సమీక్ష

భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనంలో భక్తి ఉద్యమం మేలిమలుపు. ఆధ్యాత్మిక చింతన, సాహిత్యస్ఫూర్తి, సైద్ధాంతిక దృక్పథాలతో కొనసాగుతూ బౌద్ధ, జైనమతాల్ని ఎదుర్కొనేందుకు సామాజిక సంస్కరణగా వర్ధిల్లింది.

Updated : 02 Apr 2023 05:36 IST

సమీక్ష

భక్తి కవిత్వం

భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనంలో భక్తి ఉద్యమం మేలిమలుపు. ఆధ్యాత్మిక చింతన, సాహిత్యస్ఫూర్తి, సైద్ధాంతిక దృక్పథాలతో కొనసాగుతూ బౌద్ధ, జైనమతాల్ని ఎదుర్కొనేందుకు సామాజిక సంస్కరణగా వర్ధిల్లింది. ఆ ఉద్యమ నేపథ్యంలో అద్భుతమైన సాహిత్య సృజన జరిగింది. భక్తికవుల సాహిత్య అంశాల్నీ వారి జీవనరేఖల్నీ అక్షరీకరించిన ఉద్గ్రంథం ‘అదే కాంతి’. దక్షిణ భారతంలో ఆరంభమై దేశమంతా విస్తరించిన భక్తి ఉద్యమంలో భాగస్వాములైన కవులూ వాగ్గేయకారులూ కళాకారుల సారస్వతాన్ని పరిశోధించి గ్రంథస్తం చేశారు రచయిత. భక్తి సాహిత్య విశేషాల్ని ప్రాంతాల వారీగా విభజించి ఆవిష్కరించారు. 16వ శతాబ్దంలో భద్రాచలంలో పుట్టిన కవి నాభాదాస్‌ ఉత్తరాన పంజాబ్‌, రాజస్థాన్‌ ప్రాంతాల్ని ఎలా ప్రభావితం చేశారో చెబుతారు. మరో పుస్తకంలో బెంగాలీ గ్రామీణ జీవితాన్ని సంగీత సాహిత్యమయం చేసిన ‘బౌల్‌’ కళాకారుల కవితామాధుర్యాన్నీ తాత్విక చింతననీ తేటతెలుగులో పంచారు రచయిత.

రాజేశ్‌ పటేల్‌

అదే కాంతి

పేజీలు: 735;

వెల: రూ. 700/-

బెంగాలీ బౌల్‌ కవిత్వం

పేజీలు: 186;

వెల: రూ. 200/-

రచన: ముకుంద రామారావు

ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


కనిపించని శత్రువులు

ఇరుగూ పొరుగూనే అయినా రెండు దేశాలనీ బద్ధ శత్రువులుగా మార్చిన సరిహద్దు రేఖ అక్కడి గ్రామ ప్రజల గుండెల్లో రగిల్చిన చిచ్చుకు అక్షరరూపమే ‘రెండు ఆకాశాల మధ్య’. ‘రాత్రి పడుకున్నాక ఉదయం వరకూ బతికుంటామో లేదో తెలియదు’ అనే పరిస్థితిలో దినదినగండంగా బతుకుతున్న ఫౌజియా ఫక్రుద్దీన్‌లు మోర్టార్‌ దాడిలో పదిహేనేళ్ల కొడుకుని కోల్పోయి పడే నరకయాతన చదువుతుంటే గుండె చెరువవుతుంది. మరో నవల కరోనా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన వైనాన్ని చూపుతుంది. బయటి విధ్వంసాన్ని లెక్కగట్టగలం కానీ ఆప్తుల్ని కోల్పోయినవారి మనసుల ‘లోపలి విధ్వంసా’న్ని కొలిచేదెవరని అడుగుతుంది. భిన్న కోణాల్లో నాటి పరిస్థితులను కళ్లకు కట్టారు రచయిత. రెండూ ఆపకుండా చదివిస్తాయి.

పద్మ

రెండు ఆకాశాల మధ్య (నవల)

పేజీలు: 251;

వెల: రూ. 200/-

లోపలి విధ్వంసం (నవల)

పేజీలు: 204;

వెల: రూ. 150/-

రచన: సలీం;

ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


గణితం... ఇలా సులభం!

ఇందుగలదందులేదన్న సందేహం వలదన్నట్టు గణితం సర్వాంతర్యామి. విద్యార్థి అందులో వెనకబడితే- ఆ ప్రభావం జీవితకాలం ఉంటుంది. నిజానికి ఆ లోపం మన విద్యావ్యవస్థది. గణితాన్ని ఆసక్తికరంగా బోధించే విధానాల గురించి ఆలోచించకపోవడమే అందుకు కారణం. గణితాన్ని అర్థం చేసుకుంటే మిగతా శాస్త్రాల అధ్యయనమూ తేలికవుతుంది. అదే చెబుతూ గణితంపైన ఆసక్తి కలిగించే అంశాల్ని రాశారు రచయిత. పలు గణితాంశాల చరిత్ర, వినియోగం, విశిష్టత గురించి కూలంకషంగా వివరించారు. నిత్యజీవితంలో వాటి ప్రాముఖ్యతని తెలిపారు. సృష్టిలో మనకు అందంగా కనిపించే ప్రతి రూపం, నిర్మాణం వెనక గణితం ఉంటుందంటూ ఉదాహరణలతో వివరించారు. పిల్లల్లో, పెద్దల్లో గణితంపైన ఆసక్తిని పెంచేందుకు చేసిన ఓ మంచి ప్రయత్నం ఇది.

రోహిత్‌

గణితాసక్తి;

రచన: జాస్తి జవహర్లాల్‌

పేజీలు: 72;

వెల: రూ. 50/-

ప్రతులకు: ఫోన్‌- 9440503061


ప్రేమకథ

సంగీతం చుట్టూ తిరిగే ప్రేమకథ ఇది. అన్నీ మంచి మనసున్న పాత్రలే కావడంతో హాయిగొలిపే కథనం ఆపకుండా చదివిస్తుంది. మహిమ, విద్యాసాగర్‌ కాలేజీలోనే ప్రేమించుకుంటారు. చదువు పూర్తిచేసి ఉద్యోగం తెచ్చుకుని తమ కాళ్లపై తాము నిలబడ్డాకే పెళ్లి చేసుకుందామనుకుంటారు. అంతలో అనుకోకుండా విద్యాసాగర్‌ వసంతను పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిపోతాడు. ఒంటరిగా ఉన్న మహిమ సంగీత కళాశాల నిర్వహిస్తూండగా ఓరోజు కూతుర్ని అందులో చేర్చడానికి వస్తాడు విద్యాసాగర్‌. ఆ తర్వాత ఏం జరిగిందీ, అవివాహితురాలైన మహిమ ఒక పాపకు తల్లి ఎలా అయిందీ, భార్యను కోల్పోయిన విద్యాసాగర్‌ మహిమను పెళ్లిచేసుకున్నాడా... అన్నది కథ.

శ్రీ

మాధుర్యం (నవల)

రచన: నండూరి సుందరీ నాగమణి

పేజీలు: 156;

వెల: రూ. 200/-

ప్రతులకు: ఫోన్‌- 9849989201గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..