వాచీ విలాసం!

కొందరు సెలెబ్రిటీలు ధర ఎంతని చూడకుండా బ్రాండెడ్‌ దుస్తులూ, కార్లూ కొంటుంటారు. మరికొందరు తమ దగ్గర ఎన్ని వాచీలున్నా... మార్కెట్‌లోకి కొత్త వాచీ రావడం ఆలస్యం మళ్లీ కొనేస్తుంటారు. మరి మన సినిమా తారల దగ్గర ఎంత ఖరీదైన వాచీలున్నాయో చూద్దామా!

Updated : 17 Jul 2022 04:53 IST

వాచీ విలాసం!

కొందరు సెలెబ్రిటీలు ధర ఎంతని చూడకుండా బ్రాండెడ్‌ దుస్తులూ, కార్లూ కొంటుంటారు. మరికొందరు తమ దగ్గర ఎన్ని వాచీలున్నా... మార్కెట్‌లోకి కొత్త వాచీ రావడం ఆలస్యం మళ్లీ కొనేస్తుంటారు. మరి మన సినిమా తారల దగ్గర ఎంత ఖరీదైన వాచీలున్నాయో చూద్దామా!


ఆ వాచీ ప్రత్యేకం...

రామ్‌చరణ్‌-శంకర్‌ కలయికలో ఈ మధ్య ఓ సినిమాకి కొబ్బరికాయ కొట్టారు. ఆ సందర్భంగా రామ్‌చరణ్‌ ధరించిన రిచర్డ్‌ మిల్‌ ఆర్‌61-01 సిరీస్‌కి చెందిన యోహన్‌ బ్లేక్‌ మోడల్‌ వాచీ గురించి చాలామంది చర్చించుకున్నారు. ఎందుకంటే 2012-ఒలింపిక్స్‌లో 100, 200మీటర్ల పరుగు పందెంలో రజతం సాధించిన జమైకన్‌ అథ్లెట్‌ యోహన్‌ బ్లేక్‌ కోసం రిచర్డ్‌ మిల్‌ సంస్థ ఆ వాచీని ప్రత్యేకంగా డిజైన్‌ చేసింది. నీళ్లలో మునిగినా, పై నుంచి కింద పడ్డా చెక్కు చెదరకపోవడంతోపాటు మరెన్నో ప్రత్యేకతలున్నాయి. అందుకే మన కరెన్సీ ప్రకారం రూ.1.2 కోట్ల ధర పలికినా రామ్‌చరణ్‌ దీనిపై మనసు పడ్డాడు. అలాగే రూ.13 లక్షల విలువ చేసే రోలెక్స్‌వాచీల దగ్గర్నుంచీ కోటికిపైనే విలువ చేసే అంతర్జాతీయ బ్రాండెడ్‌ గడియారాలెన్నో రామ్‌చరణ్‌ వద్ద ఉన్నాయి.


బహుమతులుగా...

విఘ్నేశ్‌ శివన్‌ను పెళ్లాడి కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన నయనతారకు వాచీలు సేకరించడం హాబీ. వాచీల కోసం ప్రత్యేకంగా వార్డ్‌రోబ్‌ను కేటాయించిన నయన్‌ రిచర్డ్‌ మిల్‌ కంపెనీకి చెందిన ఆర్‌ఎమ్‌11 సిరీస్‌ వాచీని ఎక్కువగా ధరిస్తుంటుంది. డైమండ్లు పొదిగి.. ప్లాటినం కోటింగ్‌తో డిజైన్‌ చేసిన ఈ వాచీ ధర దాదాపుగా రూ.1.2 కోట్లు. వాచీలు తనకోసం కొనే విషయంలోనే కాదు... ఇతరులకు బహుమతిగా ఇచ్చేటప్పుడు కూడా నయన్‌ ఏ మాత్రం ఆలోచించకుండా ఖరీదైన వాచీలనే ఎంచుకుంటుంది. అలానే తాను నటిస్తున్న సినిమా షూటింగ్‌ పూర్తయ్యాక అందుకోసం పనిచేసిన వారికీ, తన వ్యక్తిగత సిబ్బందికీ వాచీలనే బహూకరిస్తుంటుంది. అవంటే అంత ఇష్టం నయన్‌కి.


