మార్పు

నగరంలో పుట్టిపెరిగిన సుధీరకి అమెరికా సంబంధం వచ్చింది. అబ్బాయి చాలా నచ్చాడు. పెళ్లి కాగానే అమెరికా వెళ్లిపోవడమేననుకుంది. పెళ్లికొడుకు నాయనమ్మకు బాగోలేదని పల్లెటూరిలోని అత్తగారింటికి తీసుకెళ్లారు.

Updated : 30 Jul 2022 15:39 IST

మార్పు

గరంలో పుట్టిపెరిగిన సుధీరకి అమెరికా సంబంధం వచ్చింది. అబ్బాయి చాలా నచ్చాడు. పెళ్లి కాగానే అమెరికా వెళ్లిపోవడమేననుకుంది. పెళ్లికొడుకు నాయనమ్మకు బాగోలేదని పల్లెటూరిలోని అత్తగారింటికి తీసుకెళ్లారు. అంతిమఘడియల్లో ఉన్న ఆవిడ కొత్త కోడలికి నాలుగు మంచిమాటలు చెప్పి వెళ్లిపోయింది. తల్లికి అంతిమ సంస్కారాల సమయంలోనే మామగారు పడిపోయి ఆస్పత్రిలో చేరారు. వరస సంఘటనలకి తోడు అలవాటులేని ఆ పరిసరాలూ అమెరికా ఊసెత్తని భర్తా నిరాశకు గురిచేయడంతో ఆ ఇంటిని వదిలి వెళ్లిపోవాలనుకుంటుంది. అంతలోనే ఆస్పత్రిలో ఆడపడుచుకు అండగా ఉండడం, నెలలు నిండకుండా పుట్టినబిడ్డ కళ్లముందే పోవడం... కొత్త పెళ్లికూతురు సుధీరకు మెట్టినింట అయిన అనుభవాలు ఆమెను ఎలా మార్చేశాయీ... అన్నది కథ. కుటుంబ పరిధిని పెంచుకోవాలి, భూమికింద పెద్దా చిన్నా భేదం లేదు, అందరూ ఆ మట్టికిందే పడుకుంటారు... లాంటి వాక్యాలు మనసుకు హత్తుకుపోతాయి.

ఆమె మారింది (నవల)
రచన: గంటి భానుమతి
పేజీలు: 144; వెల: రూ. 150/-
ప్రతులకు: ఫోన్‌- 8897643009

- పద్మ


కథల విందు

విభిన్న అంశాల మేళవింపుతో వండి, వడ్డించిన హాస్య కథల విందు ఈ పుస్తకం. పాఠోళి వంటకం ఎలా పుట్టిందో చెప్పే ఊహాకథనం ‘భారతంలో పాఠోళీ’. దోసకాయ మహత్యం కాస్తా శ్రీకృష్ణార్జునుల సంవాదంలో ‘శ్రీదోసగీత’గా మారి నవ్విస్తుంది. అల్లంశాస్త్రి పాత్రతో వంటల్లో అల్లానికి ఉన్న ప్రాధాన్యాన్ని రచయిత ఆసక్తికరంగా చెప్పారు. కంద, వంకాయ కలగలిపి కూర చేసే ప్రయత్నం ఓ బ్రహ్మచారి వంట కష్టాల్ని ప్రతిఫలిస్తుంది. తెలుగువారికి ప్రియమైన ఆవకాయను కళాత్మకమైన నవరసాల రూపంలో వర్ణించే ‘మామిళ్ల తోట కాడ మాటేస్తే’ కథ పనిలో పనిగా ఆధునిక పోకడలమీద వ్యంగ్యబాణాలు సంధిస్తుంది. కథలన్నీ అచ్చతెలుగు పలుకుబడులతో అలరిస్తాయి.

శ్రీదోసగీత (కథలు)
రచన: నేతి సూర్యనారాయణ శర్మ
పేజీలు: 162; వెల: రూ.150/-
ప్రతులకు: ఫోన్‌- 9951748340

- లాస్య శ్రీనిధి


స్త్రీ అంతరంగం

నస్తత్వ విశ్లేషణకు పేరొందిన ఫ్రెంచి రచయిత మపాసా చివరి నవల ‘ఏలియన్‌ హార్ట్స్‌’కి అనువాదం ఇది. చిన్నవయసులోనే భర్తని కోల్పోయి ఒంటరైన అందమైన యువతి డీబర్నీ. నగరంలోని ప్రముఖులందరి కళ్లూ ఆమె పైనే. ఎందరో యువకులు ఆమెను ప్రేమిస్తారు, ఎప్పటికైనా ఆమె మనసు కరగకపోతుందా అని వారం వారం ఆ ఇంట్లో జరిగే విందులకు వెళ్తూనే ఉంటారు. సంపన్న యువకుడు ఆండ్రీ మొరాలీకి కూడా ఆ ఇంటినుంచి ఆహ్వానం వస్తుంది. అందరినీ నవ్వుతూ పలకరిస్తూ, అందకుండా ఊరిస్తూ ఎవరినీ దూరం చేసుకోకుండా ఉండడానికి ఆమె ప్రయత్నించే తీరు అతడిని ఆశ్చర్యపరుస్తుంది. ఆ ఇద్దరి పరిచయం ఎక్కడికి దారితీసిందన్నదే కథ. అనువాదం హాయిగా చదివిస్తుంది.

మానవ హృదయాలు
అనువాదం: రెంటాల గోపాలకృష్ణ
పేజీలు: 192; వెల: రూ. 200/-
ప్రతులకు: ఫోన్‌- 9866115655

- శ్రీ



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..