నాన్నే మా హీరో!

సెలెబ్రిటీలు బయటకు వెళ్లారంటే జనాలు చుట్టుముట్టేస్తుంటారు. వాళ్లతో మాట్లాడాలనీ, కుదిరితే సెల్ఫీ తీసుకోవాలనీ ఉవ్విళ్లూరుతుంటారు. అంతగా ప్రజల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న ఆ ప్రముఖులు  ఇంట్లో ఎలా ఉంటారో... తమ పిల్లలతో ఎలా గడుపుతారో... ఏ ఆటలు ఆడుకుంటారో తెలుసుకోవాలని చాలామందికే ఉంటుంది.

Updated : 16 Jun 2024 07:33 IST

సెలెబ్రిటీలు బయటకు వెళ్లారంటే జనాలు చుట్టుముట్టేస్తుంటారు. వాళ్లతో మాట్లాడాలనీ, కుదిరితే సెల్ఫీ తీసుకోవాలనీ ఉవ్విళ్లూరుతుంటారు. అంతగా ప్రజల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న ఆ ప్రముఖులు  ఇంట్లో ఎలా ఉంటారో... తమ పిల్లలతో ఎలా గడుపుతారో... ఏ ఆటలు ఆడుకుంటారో తెలుసుకోవాలని చాలామందికే ఉంటుంది. ఫాదర్స్‌ డే సందర్భంగా ఆ విశేషాలన్నీ వారి పిల్లల మాటల్లోనే తెలుసుకుందాం రండి..!


నాన్నలాగే నేను కూడా

- సితార

నా దృష్టిలో మానాన్న మహేశ్‌బాబు సూపర్‌ హీరో. నా అభిమాన నటుడు కూడా తనే. తన దగ్గర నాకు చొరవ ఎక్కువ. సినిమాలు చూసి నచ్చితే నచ్చిందనీ- నచ్చకపోతే నచ్చలేదనీ ముక్కుసూటిగా చెప్పేస్తుంటా. చిన్నప్పట్నుంచీ నాన్నని చూస్తూ పెరగడం వల్ల నాకూ సినిమాల్లోకి రావాలనుంది. అయితే ఇంగ్లిష్‌ సినిమాల్లోనే నటించాలనుకుంటున్నా. ‘సర్కారువారి పాట’ ప్రమోషన్స్‌ సమయంలో తమన్‌ అంకుల్‌ నా చేత పెన్నీ సాంగ్‌కు డాన్స్‌ చేయించి ఓ వీడియో విడుదల చేశారు. నిజానికి ఆ వీడియో కోసం నేను డాన్స్‌ చేసినట్టు నాన్నకి తెలియదు. చూశాక మాత్రం సర్‌ప్రైజ్‌ అయ్యారు.

దాన్ని సినిమాలో పెట్టనందుకు మాత్రం కొంచెం ఫీలయ్యా. నాన్నతో సరదాగా పోట్లాడా కూడా. పేదవాళ్ల గురించి ఆలోచించి ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయిస్తున్న నాన్నను చూస్తే చాలా గ్రేట్‌ అనిపిస్తుంది. నాన్నలాగే నేను కూడా చెయ్యాలని- ఈ మధ్య నేను నటించిన ఓ ప్రకటనకు వచ్చిన రెమ్యునరేషన్‌ అంతా సేవా కార్యక్రమాలకు ఇచ్చేశా. బర్త్‌డేలాంటి అకేషన్స్‌లో పేద పిల్లలకు రకరకాల వస్తువులు కొనిస్తున్నా.


