సిసింద్రీ

హాయ్‌ నేస్తాలూ...! మనకు మైక్‌ అంటే ఇష్టం కదూ! ఎందుకు ఇష్టం ఉండదు చెప్పండి.

Updated : 11 Dec 2022 08:42 IST

సిసింద్రీ


గొంతులు మార్చే మైక్‌!

హాయ్‌ నేస్తాలూ...! మనకు మైక్‌ అంటే ఇష్టం కదూ! ఎందుకు ఇష్టం ఉండదు చెప్పండి. మనలాంటి పిల్లలకు కచ్చితంగా చాలా నచ్చుతుంది. అదే గొంతులు మార్చే మైకైతే... ఇక సందడే సందడి. అసలు అలాంటి మైకంటూ ఒకటి ఉంటుందా అనే అనుమానం మీకు ఈ పాటికే వచ్చి ఉంటుంది కదూ! ‘టాయ్‌స్మిత్‌ మల్టీ వాయిస్‌ ఛేంజర్‌’ సరిగ్గా అలాంటి మైకే. ఇందులో మాట్లాడితే మన గొంతు దాదాపు ఎనిమిది రకాలుగా మారుతుంది. అవన్నీ భలే ఫన్నీగా ఉంటాయి. ఈ గొంతులు మార్చే ఆటబొమ్మ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. దీనికున్న బటన్‌ నొక్కి మాట్లాడితే చాలు మన గొంతు బయటకు వినిపిస్తుంది.

ఈ బొమ్మకున్న గొంతులు మార్చే మీటను మార్చితే మన గొంతూ మారుతుంది. అంటే అచ్చం మిమిక్రీ చేసినట్లుగా అన్నమాట. ఆ గొంతులన్నీ భలే తమాషాగా నవ్వు తెప్పించేలా ఉంటాయి. మనం ఎంచక్కా ఇందులో మాటలు చెబుతూ, పాటలు పాడుతూ హాయిగా సమయాన్ని గడపొచ్చు. ఎప్పుడు చూసినా ఆ స్మార్ట్‌ఫోన్‌లో కాలక్షేపం చేసే బదులు కాసేపు ఈ బొమ్మతో ఆడుకోవచ్చు. మన స్నేహితులకూ దీన్ని పుట్టినరోజు కానుకగా ఇవ్వొచ్చు.ఈ ‘టాయ్‌స్మిత్‌ మల్టీ వాయిస్‌ ఛేంజర్‌’ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. 


గాడిద బరువు!

పూర్వం రంగాపురంలో భీమయ్య ఉండేవాడు. అతడు దుస్తులను ఉతుకుతూ జీవనం సాగించేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. అతడు రోజూ జనాల నుంచి సేకరించిన దుస్తులను మూట కట్టి గాడిద మీద వేసుకుని, ఊరి చివర ఉన్న చెరువు దగ్గరకు వెళ్లేవాడు. అక్కడ వాటిని ఉతికి, ఆరేసిన తర్వాత మూటలు కట్టేవాడు. వాటిని గాడిద మీద వేసి ఇల్లు చేరుకునేవాడు. చెరువు పక్కనే ఒక అడవి ఉండేది. భీమయ్య దుస్తులు ఉతికే సమయంలో గాడిద ఆ అడవిలోకి వెళ్లేది. అక్కడకడుపు నిండా తిని, తిరిగి కొంత సమయానికి భీమయ్య దగ్గరకు వచ్చేది.  కొన్నాళ్లకు భీమయ్య అత్యాశకు పోయి ఊళ్లో దుస్తులు ఇంకా ఎక్కువ సేకరించి వాటిని కూడా గాడిద మీద వేయడంతో పెరిగిన బరువు మోయలేక అది చాలా ఇబ్బంది పడుతుండేది. ఒక్కోసారి భీమయ్య కూడా ఆ గాడిద మీద కూర్చొని వెళ్లేవాడు. ‘నేను రోజూ ఎంతో కష్టపడుతున్నా. అయినా నా విలువ నా యజమానికి తెలియట్లేదు. నేను కొన్ని రోజులు దూరంగా వెళితే అప్పుడు తెలిసి వస్తుంది’ అనుకుంది గాడిద. మరుసటి రోజు గాడిద మేత కోసం అడవిలోకి వెళ్లి తిరిగిరాలేదు. దాని కోసం చాలా సేపు ఎదురు చూసిన భీమయ్య అది రాకపోయేసరికి అడవిలోకి వెళ్లి వెతికాడు. దాని ఆచూకీ చిక్కలేదు. చీకటి పడుతుండటంతో ఇక ప్రయోజనం లేదనుకుని ఆ మూటను పైకెత్తే ప్రయత్నం చేశాడు. దాన్ని మోయలేక...  మూటతో సహా కిందపడ్డాడు. ఎలాగోలా తన ఊరివారి సాయంతో మూటను ఇంటికి చేర్చాడు. ‘అమ్మో.. నేను ప్రతిరోజూ ఇంత బరువును గాడిద మీద వేస్తున్నానా? పాపం అది ఏనాడూ ఎదురు తిరగలేదు. ఆ మూటను పడేయలేదు’ అనుకున్నాడు.  ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయాన్నే భీమయ్య నిద్రలేచేసరికే ఇంటిముందు నిల్చున్న తన గాడిదను చూసి మొదట ఆశ్చర్యపోయాడు. తర్వాత ఆనందపడ్డాడు. నెమ్మదిగా దాని దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా తలనిమిరాడు. అప్పటి నుంచి ఇక ఎప్పుడూ విపరీతమైన బరువులు గాడిద మీద వేయకుండా, అది మోయగలిగేంతనే వేసేవాడు.

 ఏడుకొండలు కళ్లేపల్లి



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..