కాలక్షేప రచనలు

హాయిగా నవ్విస్తూ, ఆహ్లాదాన్నిస్తూ అక్కడక్కడా భావోద్వేగాలను స్పృశిస్తూ సాగే 24 కథలివి. రైలు ఆగితే ముక్కుపొడి దట్టించి తుమ్మే భార్య, రైలు కదలగానే భయంకర శబ్దంతో గురక పెట్టే భర్త... తమ అలవాట్లతో కుంగిపోయివున్న వీరికి ఆత్మవిశ్వాసం ఎలా ఏర్పడిందన్నది ‘ఉండమ్మా బొట్టు పెడతా’ ఇతివృత్తం.

Published : 01 Oct 2022 23:59 IST

కాలక్షేప రచనలు

హాయిగా నవ్విస్తూ, ఆహ్లాదాన్నిస్తూ అక్కడక్కడా భావోద్వేగాలను స్పృశిస్తూ సాగే 24 కథలివి. రైలు ఆగితే ముక్కుపొడి దట్టించి తుమ్మే భార్య, రైలు కదలగానే భయంకర శబ్దంతో గురక పెట్టే భర్త... తమ అలవాట్లతో కుంగిపోయివున్న వీరికి ఆత్మవిశ్వాసం ఎలా ఏర్పడిందన్నది ‘ఉండమ్మా బొట్టు పెడతా’ ఇతివృత్తం. శోభనం గదిలోకి రావాలంటే పెళ్లికూతురు ‘అపాయింట్‌మెంట్‌’ తీసుకోవాల్సిందేనని భీష్మించిన సీఈఓ.. భార్య ఇచ్చే అపాయింట్‌మెంట్‌ కోసం ఎలా బతిమిలాడాల్సొచ్చిందో ఓ కథలో చూడొచ్చు. సొంత ఇల్లు- అద్దె కొంపల కష్టాలను మరో కథ చిత్రిస్తుంది. ప్రేమలేఖ రాసి ఫైల్లో పెడితే పొరపాటున పై అధికారులకు చేరే ప్రమాదం ‘ప్రేమపూజారి’లో ఉత్కంఠ కలిగిస్తుంది. ముగ్గురు శిష్యురాళ్లకు ప్రేమలేఖలు పంపిన యువ లెక్చరర్‌కు ఆ ముగ్గురూ కలిసి తెలిపిన సమాధానం ‘రంభ ఊర్వశి మేనక’. కథనంలో భాగంగా వచ్చే సామెతలు కథకు పుష్టినిస్తూ అలరిస్తాయి.

- సీహెచ్‌.వేణు

కామెడీ కథలు

రచన: పోట్లూరు సుబ్రహ్మణ్యం;

పేజీలు: 226; వెల: రూ.250/-

ప్రతులకు: విశాలాంధ్ర, నవచేతన పుస్తకకేంద్రాలు


వాస్తవికతకు ప్రతిబింబాలు

దిగువ, మధ్యతరగతి జీవితాల్లో ఉండే ఘర్షణని, కన్నీళ్లని మనసుకు హత్తుకుపోయేలా చిత్రించిన కథలివి. అత్తగారు చనిపోతే అయ్యే ఖర్చు కన్నా వైద్యానికయ్యే ఖర్చు తక్కువ అని బేరీజు వేసుకొనే రత్తాలు, తనిచ్చిన కౌలు డబ్బులతో యజమాని కట్టిన డాబాలో తన కొడుకులని చూసుకున్న రావులు, డబ్బున్నోళ్ల కష్టాల ముందు తన కష్టాలెంత అని పేదరికంతో రాజీపడే ముత్యాలు... ఇలా ప్రతి పాత్రా పాఠకుల్ని వెంటాడతాయి. గూడుచాలని సుఖం, చిల్లరరాళ్లు, హింస... ఏ కథకి ఆ కథే పాఠకుల కళ్లు చెమ్మగిల్లేలా చేస్తాయి. ఇంత పేదరికంలోనూ చిగురించిన ప్రేమను అందంగా చూపించిన కథ ‘ఎటు చూస్తే అటు చీకటి’. బిచ్చగాడు, అంధుడు అయిన లక్ష్మణ్‌ ప్రేమ కథ ఏ తీరాన్ని తాకిందో తెలిపే కథ అది. వాస్తవానికి ఇందులో చాలామటుకు కథలు ఇప్పటివి కావు. అయినా ఆ లోటు మనకి ఎక్కడా కనిపించదు. వర్తమానానికి అతికినట్టుగా సరిపోతాయి. శీర్షికలు, కథన శైలి ఆకట్టుకుంటాయి.

- వాణి

పురాణం శ్రీనివాసశాస్త్రి కథలు

పేజీలు: 184; వెల: రూ.150/-

ప్రతులకు: ఫోన్‌- 8121098500


స్త్రీవాద కవిత్వం

స్త్రీవాద కవిత్వ సంకలనంలో 93 మంది కవయిత్రుల 168 కవితలున్నాయి. ఒక్కో కవితా చదువుతుంటే- శిలాలోలిత అన్నట్లు అరచేతుల్లో నిప్పులు మండుతున్నట్లుంది. వారం వారం ఏం రాయమంటావు కుశలం/ పరుగెత్తే కాలం వెనుక పడిలేస్తూ ఈ ప్రయాణం... ఇంట్లోనూ ఆఫీసులోనూ పనిభారంతో సతమతమయ్యే ఉద్యోగిని ఉత్తరమది. నీ దగ్గర మేం అవయవాల్లా కాక/ మనుషులుగానే ఉంటాం/ మా అందరి ముఖాల్లో ఉపశమనం నదిలా పరుచుకుంటుంది... అవును మరి, అది ‘లేడీస్‌ స్పెషల్‌’ కదా. నీ పంట నాశనాన్నే చూశావు కానీ/ నా కడుపు పంట సంగతి ఏమాలోచించావు/ పురుగు కొరుక్కుతిన్న పత్తికాయల్లా/ వాళ్లనెలా గాలికొదిలెయ్యమంటావు... ప్రాణం తీసుకున్న రైతు భార్య ఆవేదనలోంచి- నేను బతికి తీరతాను/ చావును కాదు/ బతుకును కావిలించుకుంటాను... అన్న హామీ వస్తుంది. కవితా వస్తువులన్నీ స్త్రీల అనుభవాలూ జీవనసంఘర్షణలకు అక్షర రూపాలే.

- పద్మ

అపరాజిత
(గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం)
సంపాదకులు: డా।।కె.గీత
పేజీలు: 468; వెల: రూ.250/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..