ఆ తీరు నచ్చుతుంది

- దియా

మా నాన్న సూర్య ఇంట్లో ఉంటే అవుట్‌డోర్‌ స్పోర్ట్స్‌- క్రికెట్‌, ఫుట్‌బాల్‌ ఎక్కువగా ఆడతాడు. తనవల్ల నాకూ ఆటలంటే ఆసక్తి పెరిగింది. అందుకే మా స్కూల్లో క్రికెట్‌, ఫుట్‌బాల్‌ జట్టుకి కెప్టెన్‌ను అవ్వగలిగా. మన పనిని మనం ప్రేమించాలని ఎప్పుడూ చెబుతుంటాడు. తను అలా చెప్పడం వల్లే ఇష్టంగా చదివి టెన్త్‌లోనూ ఇంటర్‌లోనూ 97శాతం మార్కులు తెచ్చుకున్నా. నాన్న ఇంట్లో ఉంటే అమ్మకు పనుల్లో సాయపడతాడు. తనకి ఆడవాళ్లంటే చాలా గౌరవం. ‘ముందు ఇంట్లో అమ్మనీ అక్కనీ గౌరవించడం నేర్చుకుంటేనే సమాజంలో మహిళల్ని గౌరవించగలవు’ అని నా తమ్ముడు దేవాకి పదే పదే చెబుతుంటాడు. ఏ విషయమైనా సరే అమ్మతో మాట్లాడే నిర్ణయం తీసుకుంటాడు. పేదవాళ్లకీ కష్టాల్లో ఉన్నవాళ్లకీ సాయం చేయాలని మాకు ఎప్పుడూ చెప్పే నాన్న వ్యక్తిత్వం, ఆలోచనా విధానం నాకెంతగానో నచ్చుతాయి. సినిమాల పరంగా చెప్పాలంటే ‘జైభీమ్‌’, ‘ఆకాశమే హద్దురా’ నాకు చాలా ఇష్టం.


నాన్నే సింబా అనుకున్నా

- అర్జున్‌

నాకు నాన్నంటే చాలా ఇష్టం. నన్ను ముద్దుగా జున్నూ... అని పిలుస్తాడు. ఇంట్లో ఉన్నంత సేపూ నాతోనే ఉంటాడు. లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్‌ క్లాస్‌లకు హాజరైతే పక్కన కూర్చుని నా చేత చదివించేవాడు. ఇప్పుడు కూడా టైమ్‌ దొరికితే పోటీ పడి మరీ బ్లాక్స్‌తో బిల్డింగ్స్‌ కట్టుకుంటాం. నామీదున్న ప్రేమ వల్ల ‘జెర్సీ’ సినిమాలో తన పాత్రకి అర్జున్‌ అని నా పేరే పెట్టుకున్నాడు. నాన్న యాక్ట్‌ చేసిన సినిమాలన్నీ చూడను నేను. ఎందుకంటే, తన పక్కన అమ్మ కాకుండా వేరేవాళ్లుంటే చూడ్డం ఇష్టముండదు. అందుకే నాన్న ఒక్కడే డాన్స్‌లూ ఫైట్‌లూ చేస్తున్నవి మాత్రం చూస్తుంటా. ప్రతిరోజూ షూటింగ్‌లో విశేషాలు అడిగి తెలుసుకుంటా. కానీ నాన్న మాత్రం కొన్నే చెబుతాడు. నాకు సంగీతమంటే చాలా ఇష్టం. ఇంట్లో పియానో కూడా ఉంది. రోజూ నేర్చుకుంటున్నా. ప్రత్యేకంగా కొన్ని ట్యూన్లు కంపోజ్‌ చేసి నాన్నకు వినిపిస్తుంటా. నాన్న సినిమాల్లో ‘శ్యామ్‌ సింగరాయ్‌’ నాకు చాలా ఇష్టం. అందులో మీసాలతో భలే ఉన్నాడు. ‘జెర్సీ’ సమయంలో నాన్న ముక్కు విరిగింది. అప్పుడు నేను చాలా చిన్నగా ఉండేవాడిని. తెలియక ఆ ముక్కు పట్టుకునేవాణ్ని. దాంతో ఆమ్మావాళ్ళు నన్ను నాన్న దగ్గరకు పోనివ్వలేదు. అప్పుడు నాకు చాలా దిగులేసింది.  అలానే నవ్వు తెప్పించే విషయం కూడా ఒకటి ఉంది. ‘ది లయన్‌ కింగ్‌’లో సింబా పాత్రకి నాన్న డబ్బింగ్‌ చెప్పాడు కదా! ఆ సినిమాని తెలుగులో చూశాక మా నాన్నే సింబాలా మారిపోయాడేమో అనుకున్నా. అది చెబితే మా ఇంట్లో వాళ్లంతా నవ్వుకున్నారు.


