చీజ్‌కి... చాలా సీనుంది!

‘చీజ్‌... ప్లీజ్‌...’ ఒకప్పుడు ఈ మాటలు మన దగ్గర ఏ రెస్టరెంట్లకు వెళ్లినప్పుడో మాత్రమే వినిపించేవి. కానీ ఇప్పుడు ఇంట్లో అమ్మ దోసె వేస్తున్నా శాండ్‌విచ్‌ చేస్తున్నా... ఆమ్లెట్‌ వేస్తున్నా నూడుల్స్‌ చేస్తున్నా...

Updated : 30 Oct 2022 03:33 IST

చీజ్‌కి... చాలా సీనుంది!

‘చీజ్‌... ప్లీజ్‌...’ ఒకప్పుడు ఈ మాటలు మన దగ్గర ఏ రెస్టరెంట్లకు వెళ్లినప్పుడో మాత్రమే వినిపించేవి. కానీ ఇప్పుడు ఇంట్లో అమ్మ దోసె వేస్తున్నా శాండ్‌విచ్‌ చేస్తున్నా... ఆమ్లెట్‌ వేస్తున్నా నూడుల్స్‌ చేస్తున్నా... పిల్లలూ పెద్దవాళ్లూ వెనకాలే చేరి... ‘ఇంకొంచెం చీజ్‌ వేయమ్మా...’ అని అడుగుతుంటారు. ఇక, సూపర్‌ మార్కెట్‌కి వెళితే చిప్స్‌ నుంచి పాప్‌కార్న్‌ వరకూ అన్నీ చీజ్‌ రుచులే కావాలంటారు. అందుకే ఇప్పుడు ఆ క్రేజీ చీజ్‌ సైతం వీగనిజాన్ని అద్దుకుని మరీ చవులూరిస్తోంది.

‘చీజా... అదేంటీ...’ అని ఎవరైనా పెద్దవాళ్లు తెలియక అంటే... పిల్లతరం అది కూడా తెలియదా అన్నట్లు చూస్తారు. పిజ్జాతో మనదగ్గర పాపులర్‌ అయిన చీజ్‌, ఇప్పుడు అదీఇదీ అని లేకుండా అన్నింట్లోనూ కనిపిస్తోంది. ముఖ్యంగా పిల్లలకు కాస్త చీజ్‌ వాసన వస్తే చాలు... ఏదయినా కిక్కురుమనకుండా తినేస్తారు. అమోఘమైన రుచీ అద్భుతమైన ఫ్లేవరూ దాని సొంతం మరి. అన్నింటినీ మించి పోషకాహారం కూడా. ఇంతకీ అసలీ చీజ్‌ కథేంటో తెలియాలీ అంటే...పాలల్లోని ప్రొటీన్‌నీ కొవ్వునీ వేరు చేసి అందులో ఎంతమాత్రం నీరులేకుండా గడ్డ కట్టించి పులియనిస్తారు. ఇందుకోసం పాలల్లో నిమ్మరసం లేదా బ్యాక్టీరియా; రెన్నెట్‌(జంతువుల పొట్టభాగం) లేదా పెన్సిలియం శిలీంధ్రాలను కలుపుతారు. ఆపై ఉప్పు జోడించి, విభిన్న ఆకారాల్లో చేసి ఓ ప్రత్యేకమైన కాగితంతో చుట్టి నిల్వచేస్తారు. అదే చీజ్‌. పెరుగులానే చీజ్‌ కూడా ప్రొబయోటిక్‌ ఫుడ్‌. అయితే శిలీంధ్రాలూ ఇతరత్రా మొక్కల ఉత్పత్తులు వేసి చేసిన దానికన్నా రెన్నెట్‌తో చేసే చీజ్‌ గట్టిగా పొరలు పొరలుగా ఉంటుంది.

మన దగ్గర ఎక్కువగా వాడే పన్నీర్‌ కూడా ఒక రకం చీజే. కానీ పన్నీర్‌ కొద్దిరోజులపాటే నిల్వ ఉంటే, తయారీనిబట్టి చీజ్‌ రోజుల నుంచి సంవత్సరాలపాటు నిల్వ ఉంటుంది. క్యూబ్స్‌, సాస్‌, స్లైసెస్‌, తురుము... ఇలా భిన్న రూపాల్లోనూ దొరుకుతుంది.

క్రీ.పూ. సుమారు ఎనిమిది వేల ఏళ్ల క్రితం నుంచీ చీజ్‌ తయారీ ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. అప్పట్లో ఓ గొర్రెల కాపరి జంతువుల పేగుతో చేసిన సంచీల్లో పాలు పోసినప్పుడు అవి అనుకోకుండా గడ్డకట్టాయట. దాని ఆధారంగానే గ్రీకులూ రోమన్లూ చీజ్‌ను తయారుచేయడం నేర్చుకున్నారట. అప్పట్లో చీజ్‌ తయారీని ఓ ప్రత్యేకమైన కళగా భావించేవారు. ఇప్పటికీ ఐరోపా దేశాల్లో చీజ్‌ను భారీయెత్తున చేసి శీతల గదుల్లోని షెల్ఫుల్లో ఉంచి నిల్వ చేస్తుంటారు. చీజ్‌లో వెయ్యికి పైనే ఫ్లేవర్లు ఉన్నాయి. ఆయా జంతువుల పాలు, అవి తినే మేత; ఆ పాలల్లోని వెన్న శాతం; వాటిని తోడుపెట్టేందుకు వాడిన బ్యాక్టీరియా లేదా శిలీంధ్రం; ఫ్లేవర్‌కోసం కలిపే మూలికలు, మసాలా ద్రవ్యాలు; తయారీకి పట్టిన సమయం... ఇవన్నీ కూడా చీజ్‌లో భిన్న రుచులకు కారణమే. అంతెందుకు... మిరియాలు, వెల్లుల్లి, ఉల్లి, క్రాన్‌బెర్రీ... వంటివన్నీ చీజ్‌ తయారీలో వాడతారు. రంగుకోసం లిప్‌స్టిక్‌ మొక్క గింజల్నీ వేస్తారు.

అయితే జంతు ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించే క్రమంలో భాగంగానే పాలకు బదులుగా సోయా, బాదం, ఓట్స్‌, జీడిపప్పు, నువ్వులు, పొద్దుతిరుగుడు, కొబ్బరినూనె, వరి, బంగాళాదుంప, కర్రపెండలం... వంటి ధాన్యాల్నీ నట్స్‌నీ దుంపల్నీ ఇతరత్రా మూలికల్నీ వాడి ఈస్ట్‌ సాయంతో వీగన్‌ చీజ్‌నీ చేస్తున్నారిప్పుడు. లాక్టోజ్‌ పడనివాళ్లకి ఈ వీగన్‌ చీజ్‌తో ఏ సమస్యా ఉండదు. ఈ చీజ్‌ తయారీ మూడు దశాబ్దాల క్రితమే మొదలైనప్పటికీ అప్పట్లో ధర ఎక్కువ. గత నాలుగేళ్ల నుంచీ తయారీ పెరిగింది. డెయిరీతో పోలిస్తే వీగన్‌ చీజ్‌లో కొవ్వూ ప్రొటీన్ల శాతం తక్కువ. కాబట్టి కొలెస్ట్రాల్‌ ఉన్నవాళ్లకి ఇదే మేలు అంటున్నారు.

రకరకాలు!

వందలకొద్దీ ఫ్లేవర్లతోపాటు దాని రూపం, నిల్వ ఉండడాన్ని బట్టి చీజ్‌ను తాజా, సాఫ్ట్‌, సెమీ-ఫర్మ్‌, ఫర్మ్‌, హార్డ్‌... అని భిన్న రకాలుగా చెబుతారు. పన్నీర్‌, రికొటా, క్రీమ్‌... వంటివన్నీ కొన్నిరోజులు మాత్రమే నిల్వ ఉంటే; పార్మీసన్‌, చద్దర్‌, మొజారెల్లా రకాలు నెలల నుంచి ఏళ్ల తరబడి నిల్వ ఉంటాయి. ఇవన్నీ కాకుండా నీలిపచ్చ శిలీంధ్రాలను ఇంజెక్టు చేసే బ్లూ వెయిన్డ్‌ చీజ్‌ కూడా ఉంటుంది. అయితే అన్నింటిలోకీ గేదె పాలతో చేసే మొజారెల్లా చీజ్‌ వాడకమే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ. పోతే, పులె చీజ్‌ అన్నింటిలోకీ ఖరీదైనది. బాల్కన్‌ గాడిద పాలతో చేసే ఈ రకంలో ఒక కిలో చీజ్‌ కావాలంటే 25 లీటర్ల పాలు వాడతారు. అందుకే దీని ధర కిలో యాభై వేల రూపాయల పైచిలుకే మరి.

చీజ్‌ మంచి స్నాక్‌!

