దీపం సరికొత్తగా వెలుగుతోంది!

దీపావళి.... అంటేనే దీపోత్సవం... అమావాస్య చీకట్లను పారదోలుతూ చెడు మీద మంచి గెలిచిన విజయానికి సంకేతంగా జరుపుకునే ఈ పండుగరోజున ఎక్కడ చూసినా రంగురంగుల దీపాలు వెలుగులీనుతుంటాయి.

Published : 23 Oct 2022 00:56 IST

దీపం సరికొత్తగా వెలుగుతోంది!

దీపావళి.... అంటేనే దీపోత్సవం... అమావాస్య చీకట్లను పారదోలుతూ చెడు మీద మంచి గెలిచిన విజయానికి సంకేతంగా జరుపుకునే ఈ పండుగరోజున ఎక్కడ చూసినా రంగురంగుల దీపాలు వెలుగులీనుతుంటాయి. అందుకే మట్టి ప్రమిదల్లో నూనె పోసి వత్తులు వేసి వెలిగించే ఆ సంప్రదాయ ప్రమిదలతోపాటు ఏటా మరెన్నో సరికొత్త దీపాలూ మార్కెట్లోకి వస్తున్నాయి.

‘దీపం జ్యోతి పరబ్రహ్మ’... అంటూ దేవుడి దగ్గరో తులసికోట దగ్గరో నిత్యం దీపం వెలిగించడం హైందవ సంప్రదాయం. భగవంతునికి చేసే షోడశోపచారాలలో దీప సమర్పణ ప్రధానమైనది. చీకటి అనే అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించేదే దీపం అనీ విశ్వసిస్తారు. అందుకే పండుగలూ వేడుకలూ శుభకార్యాల్లోనూ దీపారాధన విధిగా చేస్తుంటారు. అందులో భాగంగానే దీపావళి పండుగనాడు ఇంట్లోనూ వాకిట్లోనూ రంగురంగుల ముగ్గులు వేసి దీపాలను వెలిగించి ఆ లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే మట్టి ప్రమిదల్లో నూనె పోసి వెలిగించలేనివాళ్లకి రెడీమేడ్‌ మైనం దీపాలూ ఎలక్ట్రిక్‌ దీపాలూ బ్యాటరీతో పనిచేసే ఎల్‌ఈడీ దీపాలూ ఉన్నాయి. ఇప్పుడు వాటితోపాటు మరెన్నో కొత్త రకం దీపాలు ఇంటింటా వెలుగులు విరజిమ్ముతున్నాయి. అవేంటో చూసేద్దామా...


దీపాల తోరణాలు!

దీపావళి రోజున ఇంటి చుట్టూ లేదా ద్వారాల్నీ రంగురంగుల ఎల్‌ఈడీ లైట్లతో అలంకరించడం చూస్తుంటాం. అయితే ఈ లైట్లు ఈమధ్య రకరకాల ఆకారాల్లోనూ వస్తున్నాయి. అందులోభాగంగా సంప్రదాయ దీపాలే వాకిట్లో వేలాడుతున్నాయా అన్నట్లుగా ఇప్పుడవి ప్రమిదల ఆకారంలోనూ వస్తున్నాయి. ఈ ప్రమిదల్లో కొన్ని ఒకే నియాన్‌ బల్బుతో ఉంటే, మరికొన్ని ఏడెనిమిది బల్బులతో ఉంటున్నాయి. పైగా వీటిని కర్టెన్లూ, గుమ్మానికి వేలాడదీసే తోరణాలుగానూ డిజైన్‌ చేస్తున్నారు. దాంతో మీ ఇంట్లోని గోడల్నీ బాల్కనీల్నీ గుమ్మాల్నీ కూడా ఈ వేలాడే దీపాలతో మెరిపించేయవచ్చు మరి.


నేతి దీపం..!

వునెయ్యితో దీపారాధన చేస్తే మనసులో కోరికలు నెరవేరతాయన్న విశ్వాసంతో చాలామంది నువ్వులనూనెకి బదులుగా దాన్నే వాడతారు. పైగా ఇది ఎంతో శ్రేష్ఠమైనదనీ దీంతో దీపం వెలిగించినప్పుడు వచ్చే పొగని పీల్చితే ఆరోగ్యానికీ మంచిదనీ, దీనివల్ల గాల్లోని సూక్ష్మక్రిములు చనిపోతాయనీ చెబుతుంటారు. అయితే ఆ నెయ్యిని తెచ్చి ప్రమిదల్లో పోసి, వత్తుల్ని వేయడం అంటే ఈ తరం అమ్మాయిలకు కాస్త కష్టమైన పనే. అందుకే ఆ శ్రమంతా లేకుండా నెయ్యితో కూడిన వత్తులు రెడీమేడ్‌గా దొరుకుతున్నాయి. అంతేకాదు, ఆ నేతి వత్తులు ప్రమిదల్లో పెట్టి మరీ వస్తున్నాయి. కాబట్టి పద్ధతి ప్రకారం ఆవునెయ్యితోనే దీపాలు వెలిగించాలి అనుకునేవాళ్లకి ఇవి ఎంతో సౌకర్యంగా ఉంటాయని వేరే చెప్పాలా?!


