Updated : 12 Aug 2022 16:07 IST

గీతార్థ సారం

ప్రపంచం దగ్గరైపోయింది. మనుషులు దూరమైపోయారు. ఊళ్లు పెద్దవైపోయాయి. మనసులు చిన్నగా మారిపోయాయి. అందుకే జీవితమనే కురుక్షేత్రంలో సమస్యల సైన్యం మధ్యలో దిక్కుతోచక నిల్చున్న ప్రతి వ్యక్తీ... ఒక అర్జునుడిలానే కనిపిస్తాడు. ఈ నిరాశని నిప్పుకణంగా మార్చడానికి కృష్ణుడూ ఆయన పలికిన గీతా కావాలి. గీతలో అణువణువునా తొణికిసలాడే ఆ ఉజ్వల చైతన్యం కావాలి. ఈ నిబద్ధతతో, ఈ నిమగ్నతతో గణపతి సచ్చిదానంద స్వామీజీ మూడు సంపుటాలుగా
అందించిన విరాట్‌ వ్యాఖ్యానమిది. సర్వవేద సారమైన గీతలోని అన్ని శ్లోకాలకీ ప్రతిపదార్థాలూ తాత్పర్యాలతోపాటు అధ్యాయాల మధ్యగల అనుబంధాన్ని వివరించే అవతారికలు, సులభశైలిలో సిద్ధాంత చర్చలు, కథారూప వర్ణనలు... అన్నీ తర్కబద్ధంగా సాగుతాయి. ఇప్పటికే తెలిసినవాటిని కొత్తగానూ, తెలియనివాటిని కొత్త అనిపించకుండానూ అందిస్తాయి. మన ధార్మిక జీవితమనే చెట్టుకి అమ్మ వేరులాంటి గీతని అందరికీ  తేలిగ్గా అవగతపరిచే ఈ ప్రామాణిక
వ్యాఖ్యానాన్ని చదవడం... మనలోని ప్రతి అర్జునుడికీ అవసరం.

 

శ్రీ భగవద్గీత గీతాస్వరప్రస్తారవ్యాఖ్య
రచన: శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీ
పేజీలు: 2010; వెల: రూ.2000/-
ప్రతులకు: ఫోన్‌- 9606881169  
- అజయ్‌శాంతి


హాస్యకథలు

నిశితమైన హాస్యాన్నీ వ్యంగ్యాన్నీ సమపాళ్లలో మేళవించిన కథలివి. కళ్లెదుట నిత్యం జరిగే సంఘటనల్నీ, స్వీయానుభవాల్నీ ఆత్మాశ్రయ శైలిలో చక్కటి సన్నివేశాలు కల్పించి చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. పిసినారి చలపాయ్‌ లాంటి వాళ్లు పరిచయం లేనిదెవరికి. చెవుల్లో వైర్లు తగిలించుకుని పాటలు వింటూ తిరగడం అన్ని సందర్భాల్లోనూ సరికాదని సోదాహరణంగా చెబుతారు ‘పాట ఎంత గరళం’లో. ఫోనుల్లో పొట్టి సందేశాలు ‘పలుకే బంగారమాయెనా’ అన్న పరిస్థితి తెచ్చిన వైనాన్ని హృద్యంగా వివరించారు. ముఖాన నవ్వులు పూయిస్తూ చదివించడమే కాదు చురుక్కుమనేలా తగలాల్సిన చోట తగలడమూ వీటి ప్రత్యేకత.
 

నవ్వుల పువ్వుల చంద్రహాసం
రచన: చంద్రప్రతాప్‌ కంతేటి
పేజీలు: 160; వెల: రూ. 150/-
ప్రతులకు: ఫోన్‌- 8008143507
- శ్రీ


తాత్విక ఆలోచన

మాజిక బాధ్యతనూ మానవతనూ తట్టిలేపుతూ కవి తనలోని తాత్విక ఆలోచనలకు ఇచ్చిన అక్షర రూపమిది. తరచి చూచే మనిషి తరిగి పోతున్నాడు/ తరిగిపోతున్నా మనిషి తడుముకోకున్నాడు... అంటూ ఆవేదన వ్యక్తంచేస్తారు ‘అద్వైతం’లో. అష్టావక్రుని మేధ నీది కాదా/ అర్జునుని ఏకాగ్రత నీలో లేదా- అని ప్రశ్నిస్తూ లే/ లెమ్ము/ ఒకడి సాయం నీకెందుకు/ ఒకడి చేయూత నీకెందుకు/ నీలో తక్కువేమి/ నీలో లేనిదేమి... అంటూ యువతరానికి ప్రేరణనిస్తారు మరో కవితలో. కాశీ, అంతర్యామి, బాపు, బలి, పరిణామం, కులం, వర్ణాయుధం... ఇలా కవితావస్తువులన్నీ ఆలోచన రేకెత్తించేవే.
 

శోధన (కవితా సంపుటి)
రచన: గిరిధర్‌ రావుల ఐ.పి.ఎస్‌.
పేజీలు: 87; వెల: రూ.100/-
ప్రతులకు: ఫోన్‌- 040 24593380
- సుశీల


పెద్దలకు ఓ మాట

సమాజంలో వృద్ధుల పరిస్థితులను గమనించి చెబుతున్న మంచి మాటలివి. ఆరుపదులు దాటాక ఎక్కువ సమయం జ్ఞాపకాల్లోనే గడుస్తుంది. అందుకే ఏ ఆల్జీమర్సో రాకుండా మెదడుకీ వ్యాయామం ఇవ్వాలంటారు.ఆయుష్షు ఉన్నంత కాలం ఆర్థిక స్వావలంబన ఉండేలా చూసుకోమని హితవు చెబుతారు. వయసును గుర్తు చేసుకుని మరీ వృద్ధాప్యాన్ని మోయడం సబబు కాదనీ కాలూ చెయ్యీ స్వాధీనం తప్పకుండా సాధ్యమైనంతగా సాధన చేయాలనీ విడమరచి చెప్పారు. ఇలాంటి మరెన్నో మంచి మాటలున్న ఈ పుస్తకాన్ని అందరూ చదవాలి.
 

జీవనసంధ్య; రచన: సుధామ
పేజీలు: 144; వెల: రూ.120/-
ప్రతులకు: ఫోన్‌- 9849297958
- పద్మTags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని