సమీక్ష

మానవ సంబంధాల గురించి మనసుని కదిలించేలా రాసిన కథల్లో పాత్రల హృదయఘోష అర్థం కావడానికి భాషా యాసా అడ్డం రావు. ఈ సంపుటిలోని ‘ఇంగ సెలవా మరి’ అలాంటి కథ. బాధ్యతలన్నీ వైనంగా నెరవేర్చి శాశ్వతంగా

Updated : 30 Jul 2022 15:40 IST

సమీక్ష

మానవీయ పరిమళం

మానవ సంబంధాల గురించి మనసుని కదిలించేలా రాసిన కథల్లో పాత్రల హృదయఘోష అర్థం కావడానికి భాషా యాసా అడ్డం రావు. ఈ సంపుటిలోని ‘ఇంగ సెలవా మరి’ అలాంటి కథ. బాధ్యతలన్నీ వైనంగా నెరవేర్చి శాశ్వతంగా నిద్రపోయిన అర్ధాంగి సమాధి దగ్గర కూర్చుని అతడు చెప్పే కబుర్లలో ‘మసానమైపోయిన పచ్చటి ఊరూ మారిపోయిన పిల్లల తీరూ’ కనిపిస్తాయి. ‘గుండెకాయ బరువుగా నొప్పిగా అన్పిస్తాండాదిమే... లెయ్యలేకపోతాండాను’ అంటుంటే పాఠకులకీ దుక్కం కడుపులో నుంచి ‘పెరక్కవస్తాది.’ ఈ పుస్తకంలోని కథలన్నీ చిత్తూరు ప్రాంత పల్లె ప్రజల కష్టసుఖాల్ని స్పృశిస్తాయి. కాయకష్టం చేసేవాళ్ల దగ్గర చెమట వాసన కాక సెంటు వాసన వస్తుందా అని శిష్యుడి తప్పును సరిదిద్దే అయ్యోరు, తన మంచితనంతో కొడుకులూ కోడళ్లను ఒక్క తాటి మీదికి తెచ్చే తల్లి, తల్లికి కష్టం కాకూడదని తాగుబోతు తండ్రి దగ్గర ఉండి నానా కష్టాలూ పడ్డ బిడ్డలూ... ఇలా మంచితనం పరిమళించే మనుషులెందరో ఈ కథల్లో తారసపడతారు. భవిష్యత్తు పట్ల ఆశతో నిబ్బరంగా నిలబడే మహిళలెందరో కన్పిస్తారు.

- పద్మ

ఇంగ సెలవా మరి!;

రచన: యం.ఆర్‌.అరుణకుమారి

పేజీలు: 140; వెల: రూ. 200/-

ప్రతులకు: ఫోన్‌- 8121523835


పాత్రలూ స్వభావాలూ

రామాయణం అందరికీ తెలిసిందే అయినా కొన్ని పేర్లు చెబితే వాళ్లకీ రామాయణానికీ సంబంధమేమిటో ఒకపట్టాన గుర్తురాదు. ఆ లోటు తీర్చే పుస్తకమిది. రామాయణంలోని 50 ముఖ్యమైన పాత్రల పరిచయంతో పాటు వారి గుణగణాలూ, రామాయణంలో వారి ప్రయాణమూ, వారినుంచి నేర్చుకోవాల్సిన విషయాలూ... లాంటివన్నీ వివరించారు రచయిత. ఉదాహరణకు రావణుడి కొడుకుల్లో ఒకడైన ప్రహస్తుడు ఏకకాలంలో 60వేల మందితో యుద్ధం చేయగల అతిరథుడు. సీతను తిరిగి పంపించేయమని తండ్రికి చెబుతాడు. తండ్రి వినకుండా యుద్ధం దాకా తేవడంతో తండ్రికోసం ప్రాణాలైనా ఇస్తానని వెళ్లి యుద్ధంలో మరణిస్తాడు. ధర్మం తెలిసినా ఆచరించకపోతే ప్రయోజనం ఉండదని ఈ పాత్ర ద్వారా చెబుతారు రచయిత.

- శ్రీ

రామాయణ పరివారము;

రచన: బుర్రా వెంకటేశం,

పేజీలు: 162; వెల: రూ. 250/-;

