లో కనిపిస్తుంది.

Published : 02 Jan 2022 01:06 IST

ఆహ్లాద కథలు

ఎంతోకొంత చైతన్యం కలిగిస్తూ ఆహ్లాదాన్నీ, ఉల్లాసాన్నీ అందించే కథల సంపుటి ఇది. శివయ్య అనే వ్యక్తిని మట్టుబెట్టాలన్నంత విద్వేషంతో రగిలిపోయి కూడా చివర్లో వివేచన మేల్కొన్న ఆదిరెడ్డి మానవీయత ‘పగ’లో కనిపిస్తుంది. వ్యంగ్యభరితంగా అల్లిన ‘మూషికోపాఖ్యానం’ అంతస్సూత్రం కూడా ఇంచుమించు ఇదే. మాటతీరును బట్టి ఏ వ్యక్తి సంస్కారాన్నీ అంచనా వేయకూడదని ‘ఆ నలుగురు’ నిరూపిస్తుంది. ప్రేమను పంచటంలో, నిజాయతీలో, ఆత్మాభిమానంలో శ్రామికులు ముందువరసలో ఉంటారనీ, వారిపై నింద వేయటానికి ‘ఒక్క అయిదు నిమిషాలు’ ఆలోచిస్తే పరిస్థితులు విషమించవనీ ఓ కథ చెప్తుంది. కుటుంబ బంధాల విలువలకు అద్దంపట్టే కథ ‘రక్షాబంధనం’. పెద్ద సమస్య అని లేనిపోనివి ఊహించుకుంటే తీరా సమస్య చిన్నదిగా మారి రిలీఫ్‌నిచ్చిన వైచిత్రి ‘తాజ్‌మహల్‌’లో చూడవచ్చు. సినిమాల నేపథ్యంలో రాసినవి ‘సెకండ్‌ ఇన్నింగ్స్‌,’ ‘సుధారాణి’. కొన్నిటిలో సున్నితమైన హాస్యం, వ్యంగ్యం తొంగిచూస్తుంటాయి. సరళమైన శైలి, పఠనీయత అన్ని కథలనూ ఆసక్తిగా చదివిస్తాయి.

- సీహెచ్‌. వేణు

శ్రీనాథ్‌ కథలు
రచన: దిగుమర్తి సుందర శ్రీనాథ్‌
పేజీలు: 191; వెల: రూ. 150/-
ప్రతులకు: ఫోన్‌ 8096310140


తెలుగు ప్రవాసుల కథ

విదేశాలకు వెళ్లినప్పుడు మన భాష వినిపిస్తే ప్రాణం లేచొస్తుంది. ఆ పలుకు వందల ఏళ్ల క్రితం వలసవెళ్లిన తాత ముత్తాతలనుంచి పదిలంగా కాపాడుకుంటూ వస్తున్న అస్తిత్వ పోరాటానిదని తెలిసినప్పుడు పెల్లుబికే ఉద్వేగానికి ఆత్మీయ ఆలింగనాన్ని మించిన మాటలేముంటాయి. అలాంటి అనుభవాలనెన్నిటినో సొంతం చేసుకున్న రచయిత్రి మయన్మార్‌, థాయిలాండ్‌, వియత్నాం, ఇండోనేషియా, శ్రీలంక లాంటి దేశాలకు ఎప్పుడో వెళ్లి స్థిరపడిన తెలుగువారి గురించి పరిశోధించి రాసిన పుస్తకమిది. చరిత్రకి కొన్ని కల్పిత పాత్రల్నీ సన్నివేశాల్నీ జతచేసి కథగా మలచి ఆసక్తిగా చదివించడం ఈ పుస్తకం ప్రత్యేకత. ‘ఓ కొడుకా... మన నేల తెలంగాణ, మన రాజుకు అదృష్టం బాగాలేక యుద్ధంలో ఓడిపోతే మనం పడవల్లో ఎర్రరాళ్లున్న ఈ సువర్ణభూమికి వచ్చాం...’ అనే జోల పాటని తరతరాలుగా పాడుకుంటున్న ఆ ప్రవాసుల కథల్ని జర్నలిస్టు సూర్యవర్మ పాత్ర ద్వారా టైమ్‌ మిషన్‌లో ముందుకూ వెనక్కూ వెళ్తూ నాటి, నేటి పరిస్థితులను అనుసంధానిస్తూ అక్షరబద్ధం చేయడం ప్రశంసనీయం.

- విస్మయ

జగమునేలిన తెలుగు(నవల)
గోదావరి నుంచి జావా దాకా...;
రచన: డి.పి.అనురాధ పేజీలు: 157; వెల: రూ. 200/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు

నాటక సంకలనాలు

సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగు నాటక రంగానికి సంబంధించి చక్కని సంకలనం లేని లోపాన్ని భర్తీ చేస్తూ 140 ఏళ్ల సమాజ చరిత్రకు అద్దంపట్టిన వంద నాటకాలను ఎంపిక చేసి ఆరు సంపుటాలుగా వెలువరించడం ప్రశంసనీయం. 1880 నుంచి 2020 వరకూ పేరొందిన ప్రముఖ నాటకాలన్నీ వీటిల్లో ఉన్నాయి. ఆనాటినుంచి నేటివరకు ప్రజా శ్రేయస్సు కోరుతూ ఆలోచన రేకెత్తించే నాట కాలెన్నో రాశారు రచయితలు. ఒకప్పుడు అవి సమాజాన్ని చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషించాయి. నిర్యాణ కాలంలో కల్యాణమా అంటూ ప్రశ్నిస్తుంది ‘వృద్ధ వివాహము’. స్త్రీపురుషుల బాధ్యతలను చర్చిస్తుంది ‘మగసంసారం’. మధుసేవ, తప్పెవరిది, స్త్రీ లాంటివి సంఘసంస్కరణ దృష్టితో సాగుతాయి. 1945కి ముందు వచ్చి మొదటి సంకలనంలో స్థానం పొందాయివి. ఆరో సంపుటం(1990-2020) లోని 19 నాటకాల్లో కఠినమైన జీవితసత్యాన్ని నవ్విస్తూ చెబుతుంది ‘దొంగలబండి’. పల్లెల్లో కులాల మధ్య అధికారం రేపే చిచ్చుకి అద్దం పడుతుంది ‘కుర్చీ’. నాటకంతో పాటు ఆయా రచయితల వివరాలనూ పొందుపరచడం బాగుంది.

- పద్మ

ప్రసిద్ధ తెలుగు నాటకాలు
నూరు నాటకాలు- ఆరు సంకలనాలు.
పేజీలు: ఒక్కోటీ సుమారు 800; వెల: ఒక్కోటీ రూ.650/-;
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..