తెలుగు బాగా నేర్పించారు

- అర్హ

న్ను మా ఫ్యామిలీలో చాలామంది వస పిట్ట అంటుంటారు. అదంతా మా నాన్న అల్లు అర్జున్‌ వల్లనే. ఎందుకంటే ఇంట్లో ఉన్నంతసేపూ నాన్నా, నేనూ మాట్లాడుకుంటాం, ఆట్లాడుకుంటాం, పోట్లాడుకుంటాం. అలానే నాకు మాటలు కూడా సరిగా రాకముందే పొడుపు కథలూ, సామెతలూ చెప్పి తెలుగు స్పష్టంగా మాట్లాడటం అలవాటు చేశారు. అందుకే ఎక్కువగా మాట్లాడటం అలవాటైపోయింది. ‘శాకుంతలం’ సినిమాలో పెద్ద పెద్ద డైలాగులు ఉన్నా సరే ఈజీగా చెప్పగలిగా. డబ్బింగ్‌ చెప్పమన్నప్పుడు కూడా భయపడలేదు అంటే అది నాన్న వల్లే. ఆ సినిమా షూటింగ్‌కి వెళ్లినన్ని రోజులూ- నాన్న తన కోసం ఇష్టంగా తయారు చేయించుకున్న క్యారవాన్‌ను నాకోసం పంపారు. ప్రతి క్షణం నా గురించి తెలుసుకునేవారు. మా నాన్నలో నాకు అన్నిటికన్నా నచ్చేది- తనకి ఎంత కష్టమైన పని ఇచ్చినా సరే చకచకా చేసేస్తారు. నేనూ తన నుంచి అదే నేర్చుకుంటున్నా. నాకు చెస్‌ అంటే చాలా ఇష్టం. నాలుగేళ్లు ఉన్నప్పటి నుంచే ట్రైనింగ్‌ తీసుకుంటున్నా. అంతేకాదు, నేనూ ట్రైనర్‌గా మారిపోయి ఓ యాభైమందికి నేర్పించా కూడా. అందుకు నోబెల్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో ‘వరల్డ్స్‌ యంగెస్ట్‌ చెస్‌ ట్రైనర్‌’గా నా పేరును నమోదు చేశారు. ఆ రోజు నాన్న సంతోషం అంతా ఇంతా కాదు.


కవితలే బహుమతులు

- మరియం సల్మాన్‌

మా నాన్న దుల్కర్‌ సల్మాన్‌కి నేనంటే ఎంత ఇష్టమో. ఇంట్లో ఉంటే నేను ఆడుకోవడానికి నాకోసం టాయ్‌గానూ, పెయింటింగ్స్‌ వేసుకోవడానికి కాన్వాస్‌లానూ మారిపోతుంటాడు. అప్పుడు నాన్న ముఖానికీ, గోళ్లకీ రంగులు పూసినా, హెయిర్‌ బ్యాండ్స్‌తో పిలకలు వేసినా ఏమీ అనడు. నేనేం చేసినా ఎంజాయ్‌ చేస్తాడు. స్కూలుకు వెళ్లే టైమ్‌కి ఇంట్లో ఉంటే నన్ను డ్రాప్‌ చేస్తాడు. ప్రతి సంవత్సరం సమ్మర్‌ హాలీడేస్‌ అయ్యాక స్కూలుకు వెళ్లడానికి నేను బాధపడిపోతుంటే- ఫస్ట్‌ డే ఐస్‌ క్రీమ్‌ తినిపించి క్లాస్‌ రూమ్‌లో వదిలేయడం నాన్నకు సెంటిమెంట్‌. పేరెంట్‌- టీచర్‌ మీటింగ్‌కి తప్పకుండా నాన్నే రావడానికి చూస్తుంటాడు. నా సెలవు రోజుల్లోనూ, బర్త్‌డేలాంటి ఫంక్షన్లప్పుడూ షూటింగ్‌ లేకుండా చూసుకుంటాడు. అందుకే, స్కూలు క్యాలెండర్‌ ప్రకారమే సినిమాలకు డేట్స్‌ ఇస్తుంటాడు. నా ప్రతి పుట్టినరోజుకీ ఓ కవిత రాసి బహుమతిగా ఇస్తుంటాడు. అవన్నీ నేను జాగ్రత్తగా దాచుకుంటున్నా. పెద్దయ్యాక వాటితో ఓ పుస్తకం పబ్లిష్‌ చేయాలనుంది. చాలామంది ‘మీ నాన్న హీరో కదా... సినిమాలు బాగా చూస్తావా’ అని అడుగుతుంటారు. యాక్షనే అయినా నాన్నని ఎవరైనా కొట్టడం, గన్‌తో కాల్చడం వంటివి నాకు నచ్చదు. అందుకే సినిమాలు చూడను. జిమ్నాస్టిక్స్‌ అంటే చాలా ఇష్టం. నాన్నకు సమయం దొరికినప్పుడు- కష్టపడి పైకి వచ్చిన స్పోర్ట్స్‌ పర్సన్స్‌ గురించి చెప్పి నాకింకా ఆటల మీద ఇష్టాన్ని పెంచుతుంటాడు.

Ramoji Rao: అక్షరం... అక్షయం... మీ సంకల్పం!


అస్సలు కోపం రాదు

- జీవా ధోనీ

లో అందరికీ... మా నాన్న ధోనీ వల్ల నేను చాలామందికి పరిచయమే. ఎందుకంటే నా చిన్నప్పుడు- నన్ను మిస్‌ అవ్వడం ఇష్టం లేక నాన్న ఆడే ప్రతి మ్యాచ్‌కీ తీసుకెళ్లేవాడు. గ్యాలరీలో చుట్టుపక్కల వాళ్లంతా చప్పట్లు కొడుతుంటే నేను కూడా ‘కమాన్‌ పప్పా’ అంటూ అరిచేదాన్ని. ‘నా దగ్గరకు రా...’ అంటూ గోల చేసేదాన్ని. కొన్నిసార్లు మ్యాచ్‌ ఉన్నా ప్రాక్టీస్‌కి వెళ్లకుండా నాన్న హోటల్‌లోనే ఉండిపోయి నాతో ఆడుకునేవాడు. ఎప్పుడూ స్మైలీ ఫేస్‌తోనే ఉండే నాన్న ముఖంలో కోపం ఎప్పుడూ చూడలేదు. అందుకేనేమో మా నాన్నతో కలిసి క్రికెట్‌ ఆడే అంకుల్స్‌ అందరూ నాన్నని ‘మిస్టర్‌ కూల్‌’ అంటారు. నేను కూడా అప్పుడప్పుడూ అలానే పిలుస్తుంటా. మ్యాచ్‌ లేనప్పుడు నాన్న రాంచీలోని మా ఇంటికి వస్తాడు. రోజుకి ఒక్కసారైనా నాన్న పాత బైకును- అంటే, క్రికెటర్‌ కాకముందు నడిపిన బైకును బయటకు తీసి ఇంటి చుట్టూ రౌండ్లు వేస్తాడు. ‘అలా ఎందుకు చేస్తున్నావ్‌ నాన్నా...’ అని అడిగితే- ‘ఆరోజుల్ని గుర్తు చేసుకోవడానికి’ అని చెప్తాడు. అలానే మా నాన్నకి సింపుల్‌గా ఉండటం ఇష్టం. వ్యవసాయం అంటే ప్రాణం. సెలవు రోజుల్లో మా ఫామ్‌ హౌస్‌కి తీసుకెళ్లి నాతో పనులు చేయిస్తుంటాడు. మన కష్టంతో సంపాదించుకున్నవి ఇచ్చే ఆనందం అంతాఇంతా కాదని కూడా చెబుతాడు.

Ramoji Rao: బాధ్యతల వీలునామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..