సరళంగా... క్లుప్తంగా!

కథానిక ప్రక్రియకు ప్రాణప్రదమైన క్లుప్తతకు పెద్దపీట వేసిన 50 కథల సంకలనమిది. ‘సాహితీ కిరణం’ మాసపత్రిక నిర్వహించిన తక్కువ నిడివి కథల పోటీలో ఎంపికైన ఈ కథలన్నీ సమకాలీన సామాజిక పరిస్థితులను ప్రతిబింబించినవే.

Updated : 30 Jul 2022 15:27 IST

సరళంగా... క్లుప్తంగా!

కథానిక ప్రక్రియకు ప్రాణప్రదమైన క్లుప్తతకు పెద్దపీట వేసిన 50 కథల సంకలనమిది. ‘సాహితీ కిరణం’ మాసపత్రిక నిర్వహించిన తక్కువ నిడివి కథల పోటీలో ఎంపికైన ఈ కథలన్నీ సమకాలీన సామాజిక పరిస్థితులను ప్రతిబింబించినవే. కరోనా సృష్టించిన అలజడినీ, దాని ప్రభావాన్నీ చాలా కథలు చిత్రించాయి. ప్రాణాపాయ స్థితుల్లో పరిమళించే మానవ స్పందనను చెప్పే కథ ‘రిక్వెస్ట్‌ స్టాప్‌’ (రచన: పి.గోపీకృష్ణ). ‘మనుషులకు పర్మిషన్లుంటాయేమో గానీ మానవత్వానికి కాదు’ అని ఇది నిరూపిస్తుంది. శ్రమజీవుల ‘ఆత్మాభిమానం’ ఎంత గొప్పగా ఉంటుందో చాటేది మరో కథ (రచన: పద్మావతి రాంభక్త). సాటి మిత్రుడు చనిపోయినా చలించక వస్తు వ్యామోహమే ప్రధానంగా బతుకుతున్న ‘నేేటి తరం’ ధోరణి ఓ కథ (రచన: బళ్ళా షణ్ముఖరావు) ఇతివృత్తం. కన్ను పోతే గానీ కళ్లు తెరవని డాక్టర్‌ స్వభావం ‘కన్ను’ (రచన: దేశరాజు)లో కనిపిస్తుంది. సరళమైన శిల్పం, వస్తు వైవిధ్యంతో చకచకా చదివించే విలక్షణమైన కథానికలు ఇవన్నీ!

- సీహెచ్‌.వేణు

వంశీ స్వర్ణోత్సవ కథా సంకలనం
(50 మంది రచయితల కథలు)
పేజీలు: 160; వెల: రూ.150/-
ప్రతులకు: ఫోన్‌: 040-24652387


కవితల్లో చరిత్ర

ఉప్పెనలా ఎగసిపడ్డ కరోనా రెండవ విడత విషాదానికీ, రాష్ట్రం నుంచి దేశ రాజధాని వరకూ సాగిన రైతుల ఆందోళనలకూ మరెన్నో సంఘటనలకూ వేదికైన 2021ని అక్షరాల్లో చూపించిన కవితలివి. పేరు/ బొటనవేలి ట్యాగ్‌ మీదికి చేరుకుంటుంది/ బతుకులో/ కోల్పోయిన చల్లదనాన్నంతా/ పార్థివదేహం అనుభవిస్తూ ఉంటుంది... మనసు గడ్డకట్టుకుపోయే వ్యక్తీకరణ. చూడాలీ రోజేమౌతుందో.../ స్వప్నం ఫలించి పోరు ముగుస్తుందో/ సత్యం జ్వలించి డేరా మరింత తెగిస్తుందో... లాంటి కవితలు రైతు పోరాట స్ఫూర్తికి అద్దంపడతాయి. విజయవాడ సాహితీమిత్రులు వెలువరించిన ఈ సంకలనంలో విభిన్న విషయాల గురించి ఆలోచింపజేసే మొత్తం 67 కవితలు ఉన్నాయి.

- పద్మ

కవిత-2021
నిర్వాహక సంపాదకులు: విశ్వేశ్వర రావు
పేజీలు: 175; వెల: రూ. 150/-
ప్రతులకు: ఫోన్‌- 9392971359


