మహిళలూ... మీకు జోహార్లు!

ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉంటుంది అంటారు. మరి ఆయా రంగాల్లో ఉన్నతస్థానాలకు ఎదిగిన ఈ ప్రముఖుల జీవితాల్లోని అలాంటి స్ఫూర్తిదాయక మహిళలు ఎవరో వారి మాటల్లోనే....

Updated : 05 Mar 2023 03:35 IST

మహిళలూ... మీకు జోహార్లు!

ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉంటుంది అంటారు. మరి ఆయా రంగాల్లో ఉన్నతస్థానాలకు ఎదిగిన ఈ ప్రముఖుల జీవితాల్లోని అలాంటి స్ఫూర్తిదాయక మహిళలు ఎవరో వారి మాటల్లోనే....

ఆమే అమ్మ
- రజనీకాంత్‌

అప్పటికి నాకింకా పెళ్లికాలేదు. సినిమాల్లో బిజీగా గడిపే రోజులవి. ఓ బంగ్లాలో షూటింగ్‌ చేస్తుంటే ఆ ఇంటి యజమాని రెజినా పరిచయమయ్యారు. ఆమె సంఘసేవకురాలు. తల్లిలేని నాకు ఆ ప్రేమను చూపించారు. 1979లో వరసగా 17 సినిమాలు చేసి తీవ్ర ఒత్తిడి వల్ల హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చింది. అప్పుడు రెజినా అమ్మే నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు. తన ఇంటికే తీసుకెళ్ళి సపర్యలు చేశారు. నా గురించి ఎప్పటికప్పుడు వైద్యులకు చెబుతూ సరైన వైద్యం అందేలా చూశారు. నెలరోజులపాటు ఆమెతో ఉండటం వల్లే నేను మళ్ళీ మనిషిని కాగలిగా. సహనంగా, ప్రేమగా ఉండటంలో తను నాకు రోల్‌ మోడల్‌.


అలాంటి అమ్మలే స్ఫూర్తి

-సత్య నాదెళ్ల

ఏ లోపం లేని పిల్లల్ని పెంచడమే ఈరోజుల్లో ఓ సవాలు. అలాంటిది  ప్రత్యేక అవసరాలున్న వాళ్లని పెంచి పెద్ద చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. నన్నూ, ఇద్దరు ఆడపిల్లల్నీ చూసుకుంటూనే సెరెబ్రల్‌పాల్సీతోపాటు మరికొన్ని మానసిక సమస్యలూ, దృష్టిలోపంతో పుట్టిన మా అబ్బాయి జైన్‌ను పెంచింది అను. అమ్మగా ఆమె ఆరాటం, పోరాటం చూసిన నా దృష్టిలో అలాంటి పిల్లలున్న ప్రతి తల్లీ ఓ యోధురాలే. విసుగూ విరామం లేకుండా ముందుకు సాగే అలాంటి మహిళల్ని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. వృత్తిగత జీవితంలో ప్రతి చిన్న సమస్యనీ భూతద్దంలో చూస్తూ బాధపడేవారికి అలాంటి వారినే చూపిస్తుంటా.


సుష్మాజీ ఆదర్శం

- జైశంకర్‌

కొందరు నాయకులు తమ పదవిని కేవలం హోదాగానే భావిస్తారు. మరికొందరు ఆ హోదాకున్నగౌరవాన్నే రెట్టింపుచేస్తారు. అలాంటివారిలో ముందుంటారు సుష్మాస్వరాజ్‌. ఆమె విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు- ఆ శాఖ కార్యదర్శిగా పనిచేశా. విదేశాల్లో ఉన్న భారతీయ కమ్యూనిటీలతో మన సంబంధాలిప్పుడు బలంగా ఉన్నాయంటే ఆమె వల్లే. కింద స్థాయి ఉద్యోగులతోనూ ఎంతో గౌరవంగా, ఆప్యాయంగా మాట్లాడతారు. పని తప్ప వేరే వ్యాపకం ఉండదు. రకరకాల సమస్యలతో విదేశాల్లో చిక్కుకున్న ఎందరికో బాసటగా నిలిచిన ఆమె దూరదృష్టి నాకెంతో నచ్చుతుంది. చాలా విషయాల్లో ఇప్పుడు నేను ఆమెని స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నా.


థెరీసా అడుగుజాడల్లో

- శివ్‌నాడార్‌

సంతోషమైనా, డబ్బైనా పంచేకొద్దీ పెరుగుతుందని నా నమ్మకం. అందుకే నాకెంతో ఇష్టమైన చదువును పదిమందికీ పంచాలనే చూస్తుంటా. పేద విద్యార్థులకోసం స్కూళ్లు కట్టించడం, ఉపకారవేతనాలు ఇవ్వడం వంటివి అందులో భాగంగానే చేస్తుంటా. ఆ విషయంలో నాకు స్ఫూర్తి మదర్‌ థెరీసా. బడిలో చదువుకునేటప్పుడే ఆమె గురించి తెలుసుకున్న నేను.... పెద్దయ్యాక తోటివారికి సేవ చేయాలనుకున్నా. మా అమ్మాయిలో కూడా మదర్‌ సేవా స్ఫూర్తిని నూరిపోసేవాణ్ని. అందుకే సంపాదించే విషయంలోనే కాదు... పంచడంలోనూ తను ఆ విశ్వమాతనే ఆదర్శంగా తీసుకుంటోంది.


ఆ తీరు నాకిష్టం

- ధోనీ

కొందరు ఏ విషయంలోనైనా తిరస్కారానికి గురైతే అస్సలు  తట్టుకోలేరు. మనసుకు తీసుకుని అక్కడే ఆగిపోతారు. ఎన్నో భాషల్లో వేల సినిమా పాటలు పాడిన లతా మంగేష్కర్‌ ఆ స్థాయికి రావడానికి ముందు చాలాచోట్ల తిరస్కారాలకు గురయ్యారు. బడిలో చేర్చుకోకపోవడం, గొంతు పీలగా ఉందని అవకాశాలు ఇవ్వకపోవడం- తొలినాళ్లలో సినిమాల్లో పాటలు పాడించి తొలగించడం వరకూ లతాజీ చాలానే అవమానాలు ఎదుర్కొన్నారు. అయినా వాటితో ఆమె మానసికంగా రాటుదేలారే తప్ప డీలాపడలేదు. హిందుస్థానీ క్లాసికల్‌ మ్యూజిక్‌ నేర్చుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆదరాభిమానాలు సొంతం చేసుకున్నారు. గానకోకిలగా సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న లతాజీ జీవితం నాకు ఎప్పటికీ ఓ స్ఫూర్తి పాఠమే.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు