మానవతే ముఖ్యం

భిన్న మత విశ్వాసాలున్నప్పటికీ ఇరుగుపొరుగు మనుషుల మధ్య వెల్లివిరిసే ఆత్మీయానుబంధాలను అపురూపంగా చిత్రించిన కథలివి. తెలంగాణ ప్రాంత సమకాలీన ముస్లిం జీవితాల్లోని భిన్న కోణాలను ఇవి ప్రతిఫలిస్తాయి. ‘ఎక్కాలు రానోడు’లో షరీఫ్‌ కాయకష్టంతో బతికే అమాయకుడు.

Updated : 30 Jul 2022 15:36 IST

మానవతే ముఖ్యం

భిన్న మత విశ్వాసాలున్నప్పటికీ ఇరుగుపొరుగు మనుషుల మధ్య వెల్లివిరిసే ఆత్మీయానుబంధాలను అపురూపంగా చిత్రించిన కథలివి. తెలంగాణ ప్రాంత సమకాలీన ముస్లిం జీవితాల్లోని భిన్న కోణాలను ఇవి ప్రతిఫలిస్తాయి. ‘ఎక్కాలు రానోడు’లో షరీఫ్‌ కాయకష్టంతో బతికే అమాయకుడు. మారుబేరగాళ్ల భాగస్వామ్యంతో తనకెదురైన సమస్యను ఘర్షణకు తావివ్వకుండా ఎదుర్కొన్న తీరు కథాంశం. అనుబంధానికి అడ్డురాని మతం అంత్యక్రియల్లోనూ ఆటంకం కాబోదని ‘అల్విదా’ కథ చాటుతుంది. జానకి, ఫాతిమా చిన్ననాటి స్నేహితులు. ‘ఇప్పుడే వస్తా’నంటూ చెప్పి వెళ్లి రోడ్డుప్రమాదంలో జానకి కొడుకు కృష్ణమూర్తి కన్నుమూస్తే వారి దుఃఖంలో పాలుపంచుకుని, ఆ కుటుంబానికి అండగా నిలుస్తాడు ఫాతిమా కొడుకు లతీఫ్‌. కలుషిత రాజకీయాల విష ప్రభావంపై చివరకు మానవీయతదే పైచేయి అవ్వటం ‘ఈద్‌ కా చాంద్‌’ ఇతివృత్తం. ఆసక్తికర కథనం, సహజ సంభాషణలతో పాటు మనసును కదిలించే ఆర్ద్రత, మానవతా పరిమళాలు... ఈ కథల విశేషాలు.

ఇప్పుడే వస్తా (కథలు)

రచన: హనీఫ్‌; పేజీలు: 120; వెల: రూ. 100/- 

ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు

- సీహెచ్‌.వేణు


ప్రకృతిగీతం

ప్రకృతినీ పరిసరాలనీ నాశనం చేస్తున్న మనిషికి గురిపెట్టి వదిలిన కావ్యాస్త్రం ఇది. మనలాగా మాట్లాడలేని ప్రకృతికి కవి తన గొంతుకనిచ్చాడు. నాగరికుడినని విర్రవీగుతున్న మనిషిని- చెట్టు చెట్టుకో ఆధార్‌ కార్డు, అడవి అడవికీ ఒక ఆరోగ్యశ్రీ అని మీ చట్టసభలో పెట్టరేంది- అని నిలదీసి ప్రశ్నించాడు. దేశమంటే మనుషులేనా, దేశమంటే మట్టి కాదా, చెట్టూ పిట్టా కావా... లాంటి ప్రశ్నలూ ఆక్రోశాలే కాదు, అఖిల సృష్టికి ప్రాణ ముద్ర ప్రకృతి, ప్రకృతికి వేలిముద్ర అడవి, అడవి నిలువెత్తు సంతకం చెట్టు అని తేల్చి చెప్పారు. ఇచ్చుడే తప్ప తీసుకొనుడే/ తెలియని భూ/తలదేవతను / దేవతారణ్యాన్ని /నేలవేర్లనుంచి కొమ్మతలకొస దాక/ దాతృత్వమే ధన్యతగా జీవించే/ బాధ్యతను నేను... అంటున్న అడవి మాటల్ని ఆలకించాల్సింది మనిషే.