ప్రతులకు: ఫోన్‌- 9963539139


డిటెక్టివ్‌ నవలలు

ఏడెనిమిది దశాబ్దాల నాటివే అయినా ఇప్పటికీ ఉత్కంఠగా చదివించే శైలి కొవ్వలి డిటెక్టివ్‌ నవలల సొంతం. ‘భయంకర్‌’ అనే కలంపేరుతో ఆయన రాసిన కాలసర్పం, లంబాడీ దెయ్యం, పెళ్లెందుకు, క్రైం థ్రిల్లర్‌- నవలలు ఇందులో ఉన్నాయి. కళ్లు కనిపించని కటిక చీకటి, చేతిలో తళతళ మెరిసే కత్తి... అంటూ సాగే వర్ణన ఆపకుండా చదివిస్తుంది. సంగీత పాఠాలు చెప్పుకునే ఓ పంతులమ్మ హత్యకు గురికాగా ఆమెకీ హంతకుడికీ సంబంధమేమిటో చెబుతుంది ‘కాలసర్పం’. చక్రధర్‌ ప్రేమించి పెళ్లిచేసుకున్న ప్రభ గొప్ప అందగత్తె. కానీ ఆమెకు దయ్యం పట్టింది. ఆ దయ్యం కథా కమామిషు ‘లంబాడీ దెయ్యం’లో చూడవచ్చు. ఉత్కంఠభరితమైన కథనంతో సాగుతాయి నవలలన్నీ.

- విస్మయ

కాలసర్పం; రచన: భయంకర్‌;

పేజీలు: 328; వెల: రూ. 275/-

ప్రతులకు: ఫోన్‌- 9866115655


జీవితాన్వేషణ

తత్వశాస్త్రపరంగా పాశ్చాత్యులకీ, మనకీ ప్రధాన తేడా ఒకటుంది. పాశ్చాత్య తాత్వికత కవితల్ని ఊహాకల్పితాలుగా హేతువుకి విరుద్ధమైనవిగా చూస్తే భారతీయ తత్వశాస్త్రం వాటిని తనలో భాగంగానే చూస్తుంది. తాత్వికత సారాన్నంతటినీ కవితల రూపంలోనే చెబుతుంది. తనదైన తాత్వికతని తేనెగుళికల్లా మార్చి తీయగా అందించారు ఈ కవి. ‘ఆకాశం చదివేసిన పాత పుస్తకం/ చంద్రుడు ఎన్నేళ్ళు వచ్చినా/ అదే వేషం వేసే ముసలి కథానాయకుడు’ అంటూ మొదలుపెట్టి యుగయుగాలుగా ఒకే మూసలో నడుస్తున్న ప్రకృతిచర్యల్ని వివరిస్తూ ‘ఏ మార్పూలేని ఈ ఆటని/ ఏమాత్రం విసుగులేకుండా/ అనంతకాలం ఆడాలంటే/ ఎంత బాలుడై ఉండాలి’(ఆట) అంటూ విస్తుపోతాడు. ప్రకృతి వెనకున్న అనంతశక్తిని చిన్నారి చేష్టలా చూసే ఈ అరుదైన దృష్టి దాదాపు అన్ని కవితల్లోనూ కనిపిస్తుంది.

- అంకి

మంచు కరిగాక (కవిత్వం)


రచన: విన్నకోట రవిశంకర్‌
పేజీలు: 74; వెల: రూ. 100/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


బుక్‌ షెల్ఫ్‌

వీఎస్‌డీ ఆంగ్ల ఆంధ్ర నిఘంటువు

సంకలనం: సనపల జీవన్‌కుమార్‌

పేజీలు: 210; వెల: రూ.399/-

ప్రతులకు: ప్రధానపుస్తకకేంద్రాలు

నువ్వేచెప్పు (కవిత్వం)

రచన: కె.వి.యస్‌.వర్మ

పేజీలు: 55; వెల: రూ. 50/-

ప్రతులకు: ఫోన్‌- 9246277375

ఆణిముత్యాలు (ఖండకావ్యం);

రచన: జన్నాభట్ల నరసింహప్రసాద్‌

పేజీలు: 45; వెల: రూ.60/-;

ప్రతులకు: ఫోన్‌- 8297263741

మాట్లాడే సమయం (కవిత్వం);

రచన: పోర్షియాదేవి

పేజీలు: 152; వెల: రూ.100/-;

ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు

ఆచార్య చెన్నప్ప అమెరికా ముచ్చట్లు

పేజీలు: 110; వెల: రూ.150/-;

ప్రతులకు: ఫోన్‌- 9885654381

కాళిదాస విరచిత మేఘసందేశమ్‌;

స్వేచ్ఛాకవితానువాదం: రఘువర్మ

పేజీలు: 61; వెల: రూ. 70/-;

ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు

నిన్ను చేరి కొలుతు..!;

రచన: రామిరెడ్డి ఇందిరాదేవి
పేజీలు: 36; వెల: రూ.50/-; ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు

గుటుక్కు గుటుక్‌! బ్రే..వ్‌..?పిల్లల పాటలు
సేకరణ: చంద్రలత
పేజీలు: 130; వెల: రూ. 285/-
ప్రతులకు: ప్రభవ
ఫోన్‌- 0861 2355567

పి.వి.నరసింహారావు - భారతజాతి పునరుజ్జీవశక్తి

రచన: శంకర్‌ నీలు భాగవతుల;

పేజీలు: 125; వెల: రూ.100/-

ప్రతులకు: ఫోన్‌- 9849017667


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..