Costly Fish: ఆ చేపలు వలలో పడితే.. కోట్లే!

ఒడిశాలోని డీఘా తీరం... రోజూలానే ఆ రోజు కూడా చేపలకోసం పడవలు బయల్దేరాయి. వెళ్లిన కాసేపటికే మనోరంజన్‌దాస్‌కి తాను విసిరిన వల బరువుగా అనిపించింది. లాగి చూశాక ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడట.

Updated : 20 Oct 2022 16:57 IST

Costly Fish: ఆ చేపలు వలలో పడితే.. కోట్లే!

ఒడిశాలోని డీఘా తీరం... రోజూలానే ఆ రోజు కూడా చేపలకోసం పడవలు బయల్దేరాయి. వెళ్లిన కాసేపటికే మనోరంజన్‌దాస్‌కి తాను విసిరిన వల బరువుగా అనిపించింది. లాగి చూశాక ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడట. ఒకటీ రెండూ కాదు, ఏకంగా 121 చేపలు- అదీ తెలియాభోలా చేపలు- పడ్డాయి మరి. ‘ఈ రోజు నా అదృష్టం మత్స్యదేవత రూపంలో వచ్చింది’ అనుకుంటూ మార్కెట్‌కి వెళ్లి వేలంపాట పెట్టాడు. సాయంత్రానికల్లా రెండు కోట్ల రూపాయలతో తిరిగివచ్చాడు. ఇంతకీ ఆ చేపలేంటీ... వాటికంత ధరేంటీ... తెలుసుకోవాలని అనిపిస్తోంది కదూ...

రాజుగారి కథలో మాదిరిగా ‘చేపా చేపా... నీకెందుకంత రేటు...’ అని ఎవరైనా అడిగారే అనుకుందాం... ‘నా పేరు తెలియాభోలా... అందుకే నాకంత గిరాకీ’ అని బదులిస్తుందేమో. అవునండీ... నిన్నటి డీఘా తీరంలోనే కాదు, ఆమధ్య సుందరబన్‌ ప్రాంతంలోని కపుర నదిలో వికాస్‌ బర్మన్‌ బృందానికి దొరికిన 78.5 కిలోల చేప అయితే 7 అడుగుల పొడవు ఉందట. అందుకే దాని ధర 38 లక్షలు పలికిందట. ఈ చేప ఎప్పుడు, ఎక్కడ జాలర్లకు చిక్కినా ధర అంతే ఉంటుంది. ఎందుకంటే ఇది అరుదైనదీ, ఔషధగుణాలున్నదీనూ. అయితే అన్ని చేపలు ఒకేసారి పడటం ఈమధ్య కాలంలో ఇదే. పైగా ఒక్కో చేపా 18 కిలోల బరువూ ఉండటంతో రెండు కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి.

మందుల తయారీలో...

సాధారణంగా ఈ చేపల వెల పరిమాణాన్ని బట్టి కిలో 13 నుంచి 30 వేల రూపాయలు ఉంటుంది. అయితే సుందర్‌బన్‌ దగ్గర దొరికినది భారీ చేప కావడంతో కిలో 48 వేల రూపాయల ధర పలికిందట. ఈ చేప పొట్ట తిత్తిలోని పోషకాలను మందుల తయారీలో వాడుతుంటారు. అందుకే విదేశాల్లో దీనికి డిమాండ్‌ అని చేపల వ్యాపారులు చెబుతున్నారు.

క్రోకర్‌ జాతికి చెందిన తెలియాభోలానే సీ గోల్డ్‌, గోల్డ్‌ హార్టెడ్‌ ఫిష్‌, ఘోల్‌ చేప అనీ అంటారు. ఇది ఎవరి వలకైనా చిక్కిందా... వాళ్లు నక్కను తొక్కి వచ్చినట్లే. ఆమధ్య మహారాష్ట్రలోని పాలగఢ్‌కు చెందిన ముర్బె గ్రామానికి చెందిన చంద్రకాంత్‌ ఇతర సభ్యులతో కలిసి వేటకు వెళ్లినప్పుడు వల చాలా బరువుగా కనిపించిందట. ఎంతో ప్రయాసపడి దాన్ని బయటకు లాగగానే పడవలో ఉన్నవాళ్లంతా కళ్లు తేలవేశారట. ఒకేసారి... 157 తెలియాభోలా చేపలు... అంతే, చంద్రకాంత్‌ ఆనందానికి అడ్డే లేదు. దాంతో అట్నుంచటే బేరం మాట్లాడుకుని 1.33 కోట్ల రూపాయలతో ఇంటికి తిరిగివచ్చాడా మత్స్యకారుడు. అలాగే బెంగాల్‌కు చెందిన ఓ మత్స్యకారుల బృందానికి భారీ సైజులోని 33 తెలియాభోలా చేపలు చిక్కాయట. 84 కిలోల బరువున్న ఆ చేపల్ని కోల్‌కతాకి చెందిన ఫార్మా కంపెనీ సొంతం చేసుకుని కోటి రూపాయలు ముట్టజెప్పిందట. ఇలా అప్పుడప్పుడూ ఈ క్రోకర్‌ చేప జాలర్ల ఇంట కాసుల పంట కురిపిస్తుంటుంది.

