చీకటి కోణం

సాదత్‌ హసన్‌ మంటు రచనలు ఉర్దూ భాషలోని తీయదనంలో ముంచితీసినట్టు ఉంటాయి. వాక్యం ఎంత నిరాడంబరమో, భావం అంత ప్రగాఢం.

Updated : 07 Jul 2024 05:22 IST

సాదత్‌ హసన్‌ మంటు రచనలు ఉర్దూ భాషలోని తీయదనంలో ముంచితీసినట్టు ఉంటాయి. వాక్యం ఎంత నిరాడంబరమో, భావం అంత ప్రగాఢం. ‘అనార్కలి’ పేరుతో అమ్జద్‌ అనువదించిన తాజా కథలూ ఇందుకు మినహాయింపు కాదు. ‘ఆకలి’ కథలోని సురయ్యా ఓ విధివంచిత. ఆమె పట్ల విపరీతమైన వ్యామోహాన్ని పెంచుకున్న మొగుడు.. పేదరికం పెట్టిన పరీక్షలో చిత్తుగా ఓడిపోతాడు. సురయ్యాను ఓ వింత కోరిక కోరతాడు. ఈ కథలో మానవ సంబంధాల్లోని అతి సున్నితమైన కోణాన్ని తడిమారు రచయిత. ‘అనుమతి లేకుండా..’ మార్మికతను నింపుకున్న కథ. ‘టోబా టెక్‌ సింగ్‌’ దేశ విభజన నేపథ్యంగా సాగే కథ. ‘అనార్కలి’ ఆస్తి కోసం భర్తను దూరం చేసుకున్న ఓ అందగత్తె జీవనచిత్రం. మొత్తం పదిహేడు కథల సమాహారం ఈ సంకలనం.  

 అనార్కలి
ఉర్దూ: సాదత్‌ హసన్‌ మంటు
అనువాదం: అమ్జద్‌
పేజీలు: 144; వెల: రూ.100

ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు.


నాలుగు తరాలు

ఎక్కడుందో తెలియని కపిలవాయి గ్రామాన్ని ఇంటి పేరుగా మార్చుకున్న నాలుగుతరాల కుటుంబ కథ ఇది. వంశ మూలపురుషుడి ప్రస్తావనతో మొదలవుతుంది. రచయిత స్వతహాగా చరిత్ర అభిమాని కావడంతో ముత్తాత-తాత-తండ్రి-తాను.. ఇలా ప్రతితరంలోని ఆర్థిక సామాజిక నేపథ్యాలనూ, ఇతర విశేషాలనూ కళ్లకుకట్టారు. నేటి మహబూబ్‌నగర్‌ జిల్లా బాల్మూర్‌ మండలంలోని జినుకుంట గ్రామం మన కథా కేంద్రం. కొన్ని జ్ఞాపకాలూ, కొన్ని అనుభవాలూ, కొన్ని చారిత్రక ఘట్టాలూ, కొన్ని కరవులూ, కొన్ని సామాజిక సంక్షోభాలూ... అన్నీ కలిసి వందల ఏళ్ల చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచాయి.

మా భగోట
రచన: డాక్టర్‌ కపిలవాయి లింగమూర్తి
పేజీలు: 686; వెల: రూ.800
ప్రతులకు: ఫోన్‌: 9440206387  


భావాల సముద్రం!

సముద్రాల జూనియర్‌గా సుప్రసిద్ధులైన  వేంకట రామానుజాచార్యుల శత జయంతి సందర్భంగా వెలువరించిన పుస్తకమిది. ఆయన రచించిన సినీ గీతాలకు సహృదయోల్లాస వ్యాఖ్యను అందించారు డాక్టర్‌ వి.వి.రామారావు. సముద్రాలవారి గీతాలు పదాల ప్రయోగశాలలు. ఆ వర్ణనల్లో ప్రబంధాల ఛాయలు కనిపిస్తాయి. సముద్రాలవారు చేపట్టని ప్రక్రియ అంటూ లేదు. జాను తెలుగులో జానపదాలు రాశారు. సినీ సరస్వతికి పద్యాల నైవేద్యాలు సమర్పించారు. బుర్రకథలు అల్లారు. ఆ సరస్వతీ పుత్రుని వంశవృక్షంతో ఆరంభించి.. సినీ జీవితం వరకూ అనేేక అంశాల్ని ప్రస్తావించారు రచయిత.

అందమె ఆనందం
రచన: డాక్టర్‌ వి.వి.రామారావు
పేజీలు: 451; వెల: రూ.500
ప్రతుకుల: ఫోన్‌: 9848065658


జీవన పోరాటం

ఇదొక పల్లెటూరి పిల్లాడి కథ. కౌమారంలోనే కుటుంబ బాధ్యతల్ని భుజాన వేసుకుని.. సంచిలో రెండు జతల పాత బట్టలతో, మనసులో కొత్త ఉత్సాహంతో హైదరాబాద్‌ బాట పట్టినవాడు.. ఈ జనారణ్యంలో ఎలా నిలదొక్కుకున్నాడో తెలుసు కోవాలంటే ఈ నవల చదవాలి. సరిగ్గా హైదరాబాద్‌ రాచవీధుల్లో అక్కినేని నాగేశ్వరరావు డాక్టర్‌ చక్రవర్తి సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో మన కథా నాయకుడు నగరంలో కాలుపెడతాడు. తానేమిటో నిరూపించుకుంటాడు. కథలో మలుపులు లేకపోవచ్చు. కానీ, జీవితం ఉంది. అదే మనల్ని చివరి వరకూ చదివిస్తుంది.

పట్టణంలో బతుకుదామని..
రచన: అక్కినేని కుటుంబరావు
పేజీలు: 167; వెల రూ.190
ప్రతులకు: 9000413413Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..