ఆరని మట్టి దీపం!

‘ఆరనీకుమా ఈ దీపం... కార్తీకదీపం...’ అంటూ దీపావళికి ముందు రోజు మొదలుకుని కార్తిక మాసమంతా భక్తితో దీపాలు వెలిగిస్తుంటారు. అయితే ఆ దీపం ఆరకుండానూ వత్తి మొత్తం ఒకేసారి కాలిపోకుండానూ ఉండాలంటే దాన్ని చూసుకుంటూ కొంచెంకొంచెంగా వత్తిని ప్రమిద అంచుపైకి జరుపుతూ ఉండాలి. కానీ ఇప్పుడా అవసరం లేకుండా మట్టి ప్రమిదలకు సైతం ఇత్తడి, ప్లాస్టిక్‌ దీపాల్లో మాదిరిగా వత్తిని పట్టి ఉంచే హోల్డర్‌ ఉన్న ప్రమిదల్నీ తయారుచేస్తున్నారు. ప్రమిద మధ్యలో గొట్టంలాంటి ఈ హోల్డర్‌ ఉండటంతో నూనె అయ్యేవరకూ దీపం వెలుగుతూనే ఉంటుంది.


ఎలక్ట్రిక్‌ దీపం!

‘దీపలక్ష్మీ నమోస్తుతే’ అంటూ నిత్యం దీపారాధన చేయాలీ... చిటికెలోనే పనైపోవాలీ... అనుకునే ఆధునిక మహిళలకోసం రంగురంగుల ఎల్‌ఈడీ దీపాలూ టీ లైట్లూ చాలానే వస్తున్నాయి. అయితే ఆకారాన్ని బట్టి అవన్నీ రెడీమేడ్‌వి అని తెలిసిపోతుంటాయి. అలా కాకుండా చూడ్డానికి సంప్రదాయ దీపాల్లానే కనిపించాలి... చేతికి నూనె అంటకూడదు... ఆని ఆలోచించేవాళ్లకోసమే ఈ స్మార్ట్‌ దీపాలు. బ్యాటరీతో పనిచేసే ఈ దీపాలు అచ్చం సంప్రదాయ ప్రమిదల్లానే కనిపిస్తాయి. అడుగున ఉన్న స్విచ్‌ ఆన్‌ చేస్తే చాలు... వెలిగిపోయే ఈ దీపాల్ని గాలికి ఆరిపోతాయన్న భయం లేకుండా ఆరుబయటా నిశ్చింతగా పెట్టుకోవచ్చు.


కలశ దీపం!

రలక్ష్మీ, అష్టలక్ష్మీ, వినాయకచవితి, గృహప్రవేశం... ఇలా ఏ పూజలోనయినా కలశాన్ని పెట్టి ‘కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితః’ అంటూ పూజిస్తారు. కలశ ముఖంలో విష్ణుమూర్తి, కంఠభాగంలో శివుడు, మూల భాగంలో బ్రహ్మదేవుడు ఉంటారనీ అందుకే ఇది త్రిమూర్త్యాత్మకమనీ శుభసూచకమనీ భావిస్తారు. అంతటి పవిత్రమైన కలశాలు సైతం ఇప్పుడు దీపాలతో అందంగా కాంతులీనుతున్నాయి. పూజగది మరింత దేదీప్యమానంగా వెలుగొందేలా రకరకాల డిజైన్లలో ఎల్‌ఈడీ దీపాలతో అమర్చిన ఈ కలశాన్ని గుండ్రంగా తిరిగేలానూ డిజైన్‌ చేస్తున్నారు. బ్యాటరీతోనూ కరెంటుతోనూ ఈ దీప కలశాన్ని పూజలో పెట్టుకుంటే దివ్యమైన దీపావళి వెలుగులన్నీ మీ ఇంటే మరి!


నీటి దీపాలు!

