సమీక్ష

మధ్యతరగతి అనుబంధాలూ, ఆకాంక్షలూ, తాపత్రయాలూ, రాగద్వేషాల్లాంటి భిన్న కోణాలపై వెలుగు ప్రసరించిన 60 కథల సంపుటి ఇది. 35 ఏళ్ల వ్యవధిలో రాసిన ఈ రచనలు సామాజిక జీవనంలో వచ్చిన మార్పుల్ని ప్రతిఫలించాయి. స్థానికంగా ఎవరూ పట్టించుకోని ఓ కవి ప్రతిభను

Published : 30 Jan 2022 01:57 IST

సమీక్ష

భిన్న కోణాలు

ధ్యతరగతి అనుబంధాలూ, ఆకాంక్షలూ, తాపత్రయాలూ, రాగద్వేషాల్లాంటి భిన్న కోణాలపై వెలుగు ప్రసరించిన 60 కథల సంపుటి ఇది. 35 ఏళ్ల వ్యవధిలో రాసిన ఈ రచనలు సామాజిక జీవనంలో వచ్చిన మార్పుల్ని ప్రతిఫలించాయి. స్థానికంగా ఎవరూ పట్టించుకోని ఓ కవి ప్రతిభను ఇతర ప్రాంత కవులు గుర్తించిన వైరుధ్యం ‘పెరటి చెట్టు’ ఇతివృత్తం. ప్రభుత్వమూ, ప్రజలూ గుర్తించని సాహితీ కృషి ‘కంచి గరుడసేవ’ అని సూత్రీకరిస్తుందో కథ. అధిక వడ్డీల మోజుతో ‘ఆశలపల్లకి’ ఎక్కితే ఎదురయ్యే దుష్పరిణామాలు; అప్రియ సత్యాన్ని ముక్కుసూటిగా చెప్పకూడదని గ్రహించిన ఉద్యోగి పరివర్తన వేర్వేరు కథలను మెరిపిస్తాయి. ‘నరసింహం డాక్టరు’, ‘వడయారు డాక్టరు’, ‘తీపి గరళం’ కథలు హోమియో చికిత్స ప్రత్యేకతను చాటుతాయి. చిన్న అంశాన్ని సైతం ఆకట్టుకునేలా మలిచే నేర్పు, కథన నైపుణ్యం పుస్తకాన్ని పఠనీయంగా మలిచాయి.

- సీహెచ్‌. వేణు

పెరటి చెట్టు(కథలు);
రచన: వియోగి
పేజీలు: 416; వెల: రూ. 399/-
ప్రతులకు: ఫోన్‌- 7794820104

ఆలోచింపజేసే కథలు

కథలంటే ఎక్కడినుంచో ఊడి పడవు, మన చుట్టూనే ఉంటాయనీ ప్రతి మనిషీ ఓ కథలోని పాత్రేననీ చెబుతాయి ఈ పాతిక కథలూ. మంచితనాన్ని నటిస్తూ మాటలతో వలవేసి కొంపలు ముంచే జగన్నాథం లాంటివాళ్లు ఎందుకూ పనికిరాక పోయినా రంగులతో ఆకట్టుకునే ‘కాగితంపూల’ లాంటివారే. తల్లి బాధ్యత ఎక్కడ మీదపడుతుందోనని ఆమె ఉత్తరాలకు సమాధానమే ఇవ్వని కొడుకు రెక్కలు కట్టుకుని తల్లి ముంగిట వాలేలా చేసిన వార్త ఏమిటో చెప్పే కథ ‘పేగు బంధం’. కాలంతో పాటు కొన్ని పద్ధతుల్నీ మార్చుకోక తప్పదంటుంది ‘శ్రాద్ధ కర్మ’.కథలన్నీ సూటిగా స్పష్టంగా రచయిత చెప్పదలచుకున్న విషయాన్ని పాఠకులకు అర్థమయేలా చెబుతూ చదివిస్తాయి.

- సుశీల

కాగితం పూలు మరో 24 కథలు
రచన: ప్రతాప వెంకట సుబ్బారాయుడు
పేజీలు: 143; వెల: రూ.200/-
ప్రతులకు: ఫోన్‌- 9393981918


మహానటుడు దిలీప్‌కుమార్‌

సమానమైన ప్రతిభతో ‘మెథడ్‌ యాక్టర్‌’గా ప్రత్యేక శైలిని అలవరచుకుని దాదాపు ఐదు దశాబ్దాలపాటు భారతీయ సినీ ప్రేక్షకుల్ని అలరించారు దిలీప్‌కుమార్‌. సినిమాల సమగ్ర పరిచయంతో పాటు, ఆయన వ్యక్తిత్వాన్ని కూడా విశ్లేషిస్తూ రాసిన ఈ పుస్తకం హిందీ సినిమా స్వర్ణయుగాన్ని గుర్తుచేస్తుంది. ఒక కళాకారుడిగా అభిమానులకు ఆదర్శంగా ఉండాల్సిన బాధ్యతా తనమీద ఉందని భావించి సిగరెట్టు తాగుతూ తెరపై కన్పించకూడదని నిర్ణయించుకుని దానికి కట్టుబడిన వ్యక్తి దిలీప్‌కుమార్‌. అంతేకాదు, చొక్కా లేకుండా నటించడం ఇష్టం లేక సత్యజిత్‌రే సినిమానీ వదులుకున్నాడాయన. బతుకుతెరువు కోసం సినిమాల్లోకి వచ్చినా వృత్తికి నూరుశాతం న్యాయం చేసిన దిలీప్‌కుమార్‌ హాలీవుడ్‌ అవ కాశాన్నే తిరస్కరించిన ధీశాలి. ఇలాంటి ఎన్నో విశేషాలతో హిందీ సినిమానీ దిలీప్‌నీ అభిమానించేవారిని అలరించే పుస్తకమిది.

- శ్రీ

తహ్జీబ్‌ కా బాద్‌షాహ్‌ దిలీప్‌ కుమార్‌
రచన: పి.జ్యోతి;
పేజీలు: 384; వెల: రూ. 500/-
ప్రతులకు: వాట్సప్‌ నం- 8558899478

పెళ్లా... సహజీవనమా..?

పెళ్లికి ముందు కొన్నాళ్లు ‘సహజీవనం’ చేసి నచ్చితేనే పెళ్లి, లేకపోతే ఎవరి దారి వాళ్లు చూసు కోవడమనే విధానం గురించి చర్చి స్తుంది ఈ చిన్న నవల. ఎటువంటి ఉపోద్ఘాతాలూ లేకుండా నేరుగా కథలోకి వెళ్లి ఎక్కువగా పాత్రల మధ్య సంభాషణల ద్వారా కథను నడిపించారు రచయిత్రి. కూతురు మధు పెళ్లికి ఇష్టపడక తనకి నచ్చినవాడితో సహజీవనం చేస్తాననడంతో వనజకి టెన్షన్‌ మొదలవుతుంది. తనలాగే కూతురు కూడా పొరపాటు చేసి జీవితాన్ని పాడుచేసుకుంటుందేమోనని ఆ తల్లి ఆందోళన. దాంతో ఇద్దరి మధ్యా సాగే వాదోపవాదాలూ బంధువుల ప్రవర్తనా సహజీవనంలో మధుకి ఎదురయ్యే అనుభవాలూ... నవలని ఆపకుండా చదివిస్తాయి. రెండు విధానాల్లోని మంచి, చెడులనూ లోతుగా చర్చించారు రచయిత్రి.

- పద్మ

కలిసుందామా..? (నవల)
రచన: లలితా వర్మ;
పేజీలు: 136; వెల: రూ. 120/-
ప్రతులకు: ఫోన్‌- 9949672671

బుక్‌ సెల్ఫ్‌

కాల ప్రభంజనం (కవిత్వం)
రచన: డా।। కొండపల్లి నీహారిణి
పేజీలు: 175; వెల: రూ. 120/-
ప్రతులకు: ఫోన్‌- 040 27678430


ఆటా-పాటా(బాలల కథలు)
రచన: ఎన్నవెళ్లి రాజమౌళి
పేజీలు: 104; వెల: రూ. 80/-
ప్రతులకు: ఫోన్‌- 9848592331


కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్‌ ఈశ్వర్‌
పేజీలు: 184; వెల: అమూల్యం
ప్రతులకు: ఫోన్‌- 9059519137


నాది దుఃఖం వీడని
దేశం(కవిత్వం); రచన: హనీఫ్‌
పేజీలు: 122; వెల: రూ. 120/-
ప్రతులకు: ఫోన్‌- 9247580946


ఖలిల్‌ జిబ్రాన్‌ (ప్రవక్త)
అనువాదం: డా.తుర్లపాటి రాజేశ్వరి
పేజీలు: 71; వెల: రూ. 150/-
ప్రతులకు: ఫోన్‌- 7077613351


తపస్విని(శబరి చరిత్ర-పద్యకావ్యం)
రచన: డా।।ఎం.పురుషోత్తమాచార్య
పేజీలు: 176; వెల: రూ. 135/-
ప్రతులకు: నవోదయ బుక్‌ హౌస్‌


తమిళనాడులోని నవగ్రహక్షేత్రాలు
తమిళమూలం: స్వర్గీయ ఆనంది
తెలుగు సేత: ఆర్‌. జయశ్రీ కాశీకర్‌
పేజీలు: 52; వెల: రూ. 50/-
ప్రతులకు: ఫోన్‌- 9989450669


కథానికలతో... కాసేపు
పేజీలు: 86; వెల: అమూల్యం గీతావలోకనం
పేజీలు: 84; వెల: అమూల్యం
రచన: డా।।వి.డి.రాజగోపాల్‌
ప్రతులకు: ఫోన్‌- 9505693690


పోతన చరిత్ర
శ్రీమాన్‌ వానమామలై వరదాచార్యులవారి పద్య కావ్యానికి వచనాకృతి
రచన: గొడవర్తి సంధ్య
పేజీలు: 296; వెల: రూ.150/-
ప్రతులకు: ఫోన్‌- 9440927200


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..