కథల విందు

ఉమ్మడి పశ్చిమ గోదావరి ప్రాంతం నుంచి రచయితలుగా ఎదిగిన 60 మంది రాసిన కథల సంకలనం ఇది.

Updated : 26 Feb 2024 16:41 IST

మ్మడి పశ్చిమ గోదావరి ప్రాంతం నుంచి రచయితలుగా ఎదిగిన 60 మంది రాసిన కథల సంకలనం ఇది. జీవన గమనంలో పొరపాట్లూ పశ్చాత్తాపాలూ మానవత్వమూ ప్రేమాభిమానాలూ మనుషులపై చూపే ప్రభావాన్ని ఈ కథలు ఆసక్తికరంగా, వైవిధ్యభరితంగా వివరిస్తాయి. ఓ అమ్మాయి బాల్యస్మృతుల పరిమళంతోపాటు యువతిగా ఆమెకెదురైన ఓ చేదు అనుభవాన్ని ముందుకు తెచ్చే కథ ‘డిసెంబరు పూలు’. ఆపత్సమయంలో స్వపర భేదాలను పాటించకున్నా అపనిందలపాలైన వ్యక్తి నిర్ణయం..

‘తల్లీ.. గోదారీ..!’. సులోచనాల సరదా కథ ‘కళ్లజోడు’. కోడలి కంటే నాలుగాకులు ఎక్కువ చదివిన అత్తగారి వ్యవహార జ్ఞానం, చాతుర్యం ‘అత్తారింటికి దారేది’. ప.గో.జిల్లా గత వైభవానికి అద్దం పట్టే ‘అజరామరం.. నా జిల్లా సౌందర్యం’ స్కెచ్‌ లాంటి కథ. పలువురు లబ్ధ ప్రతిష్ఠుల కథలనూ దీనిలో చేర్చారు. ప్రతి కథ చివరా రచయిత పరిచయం ఇవ్వటం బాగుంది. సాహిత్య ప్రియులకు విందు లాంటి పుస్తకమిది!  

కథా కిరణాలు

(పశ్చిమ గోదావరి జిల్లా రచయితల కథా సంకలనం)

పేజీలు: 488; వెల: రూ.300/-

ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు

సీహెచ్‌. వేణు


సామాజిక కథలు

వితాత్మకంగా సాగే శైలీ కథనంలో క్లుప్తతా వస్తువులో గాఢతా...ఈ కథలను ప్రత్యేకంగా నిలుపుతాయి. కథావస్తువులన్నీ ఆలోచనలు రేకెత్తించేవే. కులమతభేదాలు లేవని చెప్పుకునే సమాజంలో కులం ఎంత వాస్తవమో చెబుతాయి చాలా కథలు. అగ్రవర్ణపు యువకుడికి దళిత యువతి కోరిక తీర్చుకోవడానికి పనికొస్తుంది కానీ ప్రేమించడానికి పనికిరాదు ‘సిగ్గు’ కథలో. కాళ్లులేని పిల్ల అవసరాలు గ్రహించి అండగా నిలుస్తున్న వ్యక్తిని ప్రేమించడం ఆమె ‘తప్పు’. ఆ తప్పును సరిచేసుకుంటాను, కులంలో పెళ్లి చేయమంటే ఒక్కరు మిగలరు. కులం నుంచి ఎవరూ పారిపోలేరంటుంది ‘ఎర్రకమ్మెలు’. ‘పెగ్గు’మాలిన తనం కథలో కొత్త పదాలు చమక్కుమని మెరిస్తే, భూత నాయకుడు, పండుగలు ‘భర్త’డేలూ, సామ్రాజ్య కాంక్ష... తదితర కథల్లో పదునైన వ్యంగ్యం చురుక్కుమనిపిస్తుంది.  

సతీష్‌ చందర్‌ కథలు;

పేజీలు: 104; వెల: రూ.65/-

ప్రతులకు: విశాలాంధ్ర, నవచేతన పుస్తకకేంద్రాలు

శ్రీ


హృదయ సంవేదన

‘కవిత్వమంటే ఊహాలోకాల్లో విహారమే కాదు, హృదయ సంవేదనలకూ మనో సంక్షోభాలకూ ప్రతీకగానూ భాసిల్లేది’ అనే నిర్వచనాన్ని ఈ కవితాసంపుటి ఆవిష్కరిస్తుంది. ‘వ్యక్తావ్యక్త సంశయాల మధ్య, అస్తిత్వ సంవేదనల మధ్యా ప్రాణం నలుగుతుంది’ అని జీవన మార్మికతకు కవయిత్రి కొత్త అర్థం చెప్పారు. ‘మనుషులెందరో మన్నుగలసిన నేల ఇది, ఆకాశం మీదైనా ఆశపడదామంటే వట్టి శూన్యమది’ అనే పంక్తులు జీవితం పట్ల ఆర్తినీ ఆవేదననూ ప్రకటిస్తాయి. ‘కథలన్నీ చెప్పుకోవడం పూర్తయ్యాక ఒక్కొక్కరుగా వెళ్లిపోయారు’ అనే మాటల్లో జీవనచక్రభ్రమణం స్ఫురిస్తుంది. జీవితమంటే ఆకాంక్షలకూ నిరాశలకూ మధ్య ఊగిసలాట అనే వాస్తవికతని ‘ఉన్మత్త’ ఆవిష్కరిస్తుంది.

ఉన్మత్త (కవిత్వం);

రచన: ఉషాజ్యోతి బంధం

పేజీలు: 113; వెల: రూ. 200/-;

ప్రతులకు: ఫోన్‌- 9848015364

లాస్య శ్రీనిధి


కథల పాఠాలు

రళంగా చదివిస్తూ నిగూఢమైన అర్థంతో ఉండే చెకొవ్‌ కథల్నీ, కథా సంవిధానాన్నీ... సాధారణ పాఠకులే కాదు, సాహిత్యకారులూ ఎంతగానో ఇష్టపడతారు. మంచికథ లక్షణాల గురించి చెకొవ్‌ ఏం చెప్పాడో, వాటిని ఎలా ఉపయోగించుకున్నాడో తెలుసుకోవడానికి తోడ్పడే వంద కథల సంపుటి ఇది. చెకొవ్‌ పేరు చెప్పగానే గుర్తొచ్చే కథల్లో ‘పందెం’ ఒకటి. ఈ కథలో ఒక వ్యక్తి పందెంలో భాగంగా పదిహేనేళ్లు ఒంటరిగా ఒక గదిలో పుస్తకాలు చదువుతూ గడిపి, ఐదుగంటల్లో పందెం ముగుస్తుందనగా డబ్బుని తిరస్కరించి
బయటకు వెళ్లిపోవడం... చదువుతుంటే పాఠకుల ఒళ్లు గగుర్పొడుస్తుంది. తొమ్మిదేళ్ల చిన్నారి వంకా తాతయ్యకు ఉత్తరంలో రాసే కష్టాలు కంటతడి పెట్టిస్తాయి. చెకొవ్‌ కథల్లో పాత్రలు నేల విడిచి సాము చేయవు. ఈ కథల అనువాదం హాయిగా చదివిస్తుంది.

అంటోన్‌ చెకోవ్‌ కథలు-1

అనువాదం: అరుణా ప్రసాద్‌

పేజీలు: 800; వెల: రూ. 600/-

ప్రతులకు: ఫోన్‌- 9849992890

సుశీల



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..