వాస్తవికతకు అద్దం!

రాయలసీమ నేపథ్యంలో సగటు మనుషుల జీవితాలతో అల్లిన కథల సంకలనమిది. ‘చిల్ఢ్రన్స్‌ డే’ రోజు పిల్లలంతా పిక్నిక్‌కి వెళ్తే డబ్బు అడిగి తల్లిని ఇబ్బందిపెట్టడం ఇష్టంలేని గణేషు కూలికి వెళ్తాడు. ఏడో తరగతిలో ‘స్కూల్‌ ఫస్టు’ వచ్చి తప్పనిసరై బడి మానేసినా ఓపెన్‌ స్కూల్‌లో చదువుకోవడం బాగుంది.

Updated : 20 Feb 2022 05:43 IST

వాస్తవికతకు అద్దం!

రాయలసీమ నేపథ్యంలో సగటు మనుషుల జీవితాలతో అల్లిన కథల సంకలనమిది. ‘చిల్ఢ్రన్స్‌ డే’ రోజు పిల్లలంతా పిక్నిక్‌కి వెళ్తే డబ్బు అడిగి తల్లిని ఇబ్బందిపెట్టడం ఇష్టంలేని గణేషు కూలికి వెళ్తాడు. ఏడో తరగతిలో ‘స్కూల్‌ ఫస్టు’ వచ్చి తప్పనిసరై బడి మానేసినా ఓపెన్‌ స్కూల్‌లో చదువుకోవడం బాగుంది. ‘కొత్త సైకిలు’ మీద మోజుతో సెలవుల్లో పత్తి పొలంలో పనిచేసి మరీ డబ్బు సంపాదించుకున్నాడు పవన్‌. ఆ డబ్బు పట్టుకెళ్లి సెకండ్‌ హ్యాండ్‌ సైకిల్‌ కొని మిగిలిన డబ్బు తాగడానికి దాచుకున్న తండ్రిని పవన్‌ ఏమీ అనలేదు, సైకిల్‌నీ ముట్టుకోలేదు. బాషా మామ ‘గాజుల సంచీ’లో బాంబు ఎందుకు ఉంచుకున్నాడో చెప్పాక పార్వతికి అతడి క్షేమం గురించిన ఆలోచన ఎక్కువైపోతుంది. కథలన్నీ సీమ మాండలికంలో, సరళమైన శైలిలో చదివిస్తాయి.
 

గాజుల సంచి ఇంకొన్ని కథలు
రచన: మొహమ్మద్‌ గౌస్‌; పేజీలు: 140; వెల: రూ. 150/-
ప్రతులకు: ఫోన్‌- 9912460268
- క్రాంతి శివరాత్రి


గొలుసు కథ

అరవై మంది రాసిన ఈ గొలుసు నవల వస్తువులో కానీ, గమనంలో కానీ ఏమాత్రం తేడా లేకుండా ఒకరి తర్వాత ఒకరు కథను అల్లుకుంటూ పోవడం వల్ల పఠనం హాయిగా సాగిపోతుంది. అనాథాశ్రమం వాకిట దొరికిన ఓ పసిబిడ్డకి ‘మానస’ అని పేరుపెట్టి పెంచుతారు ఆశ్రమంలోనివారు. చదువులోనూ ఆటపాటల్లోనూ రాణిస్తూ అందరి తలలో నాలుకలా మారిన మానస చిన్నవయసు నుంచే సమాజసేవ పట్ల ఆసక్తి కనబరుస్తుంది. ఆమెని చూసి స్ఫూర్తిపొందుతాడు అనాథాశ్రమం యజమాని కొడుకు అనిరుధ్‌. కాలేజీలో రౌడీ గ్యాంగ్‌ లీడర్‌ రాజేశ్‌ కూడా బుద్ధిమంతుడిగా మారిపోయి ఆమెను ప్రేమిస్తున్నానంటాడు. మరి మానస ఎవర్ని ప్రేమించిందీ, అసలు మానసని అక్కడ వదిలేసిందెవరూ, అది తెలుసుకున్న హోంమంత్రి కృషీవలరావు ఏం చేసి ఆమెను తల్లిదండ్రుల చెంత చేర్చాడూ- అన్నది కథ.
 

