మా డార్లింగ్‌ బంగారం!

డార్లింగ్‌ అంటూ ప్రతి ఒక్కరినీ ప్రేమగా పిలుస్తుంటాడు ప్రభాస్‌. తోటి నటీనటులతో కలివిడిగా ఉంటూ.. అడిగి మరీ విందు భోజనాలు పెడుతూ అందరివాడు అయ్యాడు.

Updated : 23 Jun 2024 06:56 IST

డార్లింగ్‌ అంటూ ప్రతి ఒక్కరినీ ప్రేమగా పిలుస్తుంటాడు ప్రభాస్‌. తోటి నటీనటులతో కలివిడిగా ఉంటూ.. అడిగి మరీ విందు భోజనాలు పెడుతూ అందరివాడు అయ్యాడు. ‘కల్కి’లో బుజ్జితో కలిసి సందడి చేయబోతున్న ప్రభాస్‌ గురించి ఎవరేం చెప్పారంటే...


నన్ను నమ్మాడు

- ప్రశాంత్‌నీల్‌

ప్రభాస్‌ మొదటి సినిమా ‘వర్షం’ అప్పట్నుంచీ తనంటే నాకు చాలా ఇష్టం. ‘మిర్చి’, ‘బాహుబలి’లో నటన గురించి మాటల్లో చెప్పలేను. తన లుక్‌ అమాయకంగా ఉంటుంది గానీ పాత్రకు తగ్గట్టు తను పలికించే హావభావాలు చాలా బాగుంటాయి. తనతో కలిసి పనిచేయడం అద్భుతం. నన్ను చాలా నమ్మాడు. ‘సలార్‌’ షూటింగ్‌ సమయంలో ‘ఫైట్‌ సీన్‌ ఎప్పుడుంటుంది, సినిమా పాటలు ఏంటీ...’ అని ఎప్పుడూ ముందు అడిగేవాడు కాదు. రేపు ఫలానా షూట్‌ అంటే దానికి తగ్గట్టు ప్రిపేర్‌ అయ్యేవాడు. దర్శకుడి అంచనాలకు మించి నటిస్తాడు. తన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... నటన కోసమే పుట్టాడు అనిపిస్తుంటుంది.


ప్రేమతత్వం తనది

- జగపతి బాబు

ప్రభాస్‌తో కలిసి ‘సలార్‌’, ‘రాధేశ్యామ్‌’లో నటించడం నాకో మంచి అనుభవం. తను ఎవరినైనా సొంత కుటుంబ సభ్యుడిలా ప్రేమగా ఆదరిస్తాడు. ఇవ్వడమేకానీ.. అడగడం తెలియదు తనకి. వ్యక్తిగతంగా ప్రభాస్‌తో నాకో అనుభవం ఉంది. ఒకసారి డిప్రెషన్‌లో ఉండి ప్రభాస్‌కు ఫోన్‌ చేసి మాట్లాడాలని అడిగా. తను జార్జియాలో ఉన్నాడప్పుడు. నా గొంతు విని ‘డార్లింగ్‌.. నేనున్నా కదా! నీ సమస్య ఏంటో చెప్పు.. నేను తీరుస్తా’ అని ధైర్యం చెప్పాడు. అంతేకాదు, ఇండియా రాగానే నన్ను కలిసి, నాతో మాట్లాడాడు. ఆ సమయంలో తన ఓదార్పు నాకెంతో ఊరటనిచ్చింది.


నిలువెత్తు బంగారం

- అల్లు అర్జున్‌

నేను మా కుటుంబంలోని హీరోలకి అభిమానిని. ఈ పరిధులు దాటి బయటకు వస్తే ప్రభాస్‌కి వీరాభిమానిని. ఫ్రెండ్‌ అనీ, తోటి నటుడనీ నేను ఆ మాట చెప్పను. తనది చాలా చాలా మంచి వ్యక్తిత్వం. తనలో ఉన్న మంచి క్వాలిటీస్‌ అన్నీ ఇన్నీ కావు. చేతనైతే ఎవరికైనా సాయం చేయాలనే చూస్తాడు. అందంగా ఉంటాడు. ఫైట్స్‌, డాన్స్‌ బాగా చేస్తాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు. ‘బాహుబలి’ కోసం చాలా సమయం కేటాయించాడు. మధ్యలో ఎన్ని ప్రాజెక్టులు వచ్చినా వాటిని వదులుకున్నాడు తప్ప ఏ రోజూ బాధ పడలేదు. కష్టపడి పనిచేయడంతోపాటు వర్క్‌ని ఎంతగానో ప్రేమించే ప్రభాస్‌ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే... తను ఆరడుగుల బంగారం.


అదే తన ప్రత్యేకత

- అనుష్క

బహుశా ప్రభాస్‌తో ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోయిన్‌ని నేనే. ‘బిల్లా’, ‘మిర్చి’, బాహుబలి’ సినిమాల్లో నటించి సూపర్‌ హిట్‌ జోడీ అనిపించుకున్నాం. ఈ క్రమంలో మా ఇద్దరి మధ్యా మంచి స్నేహం ఏర్పడింది. తన కుటుంబానికెంత విలువ ఇస్తాడో... స్నేహానికీ అంతే ప్రాధాన్యమిస్తాడు.ఎప్పుడూ నలుగురి మంచి కోరుకునే వ్యక్తిత్వం తనది.
ఎవరికైనా కష్టమంటే వెంటనే స్పందిస్తాడు. ప్రభాస్‌ మంచి ఫుడీ. తనెలా ఇష్టంగా రకరకాల ఆహారపదార్థాలు కోరుకుంటాడో... సెట్‌లో వాళ్లకి కూడా అంతే ప్రేమగా తినిపిస్తుంటాడు. అంతేకాదు, తోటినటీనటుల ఇష్టాయిష్టాలు తెలుసుకుని మరీ క్యారియర్లు సిద్ధం చేయించడం ప్రభాస్‌ ప్రత్యేకత.


జోకులూ పంచ్‌లూ...

ప్రభాస్‌తో నా ప్రయాణం సుదీర్ఘమైందనే చెప్పాలి. ‘మిర్చి’, ‘బాహుబలి’(రెండు పార్ట్‌లు), ‘రాధేశ్యామ్‌’(హిందీ).. సినిమాల్లో తనతో కలిసి నటించా. వయసులో నాకంటే చిన్నవాడైనా మంచి స్నేహితుడనే చెబుతా. తనతో ఎంతసేపు మాట్లాడినా ఇంకా మాట్లాడాలనే అనిపిస్తుంది. తనతో కాసేపు ఉంటే ఎవరైనా చిన్న పిల్లలు అయిపోతారు. ‘బాహుబలి’ సెట్‌లోనే ప్రభాస్‌తో ఎక్కువ సమయం గడిపా. తను స్పాంటేనియస్‌గా జోకులూ, పంచ్‌లూ వేస్తాడు. నాదీ అదే తీరు. ఇద్దరం కలిశామంటే జోకులు వేసుకుంటూ తెగ నవ్వుకునే వాళ్లం. మా ఇద్దర్నీ చూసి రాజమౌళి తలపట్టేసుకునేవారు. ‘అసలే సీరియస్‌ సీన్‌ ఉంది. మీ ఇద్దరూ ఇలా నవ్వుకుంటే ఎలా’ అనేవారు. మేమిద్దరం అలా సరదా సరదాగా ఉంటూనే, కెమెరా ముందుకురాగానే పాత్రల్లో లీనమయ్యేవాళ్లం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..