ఏమేమి పోషకాలు?

ఈ చేపలో అయోడిన్‌, ఒమేగా-3-ఫ్యాటీ ఆమ్లాలూ, ప్రొటీన్లూ, ఐరన్‌, మెగ్నీషియం, ఫ్లోరైడ్‌, సెలీనియం... ఇలా అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్‌-ఎ, పుష్కలంగా ఉంటుంది. ఇందులోని బి5 విటమిన్‌ శరీరంలో పేరుకున్న టాక్సిన్లు బయటకు పోవడానికి సాయపడుతుంది. దీని కారణంగా హీమోగ్లోబినూ తద్వారా రోగనిరోధకశక్తీ పెరుగుతాయి. వంద గ్రా. క్రోకర్‌ చేపలో 15 మైక్రోగ్రాముల ఫోలిక్‌ ఆమ్లం లభిస్తుంది. అలాగే బి12, డి-విటమిన్‌, ఇ-విటమిన్‌, కె-విటమిన్లూ ఉంటాయి. ఇవన్నీ కలిసి హార్మోన్ల వ్యవస్థను సమతుల్యంగా ఉంచుతాయి. ఇందులోని కొలాజెన్‌ పదార్థం చర్మం ముడతలు పడకుండానూ వృద్ధాప్యం రాకుండానూ కాపాడుతుందట. గర్భిణీలు తింటే శిశువు మెదడు వృద్ధి బాగుంటుందనీ, తెలివితేటలు పెరుగుతాయనీ చెబుతారు. పులస చేప మాదిరిగానే రుచిగానూ ఉంటుంది. అయితే ఔషధగుణాల రీత్యా ఫార్మా కంపెనీలకు విక్రయించడంతో- అవి చేప పొట్టతిత్తినీ చర్మంలోని కొలాజెన్‌ పదార్థాన్నీ తీసి మందుల్లోనూ కాస్మొటిక్స్‌ తయారీలోనూ వాడి, మాంసాన్ని విడిగా విక్రయిస్తాయి. ఇటీవలి కాలంలో పెరుగుతోన్న కాలుష్యం కారణంగా ఈ చేపలు సముద్రగర్భంలోకి వెళ్లిపోతున్నాయట. అందుకే ఇది దొరకడం అరుదైపోయింది అంటున్నారు. దొరికితే మాత్రం మత్స్యకారుల పంట పండినట్లే!


గోల్డెన్‌ వీసా ఎందుకిస్తారంటే..

ఆ మధ్య యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) నుంచి ఉపాసన బంగారు వీసాను అందుకుందన్న వార్త బాగా వైరల్‌ అయింది. తాజాగా అది కాజల్‌ అగర్వాల్‌నూ వరించింది. ఇదివరకు మరికొందరు నటులూ గాయకులూ శాస్త్రవేత్తలూ కూడా ఈ వీసా అందుకున్నవారి జాబితాలో ఉన్నారు. అయితే ఈ గోల్డెన్‌ వీసాను ఎందుకిస్తారు.. అందుకు అర్హతలేంటి, దానివల్ల చేకూరే ప్రయోజనాలేంటో మాత్రం చాలామందికి తెలియదు... అదేంటో కాస్త చూద్దామా...!

విదేశీ పెట్టుబడులూ, పర్యటక రంగం నుంచి వచ్చే ఆదాయం వంటివి ఆ దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే ఆ దిశగా విదేశీయులను ఆకట్టుకునే ప్రణాళికలు వేసుకుంది యూఏఈ ప్రభుత్వం. అందులో భాగంగానే విదేశీయులు ఎలాంటి పరిమితులూ, షరతులూ లేకుండా- ఆయా నగరాల్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవడానికీ, చదువుకోవడానికీ, సొంత వ్యాపారాలూ పరిశోధనలూ అధ్యయనాల వంటివి స్వచ్ఛందంగా చేసుకోవడానికీ ఇచ్చే గ్రీన్‌ సిగ్నలే గోల్డెన్‌ వీసా. ఈ వీసా ఐదు నుంచి పదేళ్ల కాలపరిమితితో జారీ అవుతుంది. యూఏఈ నిబంధనలకు కట్టుబడి ఉన్నవారికి ఆ తరవాత కూడా రెన్యువల్‌ అవుతుంది. ఈ వీసా అందుకుంటే ఒకరకంగా యూఏఈ పౌరసత్వం వచ్చినట్టే. ఎప్పుడైనా అక్కడికి వెళ్లిరావచ్చు, విహరించొచ్చు, స్థిరపడొచ్చు కూడా. ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల నుంచి సానియా మీర్జా, ఉపాసన, కాజల్‌ అగర్వాల్‌ అందుకున్నారు. అలానే గాయని చిత్ర, త్రిష, అమలాపాల్‌, షారూఖ్‌ఖాన్‌, మోహన్‌లాల్‌, మమ్ముట్టి, దుల్కర్‌సల్మాన్‌, పృథ్వీరాజ్‌ వంటి మరికొందరూ ఈ గోల్డెన్‌ వీసాను పొందారు.  

