Published : 17 Sep 2022 23:34 IST

కుంచె చెక్కిన కథలు

పేద, మధ్యతరగతి మనుషుల జీవితాలను భిన్నకోణాల్లో పరిశీలించి ఒడుపుగా అల్లిన కథలివి. చిత్రకారుడైన రచయిత చెక్కిన ఈ 32 కథల సంకలనం ఆద్యంతం పఠనీయం. వీటిలో అమాయకపు బాల్య జ్ఞాపకాలూ,  ప్రేమలూ, ఆప్యాయతలూ, సంస్కారాలూ, బతుకు పోరాటాలూ, రాజకీయాలూ, కలహాల కాపురాలూ.. మరెన్నో సాక్షాత్కరిస్తాయి. కష్టాలకు కుంగిపోకుండా ఎదురీదగలిగే ఆత్మవిశ్వాసం చాలా కథలను మెరిపిస్తుంది. గ్రహశాంతుల నమ్మకం ఓ పేదింటి అమ్మాయి పెళ్లికి ఉపయోగపడటం ‘మేలు చేసిన కీడు’ ఇతివృత్తం. భిన్న ప్రవృత్తుల సమాహారం ‘అప్పికట్ల వారి వీధి’ పెద్ద కథ. స్వభావాలను పట్టిచ్చే సూక్ష్మ వివరాలతో పాత్రలను బొమ్మ కట్టించటంలో రచయిత నేర్పు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

- సీహెచ్‌.వేణు


బాలి కథలు

పేజీలు: 307; వెల: రూ.320/-
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు


పెళ్లి కథలు

డు నవలికల ఈ సంపుటిలో అన్నింటి లోనూ కనిపించే అంశం దాదాపుగా ఒకటే. పెళ్లికి ముందు యువతీయువకుల మానసిక పరిస్థితి, పెళ్లిచూపులు, ప్రేమ, అంతస్తుల తేడా... అన్నీ కళ్లకు కట్టేలా రాశారు. అయితే ఇవన్నీ కూడా అసూయా ద్వేషాలు లేకుండా మంచి కుటుంబ వాతావరణంలో చక్కని కథనంతో సాగుతాయి. ‘ఏడడుగులు’ నవలలో ఉషస్వినిని మనసారా ప్రేమించి, మరో అమ్మాయినే చూడనన్న ప్రద్యుమ్నరావు; ‘జీవన వలయాలు’లో తల్లిమాట మన్నించి హేమసుందరిని చేసుకున్న సారథి; ‘ప్రాణదాత’లో అపకారికి ఉపకారం చేసిన సౌదామిని; ‘వెన్నెల’లో సుస్మితని తొలిచూపులోనే ప్రేమించిన పరాక్రమరావు... ఇలా పాత్రలన్నీ సజీవంగా అనిపిస్తాయి.

- సాహితి


ఏడడుగులు మరికొన్ని నవలికలు
రచన: చిత్రపు హనుమంతరావ్‌
పేజీలు: 470; వెల: రూ. 350/-
ప్రతులకు: ఫోన్‌- 9953402587


నటనావైభవం

‘పదహారేళ్ల వయసు’ సినిమా చూసి కమల్‌ హాసన్‌ ‘మీరు చేసిన నటనలో ఐదో వంతు కూడా నేను చేయలేకపోయాను’ అన్నారట. 1966లో ‘రంగులరాట్నం’తో మొదలుపెట్టి నాయకుడిగా, సహనాయకుడిగా, హాస్యనటుడిగా, కారెక్టర్‌ యాక్టర్‌గా విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు- చంద్రమోహన్‌ గురించే ఆ మాట. సుదీర్ఘ కెరీర్‌లో 932 చిత్రాలలో నటించారట ఆయన. అగ్రికల్చర్‌ బీఎస్సీ చదివి ఏలూరులో ఏఈఓగా ఉద్యోగం చేస్తూ డ్రామాల్లో నటించిన నాటి నుంచి వెండితెర వరకూ సాగిన ప్రయాణ విశేషాలతో పాటు, చంద్రమోహన్‌ నటించిన వందకు పైగా చలన చిత్రాల విశ్లేషణలనూ ఈ పుస్తకంలో చూడవచ్చు.

- పద్మ


తెలుగు సినీతెర చంద్రమోహనం

సంకలనం: తెన్నేటి సుధాదేవి, జ్యోతి వలబోజు
పేజీలు: 424; వెల: రూ. 500/-
ప్రతులకు: ఫోన్‌- 8096310140


విజయగాథలు

బాపట్ల వ్యవసాయ కళాశాల ప్లాటినం జూబిలీ ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా మొదలుపెట్టిన ‘హరితరేఖల సంకలనం’ సిరీస్‌లో మూడో పుస్తకం ఇది. మెరికల్లాంటి విద్యార్థులెందరో ఆ కళాశాలలో పట్టా పుచ్చుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. సమాజంలోని అన్నిరంగాలనూ ప్రభావితం చేశారు. వారందరి పరిచయాన్నీ అక్షరబద్ధం చేసే ఈ ప్రయత్నం ముందుతరాలకు మార్గదర్శకం. ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, యూనివర్సిటీ ఉపకులపతి లాంటి ఉన్నతోద్యోగాల్లో, పరిశోధనారంగం లోని విభిన్న విభాగాల్లో రాణించిన వారెందరి విశేషాలో ఇందులో ఉన్నాయి. పాఠకుల్లో స్ఫూర్తిని నింపుతాయి.

- శ్రీ


వెలుగు దివ్వెలు

హరిత రేఖల సంకలనం-3
పేజీలు: 214; వెల: రూ.300/-
ప్రతులకు: ఫోన్‌- 9441276770


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని