పరశురామ్‌ పరిశోధన

డిటెక్టివ్‌ పరశురామ్‌ శోధించిన కేసులకు సంబంధించి నాలుగు నవలికల సంకలనం ఈ పుస్తకం. ఒక హత్య చేసి సాక్ష్యాలేవీ లేకుండా చూసుకుని భార్యతో బెంగళూరు వెళ్లడానికి ప్లాన్‌చేసుకున్న కాళిదాస్‌ ఊహించని

Updated : 18 May 2022 15:23 IST

పరశురామ్‌ పరిశోధన

డిటెక్టివ్‌ పరశురామ్‌ శోధించిన కేసులకు సంబంధించి నాలుగు నవలికల సంకలనం ఈ పుస్తకం. ఒక హత్య చేసి సాక్ష్యాలేవీ లేకుండా చూసుకుని భార్యతో బెంగళూరు వెళ్లడానికి ప్లాన్‌చేసుకున్న కాళిదాస్‌ ఊహించని పరిస్థితుల్లో లిఫ్టులో ఇరుక్కుపోయాడు. కానీ అతడు తన కారులోనే భార్యతో కలిసి బెంగళూరు వెళ్లి హోటల్లో గడిపినట్లు రికార్డు ఉంది. భర్త మరో అమ్మాయితో కారులో వెళ్లడం చూసింది అతడి భార్య... ఈ గందరగోళాన్ని పరశురామ్‌ ఎలా ఛేదించాడో చెప్పే కథ ‘మెరిసేదంతా మేలిమి కాదు’. దెయ్యాలు సిగరెట్లు కాల్చవ్‌, ఎర్రగులాబీ 66, మూడు హత్యలు... కథలు కూడా సస్పెన్స్‌తో ఆపకుండా చదివిస్తాయి.

మెరిసేదంతా మేలిమి కాదు!

రచన: టెంపోరావ్‌
పేజీలు: 328; వెల: రూ. 275/-
ప్రతులకు: ఫోన్‌ 9866115655 

  -విస్మయ


వివక్ష కథలు

సాహిత్యంలో దళితుల గొంతును బలంగా విన్పిస్తున్నజూపాక సుభద్ర రాసిన ఈ కథలు తిండి రాజకీయాల దగ్గరనుంచి వక్రీకరణకు గురవుతున్న చరిత్ర రాజకీయాల వరకూ ఎన్నో అంశాలను స్పృశిస్తాయి. సమాజంలో దళితులకు గుర్తింపు లేదనీ అసలు వారికి ఒక మంచి పేరు ఉండడానికి కూడా వీల్లేని పరిస్థితి ఉందనే రచయిత్రి ‘కనికీర’ అన్న తల్లి పేరుకు రుజువుకోసం రికార్డులన్నీ వెతికి తీస్తే ‘కనక వీరమ్మ’ కనిపిస్తుంది ‘ఆనవాల్లు ఆగమైన అవ్వ’ కథలో. ఉప్పుంటే తొక్కుండని, తొక్కుంటే ఉప్పుండని సంసారాల్లో స్త్రీలకు పోషకాహారం అందని మానిపండే. ఆ లోపాన్ని భర్తీ చేసే బీఫ్‌ చుట్టూ అల్లుకున్న రాజకీయాల్ని ఎత్తి చూపిస్తారు ‘బిందాస్‌ బీఫ్‌’, ‘నీసు నియ్యతి’ లాంటి కథల్లో. ‘ఇది ‘రిజర్వేషన్‌ బోగీ’, జనరల్‌ డబ్బా కాదు, తెలిసే ఎక్కినవా’ అని అడిగిన అవమానం మనసుని మండిస్తూనే ఉంటుందంటారు.

రిజర్వేషన్‌ బోగి (కథలు)
రచన: జూపాక సుభద్ర
పేజీలు: 104; వెల: రూ. 100/-
ప్రతులకు: నవతెలంగాణ ప్రచురణ కేంద్రం

-పద్మ 


మంచితనం కథలు

ప్రతి మనిషీ ఆదర్శమైన వ్యక్తిత్వాన్ని అలవరచుకుంటే ఎంత బాగుంటుందో చెబుతాయి ఈ కథలన్నీ. ‘జీవనసంధ్య’లో కథానాయకుడు చక్రవర్తి బోళా మనిషి. నవ్వుతూ నవ్విస్తూ గడిపేయాలనీ పువ్వు రాలినంత సహజంగా జీవితం ముగియాలనీ కోరుకుంటాడు. అలాగే జరుగుతుంది. భర్త ఉన్నప్పుడు వారం వారం మార్కెట్‌కి వెళ్లి రకరకాల కూరలు కొనుక్కొస్తున్నందుకు విసుక్కున్న భార్య అతడు పోయాక తనూ అదే పనిచేస్తుంది. ట్యాక్సీ డ్రైవరు రాజుకి ప్రయాణికుల మాటలు వినడం అలవాటు. ‘ప్రతి మనిషి మనసులోనూ ఓ మూల మానవత్వపు అర ఉంటుంది. దాన్ని మనం తాకగలిగితే సమస్యలే ఉండవ’న్న పెద్దాయన మాటని అర్థం చేసుకుని జీవితాన్ని ‘ఓకే ట్యాక్సీ’లా మార్చుకుంటాడు. ఒక అధికారి కల్పించి రాసుకున్న ‘ఉత్తరం’ ఎందరికో మార్గదర్శనం చేస్తుంది. ఇలా కథలన్నీ సానుకూల దృక్పథంతో ముగుస్తాయి.

