అవే మా ప్రేమ కానుకలు

మనసైనవారు ఇచ్చే కానుక ఎంత చిన్నదైనా అందులో వారిని చూసుకుని మురిసిపోతుంటారు ప్రేయసీప్రియులు. గుండెల్లోని ప్రేమను గుడికట్టినంత ప్రత్యేకంగా మలచి అందించే ఆ ప్రియ కానుకల్ని ఇచ్చి పుచ్చుకున్న కొందరు హీరోలు వాటి గురించి ఏం చెబుతున్నారంటే..

Updated : 20 Oct 2022 17:02 IST

అవే మా ప్రేమ కానుకలు

మనసైనవారు ఇచ్చే కానుక ఎంత చిన్నదైనా అందులో వారిని చూసుకుని మురిసిపోతుంటారు ప్రేయసీప్రియులు. గుండెల్లోని ప్రేమను గుడికట్టినంత ప్రత్యేకంగా మలచి అందించే ఆ ప్రియ కానుకల్ని ఇచ్చి పుచ్చుకున్న కొందరు హీరోలు వాటి గురించి ఏం చెబుతున్నారంటే..


లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌

- అల్లు అర్జున్‌

పెళ్లికి ముందు వారాంతాల్లో స్నేహితులూ పార్టీలంటూ తిరిగేవాడిని. అలా ఓ పార్టీలో స్నేహని మొదటిసారి చూశా. హుందాగా ఉన్న ఆమె తీరు తొలిచూపులోనే ప్రేమలో పడేలా చేసింది. తను చాలా బ్యాలెన్డ్స్‌గా ఉంటుంది. మొదట్లో నా ప్రేమను ఒప్పుకుంటుందో లేదో అని చాలా భయపడ్డా. కాస్త ఆలస్యంగానే ఓకే చెప్పింది. మేం పెళ్లికి ముందు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంది తక్కువే. పెళ్లయ్యాక మాత్రం అయాన్‌, అర్హ రూపంలో వెలకట్టలేని బహుమతులు ఇచ్చింది స్నేహ. అందుకే నేనూ మా పదో పెళ్లిరోజుని తాజ్‌మహల్‌ వద్ద సెలబ్రేట్‌ చేశా. మోకాళ్ల మీద కూర్చుని స్నేహకి మళ్లీ ప్రత్యేకంగా ప్రపోజ్‌ చేశా. రొమాంటిక్‌ వెకేషన్‌కి తీసుకెళ్లి ఆ ట్రిప్పుని మధుర జ్ఞాపకంగా మార్చేశా. అదే నేనిచ్చిన అతి పెద్ద గిఫ్ట్‌ అంటుంది స్నేహ.


మూడేళ్లు వెంటపడ్డా

- కార్తికేయ

నా భార్య లోహిత కాలేజీలోనే పరిచయం. తనని చూడగానే నచ్చేసింది. కష్టపడి నంబర్‌ సంపాదించి మెసేజ్‌లు పెట్టేవాడిని. అప్పుడప్పుడూ బహుమతులూ పంపేవాడిని. ఏదో ఒక రోజు ఒప్పుకుంటుందని-ఫైనలియర్‌లో ఓకే చెప్పేవరకూ ఓపిగ్గా చూశా. అంతేకాదు హీరోనయ్యాకే తనింట్లో పెళ్లికి ఒప్పిస్తానని హామీ ఇచ్చా. మొదట్లో కాస్త షాక్‌ అయినా లోహిత నిదానంగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. నేను హీరోగా నిలదొక్కుకుని వాళ్లింట్లో మాట్లాడేవరకూ సహనంగా ఉంది. అదే నాకు తనిచ్చిన పెద్ద బహుమతి. అందుకే ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకున్నా.


తనకోసం షాపింగ్‌ చేశా

- నాని

నేను సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నప్పుడే అంజన పరిచయమైంది. తను నా ఫ్రెండ్‌కి కజిన్‌. తొలి చూపులోనే నచ్చేసింది. నిజానికి నాకు షాపింగ్‌చేయడం, ఎవరికైనా గిఫ్ట్‌లు ఇవ్వడం వంటి అలవాట్లు లేవు. కానీ అంజన పద్దెనిమిదో పుట్టిన రోజు ప్రత్యేకంగా ఉండాలని ఎన్నో షాపులు తిరిగి మగ్‌, డైరీ, కీ చెయిన్‌, డీవీడీలు, పుస్తకాల వంటి 18 బహుమతులు కొని గిఫ్ట్‌గా ఇచ్చా. తను వాటిని భద్రంగా దాచుకుని ఇప్పటికీ మురిసిపోతుంటుంది. అలానే అంజన కూడా పెళ్లికి ముందు ఓ టీషర్టు మీద పెయింటింగ్‌ వేసి ఇచ్చింది. పెళ్లి తరవాత మా మధ్య జరిగిన మధురానుభూతుల్ని అక్షరాలుగా కూర్చి ఓ డైరీ రూపంలో ఇచ్చింది.


గుర్రం పిల్లని ఇచ్చా

- రామ్‌చరణ్‌

పెళ్లికి ముందు నేనూ ఉపాసన కలిస్తే ఎప్పుడూ మూగజీవాలు, క్రీడలు, సాహసాల గురించే మాట్లాడుకునే వాళ్లం. ప్రేమలో పడ్డాక ఉపాసనకు ఫోన్‌ బహుమతిగా ఇచ్చా. తనేమో టీషర్టు ఇచ్చింది. పెళ్లయ్యాక ఓ గుర్రపు పిల్లని ప్రజెంట్‌చేశా. ఇప్పటి వరకూ ఇద్దరం చాలా గుర్రపు పిల్లల్నీ పప్పీల్నీ బహుమతులుగా ఇచ్చిపుచ్చుకుని మా ప్రేమకు గుర్తులుగా పెంచుతున్నాం.


చేతులు పెనవేసుకుని...

- రానా

మిహిక చిన్నప్పట్నుంచీ తెలుసు. అయితే లాక్‌డౌన్‌కు ముందు ఒకసారి కలిసినప్పుడు తనలో ఏదో స్పార్క్‌ నన్ను ఆకట్టుకుంది. అప్పుడే అనిపించింది మిహిక నా భార్య అయితే బాగుంటుంది అని. ప్రపోజ్‌ చేయగానే ఒప్పేసుకుంది. మా పెళ్లయ్యాక ఇద్దరి చేతుల్నీ పెనవేసి త్రీడీ హ్యాండ్‌ ఇంప్రెషన్‌ తీసుకున్నాం. మా ప్రేమకి గుర్తుగా మాకు మేం మలచుకున్న అందమైన జ్ఞాపకం అది. ఒకరికొకరం ఇచ్చుకున్న కానుకగానూ భావిస్తాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..