నయనతార పెళ్లి.. చేసింది వీళ్లే!

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయి అంటారు. అది నిజమో కాదో తెలీదుగానీ నేటితరం వెడ్డింగ్‌ ప్లానర్ల పుణ్యమాని పెళ్లిళ్లు మాత్రం అచ్చం స్వర్గంలాంటి నేపథ్యంలోనే జరుగుతున్నాయి.

Published : 19 Jun 2022 01:05 IST

నయనతార పెళ్లి.. చేసింది వీళ్లే!

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయి అంటారు. అది నిజమో కాదో తెలీదుగానీ నేటితరం వెడ్డింగ్‌ ప్లానర్ల పుణ్యమాని పెళ్లిళ్లు మాత్రం అచ్చం స్వర్గంలాంటి నేపథ్యంలోనే జరుగుతున్నాయి. ఆ విధంగానే తాజాగా నయనతార- విఘ్నేశ్‌శివన్‌ల పెళ్లినీ అంగరంగ వైభవంగా జరిపించింది ‘షాదీస్క్వాడ్‌’ సంస్థ. ఎందరో సెలెబ్రిటీల పెళ్లిళ్లు జరిపిన ఆ సంస్థ ప్రయాణమిదీ...

మహా బలిపురంలో పరమశివుడి సాక్షిగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు నయనతార దంపతులు. నిజానికి ఆహ్వాన పత్రికలు పంచడంతోనే విషయం బయటకు వచ్చిందిగానీ, దాదాపుగా ఏడాది క్రితమే ఆ పెళ్లి పనుల్ని మొదలుపెట్టింది ‘షాదీస్క్వాడ్‌’ సంస్థ. ప్రతి విషయంలోనూ గోప్యతను పాటిస్తూ ప్రముఖుల పెళ్లిళ్లకు కేరాఫ్‌గా నిలిచిన ఆ సంస్థ ఇప్పటి వరకూ ఆలియాభట్‌- రణ్‌బీర్‌కపూర్‌; కత్రినాకైఫ్‌- విక్కీకౌశల్‌; ప్రియాంకాచోప్రా- నిక్‌జొనాస్‌; అనుష్కశర్మ- విరాట్‌కోహ్లీ తదితర సెలెబ్రిటీల పెళ్లిళ్లను కన్నుల పండువగా నిర్వహించింది. సినీ, టీవీ నిర్మాణ రంగంలో పని చేసిన అనుభవంతో సౌరభ్‌ మల్హోత్రా, టీనా తర్వానీ, మనోజ్‌ మిత్రాలు ఆరేళ్ల క్రితం ముంబయిలో ఈ సంస్థను స్థాపించారు.

సవాళ్లెన్నో...

మొదట తెలిసిన వారి పెళ్లిని ఒమన్‌లో చేశారు. అనుభవం లేకపోయినా తొలిసారే డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ను విజయవంతంగా చేయడంతో వీరికి మంచి పేరొచ్చింది. క్రమంగా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల పెళ్లిళ్లతోపాటు సామాన్యుల వివాహాలనీ వారి బడ్జెట్‌లో చేయడం మొదలుపెట్టిన వీరికి అనుష్కశర్మ స్నేహితురాలు. కోహ్లీతో పెళ్లి అనుకోగానే అనుష్క ‘షాదీస్క్వాడ్‌’ బృందాన్ని సంప్రదించినా- వారు మాత్రం అంత భారీ బడ్జెట్‌లోనూ పైగా ఇటలీలో పెళ్లి చేయగలమా అనే సంశయంతో మొదట్లో ఒప్పుకోలేదు. చివరికి అనుష్క పట్టుబట్టడంతో వీళ్లు ఒప్పుకోక తప్పలేదు. లొకేషన్లు చూడ్డం, బంధువులకి వీసాలు తీసుకోవడం, డెకరేషన్‌, వధూవరుల కాస్ట్యూమ్స్‌, నగల డిజైనింగ్‌, సెక్యూరిటీ ఏర్పాట్ల వంటివన్నీ చూసుకున్నారు.  ఆ పెళ్లికి మంచి మార్కులు పడటంతో ప్రియాంక చోప్రా వీళ్లనే సంప్రదించింది. ‘రాయల్‌ వెడ్డింగ్‌ తరహాలో జరిగే తన పెళ్లిలో సేంద్రియ ఉత్పత్తుల్నే వాడాలని నియమం పెట్టింది ప్రియాంక. అలానే మా సంస్థలోని ఉద్యోగులకు సెలెబ్రిటీల వివరాలు తెలియకుండా ఉండటం కోసం రాత్రి వేళే పని చేయాల్సి ఉంటుంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇటలీలో అనుష్క పెళ్లి వేదికను చివరి నిమిషంలో అవుట్‌డోర్‌ నుంచి ఇండోర్‌కు మార్చాల్సి వచ్చింది. మనదికాని ప్రాంతంలో ఒక్కరోజులోనే గ్రాండ్‌గా అప్పటికప్పుడు డెకరేట్‌ చేయడానికి చాలా కష్టపడ్డాం. ఆలియా భట్‌ పెళ్లికి కేవలం వారం రోజుల ముందు చెప్పారు. వాస్తుకు ఎంతో ప్రాధాన్యమిచ్చే రణ్‌బీర్‌ ఇంట్లోనే నిపుణుల సూచనలతో ఇంటిని అలంకరించి కార్యక్రమం నిర్వహించాం. కత్రిన - విక్కీకౌశల్‌లు సెల్‌ఫోన్లు లేకుండా పెళ్లికి హాజరవ్వమని అతిథుల్ని కోరారు. దాంతో అతిథుల ఫోన్లను జాగ్రత్తగా భద్రపరచడం, ఎవరూ ఫోన్‌ తీసుకెళ్లకుండా చూడటం మాకు పెద్ద ఛాలెంజ్‌’ అని చెబుతున్న ఆ సంస్థ వ్యవస్థాపకులు సెలెబ్రిటీల పెళ్లిని ఓ అపురూపమైన కావ్యంలా... అందమైన జ్ఞాపకంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నారనే చెప్పాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..