Updated : 22 Jan 2023 04:31 IST

సమీక్ష

భిన్న భావోద్వేగాలు

ప్రతికూల పరిస్థితుల్లోనూ రాజీపడని వ్యక్తిత్వాలతో జీవితాలను చక్కదిద్దుకున్న స్త్రీలు ఈ సంపుటిలో కనిపిస్తారు. కరుణ, క్షమ, ప్రేమ, ధైర్యం లాంటి భావోద్వేగాలు అల్లుకున్న 14 కథలివి. కథాస్థలం అమెరికా అయినా, హైదరాబాద్‌ అయినా ఆత్మాభిమానంతో చరించే సజీవ పాత్రలను చిత్రించారు రచయిత్రి. మెట్రో రైలు రద్దీలో తనపట్ల అసభ్యంగా ప్రవర్తించి బాధపెట్టినవాడు అపాయంలో ఉంటే మానవత్వంతో కాపాడుతుందో యువతి... ‘ఆమె-వాడు- వరద’లో. దీనికి భిన్నంగా- సహజవనరులను ధ్వంసం చేసే స్వార్థపరులైన కన్నబిడ్డలను మట్టుబెట్టే ప్రకృతి మాత క్రోధం ‘అమ్మ’ కథాంశం. కాముకత్వంతో కాటేయబోయిన వృద్ధుడికి గుణపాఠం- ‘బాబాయి గారు’. సందర్భాను సారం వచ్చే మెరుపు సూత్రీకరణలతో (‘సలహా ఆశించినవాళ్లకి కావలసింది వాళ్ల వెర్షన్‌ని బలపరిచే మాటలే కానీ సలహా కానే కాదు’) నేల విడిచి సాము చేయని ఈ కథలు పఠనానందాన్ని ఇస్తాయి. సహజమైన, పదునైన సంభాషణలు ఆకట్టుకుంటాయి.

సీహెచ్‌. వేణు

కొన్ని జీవితాలు, కొన్ని సందర్భాలు(కథలు)
రచన: సుజాత వేల్పూరి
పేజీలు: 170; వెల: రూ. 225/-
ప్రతులకు: అనల్ప ఫోన్‌- 7093800303


పోరు పాట

పాట కదిలిస్తుంది, పదం కలిపి నడవమంటుంది. అందుకే తెలంగాణ ఉద్యమంలో ఎన్నెన్నో పాటలు పుట్టాయి. ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపాయి. ఊరూరా పుట్టుకొచ్చిన ఆ పాటలన్నిటినీ ఒక్కచోట చేర్చడం మామూలు పనికాదు. ఆ బృహత్తర కార్యక్రమాన్ని తలకెత్తుకుని ఈ పుస్తకాన్ని ప్రజల ముందుకు తెచ్చారు అందెశ్రీ. వందలాది రచయితలు రాసిన 790 పాటలు ఇందులో ఉన్నాయి. రాజరికంలో దౌర్జన్యాలూ దొరల గడుల్లో అన్యాయాలూ వలసపాలనలో దోపిడీలూ... అన్నిటిమీదా ఎక్కుపెట్టిన పాటల తూటాలివి. ఘనమైన తెలంగాణ చరిత్రను చాటుతూనే, సొంత రాష్ట్ర ఆకాంక్షని ప్రతిధ్వనింప చేసిన ఈ పాటల్ని చరిత్రలో నిలిచిపోయేలా చేసిన ప్రయత్నం అభినందనీయం.

సుశీల

నిప్పులవాగు (తెలంగాణ ఉద్యమ పాట)
సంపాదకుడు: అందెశ్రీ
పేజీలు: 1307; వెల: రూ. 1200/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలుల


ఆలోచింపజేసే కథలు

అలాంటి సందర్భమో, అచ్చంగా అటువంటి మనిషో మనకు తెలుసనిపించేలా ఉన్నాయి ఈ సంపుటిలోని కథలూ పాత్రలూ. తోటి స్త్రీ తప్పుని వేలెత్తి చూపే ‘సిట్యుయేషనల్‌ టెంప్టేషన్‌’ ఒకరిని ‘అగాధం’లోకి నెట్టేస్తుంది. పూడ్చుకోలేని కష్టం కలిగించినవాళ్లని క్షమించడం ఎంత కష్టమో చెబుతుంది ‘నిశ్శబ్దపు హోరు’. ప్రమాదంలో కళ్లు పోతే జీవితమే వ్యర్థమనుకుని ఆత్మహత్య చేసుకుందామనుకున్న ఆమె ఆ తర్వాత ఎందరికో దారిచూపే ‘వేగుచుక్క’ ఎలా కాగలిగిందో చెప్పే కథ స్ఫూర్తిదాయకం. మంచి మనసూ మాటా ‘మలయమారుతా’న్ని గుర్తు చేయడం సహజమేనంటుంది ఒక కథ. ‘ముసుగులు’, ‘మారేదీ మార్పించేదీ’, ‘మాతృదేవో భవ’ ఆలోచింపజేస్తాయి. కథలన్నీ చదివిస్తాయి.

పద్మ

మలయమారుతం (కథలు)
రచన: శారద
పేజీలు: 136; వెల: రూ.150/-
ప్రతులకు: ఫోన్‌- 7093800303


రాజ్యాంగ పరిచయం

ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ఓటర్లకి రాజ్యాంగం గురించి తెలిసివుండాలంటారు రచయిత్రి. ముఖ్యంగా యువతకీ పిల్లలకీ రాజ్యాంగం గురించి తెలియాల్సిన అవసరం చాలా ఉందని భావించిన ఆమె- 448 ఆర్టికల్స్‌, 12 షెడ్యూల్స్‌, 105 సవరణలతో ఉన్న మన సుదీర్ఘమైన రాజ్యాంగాన్ని సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా వివరించారు. మన ప్రజాస్వామ్యం, స్వతంత్ర న్యాయవ్యవస్థ, ఓటుహక్కు విలువ, ప్రజల బాధ్యతలూ, హక్కులూ... అన్నిటినీ వివరించడమే కాక, రాజ్యాంగం గురించి పలువురు ప్రముఖుల అభిప్రాయాలనూ చేర్చిన ఈ పుస్తకం దేశ పౌరులందరూ చదవాల్సిన పుస్తకం.

శ్రీ

సచిత్ర భారత సంవిధానం
కూర్పు, రచన: శ్రీదేవీ మురళీధర్‌
పేజీలు: 188; వెల: రూ. 600/-
ప్రతులకు: వాట్సాప్‌ నం.: 9908132166


బుక్‌షెల్ఫ్‌

ఆ రోజుల్లో...

రచన: అల్లంరాజు రాధాకుమార్‌
పేజీలు: 200; వెల: రూ.150/-
ప్రతులకు: ఫోన్‌- 9490370248

రాజు రాజు గుమ్మడి పండు (కథాసంపుటి)

రచన: ఐతా చంద్రయ్య
పేజీలు: 184; వెల: రూ. 250/-
ప్రతులకు: ఫోన్‌- 9391205299

డా।। ముక్తేవి భారతి రచనలు (సమీక్షా వ్యాసాలు)
పేజీలు: 60; వెల: రూ. 100/-; ప్రతులకు: ఫోన్‌- 8558899478

అంతర్దర్శనం; రచన: డా.పూసపాటి శంకరరావు
పేజీలు: 663; వెల: రూ. 550/-; ప్రతులకు: ఫోన్‌- 040 40215873

కడప జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణశిల్పి

కామ్రేడ్‌ పొన్నతోట వెంకటరెడ్డి
రచన: పొన్నతోట గంగాధర్‌ రెడ్డి; పేజీలు: 118; వెల: రూ. 100/-
ప్రతులకు: ఫోన్‌- 9441002965

మనుచరిత్రము (ప్రతి పద్యానికి వాడుక భాషలో వివరణతో)
రచన: డాక్టర్‌ పమ్మి పవన్‌ కుమార్‌, డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ
పేజీలు: 395; వెల: రూ. 504/-; ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు

అడవి మల్లి కథలు

రచన: సురేంద్ర రొడ్డ
పేజీలు: 100; వెల: రూ. 150/-
ప్రతులకు: ఫోన్‌- 9491523570

పుస్తకాలం; సంకలనం: జి.ఎస్‌.చలం
పేజీలు: 144; వెల: అమూల్యం
ప్రతులకు: ఫోన్‌- 9440503061

నదీప్రస్థానం

రచన: రామవరపు వేంకట రమణమూర్తి
పేజీలు: 176; వెల: రూ. 200/-
ప్రతులకు: ఫోన్‌- 9440798301


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు