ప్యాకెట్లలో కొబ్బరి నీళ్లు..!

అది తాగితే... దాహం తీరుతుంది. వేడెక్కిన శరీరం చల్లబడుతుంది. కొత్త శక్తి వస్తుంది. అందుకే  కొబ్బరిబోండాం ప్యాకింగు చొక్కాలేసుకుని కోకోనట్‌ వాటర్‌ రూపంలో ఓ సూపర్‌ డ్రింక్‌గా ఇప్పుడు మార్కెట్‌లో దొరుకుతోంది. అవునండీ... కొబ్బరినీళ్లనీ శీతలపానీయాల్లానే రకరకాల ప్యాకింగుల్లోనూ

Updated : 03 Apr 2022 03:23 IST

ప్యాకెట్లలో కొబ్బరి నీళ్లు..!

అది తాగితే... దాహం తీరుతుంది. వేడెక్కిన శరీరం చల్లబడుతుంది. కొత్త శక్తి వస్తుంది. అందుకే  కొబ్బరిబోండాం ప్యాకింగు చొక్కాలేసుకుని కోకోనట్‌ వాటర్‌ రూపంలో ఓ సూపర్‌ డ్రింక్‌గా ఇప్పుడు మార్కెట్‌లో దొరుకుతోంది. అవునండీ... కొబ్బరినీళ్లనీ శీతలపానీయాల్లానే రకరకాల ప్యాకింగుల్లోనూ బాటిల్స్‌లోనూ అమ్మేస్తున్నారు. దాంతో ఒక్క వేసవి అనేకాదు, ఏడాదిపొడవునా  ఆ నీళ్లని చల్లచల్లగా తాగేస్తున్నారు.

చెరకురసంలా తియ్యగా ఉంటుందా,  పోనీ మామిడి రసంలా చవులూరిస్తుందా అంటే... కాదనే చెప్పాలి. అయినా వేసవి వచ్చిందంటే చాలు, కొబ్బరిబోండాం బండి ఎక్కడ కనబడితే అక్కడ ఆగిపోతుంటాం... ఎందుకంటే అది అద్భుత పోషకాల భాండాగారం... ఆ నీళ్లు అమృతతుల్యం. ఈ విషయం ఆనోటా ఈనోటా ప్రపంచమంతటికీ తెలిసినట్లుంది. దాంతో తాజాగా తాగే కొబ్బరినీళ్లని నెలల తరబడి నిల్వ చేస్తుంటే, అంతే ఇష్టంగా వాటిని తాగేస్తున్నారు. అందుకే ప్రస్తుతం సుమారు 42 వేల కోట్లు ఉన్న కొబ్బరినీళ్ల మార్కెట్‌, మరో ఐదేళ్లకి లక్ష కోట్ల రూపాయలకు చేరుతుందని ఓ అంచనా. శీతలపానీయాలవల్ల ఊబకాయం, గుండెజబ్బులు, మధుమేహం... వంటి సమస్యలు తలెత్తవచ్చని వాటికి బదులు కొబ్బరినీళ్లు తాగడమే ఉత్తమంగా భావిస్తున్నారందరూ.

రకాలెన్నో..!
భారత్‌తోపాటు థాయ్‌ల్యాండ్‌, ఫిలిప్పీన్స్‌, మలేషియా, ఫిజి, శ్రీలంక... వంటి దేశాలూ కొబ్బరితోటలకు పెట్టింది పేరే. చెట్టు పరంగా పొట్టి, పొడవు అని రెండు రకాలుంటే, వాటిల్లో మళ్లీ అనేక రకాలున్నాయి. అదే కాయ రంగుని బట్టి ఎరుపూ పసుపూ ఆకుపచ్చా అని మూడు రకాలు. అన్నింటిలోనూ శ్రీలంకకి చెందిన రెడ్‌ డ్వార్ఫ్‌ రకం నీళ్లలో పోషకాల శాతం ఎక్కువట. ఇందులోని కొబ్బరి స్పాంజిలా మెత్తగా ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధంలో సెలైన్‌ బాటిల్స్‌ దొరకక ఈ నీళ్లనే ఎక్కించారనీ ఇవి శరీరానికి తక్షణ శక్తినిస్తాయనీ అక్కడి వైద్యులు చెబుతారు. అందుకే ఇప్పుడు అనేక దేశాల్లో ఈ రకాన్ని పండిస్తున్నారు. కొబ్బరినీళ్లలో సూక్ష్మజీవులేవీ ఉండవు కాబట్టి సహజ స్టెరిలైజ్‌డ్‌ మినరల్‌ వాటర్‌గానూ పిలుస్తారు.ఇవి వెంటనే రక్తంలో కలిసిపోతాయి.
అయితే బోండాం కాయగా పెరిగేకొద్దీ అందులోని ఫ్యాటీఆమ్లాల శాతం మారుతుంది. అందుకే ఆయుర్వేద నిపుణులు కొబ్బరికాయని బాల, మధ్య, పక్వ అని మూడు దశలుగా విభజించారు. బాల కొబ్బరిబోండాంలో 90-95 శాతం నీరు ఉంటుంది. ఒంటిని చల్లబరిచే గుణాలు ఇందులోనే ఎక్కువ. ఈ నీళ్లు జీర్ణ వ్యవస్థకి మేలు. ఇందులోని తీపి గుణం ప్రాణాపాయం నుంచీ రక్షిస్తుందట. కాస్త లేత కొబ్బరి కట్టినదే మధ్య వయసు బోండాం. ఈ నీళ్లలో పోషకాల శాతం ఎక్కువ. పిండి పదార్థాలు, ఖనిజాలు, ఫాస్ఫరస్‌, ఎ, బి, సి-విటమిన్‌లు మిగిలిన రెండింటిలోకన్నా ఎక్కువ. కొబ్బరి బాగా కట్టినదే పక్వ దశ. జీర్ణశక్తి లేనివాళ్లు ఈ దశలోని కొబ్బరిని ఎక్కువగా తినకూడదని చెబుతారు. అందుకే మూడింటిలోకీ లేత, మధ్య వయసు బోండాలే శరీరంలోని ఏడు రకాల కణజాలాల పెరుగుదలకీ పనితీరుకీ తోడ్పడతాయని చరకసంహిత సైతం పేర్కొంటోంది.

ఉపయోగాలెన్నో!
కాస్త తీపీ వగరూ కలిసినట్లుండే కొబ్బరినీళ్ల రుచి అందరికీ నచ్చదు. కానీ ఖనిజాలూ విటమిన్లూ చక్కెరలూ ప్రొటీన్లూ అమైనోఆమ్లాలూ యాంటీఆక్సిడెంట్లూ... ఇలా ఎన్నో పోషకాలు ఉండటంతో మంచి స్పోర్ట్స్‌ డ్రింక్‌గా వీటిని తాగుతున్నారు. ఎలక్ట్రోలైట్లూ ఉండటం వల్ల అథ్లెట్లకీ క్రీడాకారులకీ యోగా, వ్యాయామం చేసేవాళ్లకీ ఇతరత్రా ఎనర్జీ డ్రింకులకన్నా ఇవి ఎంతో మేలు. ఆల్కహాల్‌ వల్ల కలిగిన డీహైడ్రేషన్‌నీ తలనొప్పినీ వికారాన్నీ తగ్గిస్తాయి. అందుకే హ్యాంగోవర్‌కి కోకోనట్‌ వాటర్‌ మంచి మెడిసిన్‌. కొబ్బరినీళ్లు శరీరంలోని టాక్సిన్లను తొలగించి, చర్మం నిగారింపునీ పెంచుతాయి.
కొబ్బరినీళ్లలోని షికిమిక్‌, కెఫియాక్‌ ఆమ్లాలు మంచి యాంటీఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించి కాలేయ ఆరోగ్యాన్ని పెంచడంతోపాటు కిడ్నీల్లో రాళ్లు రాకుండా చేస్తాయి. లేత కొబ్బరినీళ్లు ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ వృద్ధికీ తోడ్పడతాయి. మెనోపాజ్‌ సమయంలో వీటిని తాగడంవల్ల ఆల్జీమర్స్‌ రాదట. అలాగే కొబ్బరినీళ్లలోని ఔషధ గుణాలు వ్యాధికారక సూక్ష్మజీవుల్ని నాశనం చేస్తాయి. గ్యాస్ట్రో ఎంటరైటిస్‌ వ్యాధితో బాధపడేవాళ్లకీ ఇవి మేలే. కొబ్బరినీళ్లు జీర్ణకోశాన్నీ మూత్రపిండాల్నీ మూత్రకోశాల్నీ శుభ్రపరుస్తాయనీ వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయనీ ఆయుర్వేదం చెబుతోంది. కొబ్బరినీళ్లలో రెండు చుక్కల నిమ్మరసం పిండుకుని తాగితే ఆకలి పెరుగుతుందట. జ్వరం, తలనొప్పి, విరేచనాలు, పేగుపూత, వేడిపొక్కులు....వంటివాటికి కొబ్బరినీళ్లు మంచి పరిష్కారం. ఈ నీళ్లలోని ఆల్బ్యుమిన్‌ కలరా రోగులకీ మేలే. అయితే ప్రి-డయాబెటిక్‌, డయాబెటిక్‌ రోగులు వైద్యుల సలహా మేరకు తగు మోతాదులో తాగాలి.