నేను అడవిని మాట్లాడుతున్నాను

రచన: డా।। సుద్దాల అశోక్‌తేజ

పేజీలు: 168; వెల: రూ.75/- ప్రతులకు: ఎమెస్కో బుక్స్‌

- శ్రీ


స్ఫూర్తి కథ

కాళ్లూ చేతులూ లేకుండా పుట్టిన నికొలస్‌ జేమ్స్‌ వుయిచిచ్‌ జీవితకథ ఇది. జన్యులోపంతో పుట్టిన బిడ్డను చూసి బాధపడినా నెమ్మదిగా తమకు తాము ధైర్యం చెప్పుకున్న తల్లిదండ్రులు బిడ్డలోనూ ఆత్మస్థైర్యాన్ని నింపారు. తన శారీరక స్థితికి కుంగిపోకుండా అతడు జీవితాన్ని నిర్మించుకున్న తీరు ఆసాంతం ఆసక్తికరం. అంతటి పోరాటయోధుడినీ తన కన్నబిడ్డలను గుండెకు హత్తుకోలేని అసహాయత ఎంత వేదనకు గురిచేసిందో చదువుతుంటే, గుండె పిండేసినట్లవుతుంది. పిల్లలకు స్ఫూర్తినిచ్చేలా ఈ జీవిత కథను మలిచారు రచయిత్రి. జీవితంలో ఉన్నవాటిని మరిచి, లేనివాటికోసం తాపత్రయపడుతూ జీవితమంతా అశాంతిగా గడిపేవారికి నిక్‌ జీవితం నిజమైన ప్రేరణ. 

నిక్‌ అంటే ప్రేరణ

రచన: సమ్మెట ఉమాదేవి

పేజీలు: 128; వెల: 250/-; ప్రతులకు: ఫోన్‌- 9849406722

- సుశీల


ఉదాత్త ప్రేమగాథ

రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి రష్యన్‌ పైలట్‌ ప్రేమ కథ ఇది. యుద్ధంలో విమానం కూలిపోతే ఎలాగో ప్రాణాలతో బయటపడి ఊరికి చేరుకుంటాడు జవ్యలోవ్‌. తీరా అక్కడికి వెళ్లేసరికి ప్రేయసి ఓల్గా కనిపించదు. ఆమె కోసం ఎదురుచూస్తున్న అతనికి ఎందరో యువతులు పరిచయమవుతారు, దగ్గర కావాలని ప్రయత్నిస్తారు. నిరాసక్తంగా కాలం గడుపుతున్న అతడికి ఒక పాత పత్రికలో ప్రేయసి చిత్రం కనిపిస్తుంది. దాంతో మళ్లీ వెతుకులాట మొదలెడతాడు. ఆ క్రమంలో విభిన్న దృక్పథాలు గల మనుషులు అతనికి తారసపడతారు. దేశంకోసం ప్రాణాలర్పించేవారు కొందరైతే పక్కా స్వార్థపరులు మరి కొందరు. ఇంతకీ అతడు ఓల్గాను కలుసుకోగలిగాడా అన్నది కథ. ఒక ఉదాత్తమైన ప్రేమకథని నాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చెప్పిన తీరూ, అనువాదమూ ఆసక్తిగా చదివిస్తాయి. 

ప్రేమజ్యోతి
రచన: అలెగ్జాండర్‌ చెకోవ్‌స్కీ

అనువాదం: రెంటాల గోపాలకృష్ణ
పేజీలు: 312; వెల: రూ. 275/-
ప్రతులకు: ఫోన్‌- 9866115655

- పద్మ


బుక్‌షెల్ఫ్‌

పసుపు చీర (సాంఘిక నాటకం)

రచన: డా।।వి.ఆర్‌.రాసాని
పేజీలు: 64; వెల: రూ.75/-
ప్రతులకు: ఫోన్‌-9848443610


గురు కృప (ధ్యానగానం)

రచన: కందాళై రాఘవాచార్య
పేజీలు: 72; వెల: రూ.100/-
ప్రతులకు: ఫోన్‌- 8790593638


వీరశతకము

రచన: వి.వీరాచారి
పేజీలు: 40; వెల: రూ.25/-; ప్రతులకు: ఫోన్‌- 8897182796


జనరల్‌ నాలెడ్జ్‌ బిట్‌ బ్యాంక్‌

రచన: అక్కెనపల్లి లక్ష్మణాచారి
పేజీలు: 72; వెల: రూ.48/-; ప్రతులకు: ఫోన్‌- 9948315482


జీవుడే శివుడు

రచన: చతుర్వేదుల మురళీమోహనశాస్త్రి
పేజీలు: 334; వెల: రూ.180/-
ప్రతులకు: రామకృష్ణమఠం, హైదరాబాద్‌


సూర్యోదయము

రచన: అల్వాల లక్ష్మణ మూర్తి
పేజీలు: 109; వెల: రూ.80/-; ప్రతులకు: ఫోన్‌- 9550467431


చంపకాలోచనమ్‌ (ఖండకావ్యము)

రచన: పాణ్యం దత్తశర్మ
పేజీలు: 84; వెల: రూ.99/-; ప్రతులకు: ఫోన్‌- 9550214912


ఋతుసంహారము

కాళిదాస మహాకవి కృతికి ఆంధ్రీకరణము
అనువాదకులు: కోగంటి సీతారామాచార్యులు
డా।। రామడుగు వేంకటేశ్వర శర్మ
పేజీలు: 156; వెల: అమూల్యం
ప్రతులకు: ఫోన్‌- 9866108214


జయభేరి (కవిత్వం)

రచన: అడిగోపుల వెంకటరత్నం
పేజీలు: 132; వెల: రూ. 100/-
ప్రతులకు: విశాలాంధ్ర, ప్రజాశక్తి పుస్తకకేంద్రాలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..