కళాస్రష్ట జీవితచిత్రం

సంపన్నుల సౌధాలనే కాకుండా పేదల పూరిళ్లను కూడా అలంకరించిన అద్భుత వర్ణచిత్రాల సృష్టికర్త రవివర్మ. సరస్వతి, లక్ష్మిలాంటి దేవతలనూ... శకుంతల, దమయంతి లాంటి కావ్య నాయికలనూ రసవంతంగా తన కుంచె స్పర్శతో

Updated : 23 Jan 2022 07:59 IST

కళాస్రష్ట జీవితచిత్రం

సంపన్నుల సౌధాలనే కాకుండా పేదల పూరిళ్లను కూడా అలంకరించిన అద్భుత వర్ణచిత్రాల సృష్టికర్త రవివర్మ. సరస్వతి, లక్ష్మిలాంటి దేవతలనూ... శకుంతల, దమయంతి లాంటి కావ్య నాయికలనూ రసవంతంగా తన కుంచె స్పర్శతో పునఃసృష్టి చేసిన ఈ చిత్రశిల్పి జీవిత నవల ఇది. స్వయంగా చిత్రకారుడైన రచయిత- రవివర్మ కళాసృజన ప్రస్థానాన్నీ, అది పదునుదేరటానికి చేసిన అవిరళ కృషినీ, ప్రాక్పశ్చిమ చిత్రకళారీతుల ప్రస్తావనలనూ సాధికారికంగా అక్షరబద్ధం చేశారు. భార్య భాగీరథి, ప్రోత్సహించిన కల్యాణి కుట్టి, మోడల్స్‌ మాధవి, కమల... వీరందరూ రవివర్మ కళలో, జీవితంలో అంతర్భాగం. విజయాలనూ, ఆశానిరాశల భావోద్వేగాలనూ, అంతరంగ ఘర్షణలనూ ఆసక్తికరంగా చిత్రించారు. రచయిత చేసిన పరిశోధన, సమాచార సేకరణ ప్రశంసనీయం. పుస్తకంలో... రవివర్మ గీసిన విభిన్న వర్ణచిత్రాలను ఇవ్వడం ఓ ఆకర్షణ.  

- సీహెచ్‌. వేణు

రాజా రవివర్మ(నవల)

రచన: పి.మోహన్‌
పేజీలు: 411; వెల: రూ. 300/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


ద్రవించిన గుండె

అసింటా...ఇప్పుడు కాదుకానీ ఒకప్పటి ఊళ్లలో ఎక్కువగా వినిపించిన పదం. కూటికోసమో, మంచినీళ్లకోసమో గడప దగ్గరకొచ్చి ఎడంగా నిల్చున్న ‘వాళ్ల’పైన దయతలచి నాలుగు మెతుకులు విదిల్చినప్పుడో దోసెడు నీళ్లు పోసినప్పుడో వినిపించే మాట ఇది. కరోనా వేళ ప్రతి ఒక్కళ్లం ‘అసింటా’ అన్నపదాన్నే భౌతికదూరం పేరుతో ఎదుర్కొంటున్నాం. మరి ఈ వేళ... ఒకనాటి అంటరానివాళ్ల బాధేమిటో తెలియొద్దూ?! అందుకే తరాలుగా వివక్షాయుధాన్ని విసిరినవాళ్ల మానవీయ ప్రతినిధిగా మోకరిల్లి ‘నీ కంచంలో ఎత్తిపడేసిన అన్నం ముద్దను/నీతోనే కలిసి తినాలని/నీ దోసిట్లో ఎత్తి పోస్తున్న నీళ్ళలోంచి/మిగిలిపోయి కారిపోతున్న/నీ మోచేతి నీళ్లతో/దాహం తీర్చుకోవాలని ఉంది’(అసింటా) అంటాడు. ఇది మచ్చుకే. ఈ సంపుటిలోని చాలా కవితల్లో ఇలా అణగారిన ప్రజల ప్రతినిధిగా వకాల్తా పుచ్చుకుని కనిపిస్తాడీ కవి!