నిజాయతీ కథలు

డ్యూటీని దేవుడిలా భావించి, నియమాలను కచ్చితంగా అనుసరించే పోస్టుమ్యాన్‌ కలెక్టరుకి వచ్చిన రిజిస్టర్‌ పోస్టును ఆయన చేతికే ఇచ్చి సంతకం తీసుకోవాలనుకోవడం ఏ పరిణామాలకు దారితీసిందో చెప్పే కథ ‘సర్‌’. ప్రాణాలర్పించేందుకు సైతం వెనకాడనియ్యని కళాకారుల పట్ల పిచ్చి అభిమానాన్ని చర్చిస్తుంది ‘తీరం చేరని నావ’. భార్య సంపాదించి తెస్తుంటే తిని కూర్చునే రాజారావు అనుమానంతో ఆమెను వేధించడమూ ఆమె ఆగ్రహానికి గురై ఆస్పత్రి పాలవ్వడమూ తరచూ జరిగేదే. అలాంటి రాజారావుకి ఒక్కసారిగా కనువిప్పు కలగడానికి కారణమేమిటో ‘మారిశెట్టి చంద్రావతి దాని మొగుడు’ కథ చెబుతుంది. అన్ని కథల్లోనూ అంతర్లీనంగా నిజాయతీ విలువ కన్పిస్తుంది.

- సుశీల

గౌతమీతీరం (కథలు)
రచన: రత్నాకర్‌ పెనుమాక
పేజీలు: 136; వెల: రూ. 195/-
ప్రతులకు: ఫోన్‌- 9640268333


సామాజిక చైతన్యం

అనంతపురం జిల్లాకు చెందిన నాలుగు తరాల మహిళలు రాసిన కథలివి. సిటీలో నంబర్‌ వన్‌ వాస్తునిపుణుడి సలహాలను తు.చ.తప్పక ఆచరించే పెద్దమనిషి క్యాంపుకెళ్లి వానలో చిక్కుకుని ఓ గుడిసెలో ఆశ్రయం పొందుతాడు. అతనిలోని సందేహాలూ నమ్మకాలూ భయాలూ...పటాపంచలైపోయేలా ఏం జరిగిందో ‘ముసుగు తీసిన హేతువు’ చెబుతుంది. ఆటలపోటీల నేపథ్యంలో దళితుల అణచివేత విషయాన్ని ‘ఆటపట్టు’లో ప్రస్తావిస్తే,  పదహారేళ్ల వయసులో ప్రేమని ఎలా డీల్‌ చేయాలో ‘పరిణీత’లో చెప్పారు. సామాజిక చైతన్యాన్ని రగిలించే భిన్న కథాంశాలతో కథలన్నీ ఆసక్తిగా చదివిస్తాయి.

- శ్రీ

ముంగారు మొలకలు
సంపాదకులు: యం.ప్రగతి, జి.నిర్మలారాణి, బి.హేమమాలిని
పేజీలు: 223; వెల: రూ.250/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


బుక్‌ షెల్ఫ్‌
ఒక అస్పృశ్యుని యుద్ధగాథ (రెండు భాగాలు)

డా।। కత్తి పద్మారావు స్వీయజీవన చిత్రం

పేజీలు: 1264; వెల: రూ.1200/-

భారత దేశ చరిత్ర (2వ భాగం)
రచన: కత్తి పద్మారావు
పేజీలు: 429; వెల: రూ. 400/-
ప్రతులకు: ఫోన్‌- 9849741695

మహావాక్యం (కవిత్వం);

పేజీలు: 132; వెల: రూ. 200/-
గాయపడిన జింక పిలుపు (కవిత్వం); పేజీలు: 132; వెల: రూ. 200/-
రచన: డాక్టర్‌ లంకా శివరామప్రసాద్‌
ప్రతులకు: విశాలాంధ్ర పుస్తకకేంద్రాలు

ఆత్మజ్ఞాన ప్రయాణం (రెండవ మజిలీ)

సేకరణ, సంకలనం: కె.రంగనాయకులు; పేజీలు: 264; వెల: అమూల్యం
ప్రతులకు: ఫోన్‌- 9100693814


వాకిలి (కవిత్వం);

రచన: ఒబ్బిని; పేజీలు: 239; వెల: రూ.200/-
ప్రతులకు: ఫోన్‌- 9849558842


రెప్పవాలని రాత్రి (కవిత్వం);

రచన: వంశీకృష్ణ
పేజీలు: 183; వెల: రూ. 150/-; ప్రతులకు: ఫోన్‌- 9848787284
శతారం (కవిత్వ విమర్శనా వ్యాసాలు)
రచన: గోపగాని రవీందర్‌
పేజీలు: 319; వెల: రూ.260/-
ప్రతులకు: ఫోన్‌- 9848787284

గుప్పెడు గుండెను తడితే... (కవిత్వం)

రచన: ఎర్రగుంట సుజాత ప్రసాద్‌
పేజీలు: 141; వెల: రూ. 120/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు

తెలంగాణ నాటకరంగ చరిత్ర

రచన: తాటికొండాల నరసింహారావు
పేజీలు: 360; వెల: రూ.300/-
ప్రతులకు: ఫోన్‌- 9848787284


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..