ఏసునాథుని జన్మదినం... మానవాళికి మహోదయం!

కరుణామయుడి జన్మదినం... ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మందికి సంబరం. పవిత్రస్థలాల్లో ప్రార్థనలూ, మంద్రంగా వినిపించే చర్చి గంటలూ, దేదీప్యమానంగా వెలిగే కొవ్వొత్తులూ, ఇంటింటా మెరిసే నక్షత్రకాంతులూ, విద్యుద్దీపాలంకరణలూ, చవులూరించే ప్లమ్‌ కేకులూ పుడ్డింగులూ, వెలుగుజిలుగుల ఫర్‌ చెట్లూ, వాటి చెంతనే కానుకల్ని పంచే శాంటాక్లాజ్‌లూ...

Updated : 25 Dec 2022 03:33 IST

ఏసునాథుని జన్మదినం... మానవాళికి మహోదయం!

కరుణామయుడి జన్మదినం... ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మందికి సంబరం. పవిత్రస్థలాల్లో ప్రార్థనలూ, మంద్రంగా వినిపించే చర్చి గంటలూ, దేదీప్యమానంగా వెలిగే కొవ్వొత్తులూ, ఇంటింటా మెరిసే నక్షత్రకాంతులూ, విద్యుద్దీపాలంకరణలూ, చవులూరించే ప్లమ్‌ కేకులూ పుడ్డింగులూ, వెలుగుజిలుగుల ఫర్‌ చెట్లూ, వాటి చెంతనే కానుకల్ని పంచే శాంటాక్లాజ్‌లూ... క్రిస్మస్‌ పండగంటేనే ఆనందోత్సాహాలు మేళవించిన అతిపెద్ద ఉత్సవం!


క్రిస్మస్‌ పండుగ!

సుక్రీస్తు పుట్టినరోజే క్రిస్మస్‌ పండగ అనీ ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా వేడుకలు చేసుకుంటారనీ తెలిసిందే. కానీ ఈ పండుగకి మూలం పూర్వం రోమన్లు జరుపుకునే ‘శాటర్నాలియా’ పండుగట. చలికి కాంతిని కోల్పోయిన సూర్యుడిని మళ్లీ బలం పుంజుకుని రమ్మని వేడుకుంటూ ఆ రోజునే పండగ చేసుకునేవారట. క్రీ.శ.350వ సంవత్సరంలో రోమ్‌ బిషప్‌ అయిన పోప్‌ జూలియస్‌ డిసెంబర్‌ 25ని క్రిస్మస్‌ పర్వదినంగా ప్రకటించాడు. ఆ రోజు నుంచి ఈ వేడుకలను జనవరి 5 వరకూ అంటే 12 రోజులపాటు జరుపుకుంటే; జులియన్‌ క్యాలెండర్‌ను అనుసరించే దేశాల్లో మాత్రం జనవరి 7 నుంచి 19 వరకూ పండుగ చేసుకుంటారట. నిజానికి జీసస్‌ జన్మదినం గురించి బైబిల్‌లో కచ్చితమైన సమాచారం లేదు. కానీ క్రైస్తవులంతా ఈ రోజును పవిత్రమైనదిగా భావించి ఇంట్లో క్రిస్మస్‌ ట్రీని అలంకరించడం, కేరల్స్‌ పాడటం, చర్చ్‌కి వెళ్లి బైబిల్‌ చదవడంతోపాటు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా గడుపుతారు. ఆ రోజున దేవుడి రూపాలైన పిల్లలకు కానుకలు ఇవ్వడం మంచిదిగా భావిస్తారు. అందుకే ‘కానుకలు లేందే క్రిస్మస్‌ లేదు’ అంటారు.


ఎక్కడెక్కడ..!

క్రిస్మస్‌ను అందరికన్నా బాగా ఫిలిప్పీన్స్‌ వాసులు సుమారు నాలుగు నెలలపాటు జరుపుకుంటారట. సెప్టెంబరు ఒకటిన మొదలైన వేడుకలు జనవరి 6న ఎపిఫనీ(బాల ఏసుని చూసేందుకు ముగ్గురు తూర్పుదేశపు జ్ఞానులు కానుకలు మూట కట్టుకుని, ప్రకాశిస్తున్న నక్షత్రాన్ని చూస్తూ బెత్లెహాంకి చేరుకునే రోజు)వరకూ కొనసాగుతాయి. బ్రిటన్‌వాళ్లకి టర్కీ(గిన్నెకోడి) లేకుండా క్రిస్మస్‌ పూర్తి కాదు. ఆ కోడి కూరని తినేసి అందులో వై ఆకారంలో ఉండే విష్‌బోన్‌ను బయటకు తీసి, దాన్ని అటొకరూ ఇటొకరూ పట్టుకుని గట్టిగా లాగితే, అది విరిగి ఎవరి చేతిలోకి పెద్ద ఎముక వస్తే వాళ్ల కోరికలు తీరతాయన్నది వాళ్ల నమ్మకమట. బెత్లెహాం నగరానికి చేరుకున్న క్రీస్తు తల్లితండ్రులు కాసింత చోటుకోసం ప్రతి గడపా తొక్కి ఎవరూ ఆశ్రయం ఇవ్వకపోవడంతో చివరకు పశువుల కొట్టంలో తలదాచుకున్న దృశ్యాన్ని చూడాలంటే మెక్సికోకి వెళ్లాల్సిందే. ఆ రోజున వాళ్లు బృందాలుగా ఏర్పడి ఇల్లిల్లూ తిరుగుతారు. బొలీవియాలో అర్ధరాత్రివేళ కోడిపుంజులను తీసుకొచ్చి అరిపిస్తారు. క్రీస్తు జననం ప్రపంచానికి మొదటగా తెలిసింది కోడికూత వల్లేనన్నది వాళ్ల నమ్మకం. ఇలా ఒక్కోచోట ఒక్కో రకమైన సంప్రదాయాన్ని పాటిస్తూ జరుపుకునే వేడుకే క్రిస్మస్‌.


పవిత్రగ్రంథం!

క్రైస్తవులు బైబిల్‌ పఠనంతోనే క్రీస్తుని ప్రార్థిస్తారు. పరిశుద్ధాత్మకు ప్రతినిధులుగా చెప్పే 40 మంది రచయితలు బైబిల్‌ సృష్టికర్తలు. ఇది మొత్తం 66 పుస్తకాలుగా ఉంటుంది. అందులో 39 పుస్తకాలను ఓల్డ్‌ టెస్టమెంట్‌ అనీ 27 పుస్తకాలను న్యూ టెస్టమెంట్‌ అనీ అంటారు. మొదటి ఐదు పుస్తకాలనూ మోజెస్‌ రాశాడు. అందుకే ఆయన్ని బైబిల్‌కి ఆద్యుడుగా పేర్కొంటారు. క్రీ.పూ. 1450 నుంచి క్రీ.శ. 100 సంవత్సరం వరకూ... అంటే జీసస్‌ పుట్టి కనుమూసి మళ్లీ పునర్జీవించేవరకూ ఇందులో ఉంటుంది. ముద్రణ యంత్రం కనుగొన్నాక అచ్చయిన తొలి గ్రంథం బైబిలే. ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా భాషల్లోకి అనువదించబడి, నిమిషానికి 50 పుస్తకాల చొప్పున అమ్ముడుపోవడంతోపాటు అత్యధికంగా దొంగిలించబడే గ్రంథం కూడా ఇదే!


క్రిస్మస్‌ చెట్టు!