- అంకిత

దృశ్య రహస్యాల వెనుక (కవిత్వం)

రచన: బండ్ల మాధవరావు
పేజీలు: 124; వెల: రూ. 120/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


పఠనీయం... ప్రామాణికం

దేవుడెవరన్న ప్రశ్నకు వేదకాలం నుంచి నేటిదాకా అనేక వివరణలు వెలువడ్డాయి. అవన్నీ విభిన్న మతాలకు ప్రాతిపదికలను ఏర్పరిచాయి. అసలు దైవం అన్న భావన మనిషి జీవితంలోకి ఎప్పుడు ప్రవేశించింది? మతం అంటే ఏమిటి? పురాణాలు చెబుతున్నదేమిటి? మనిషి జీవితానికి పరమార్థం ఏమిటి? ఆధునిక జీవితంలో మతమూ సైన్స్‌ కలిసి ఎలా ముందుకు సాగాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుకునే వారందరికీ పఠనీయమైన పుస్తకంగా వెలువడినదే- భక్తి టివి వారి ‘అర్చన’. తత్త్వం, వేదవిజ్ఞానం, గురుదేవులు, సంస్కృతి, చింతన, జ్ఞానదీపికలు తదితర శీర్షికల కింద సర్వేపల్లి రాధాకృష్ణన్‌ మొదలు జగ్గీ వాసుదేవ్‌ వరకూ జిడ్డు కృష్ణమూర్తి మొదలు కొత్త సచ్చిదానందమూర్తి వరకూ గౌతమ బుద్ధుని మొదలు స్వామి వివేకానంద వరకూ విఖ్యాత తత్త్వవేత్తల వ్యాసాలను ఇందులో చదవచ్చు.

అర్చన (భక్తి టివి ప్రత్యేక సంచిక)

సంపాదకులు: రఘు ఏలూరి
పేజీలు: 573; వివరాలకు:
ఫోన్‌- 9010232333


నేటి కథలు

స్కూల్లో సభకి రావాలని పాఠశాలనుంచి సందేశం వస్తే- ఆ అమ్మానాన్నలు మనసొప్పకపోయినా దుఃఖాన్ని అదిమిపెట్టుకుని వెళ్లారు. తమ బిడ్డ అన్యాయంగా చనిపోవడానికి కారణమేంటో, బాధ్యత ఎవరిదో గద్గదమైన గొంతుతో ఆ తండ్రి వివరిస్తోంటే అందరూ నిశ్శబ్దంగా విన్న కథ ‘నేల జారిన ముగ్ధత్వం’. ఏడ్చి ఏడ్చి గుండె అవిసిపోతోంది. కళ్లవెంట నీళ్లు కూడా రావడంలేదు. ఏడవడానికి తనకీ ఒక డూప్‌ ఉంటే, ఈ బాధల బరువును మోసే మరో గుండె ఉంటే... అనుకుంటుంది తండ్రి బాధ్యత నెత్తినేసుకున్న యువతి ‘ఓ ఎక్స్‌ట్రా కథ’లో. తాను లేకపోయినా తన మాట బిడ్డకి ధైర్యాన్నివ్వాలని ఉత్తరాలు రాసిపెట్టి కన్నుమూసిన ఓ అమ్మ కథ ‘పారిజాతాలు’. పిల్లలు డ్రగ్స్‌కి బానిసలవడం, ఆఫీసులో లైంగిక వేధింపులు, పనిఒత్తిడిలో జీవితాన్ని ఆస్వాదించలేకపోవడం... దేనికదే భిన్నమైన కథావస్తువులతో కథలన్నీ నేటి సామాజిక పరిస్థితులకి అద్దం పడతాయి.

- పద్మ

నేల జారిన ముగ్ధత్వం (కథల సంపుటి)

రచన: గంటి భానుమతి
పేజీలు: 160; వెల: రూ. 150/-
ప్రతులకు: ఫోన్‌- 8897643009



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..