జీవన సంధ్య (కథలు)
రచన: షేక్‌ అహ్మద్‌ బాషా
పేజీలు: 167; వెల: రూ.75/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు  

- శ్రీ


వెతల కథలు

స్మార్టు ఫోన్లూ ల్యాప్‌టాప్‌లూ అంటూ సైన్సూ టెక్నాలజీ మన బతుకుల్ని ఎంతగానో మార్చేసింది కదా, మరి రైతు బతుకులో ఈ అభివృద్ధి ఎందుకు కనిపించదూ- అని ప్రశ్నించే కథలివి. ‘పెట్టుబడులు ఎక్కిపాయ, ఎంత పెద్ద రైతుకైనా అప్పులు తప్పవు, వానలు రావు, పంటనీళ్లు గూడ కొనుక్కోవాల్సిందే’ అంటాడు ‘పాతబాకీలు’ కథలో పెద్ద రైతు వీరభద్రారెడ్డి. పంటరుణాల చుట్టూ అల్లుకున్న పలు కోణాలను చర్చించే కథ ఇది. మధ్య దళారీల చేతిలో రైతు నిస్సహాయంగా ఎలా మోసపోతాడో చెబుతుంది ‘రైతే సిద్ధార్థుడు’. పంట ఎంత నిండుగా పండినా అమ్మబోతే ‘అడవే’నంటుంది మరో కథ. పల్లెనుంచి ముల్లంగి తెచ్చి పట్నంలో అమ్మిన రైతుకు లాభం రాలేదు సరికదా ఎదురు చేతిలో డబ్బు ఖర్చవుతుంది.  ప్రతి కథలోనూ కరవు నేపథ్యం అంతర్లీనంగా కనిపిస్తూనే ఉంటుంది.

వానమెతుకులు(రాయలసీమ రైతు కథలు)
సంపాదకులు: ఇనాయతుల్లా- కెంగార మోహన్‌
పేజీలు: 250; వెల: రూ. 250/-
ప్రతులకు: ఫోన్‌- 9493375447

-సుశీల


మహాభారతం ఒక అవగాహన
రచన: టి.భాస్కర శర్మ
పేజీలు: 399; వెల: రూ.195/-
ప్రతులకు: ఫోన్‌- 9849666787


ముఖారి (కవిత్వం)
రచన: రొక్కం కామేశ్వర రావు
పేజీలు: 113; వెల: రూ. 100/-
ప్రతులకు: ఫోన్‌- 9133144138


గులాం రసూల్‌ ఖాన్‌
(బ్రిటిష్‌ వారిపై తిరుగుబాటు చేసిన కర్నూలు చివరి నవాబు)
రచన: యస్‌.డి.వి.అజీజ్‌;
పేజీలు: 114; వెల: రూ. 100/-
ప్రతులకు: ఫోన్‌- 9133144138


ప్రకృతి ప్రియురాలు మానవత (కవిత్వం)
రచన: గులాబీల మల్లారెడ్డి
పేజీలు: 127; వెల: రూ. 100/-
ప్రతులకు: ఫోన్‌- 9848787284


స్వయంభూః మరో 11 కథలు;
రచన: చిర్రావూరు మదన్‌మోహన్‌
పేజీలు: 88; వెల: రూ.75/-;
ప్రతులకు: ఫోన్‌- 9841458869


ఉద్యమ సంతకం;

రచన: బొమ్మగాని నాగభూషణం
పేజీలు: 109; వెల: రూ.100/-;

ప్రతులకు: ఫోన్‌- 9849622633


ప్రజల మనిషి - బొమ్మగాని ధర్మభిక్షం (జీవితచరిత్ర)
రచన: ప్రొ।। ఎస్వీ సత్యనారాయణ, బొమ్మగాని ప్రభాకర్‌
పేజీలు: 133; వెల: రూ. 100/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


అటుగా వంగిన ఆకాశం (కవిత్వం)
రచన: వైష్ణవి శ్రీ
పేజీలు: 120; వెల: రూ. 120/-
ప్రతులకు: ఫోన్‌- 8074210263


దిక్చక్రం (సాహిత్య వ్యాసాలు)
రచన: ఆడెపు లక్ష్మీపతి
పేజీలు: 416; వెల: రూ. 300/-
ప్రతులకు: ఫోన్‌- 9701227207


తొలకరి జల్లులు (కవిత్వం)
రచన: కొత్తపల్లి రవికుమార్‌
పేజీలు: 53; వెల: రూ.99/-
ప్రతులకు: ఫోన్‌- 9491804844


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..