అవే ధరిస్తాడు...

ఖరీదైన కార్లు కొనుగోలు చేయడానికి... వాటికి ఎంతడబ్బు అయినా వెచ్చించడానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎప్పుడూ ముందుంటాడు. వాటితోపాటు లగ్జరీ వాచీలు కూడా ధరించడానికి ఇష్టపడే యంగ్‌టైగర్‌ అందుకోసం కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడడు. ఆ మధ్య రిచర్డ్‌ మిల్‌ బ్రాండ్‌కు చెందిన సుమారు నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే వాచీని ధరించి ఎన్టీఆర్‌ వార్తల్లో నిలిచాడు. దాంతోపాటు అదే కంపెనీకి చెందిన ఆర్‌.ఎమ్‌ 11-03 సిరీస్‌కి చెందిన వాచీ కూడా ఎన్టీఆర్‌ వద్ద ఉంది. దాని ధర ట్యాక్స్‌తో కలిపి కోటిన్నర నుంచి రెండున్నర కోట్ల వరకూ ఉంటుంది. గడియారాలను ఎంతో ఇష్టపడే ఎన్టీఆర్‌ విదేశాల్లో షాపింగ్‌ చేస్తే మాత్రం ఒకటో రెండో బ్రాండెడ్‌ వాచీలను కొనకుండా అక్కడి నుంచి కదలడు.


తెరపైన తగ్గేదేలే!

టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకునే హీరోల జాబితాలో మహేశ్‌బాబుది స్థిరమైన స్థానం. సినిమాలూ కుటుంబమే ప్రపంచంగా ఉండే మహేశ్‌బాబు ఎక్కడైనా క్వాలిటీ సమయాన్నే కేటాయించాలనుకుంటాడు. అందుకే ‘లివ్‌ ఇన్‌ ద మూమెంట్‌’ అనే సిద్ధాంతాన్ని నమ్మడంతోపాటు మాటిమాటికీ టైమ్‌ చూసుకోవడం ఎందుకని వాచీలు పెట్టుకోవడం మానేశాడు. అయితే సినిమాల్లో మాత్రం స్టైలిష్‌ లుక్‌కి తగ్గట్టు, డ్రెస్‌కి మ్యాచయ్యే రకరకాల బ్రాండెడ్‌ వాచీలు ధరిస్తుంటాడు. రూ.7వేలు ధర ఉండే క్యాసియో కంపెనీ వాచీల నుంచీ కోటిరూపాయల విలువ చేసే బ్రెగె మరైన్‌ క్రోనో ప్లాటినం వాచీల వరకూ విలాసవంతమైన వాటినే కొనుగోలు చేసే మహేశ్‌ విదేశాలకు వెళితే  గడియారాలతోనే తిరిగొస్తుంటాడు.


ఎప్పటికప్పుడు మారుస్తూ...

క్యారెక్టర్‌  ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన మలయాళ నటుడు మోహన్‌లాల్‌... ప్రపంచంలోని లగ్జరీ బ్రాండెడ్‌ వాచీలను వాడటంలో ముందుంటాడు. బంగారం, ప్లాటినం వాడి... వజ్రాలను పొదిగి, ఆధునిక సాంకేతిక టెక్నాలజీని జోడించి తయారు చేసిన వాచీలనే మోహన్‌లాల్‌ కొంటుంటాడు. కోట్ల విలువ చేసే రిచర్డ్‌ మిల్‌ వాచీతో తెరపైన ఎక్కువ కనిపించే మోహన్‌లాల్‌ వద్ద ఫాటెక్‌ ఫలిప్‌, బ్రెగె, రోలెక్స్‌ యాట్‌ మాస్టర్‌, మాంట్‌బ్లాంక్‌, అడమర్స్‌ పైగ వంటి అత్యంత ఖరీదైన బ్రాండెడ్‌ వాచీలే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు, ఆధునికతకు తగ్గట్టు ఎప్పటికప్పుడు  కొత్త రకం వాచీని ఎంపిక చేసుకుంటాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..