మంచి కథలు

తక్కువ ధరకే ఎంపిక చేసిన మంచి కథల సంకలనాన్ని అందజేయాలన్న ప్రయత్నంలో భాగంగా ప్రచురితమైన ఈ పుస్తకంలో 15 కథలున్నాయి. కథలన్నీ సమాజంలోని భిన్న పార్శ్వాలను స్పృశిస్తూ ఆలోచింపజేస్తాయి. పక్కింట్లో తాగివచ్చిన భర్త భార్యను బయటకు లాగి మరీ కొడుతుంటే ‘అది మన సమస్య ఎందుకు కాదమ్మా’ అని ప్రశ్నిస్తుంది

Updated : 30 Jul 2022 15:54 IST

మంచి కథలు

క్కువ ధరకే ఎంపిక చేసిన మంచి కథల సంకలనాన్ని అందజేయాలన్న ప్రయత్నంలో భాగంగా ప్రచురితమైన ఈ పుస్తకంలో 15 కథలున్నాయి. కథలన్నీ సమాజంలోని భిన్న పార్శ్వాలను స్పృశిస్తూ ఆలోచింపజేస్తాయి. పక్కింట్లో తాగివచ్చిన భర్త భార్యను బయటకు లాగి మరీ కొడుతుంటే ‘అది మన సమస్య ఎందుకు కాదమ్మా’ అని ప్రశ్నిస్తుంది పద్దెనిమిదేళ్ల మాలతి. కళ్లెదురుగా జరుగుతున్న అవినీతిని ప్రశ్నించడమే కాకుండా దాన్ని నిర్మూలించడానికి కంకణం కట్టుకున్న మాలతి లాంటివాళ్లు (వ్యూహం) స్ఫూర్తినిస్తారు. మంచితనమన్నది కులగోత్రాల్లో లేదు మనుషుల్లో ఉంటుందని అర్థం చేసుకోవడమే కాదు, తన తప్పుకి క్షమాపణ చెప్పుకుంటాడు వీరభద్రయ్య ‘నిజానిజాలు’లో. ‘దృశ్యబీభత్సం’ ఆకలికి భిన్న అర్థాలు చెబితే, తన జీవితాన్ని తీర్చిదిద్దిన గురువుకి ‘అద్దెగర్భం’ గురుదక్షిణగా ఇస్తుంది ఓ శిష్యురాలు. మనుషుల్లో మంచితనానికి అద్దం పట్టే ఈ కథలతోపాటు ఆయా రచయితల వివరాలనూ ప్రచురించడం బాగుంది.

తెలుగు కథానిక 2020

సంపాదకుడు: ఎమ్‌.ఆర్‌.వి. సత్యనారాయణమూర్తి

పేజీలు: 124; వెల: రూ.100/-

ప్రతులకు: ఫోన్‌- 9848663735

- శ్రీ


ప్రబంధంపై కొత్త చూపు

ల్లసాని పెద్దన రచించిన ‘మనుచరిత్ర’ విస్తారమైన వర్ణనలతో, ఊహించని మలుపులతో సాగే తొలి ప్రబంధం. దీనిలోని ఎన్నో పంక్తులు తెలుగులో పలుకుబడులుగా, జాతీయాలుగా ప్రసిద్ధికెక్కాయి. ఈ ప్రాచీన రచనను ఆధునిక జీవితానికి అన్వయిస్తూ చేసిన విశ్లేషణ ఇది. సహజీవనాలు, వివాహేతర సంబంధాలు, వాటి పర్యవసానాలే మనుచరిత్ర ప్రధాన ఇతివృత్తం. వలచివచ్చిన వరూధిని ఆకర్షణకు ఏమాత్రం చలించని ప్రవరాఖ్యుడు, వారిమధ్య సంవాదం, గురుశిష్య సంబంధాలు... ఇలా విభిన్న ఘట్టాల్లో వ్యక్తిత్వ వికాసానికి ఉపకరించే అంశాలను రచయిత సరళంగా పేర్కొన్నారు. సందర్భానుసారం చక్కని పద్యాలు ఇస్తూ వర్ణనల్లో ఉపయోగించిన ఉపమానాలూ ప్రతీకలను హృద్యంగా వివరించారు.