క్రిస్మస్‌కి మారుపేరు అనేంతగా క్రిస్మస్‌ ట్రీ(ఫర్‌ లేదా పైన్‌ చెట్టు)రూపం స్థిరపడిపోయింది. చిన్నదో పెద్దదో ఓ చెట్టుని అలంకరించే సంప్రదాయం అంతటా వేళ్లూనుకుంది. అయితే మంచుతో మోడుబారిన చెట్లన్నీ మళ్లీ వసంతంలో చిగురిస్తాయన్నది స్ఫురించేలా ఇంట్లో పచ్చని చెట్టుని పెట్టడం ప్రాచీన ఈజిప్షియన్లూ రోమన్ల కాలం నుంచీ ఉందట. మొదట్లో క్రిస్మస్‌ చెట్టుని ఆడమ్‌, ఈవ్‌లకు గుర్తుగా ఆపిల్స్‌తోనే అలంకరించేవారు. క్రమంగా ఆ చెట్టు కొమ్మలన్నీ చర్చి గంటలూ రంగుల బెలూన్లూ గుండ్రని బంతులూ గ్రీటింగ్‌ కార్డులూ దీప తోరణాలతో అందంగా ముస్తాబవుతున్నాయి. పోలాండ్‌లోనూ ఉక్రెయిన్‌లోనూ క్రిస్మస్‌ చెట్టు అలంకరణలో సాలెగూళ్లు తప్పక కనిపిస్తాయి. అమ్మ పొత్తిళ్లలో కళ్లు తెరిచిన జీసస్‌కి చలి వేయకుండా సాలెగూళ్లే దుప్పటిలా అల్లుకున్నాయట. అందుకే వాళ్లు వాటిని మంచికి సంకేతంగా భావిస్తారు. ఈ చెట్టు చుట్టూ కానుకలూ తప్పనిసరిగా కనిపిస్తాయి.


క్రిస్మస్‌ తాత!

ధ్రువపు జింకల బండిమీద ప్రపంచమంతా తిరుగుతూ కానుకలు పంచే క్రిస్మస్‌ తాత లేని క్రిస్మస్‌ని ఊహించలేం. ఆనందానికీ ఆత్మీయతకీ ప్రతిరూపమైన శాంటా ఊహల్లోని పాత్రే అయినప్పటికీ శాంటాక్లాజ్‌ కోసం ఎదురు చూడని ఇల్లు ఉండదు. భుజాన సంచీతో క్రిస్మస్‌ చెట్టు కింద నిలబడి పిల్లాపాపల్ని పలకరిస్తూ కానుకలతో ముంచెత్తుతాడనేది క్రైస్తవుల విశ్వాసం. అయితే శాంటా పుట్టుక వెనక పెద్ద కథే ఉంది. నాలుగో శతాబ్దంలో టర్కీలోని మైరా ప్రాంతానికి చెందిన బిషప్‌ సెయింట్‌ నికోలస్‌ దయార్ద్ర హృదయుడు. నిత్యం పేదలకు అన్నం పెట్టడం, తన దగ్గరకు వచ్చిన పిల్లలకు కానుకలు ఇవ్వడం చేసేవాడు. ఓసారి కూతుళ్ల పెళ్లిచేయలేక బాధపడుతోన్న వ్యక్తికి సాక్సుల నిండా బంగారాన్ని నింపి వాళ్లింట్లో జారవిడిచాడట సెయింట్‌ నికోలస్‌. అందుకే ఆయన్నో దివ్య వ్యక్తిగా ఆరాధిస్తూ డిసెంబరు 6న ప్రీస్ట్‌ డే ఉత్సవాన్ని నిర్వహిస్తూ పిల్లలకు బహుమతులు పంచేవారట. ఆయన్ని ‘ఫాదర్‌ ఆఫ్‌ క్రిస్మస్‌’గా భావించి, ఆ పండగకి పిల్లలకు బహుమతులు ఇచ్చే సంప్రదాయం వచ్చింది. ఆ విధంగా క్రిస్మస్‌కి ముందురోజు పిల్లలు బహుమతులకోసం పాతసాక్సుని ఇంటిబయట ఉంచే ఆచారం హాలెండ్‌లో ఆరంభమైంది. సెయింట్‌ నికోలస్‌నే డచ్‌ వాళ్లు సింటర్‌ క్లాస్‌ అని పిలిచేవారు. అదే అమెరికన్‌ ఉచ్చారణలో శాంటా క్లాజ్‌గా మారింది. ఆయనకు క్రిస్మస్‌ తాత రూపాన్ని కల్పించిందీ అమెరికన్లే. పండుగడ్డం, గుబురు మీసాలు, కానుకల మూటలతో నిండుగా కనిపించే వృద్ధుడి చిత్రాన్ని థామస్‌ నాస్ట్‌ అనే కార్టూనిస్ట్‌
ఓ కవిత ఆధారంగా గీసి, హార్పర్స్‌ వీక్లీలో ప్రచురించాడు. అలా సెయింట్‌ నిక్‌ పిల్లల పట్ల చూపిన ప్రేమాభిమానాల్ని ఆధారంగా చేసుకుని ఆయన్ని ఊహిస్తూ గీసిన ఆ కార్టూనే శాంటాక్లాజ్‌గా అవతారమెత్తింది.


శాంటాక్లాజ్‌ గ్రామం...

క్రిస్మస్‌ తాత కాల్పనిక పాత్రే అయినప్పటికీ ఆయన ఉత్తర ధ్రువంలో ఉంటాడనీ అక్కడి జింకలతో కట్టిన బండిమీద తిరుగుతుంటాడనీ చెప్పే కథల్లోంచి వెలిసిందే శాంటాక్లాజ్‌ విలేజ్‌. ఆరునెలలపాటు మంచుతో నిండిన ఫిన్లాండ్‌లోని ల్యాప్‌ల్యాండ్‌లో ఉన్న రొవానియెమి శాంటా అధికారిక నివాసం. అయితే ఆయన అసలు ఊరు అక్కడికి 200 మైళ్ల దూరంలోని ‘ఇయర్‌ మౌంటెయిన్‌’ అనీ అది రహస్య ప్రదేశమనీ ఫిన్లాండ్‌ వాసుల నమ్మకం. అక్కడికెవరూ రాలేరు కాబట్టి రొవానియెమి తన స్వస్థలంగా చేసుకున్నానని శాంటాక్లాజ్‌ చెప్పాడంటూ అమ్యూజ్‌మెంట్‌ పార్కు తరహాలో ఓ గ్రామాన్ని నిర్మించి, 1985లో ప్రారంభించారు స్థానికులు. అప్పటినుంచీ ఆయన్ని చూడ్డానికి లక్షలాదిమంది ఆ ప్రాంతాన్ని సందర్శించి, ఆ వేషధారణలో ఉన్న శాంటాతో కబుర్లు చెప్పి ఫొటోలు తీయించుకుంటారు. ధ్రువపుజింకలూ హస్కీలూ కాల్పనిక పాత్రలైన ఎల్ఫ్‌లూ వచ్చిపోయే పర్యటకులతో నిత్యం సందడిగా ఉంటుందీ గ్రామం.


విశేషాలు!

కొన్ని ప్రాంతాల్లో క్రీస్తు పుట్టిన స్థలంగా భావించే పశువుల చావిడిని ప్రతిబింబించే నేటివిటీ సీన్‌ని బొమ్మలతో ఇంట్లోనే ఏర్పాటుచేస్తారు. తూర్పుదేశాల్లోని సంప్రదాయ చర్చ్‌ రీతుల్ని ఆచరించే క్రైస్తవులు క్రిస్మస్‌కు ముందు 40 రోజులపాటు ‘నేటివిటీ ఫాస్ట్‌’ పేరుతో ఉపవాస దీక్ష చేస్తారు.

* క్రిస్మస్‌కి ప్రతి పదిమందికీ ఒకరు తప్పక బహుమతిని అందుకుంటారట.

* ఏటా 300 కోట్ల క్రిస్మస్‌ కార్డుల్ని ఒక్క అమెరికన్లే పంచుకుంటారు. క్రిస్మస్‌ కోసం అందరికన్నా ఎక్కువ ఖర్చుపెట్టేది ఐర్లాండ్‌లోనేనట. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అమ్మకాలు జరిగే ఏకైక సీజన్‌ క్రిస్‌మస్‌.

* యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కి చెందిన అబుదాబిలోని ఎమిరేట్స్‌ ప్యాలెస్‌లో వజ్రాలు, పచ్చలు, నీలాలతో అలంకరించిన క్రిస్మస్‌ చెట్టు విలువ సుమారు 95 కోట్ల రూపాయలు కాగా, స్పెయిన్‌, కెంపిస్కీ హోటల్‌లోని చెట్టు అలంకరణకైతే 124 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారట.

* థామస్‌ అల్వా ఎడిసన్‌ విద్యుద్దీపాన్ని కనుగొనడంతో 1882లో న్యూయార్క్‌లో క్రిస్మస్‌ వృక్షాన్ని కరెంటు బల్బులతో తొలిసారిగా అలంకరించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..