Published : 01 Oct 2022 23:57 IST

పిల్లల చూపు పోయేలోపు ప్రపంచాన్ని చూపాలని...

తమ కన్నబిడ్డల కళ్లు ఎంతోకాలం ప్రపంచాన్ని చూడలేవవీ, వారి భవిష్యత్తుకు శాపంగా అంధత్వం సంక్రమించనుందనీ తెలిస్తే- ఏ తల్లిదండ్రులైనా తట్టుకోగలరా? వారి గుండెలు పగిలిపోవూ! అయినా ఈ అమ్మానాన్నలు తట్టుకున్నారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని తట్టిలేపుతున్నారు!

పేగుతెంచుకుని పుట్టిన పిల్లల్లో ఒకరికి చూపు లేకపోతేనే అమ్మానాన్నల మనసుల్లో కన్నీటి సంద్రాలు పోటెత్తుతాయి. ఆ బాధలో చాలామంది జీవితంపై విరక్తిని పెంచుకుంటారు. తరగని నిరాశా నిస్పృహల్లోకి జారిపోతారు. కొందరేమో తమ అసహాయతను ఆ చంటిబిడ్డలపై చూపిస్తూ, వారిని ఛీత్కరించుకుంటారు. ఆ పిల్లలను నాలుగు గోడలకు పరిమితం చేసి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తారు. కానీ, కెనడాకు చెందిన ఎడిత్‌ లెమే, సెబాస్టియన్‌ పెల్లెటియర్‌ దంపతులు మాత్రం అలా కాదు... ఒకరు కాదు ఇద్దరు కాదు, తమ నలుగురు పిల్లలూ ఎదిగేకొద్దీ- వారి కంటిచూపు కటిక చీకట్లలోకి జారుకుంటుందనీ, నడివయసుకు వచ్చేసరికి వారి కలలన్నీ శాశ్వత అంధత్వంలో సమాధి అయిపోతాయనీ తెలిసినా గుండె నిబ్బరంతో బతుకుతున్నారు. అంతేకాదు, తమ చిన్నారుల నేత్రాలు నిర్జీవం అయ్యేలోపే వారికి ఈ లోకాన్ని చూపించాలని, దృశ్య జ్ఞాపకాలతో వారి అంతర్‌ దృష్టిని నింపేయాలనీ ప్రపంచ యాత్ర చేస్తున్నారు.

బతకడం నేర్పాలని...

కెనడాలోని క్యుబెక్‌ ప్రాంతానికి చెందిన ఎడిత్‌, సెబాస్టియన్‌ల కలల పంటగా పన్నెండేళ్ల క్రితం మియా కన్నుతెరిచింది. బుడిబుడి నడకల బుజ్జాయిని ముద్దుచేస్తూ ఆ దంపతులు హాయిగా గడిపేసేవారు. ఓసారి పాపకు దృష్టిలోపం ఉన్నట్లు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. తమ ముద్దుల కూతురు రెటీనాలోని కణాలను నెమ్మదిగా ఛిద్రంచేస్తూ కంటిచూపును దిగమింగేసే జన్యుపరమైన వ్యాధి రెటినిటిస్‌ పిగ్మెంటోసా బారినపడినట్లు వారికి అప్పుడే తెలిసింది. ప్రస్తుతానికి చికిత్స లేని ఆ జబ్బు మూలంగా ముప్పై ఏళ్ల వయసు వచ్చేసరికి మియా పూర్తిగా అంధురాలు అవుతుందన్న డాక్టర్ల మాట- ఆ దంపతుల నెత్తిన పిడుగయ్యింది. ఆ తరవాత కొన్నాళ్లకు మియా ముగ్గురు తమ్ముళ్లకు పరీక్షలు చేస్తే- వారిలో ఇద్దరికి ఆ వ్యాధి ఉన్నట్లుగా తెలిసింది. చిన్న తమ్ముడు కూడా భవిష్యత్తులో ఆ సమస్య బారినపడొచ్చని వైద్యులు నిర్ధారించారు. ఎడిత్‌ దంపతులు నెమ్మదిగా ఆ విషాదంలోంచి బయటపడ్డారు. బిడ్డల కంటి జ్యోతులు కొండెక్కేలోపు వారికి ఈ లోకంలోని అందాలన్నింటినీ చూపించాలని నిర్ణయించుకున్నారు. ఈ సంవత్సరం మార్చిలో మాంట్రియెల్‌కు బయల్దేరారు. అక్కడి నుంచి నమీబియా, ఆ తరవాత జాంబియా, టాంజానియాలకు వెళ్ళారు. అటునుంచి టర్కీలో నెల రోజులు గడిపారు. ఆపై మంగోలియా, ఇండొనేసియాల్లో పర్యటించారు. వ్యాధి గురించి కొద్దికొద్దిగా పిల్లలకు ఆ తల్లిదండ్రులు అవగాహన కల్పిస్తూ- రాబోయే కష్టాలతో పోరాడుతూ జీవించడం ఎలాగో వాళ్లకు నేర్పుతున్నారు. పిల్లల్లో భయానికి బదులు ఏటికి ఎదురీదే సామర్థ్యాన్ని నింపుతున్నారు. అలా ప్రేమారా పిల్లలకెన్నో నేర్పుతున్న ఎడిత్‌, సెబాస్టియన్‌లను ఏమని అభినందించగలం! వారి కష్టానికి కడుపు తరుక్కుపోతున్నా- ఆ కుటుంబం చిరునవ్వుల్లో ప్రతిబింబిస్తున్న ఆ ఆత్మవిశ్వాసానికి అబ్బురపడకుండా ఎలా ఉండగలం!  అది కదా... అమ్మానాన్నల ప్రేమంటే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts