చికెన్‌ చిప్స్‌... చేసేద్దామా!

చికెన్‌ తెచ్చుకోగానే... కూర/పులావ్‌/పులుసు/వేపుడు... ఇలా ఏం చేసుకోవాలా అనే కోణంలోనే ఆలోచిస్తాం కదా... ఈసారి అవన్నీ పక్కన పెట్టేసి చికెన్‌తో ఇలాంటి స్నాక్స్‌ని తయారు చేసుకుంటే సరి.

Updated : 23 Jan 2022 07:13 IST

చికెన్‌ చిప్స్‌... చేసేద్దామా!

చికెన్‌ తెచ్చుకోగానే... కూర/పులావ్‌/పులుసు/వేపుడు... ఇలా ఏం చేసుకోవాలా అనే కోణంలోనే ఆలోచిస్తాం కదా... ఈసారి అవన్నీ పక్కన పెట్టేసి చికెన్‌తో ఇలాంటి స్నాక్స్‌ని తయారు చేసుకుంటే సరి.

స్పైసీ చికెన్‌ వింగ్స్‌

కావలసినవి: చికెన్‌ వింగ్స్‌: పావుకేజీ, మొక్కజొన్నపిండి: టేబుల్‌స్పూను, గుడ్డు: ఒకటి, కారం: రెండు చెంచాలు, దనియాలపొడి: చెంచా, జీలకర్రపొడి: రెండు చెంచాలు, అల్లంవెల్లుల్లి ముద్ద: టేబుల్‌స్పూను, నూనె: వేయించేందుకు సరిపడా, కరివేపాకు రెబ్బలు: రెండు, వెల్లుల్లి రెబ్బలు: అయిదు, ఉల్లిపాయ: ఒకటి, సెనగపిండి: రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, కొబ్బరిపొడి: టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి: రెండు.

తయారీ విధానం: చికెన్‌ ముక్కలపైన మొక్కజొన్నపిండి, గుడ్డుసొన, సగం కారం, దనియాలపొడి, కొద్దిగా ఉప్పు, సగం జీలకర్రపొడి, అల్లంవెల్లుల్లిముద్ద వేసి అన్నింటినీ బాగా కలిపి అరగంటసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక ఈ ముక్కల్ని వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. మరో బాణలిలో రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి కరివేపాకు, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి వేయించాలి. తరువాత చికెన్‌ ముక్కలు, మిగిలిన కారం, జీలకర్రపొడి, మరికొంచెం ఉప్పు, కొబ్బరిపొడి, సెనగపిండి వేసి బాగా కలిపి... అయిదు నిమిషా లయ్యాక దింపేయాలి.


కారంచిప్స్‌

కావలసినవి: చికెన్‌: పావుకేజీ (పల్చని ముక్కల్లా కోసుకోవాలి), మొక్కజొన్నపిండి: పావుకప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద: టేబుల్‌స్పూను, కారం: మూడు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, గరంమసాలా: చెంచా, జీలకర్రపొడి: మూడు చెంచాలు, చాట్‌మసాలా: రెండు చెంచాలు, దనియాలపొడి: రెండు చెంచాలు, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: ఓ గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకుని అందులో మొక్కజొన్నపిండి, అల్లంవెల్లుల్లిముద్ద, చెంచా కారం, గరంమసాలా, చెంచా జీలకర్రపొడి, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలపాలి. అందులో చికెన్‌ ముక్కలు వేసి మరోసారి కలిపి కనీసం రెండు గంటలసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తరువాత బయటకు తీసి కాగుతున్న నూనెలో ఈ ముక్కల్ని వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన కారం, జీలకర్రపొడి, కొద్దిగా ఉప్పు, చాట్‌మసాలా, దనియాలపొడి ఓ గిన్నెలో వేసి కలిపి... ఈ మసాలాను వేడిగా ఉన్న చిప్స్‌పైన చల్లితే కారంచిప్స్‌ రెడీ.


అపోలో చికెన్‌


 

కావలసినవి: చికెన్‌: అరకేజీ, ఉప్పు: తగినంత, మిరియాలపొడి: చెంచా, మొక్కజొన్నపిండి: రెండు టేబుల్‌స్పూన్లు, మైదా: రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి ముద్ద: టేబుల్‌స్పూను, గుడ్డు: ఒకటి, పెరుగు: పావుకప్పు, నూనె: వేయించేందుకు సరిపడా, కరివేపాకు రెబ్బలు: రెండు, కారం: టేబుల్‌స్పూను, క్యాప్సికం: ఒకటి, కొత్తిమీర: కట్ట, పచ్చిమిర్చి: రెండు, ఎండుమిర్చి: రెండు, అల్లంతరుగు: చెంచా.

తయారీ విధానం: ఓ గిన్నెలో చికెన్‌ముక్కలు, కొద్దిగా ఉప్పు, మిరియాలపొడి, మొక్కజొన్నపిండి, మైదా, పచ్చిమిర్చి ముద్ద, గుడ్డుసొన వేసుకుని బాగా కలిపి అరగంటసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తరువాత ఈ ముక్కల్ని నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు అదే బాణలిలో రెండు చెంచాల నూనె వేసి కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేయించుకుని తరువాత క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. రెండు నిమిషాలయ్యాక గిలకొట్టిన పెరుగు, కారం, తగినంత ఉప్పు, అల్లంతరుగు వేసి చికెన్‌ ముక్కల్ని బాగా వేయించాలి. అయిదు నిమిషాలయ్యాక కొత్తిమీర చల్లి దింపేయాలి.

- చెఫ్‌ ఇస్మాయిల్‌, అన్నా నేటివ్‌, సికింద్రాబాద్‌


చిట్కా

అన్నం మిగిలిందా...?

సాధారణంగా అన్నం మిగిలితే... దాంతో పులిహోర, ఫ్రైడ్‌రైస్‌ వంటివి ఎక్కువగా చేసుకుంటాం. కానీ మిగిలిన అన్నంతో ఎప్పుడూ అవే చేసుకోవాలని లేదు కాబట్టి... ఈసారి అట్టు వేసుకుని చూడండి. ఎలాగంటే...
ఉదాహరణకు రెండు కప్పుల అన్నం మిగిలితే అందులో పావుకప్పు గోధుమపిండి, అరకప్పు సెనగపిండి, ఒక క్యారెట్‌ తురుము, కొద్దిగా క్యాబేజీ తరుగు, పావుచెంచా పసుపు, రెండు చెంచాల పచ్చిమిర్చి తరుగు, చెంచా అల్లం తరుగు, తగినంత ఉప్పు, రెండు టేబుల్‌స్పూన్ల పెరుగు, కొత్తిమీర తరుగు తీసుకోవాలి. ముందుగా అన్నాన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకుని ఓ గిన్నెలో తీసుకోవాలి. అందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలను వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని వేడిపెనంమీద మందంగా అట్టులా వేసుకుని నూనె వేస్తూ ఎర్రగా కాల్చుకుని తీసుకోవాలి. ఇదేవిధంగా మిగిలిన పిండిని కూడా చేసుకోవాలి. వీటిని వేడివేడిగా అల్లం చట్నీతో తింటే భలే ఉంటాయి తెలుసా...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..