మానస వీణ;

పేజీలు: 240; వెల: రూ.200/-
ప్రతులకు: ఫోన్‌- 8558899478


స్ఫూర్తిదాయకం

కన్నతండ్రి నుంచి వాత్సల్యానికి బదులు ఏహ్యతనూ, ద్వేషాన్నీ చవిచూసిన చైత్ర అనే పేదింటి ఆడపిల్ల గాథ ఇది. పల్లెటూళ్ళో కష్టాల మధ్య పెరిగిన ఆమెకు తల్లి ప్రేమ, టీచర్‌ లక్ష్మిల ప్రోత్సాహం పెద్ద ఊరట. జవాను అవ్వాలనే లక్ష్యం సాధించటానికి అవరోధాలను ఓర్పుగా ఎలా దాటుకుంటూ పోయిందో ఈ నవల వివరిస్తుంది. పట్టుదలతో కృషిచేసి ఆర్మీ సెలక్షన్స్‌కు ఎంపికైన చైత్ర జీవిత గమనం కొత్తబాట పడుతుంది. దేశ రక్షణే ధ్యేయంగా ఆమె చేసిన సాహసకృత్యాలు అబ్బురపరుస్తాయి. శత్రుదేశపు బయోవార్‌ కుయుక్తులను చాకచక్యంగా వమ్ము చేస్తుంది. అత్యధిక సంభాషణలు తెలంగాణ మాండలికంలో సాగుతాయి. సంకల్పం, సహనం, దేశభక్తి, ఆదర్శాలను మేళవించి చైత్ర పాత్రను స్ఫూర్తిదాయకంగా చిత్రించారు రచయిత్రి.
 

చైత్ర (నవల);

రచన: స్ఫూర్తి కందివనం
పేజీలు: 276; వెల: రూ.200/-
ప్రతులకు: ఫోన్‌- 8558899478
- సీహెచ్‌. వేణు  


పూర్వ విద్యార్థుల పరిచయం

బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వవిద్యార్థుల పరిచయానికి సంబంధించి ఇది మూడో పుస్తకం. 75 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ కళాశాలలో అందరూ చదివింది వ్యవసాయశాస్త్రమే అయినా భిన్నరంగాల్లో తమదైన ప్రతిభ చూపడం విశేషం. డా.ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు లాంటివాళ్లు రాజకీయ రంగంలో, అజయ్‌ కల్లం, మాలకొండయ్య తదితరులు పాలనారంగంలో, డా.మొవ్వ రామారావు, డా.గోగినేని స్వరాజ్యలక్ష్మి లాంటివాళ్లు బోధన, పరిశోధన రంగాల్లో, కంభంపాటి చెన్నకేశవశాస్త్రి, అమిరపు నటరాజన్‌ లాంటివాళ్లు సామాజిక సేవ తదితర రంగాల్లో పేరు తెచ్చుకోగా సేద్యం చేస్తూ చదివిన చదువుకి సార్థకత తెచ్చారు మల్లిన రవీంద్ర ప్రసాద్‌, మద్దిపాటి శ్రీరామకృష్ణ పరమహంస తదితరులు. పుస్తకంలోని మొత్తం వంద మంది జీవనయానాలూ పాఠకులకు స్ఫూర్తిదాయకాలే.
 

వెలుగుపూలు (హరితరేఖల సంకలనం-2)
పేజీలు: 264; వెల: రూ.250/-
ప్రతులకు: ఫోన్‌- 9441276770
- శ్రీ


బుక్‌షెల్ఫ్‌

ధర్మం మానుషరూపేణ
రచన: విశ్వనాథ శోభనాద్రి
పేజీలు: 202; వెల: రూ.150/-
ప్రతులకు: ఫోన్‌- 9440666669

అనురాగవనం (నవల)
రచన: ప్రణవి
పేజీలు: 280; వెల: రూ.400/-
ప్రతులకు: విశాలాంధ్ర పుస్తకకేంద్రాలు


కార్తికంలో కాశీయాత్ర

(కైవల్య సోపానం)
రచన: సంధ్యా యల్లాప్రగడ
పేజీలు: 211; వెల: రూ.150/-
ప్రతులకు: ఫోన్‌ 8096310140

అందనివాడు (అందరి గుండెల్లో కొలువైనవాడు)
రచన: లంక నాగేంద్రరావు
పేజీలు: 187; వెల: రూ.200/-
ప్రతులకు: విశాలాంధ్ర, నవచేతన పుస్తకకేంద్రాలు


నోముల సాహిత్య ముచ్చట్లు

సంపాదకుడు: పెన్నా శివరామకృష్ణ
పేజీలు: 139; వెల: రూ.100/-
ప్రతులకు: నవోదయ,
నవచేతన పుస్తకకేంద్రాలు

కుదురు
(సామాజిక, ఆర్థిక, రాజకీయ కథనాలు)
రచన: కెహెచ్‌కె. మోహన్‌రావు
పేజీలు: 176; వెల: రూ.160/-
ప్రతులకు: ఫోన్‌- 9440154114


తుషార ప్రతిమ
రచన: డా।। కోడూరు ప్రభాకరరెడ్డి
పేజీలు: 91; వెల: రూ.120/- ప్రతులకు: ఫోన్‌- 9440170808

క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ఎలా చేయాలి?
యువ న్యాయవాదుల
విజయానికి మార్గదర్శకాలు-2
రచన: జస్టిస్‌ బి. చంద్రకుమార్‌
పేజీలు: 124; వెల: రూ.200/-
ప్రతులకు: ఫోన్‌- 9703072729


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..