ప్యాకింగుల్లోవి మంచివేనా?
ఎప్పుడైనా తాజా నీళ్లే మంచివి. కానీ బోండాం రూపంలో రవాణా చేయడం, వాటిని కొట్టడం అందరికీ కుదరదు కాబట్టి అందులోని పోషకాలు దెబ్బతినకుండా స్టెరిలైజేషన్‌, పాశ్చరైజేషన్‌... వంటి పద్ధతుల ద్వారా నిల్వ చేస్తున్నారు. విటాకోకో, పెప్సీకో, జికో, హామ్‌లెస్‌ హార్వెస్ట్‌, ప్యూరిటీ ఆర్గానిక్‌, టేస్ట్‌ నిర్వాణా, సీ2ఓ ప్యూర్‌ కోకోనట్‌ వాటర్‌, డాబర్‌ రియల్‌ యాక్టివ్‌, కోకోజల్‌, పేపర్‌బోట్‌... వంటి అనేక బ్రాండ్లు కొబ్బరినీళ్లను విక్రయిస్తున్నాయి. అయితే వీటిల్లో మిక్స్‌డ్‌, ప్యూర్‌ అని రెండు రకాలు ఉంటున్నాయి. మిక్స్‌డ్‌ వాటిల్లో నిమ్మ, అల్లం, గ్రేప్‌ ఫ్రూట్‌... వంటి వాటినీ జోడిస్తున్నారు. అచ్చంగా కొబ్బరినీళ్లనే ప్యాక్‌ చేసే వాటిల్లో కూడా ప్రాసెస్‌ చేసినవీ చేయనివీ అని రెండు రకాలు. ఎందుకంటే నిల్వ ఉండేందుకు అనేక కంపెనీలు వేడిచేయడం లేదా సిట్రిక్‌ ఆమ్లం లాంటివి కలపడం చేస్తాయి. దీనివల్ల కొబ్బరినీళ్లు రంగు మారవు. అవేమీ చేయకపోతే రంగు మారతాయి.  కొబ్బరినీళ్లలో సహజంగా ఉండే పాలీఫినాల్‌ ఆక్సిడేజ్‌ అనే ఎంజైమ్‌ ఆక్సిజన్‌తో చర్య పొందడంతో అవి గోధుమా ఎరుపూ లేదా గులాబీ రంగులోకి మారతాయి. కాయ వయసు మీద ఈ రంగు ఆధారపడి ఉంటుంది. పది నెలల వయసున్న బోండాంతో పోలిస్తే ఏడెనిమిది నెలల బోండాంలోని నీళ్లు త్వరగా గులాబీరంగులోకి మారతాయి.
సింగపూర్‌కి చెందిన కోకోలోకో కంపెనీ ఏమీ కలపకుండానే 90 రోజులపాటు నిల్వ ఉండేలా చేస్తుంది. అందుకే ఆ నీళ్లు గులాబీరంగులోకి మారడంతో అవి పింక్‌ కోకోవాటర్‌గా ప్రాచుర్యం చెందాయి. ‘టేస్ట్‌ నిర్వాణ’ కంపెనీ అయితే గుజ్జుతో కలిపి మరీ నీళ్లని ప్యాక్‌ చేస్తోంది. కొన్ని కంపెనీలు ఫ్లేవర్స్‌కోసం పంచదార కలుపుతున్నాయి. కాబట్టి కొనేటప్పుడు లేబుల్‌ని తప్పక పరిశీలించాలి.


వులంగ్‌ కొబ్బరికాయలు!

ఇండొనేషియా, జావా దీవుల్లో ఉండే వులంగ్‌ కొబ్బరికాయలు చిన్నసైజులో ఎక్కువ వగరుతో ఉంటాయి. వీటి  పీచు గులాబీరంగులో ఉంటుంది. అందుకే వీటిని రెడ్‌ ఫైబర్‌ కోకోనట్‌గా పిలుస్తారు. ఖనిజాలతోపాటు ఫైటోకెమికల్సూ, ఫ్లేవనాయిడ్లూ శరీరానికి అవసరమైన ఏడు అమైనో ఆమ్లాలూ ఇందులో పుష్కలం. మిగిలిన వాటితో పోలిస్తే ఔషధ గుణాలూ ఎక్కువేనట. అందుకే వీటిని విషానికి విరుగుడుగానూ వాడతారు.


తియ్యని బోండాం!

విత్తనం ఏదయినా నేలతీరునిబట్టి బోండాం రుచి మారుతుంటుంది. సాధారణంగా మన నేలలో పండేవి కాస్త ఉప్పగా ఉంటే, బ్రెజిల్‌వి తియ్యగా ఉంటాయి. అన్నింటికన్నా బంగ్లాదేశ్‌ బోండాల్లోని నీళ్లు మహా తీపి అని చెబుతారు. మనదగ్గర మాత్రం చౌగత్‌ ఆరెంజ్‌ రకాన్ని తీపి బోండాంగా గుర్తించారు.


కోకోనట్‌ లస్సీ

కోకోనట్‌ వాటరే కాదు, లస్సీ కూడా మార్కెట్‌లో కనిపిస్తుంది. కొబ్బరినీళ్లు, లేతకొబ్బరి, యాలకులు వేసి మిక్సీలో గిలకొడితే... అదే కోకోనట్‌ లస్సీ. థాయ్‌ల్యాండ్‌లో దీని వాడకం ఎక్కువ. అక్కడ కొబ్బరిని తీసి ఆ నీళ్లతో లస్సీలా చేసి ఇస్తారు. ఇది బలవర్థకమైన పానీయంగా తాగుతుంటారక్కడ.


కొబ్బరినీళ్లు... కొట్టకుండానే..!

చెరకురసం బండ్లలో చేత్తో తిప్పేవి కాకుండా ఆటోమేటిక్‌వీ ఉన్నట్లే, కొబ్బరిబోండాం కొట్టేందుకు చేతికి శ్రమ లేకుండా కొత్త రకం మెషీన్లు వస్తున్నాయి. కోకోనట్‌ కార్ట్స్‌గా పిలుస్తున్న వీటిల్లో బోండాన్ని గొట్టం దగ్గర పెట్టి బటన్‌ నొక్కితే అందులోని నీళ్లు కింది బాక్సులోకి వెళ్లి ట్యాప్‌ ద్వారా చల్లగా బయటకు వస్తున్నాయి. నీళ్లకోసం కాయ కొట్టాక, కొబ్బరి తీయడం అందరికీ కుదరదు. ఇప్పుడు ఆ శ్రమ కూడా లేకుండా మెషీనే కొబ్బరికాయనీ కోస్తుంది. కాబట్టి అలా తీసిన లేత కొబ్బరిని ‘స్నోబాల్‌ టెండర్‌ కోకోనట్‌’ పేరుతో తింటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..