ఎవరికిస్తారంటే....

కొన్నేళ్ల చర్చల అనంతరం మూడేళ్ల క్రితమే ఓ చట్టాన్ని తీసుకొచ్చి ఈ  గోల్డెన్‌ వీసా మంజూరుకు శ్రీకారం చుట్టింది యూఏఈ. వీటిని విద్యార్థులూ, వ్యాపారవేత్తలూ, చరిత్రకారులూ, శాస్త్రవేత్తలూ, కళాకారులకు అందిస్తున్నారు. అలాగని ఆయా రంగాల్లో ఉన్నవారందరికీ ఇస్తారు అనుకుంటే పొరబాటే. అందుకు కొన్ని అర్హతలు ఉండాలి. వాటికి సంబంధించిన ఆధారాలూ, రుజువులూ ఉండాలి. ఎవరైనా విద్యార్థి దుబాయ్‌ వెళ్లి చదువుకోవాలన్నా, ఏదైనా విషయంపై అధ్యయనం చేయాలనుకున్నా... షరతులకు లోబడి వీసా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అందుకు చాలా పెద్ద ప్రయాస, తతంగమే ఉంటుంది. అదే గోల్డెన్‌ వీసా సాయంతో వెళ్లడం చాలా సులువు. మరి విద్యార్థులు ఆ వీసా పొందాలంటే ప్రతిభను చూస్తారు. సెకండరీ స్కూల్‌ స్థాయిలో 95 శాతం మార్కులు వచ్చి ఉండాలి. యూనివర్సిటీ స్థాయిలో కనీసం 3.75 జీపీఏ సాధించి తీరాలి. అప్పుడు కచ్చితంగా ఈ గోల్డెన్‌ వీసా చదువుకీ, స్థిరనివాసానికీ ఉపయోగపడుతుంది.

సినిమాలూ, క్రీడా రంగంలో ఉన్నవారికైతే ప్రత్యేక ప్రతిభ ఉన్న వ్యక్తుల విభాగంలో ఈ వీసాను ఇస్తారు. వీరు తరచూ యూఏఈకి ప్రయాణం చేస్తుండటంతోపాటు ఆయా రంగాల్లో బాగా పేరు తెచ్చుకుని ఉండాలి. అలాంటి వారు దరఖాస్తు చేసుకుని సంబంధిత ఆధారాలను సమర్పిస్తే చాలు. పరిశోధనలూ, ఉన్నత చదువులు చదవాలనుకున్న శాస్త్రవేత్తలైతే... ఎమిరేట్స్‌ కౌన్సిల్‌ నుంచి అక్రిడేషన్‌ పొంది ఉండాలి. కళాకారులైతే సంస్కృతీ, విజ్ఞానాభివృద్ధి శాఖ నుంచి అక్రిడేషన్‌ తీసుకోవాలి. వ్యాపారవేత్తల విషయానికొస్తే వారు యూఏఈలో దాదాపు 20కోట్ల పెట్టుబడిని పెట్టి ఉండాలి. అలాంటి వారికీ గోల్డెన్‌ వీసా వస్తుంది. వారు సొంతంగానూ వ్యాపారాన్ని మొదలుపెట్టుకోవచ్చు. స్థిరనివాసంతోపాటు ఇతరత్రా ఆస్తుల్ని కూడా కొనుగోలు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఎలా..

గోల్డెన్‌ వీసా నిబంధనలూ, అర్హతలూ సరే... దానికోసం దరఖాస్తు చేసేదెలా అని చాలామంది మనసుల్లో ఓ ప్రశ్న మొదలయ్యే ఉంటుంది. అందుకేం చేయాలంటే...యూఏఈకి చెందిన మినిస్ట్రీ ఆఫ్‌ కల్చర్‌ అండ్‌ యూత్‌ సిఫారసు ఉండాలి. అలానే ఫెడరేషన్‌ అథారిటీ ఫర్‌ ఐడెంటిటీ అండ్‌ సిటిజన్‌షిప్‌ (ఐసీఏ), లేదా జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెసిడెన్సీ అండ్‌ ఫారినర్స్‌ అఫైర్స్‌(జీడీఆర్‌ఎఫ్‌ఏ)- వెబ్‌సైట్ల ద్వారా అప్లై చేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..