చెక్కలు చేయాలన్నా జంతికలు ఒత్తాలన్నా బ్రెడ్‌ లేదా రోటీ కాల్చాలన్నా మసాలా కూర వండాలన్నా అన్నింటిలోనూ రుచి కోసం మనవాళ్లు కాస్త వెన్నపూస వేస్తుంటారు. సరిగ్గా అలాగే ఐరోపా, అమెరికా దేశాల్లో పిజ్జా, బర్గర్‌, పాస్టా, బ్రెడ్‌... వంటి వాటిలో చీజ్‌ను తురిమిగానీ లేదా స్లైసెస్‌గా గానీ వాడతారు. అయితే ఇప్పుడు వెన్న కన్నా చీజ్‌ మంచిదని చెప్పడంతో మన సంప్రదాయ వంటకాలైన ఊతప్పం, పుణుగులూ, పకోడీలూ... వంటి స్నాక్స్‌ తయారీలోనూ చీజ్‌నే వాడటం చెప్పుకోదగ్గ విశేషం. ఎండబెట్టిన చీజ్‌తో క్రంచీ బార్స్‌, టిక్కీలూ, కేకులూ, పేస్ట్రీలూ చేస్తున్నారు. ఇది మంచి ఎపెటైజర్‌ కూడా. అందుకే సూపులూ సాసుల్లోనూ చీజ్‌ వాడుతున్నారు. అంతేనా... చిల్లీ, వడాపావ్‌, సమోసా, కార్న్‌ బాల్స్‌, బ్రెడ్‌ రోల్స్‌, మసాలా టోస్ట్‌, మోమో... ఇలా అన్నింటికీ ముందో వెనకో చీజ్‌ చేర్చి, కొత్త వెరైటీలెన్నో సృష్టించేస్తున్నారు నేటి షెఫ్‌లు.

పోషకాలు!

చీజ్‌లో కాల్షియం, జింక్‌... వంటి ఖనిజాలూ ఎ, డి, కె విటమిన్లూ ప్రొటీన్లూ కొవ్వులూ పుష్కలం. ఈ పోషకాలు చీజ్‌ తయారీని బట్టి మారుతుంటాయి. ఉదాహరణకు వంద గ్రా. మొజారెల్లా చీజ్‌ నుంచి 22.2 గ్రా. ప్రొటీన్‌, 22.4 గ్రా. కొవ్వులూ, 2.2 గ్రా. కార్బొహైడ్రేట్లూ 280 క్యాలరీలూ లభిస్తాయి. డెయిరీ చీజ్‌లో మాదిరిగానే వీగన్‌ రకాల్లోనూ పోషకాల్లో వైవిధ్యం ఉంటుంది. కానీ వీటిల్లో కొలెస్ట్రాల్‌ ఉండదు. శాచ్యురేటెడ్‌ కొవ్వు శాతం తక్కువ. అదేసమయంలో  ప్రొటీన్‌ శాతం కూడా డెయిరీ రకాల్లో కన్నా తక్కువే. తద్వారా దీన్నుంచి వచ్చే క్యాలరీలూ తక్కువే. కానీ రిబోఫ్లేవిన్‌, విటమిన్‌ బి12లు మాత్రం ఎక్కువగానే ఉంటాయి. అయితే డెయిరీ పాలతో చేసే కాటేజ్‌, రికోటా, పార్మీసన్‌, స్విస్‌, ఫెటా, గోట్‌ చీజ్‌ల్లో కూడా కొవ్వుశాతం తక్కువే. అందుకే ఈమధ్య చాలాచోట్ల వీగన్‌తోపాటు, కొవ్వు శాతం తక్కువగా ఉండే స్కిమ్‌డ్‌ మిల్క్‌తోనూ చీజ్‌ను తయారుచేస్తున్నారు.

చీజ్‌లో పుష్కలంగా ఉన్న కాల్షియం, ట్రిప్టోఫాన్‌లు కలిసి మెలటోనిన్‌ శాతం పెరిగేందుకు కారణమవుతాయి. తద్వారా నిద్రలేమినీ ఒత్తిడినీ తగ్గిస్తాయనీ పరిశీలనలు చెబుతున్నాయి. చీజ్‌ మధుమేహాన్నీ నియంత్రిస్తుంది. కాల్షియం కారణంగా తలెత్తే ఆస్టియోపొరొసిస్‌, దంత సమస్యలతో బాధపడేవాళ్లకీ చీజ్‌ మంచిదే. మితంగా తింటే- చీజ్‌లోని కాల్షియం బీపీనీ అదుపులో ఉంచేందుకూ దోహదపడుతుంది. అలాగే ఇందులోని గ్లుటాథియోన్‌ మెదడు రక్తనాళాల పనితీరుని మెరుగుపరిస్తే, లినోలిక్‌ ఆమ్లం ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తుంది. ప్రతిరోజూ 40 గ్రా. చీజ్‌ను తినడం వల్ల హృద్రోగ, మెదడు సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువని కొన్న పరిశీలనలూ చెబుతున్నాయి. అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ సైతం రోజువారీ అవసరమయ్యే క్యాలరీల్లో ఆరు శాతం వరకూ శాచ్యురేటెడ్‌ కొవ్వుల నుంచి రావచ్చు అంటోంది. మొత్తమ్మీద చీజ్‌ ఫ్లేవర్‌కి ఫిదా కాని వాళ్లుండరు. అందుకే ‘చీజ్‌ ప్లీజ్‌’ అనేవాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..