సమీక్ష

సుధామూర్తి.. ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి జీవన సహచరిగానే కాదు.. సమాజ సేవకురాలిగా, మనసున్న మనిషిగా సుపరిచితురాలు. ఆమెలో ఓ మంచి రచయిత్రి ఉన్నారు.

Updated : 22 Jun 2024 23:58 IST

కథా సుధ

సుధామూర్తి.. ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి జీవన సహచరిగానే కాదు.. సమాజ సేవకురాలిగా, మనసున్న మనిషిగా సుపరిచితురాలు. ఆమెలో ఓ మంచి రచయిత్రి ఉన్నారు. సామాజిక సమస్యల నుంచి పిల్లల కథల వరకు.. సుధామూర్తి ఎంచుకోని ఇతివృత్తం లేదు. చేయని ప్రయోగమూ లేదు. తాజాగా, చిన్నారుల కోసం.. రంగు రంగుల బొమ్మలతో, అలతి అలతి పదాలతో అందమైన కథల పుస్తకాలను తీసుకొచ్చారు. ఓ పుస్తకం పుడమి పట్ల చిన్నారుల్లో ప్రేమను పెంచుతుంది. మరో పుస్తకం వెదురు మొక్క గొప్పతనాన్ని చాటుతుంది. సముద్రపు నీళ్లు ఉప్పగా ఎలా మారాయన్నది ఇంకో రచన ఇతివృత్తం. ఆరోగ్యమాత ఉల్లినీ వదిలిపెట్టలేదు. మామిడి కథైతే మహా రుచి. పిల్లలకు పఠనాన్ని పరిచయం చేయడానికి అనువైన పుస్తకాలివి.

వెదురు పొందిన వరం భూమికి అందం ఎలా వచ్చింది సముద్రం ఉప్పగా ఎలా మారింది ఉల్లిపాయకు పొరలు ఎలా వచ్చాయి మామిడి పండు తీపి వెనుక రహస్యం
రచన: సుధామూర్తి
అనువాదం: ముంజులూరి కృష్ణకుమారి
పేజీలు: 40; వెల: రూ.150 (ప్రతి పుస్తకం)
ప్రతులకు: అశోకబుక్‌సెంటర్‌.కామ్‌


అంతరంగ ‘ఘర్షణ’

జీవితం సంక్షోభాల సమాహారం. ఏదో ఓ రూపంలో సమస్యలు దాడి చేస్తుంటాయి. వాటికి భయపడితే బతుకు నరకమే. ధైర్యంగా నిలబడాలి. తెగువతో పోరాడాలి. ఈ సంకలనంలోని కథల్లో రచయిత్రి కొండపల్లి నీహారిణి ప్రాణంపోసిన పాత్రలూ అలాంటివే. ‘కొత్తచూపు’ నెలసరి సమస్యపై అల్లిన కథ. పాతకాలపు నమ్మకానికీ, కొత్తయుగపు ప్రశ్నించే తత్వానికీ మధ్య తలెత్తిన వివాదానికి మధ్యేమార్గంగా ఓ పరిష్కారం చూపారు రచయిత్రి. రంగును బట్టీ, జాతిని బట్టీ మనుషుల్ని అంచనా వేయకూడదనే కథ ‘ఆకాశం అంచుల్లో’. ప్రపంచీకరణను నేపథ్యంగా తీసుకుని రాసిన కథ ‘ఒంటరి మేఘం’. ఇందులో కులవృత్తుల విధ్వంసాన్ని కళ్లకు కట్టారు. ఈ సంకలనంలో మొత్తం పందొమ్మిది కథలున్నాయి.
ఘర్షణ (కథల సంపుటి)
రచన: కొండపల్లి నీహారిణి
పేజీలు: 200; వెల: రూ. 150
ప్రతులకు: ఫోన్‌: 9848787284


ఓ మహర్షి కథ

వేల సంవత్సరాల తర్వాత కూడా నాలుగు వేదాలూ సురక్షితంగా ఉన్నాయంటే అది.. వైశంపాయనాది రుషి గణాల చొరవే. మన కథా నాయకుడు యాజ్ఞవల్క్యుడు ఆ మహర్షికి స్వయానా మేనల్లుడు. మామగారి సమక్షంలో వేదవేదాంగాలనూ ఆపోశన పట్టాడు. ఓ చిన్నపాటి వివాదం గురుశిష్యుల మధ్య అంతరాన్ని పెంచింది. ఆత్మాభిమాని అయిన యాజ్ఞవల్క్యుడు.. అప్పటిదాకా నేర్చుకున్న విద్యలన్నీ త్యజించి.. ఆశ్రమంలోంచి బయటికొచ్చాడు. సాధనతో, స్వయంకృషితో మళ్లీ వేదజ్ఞానాన్ని సంపాదించాడు. తన పేరుతో సంహితాన్నీ, బ్రాహ్మణాన్నీ, ఉపనిషత్తునూ రూపొందించి చరితార్థుడయ్యాడు. ఈ గాథను రచయిత చక్కని శైలిలో నవలీకరించారు.
యాజ్ఞవల్క్య (నవల)
రచన: హెచ్‌. లక్ష్మీ నరసింహ శాస్త్రి
అనుసృజన: వేలూరి కృష్ణమూర్తి
పేజీలు: 128; వెల రూ.150
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు.


బ్యాంకింగ్‌ భారతం

సామాన్యుడు బ్యాంకులో అడుగుపెట్టడానికి ఇబ్బందిపడిన రోజుల నుంచి.. బ్యాంకులే సామాన్యుడి గడప ముందు వాలిపోతున్న దశ వరకూ బ్యాంకింగ్‌ రంగం పరిణామక్రమాన్ని ఈ పుస్తకంలో కళ్లకు కట్టారు రచయిత కిశోర్‌. బ్యాంకుల విలీనానికి సంబంధించి... వైఫల్య విజయాలను సమీక్షించారు. కొన్ని బ్యాంకుల విజయ రహస్యాలను పంచుకున్నారు. కార్పొరేట్ ఎగవేతల్ని గర్హించారు. ఆర్బీఐ చొరవను మెచ్చుకున్నారు.  రుణమాఫీˆ విధానంలోని మంచిచెడులను బేరీజు వేశారు. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి బ్యాంకింగ్‌ వ్యవస్థ పనితీరును అర్థం చేసుకోడానికి ఉపకరించే రచన ఇది.
స్థిరీకరణ దిశగా బ్యాంకింగ్‌ రంగం
(విజయాలు-వైఫల్యాలు-విలీనాలు)
రచన: తుమ్మల కిశోర్‌
పేజీలు: 216; వెల: రూ.150
ప్రతులకు: ఫోన్‌: 0866-2436643


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..