మనుచరిత్ర- వ్యక్తిత్వ వికాసం

రచన: గరికిపాటి గురజాడ

పేజీలు: 111; వెల: రూ. 100/-

ప్రతులకు: ఫోన్‌- 040 24652387

- సీహెచ్‌.వేణు


కవితాధార

‘కొంతమందికి పిలిస్తే పలుకుతుంది కవిత్వం. కొండమీంచి దూకుతున్న జలధారలా పొంగిపొర్లుతుంది...’ నగ్నముని అన్న ఈ మాటలు అక్షరసత్యాలనిపిస్తాయి ఈ కవితలు చదివితే. వ్యవసాయం కోసం నాన్న కొల్లేటిని ఈదితే/ తడిసిన నాన్న జీవితం బరువంతా/ కూలి అడగకుండా మోసిన/ పెద్ద పాలేరు ఈ సైకిల్‌- అంటూ కట్నంగా వచ్చిన సైకిల్‌ని కడదాకా భద్రంగా చూసుకున్న తండ్రి కథని ఆవిష్కరిస్తారు ‘అమ్మ నాన్న ఒక సైకిల్‌’లో. తూనీగలాంటి పిల్ల వాచ్‌మ్యాన్‌ కూతురు-  రత్నదీప్‌లో సేల్స్‌ గాళ్‌గా మారింది/ నడక మారింది పెదాల రంగు మారింది... అంతటితో ఆగలేదు. కొన్నాళ్లకే ఆమె నడిచిన దారినిండా/ చితికిన కలల మరకలు- అంటూ ఆందోళన చెందుతాడు కవి.

అమ్మ నాన్న ఒక సైకిల్‌ (కవిత్వం)

రచన: ప్రసాదమూర్తి

పేజీలు: 128; వెల: రూ. 100/-

ప్రతులకు: ఫోన్‌- 8499866699

- సుశీల


ఉత్కంఠభరితం

సింహగడం చక్రవర్తి ఉదయసింహుడిని మాయోపాయంతో ఓడించి, రాజ్యం నుంచి బహిష్కరించి తానే చక్రవర్తినని ప్రకటించుకుంటాడు సేనాని ప్రచండ సింహుడు. రాక్షసనిలయం పేరుతో మాయాభవనం నిర్మించి శత్రువులను బంధిస్తుంటాడు. ప్రచండ సింహుని ఆటకట్టించాలని బయల్దేరిన ఉదయసింహుడి పెద్దకొడుకు అతడికి బందీగా చిక్కుతాడు. దాంతో అన్నని కాపాడేందుకు బయల్దేరతాడు విజయసింహుడు. అతడి ఆశయం నెరవేరిందా, ఆ క్రమంలో ఎన్ని సాహసాలు చేశాడన్నదే కథ. అడుగడుగునా గూఢచారులూ, ఎత్తులకు పై ఎత్తులతోఆసాంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది.

మాయాజాలం (జానపద నవల)

రచన: డాక్టర్‌ మల్లిఖార్జున రావు

పేజీలు: 228; వెల: రూ. 200/-

ప్రతులకు: పల్లవి పబ్లికేషన్స్‌

ఫోన్‌ 9866115655

- శ్రీ


బుక్‌షెల్ఫ్‌

స్వారోచిష మనుచరిత్ర

వ్యాఖ్య: డా।।కోడూరు ప్రభాకరరెడ్డి
పేజీలు: 424; వెల: రూ. 999/-
ప్రతులకు: నవోదయ బుక్‌ హౌస్‌


చిలుక పలుకులు (బాలల కథలు)

రచన: సమ్మెట ఉమాదేవి
పేజీలు: 80; వెల: రూ. 80/-
ప్రతులకు: ఫోన్‌- 9849406722


నేలవిమానం (కవిత్వం);

పేజీలు: 136; వెల: రూ. 120/-
తురాయి పూలు (కవిత్వం); పేజీలు: 119; వెల: రూ. 150/-
రచన: వాసరచెట్ల జయంతి; ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


మనసు పొరలలో...;

రచన: డా।।ప్యారక కృష్ణమాచార్య
పేజీలు: 264; వెల: రూ. 150/-; ప్రతులకు: ఫోన్‌- 7675042763  


ఒకప్పుడు... (కవిత్వం);

రచన: రాజేందర్‌ జింబో
పేజీలు: 138; వెల: రూ.100/-; ప్రతులకు: నవోదయ బుక్‌ హౌస్‌


సాహిత్య స్పందన; రచన: పిన్నిబోయిన కోటయ్య
పేజీలు: 80; వెల: రూ.40/-; ప్రతులకు: ఫోన్‌- 8500952294


మరణం (మరణ మర్మాన్ని ఛేదించండి);

రచన: సద్గురు
పేజీలు: 477; వెల: రూ. 300/-; ప్రతులకు: ఎమెస్కో బుక్స్‌


రావి రంగారావు పద్యకవితలు
(ఒక పరిశీలన)

పరిశోధన: డా।।ఓలేటి ఉమాసరస్వతి
పేజీలు: 128; వెల: రూ. 50/-
ప్రతులకు: ఫోన్‌- 9866366457


ఇనుపబోనులో సింహం

నజిమ్‌ హిక్మెత్‌ కవితలు
పేజీలు: 121; వెల: రూ. 200/-


టర్కీ కవిత్వం

పేజీలు: 266; వెల: రూ. 300/-
రచన: డాక్టర్‌ లంకా శివరామప్రసాద్‌
ప్రతులకు: విశాలాంధ్ర పుస్తకకేంద్రాలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..