ల్‌ఈడీ దీపాలన్నీ స్విచ్‌ ఆన్‌ చేస్తేనే వెలుగుతాయి. కానీ ఈ దీపాలు నీరు తగిలినా లేదా కాసిని నీళ్లు పోసినా చాలు వెలుగులు విరజిమ్ముతాయి. నీళ్లలో నుంచి బయటకు తీసేసినా, ప్రమిదలోని నీరు అయిపోయినా వాటంతటవే ఆరిపోతాయి. అలా ఎలా అంటే- ఈ ప్రమిదలకి అడుగుభాగాన సెన్సర్‌ ఉన్నవి కొన్నయితే, పైన సెన్సర్‌ ఉండేవి మరికొన్ని. బ్యాటరీలో మాదిరిగానే వీటిలోపలా యానోడ్‌, క్యాథోడ్‌ అనే రెండు రకాల వైర్లు ఉంటాయి. నీళ్లు లేనప్పుడు వీటిమధ్య ఎలాంటి కరెంటు ప్రసారం జరగదు. ఎప్పడైతే ప్రమిదలో అమర్చిన సెన్సర్‌కి నీరు తగిలిందో అప్పుడు వీటిమధ్య కరెంటు ప్రవహించి, బల్బు వెలుగుతుంది. పైగా ఇవి పువ్వులూ కొవ్వొత్తులూ... ఇలా ఎన్నో ఆకారాల్లోనూ దొరుకుతాయి. ఇలాంటివి ఎవరికైనా బహుమతులుగా ఇచ్చేందుకూ బాగుంటాయి. చిన్న బటన్స్‌లా ఉండే ఇందులోని బ్యాటరీలు కనీసం 50 గంటలపాటు వెలుగుతాయి. అవి అయిపోతే మళ్లీ కొత్త సెల్స్‌ వేసుకుంటే ఈ నీటి దీపాలు ఎప్పటికీ వెలుగుల్ని చిందిస్తాయి. పార్టీలూ వేడుకల సమయంలో గృహాలంకరణలో భాగంగానూ ఈ నీటిదీపాల్ని వెలిగించి అతిథుల్ని చకితుల్ని చేయవచ్చు.


దీప ప్రతిబింబాలు!

దీపం వెలిగించినప్పుడు దానిచుట్టూ రంగుల ముగ్గు కూడా ఉంటే ఎంత బాగుంటుందో కదూ... అలా వస్తున్నవే ఈ రిఫ్లెక్షన్‌ ఎల్‌ఈడీ దీపాలు. ప్లాస్టిక్కుతో తయారుచేసిన ఈ దీపాలు స్విచ్‌ ఆన్‌చేయగానే వెలగడంతోపాటు ఆ దీపం డిజైన్‌ కూడా ప్రమిద చుట్టూ రంగుల్లో అందంగా పరచుకుంటుంది. దాంతో అదాటున చూసేవాళ్లకి ముగ్గుమధ్యలో ప్రమిద పెట్టినట్లే ఉంటుంది. రకరకాల డిజైన్లలో వస్తున్న వీటిల్లో వాటర్‌ సెన్సర్‌ టెక్నాలజీని కూడా చొప్పించి నీళ్లలో వేసుకునేవీ తయారుచేశారు. కాబట్టి ఈ దీపాల్ని వాకిట్లోనే కాదు, నీళ్లు పోసిన ఉరుళిలో వేసుకున్నా ఆ దీపకాంతులతోబాటు ప్రమిద డిజైన్‌ కూడా అందంగా ప్రతిబింబిస్తుంటుంది. ఒక్క దీపావళి అనే కాదు, వేడుకల వేళలోనూ ఈ ప్రమిదలతో ఇంటిని చూడచక్కగా అలంకరించుకోవచ్చు.


దీప ‘సోయ’గం!

ట్టి ప్రమిదల్లో మైనం నింపిన ప్రమిదలు చాలాకాలం నుంచే ఉన్నాయి. అయితే ఇప్పుడవి సోయాగింజల నూనెతో తయారై, పూలసొగసుల్ని అద్దుకుని మరీ వస్తున్నాయి. ఏమాత్రం నూనె వాసన లేకుండా వెలిగే ఈ దీపాలు, ఇంటిని మరింత అందంగా కళ కట్టిస్తాయన్నమాట. ఎలాంటి పెట్రోలియం ఉత్పత్తులూ వాడకుండా సహజ పదార్థాలతో తయారుచేయడం వల్ల ఈ మైనం కాలినప్పుడు హానికర వాయువులేవీ గాల్లోకి విడుదల కావు. పైగా ఇది పారఫిన్‌ వ్యాక్స్‌కన్నా నెమ్మదిగా కాలుతుంది కాబట్టి చాలాసేపటి వరకూ వెలుగుతుందట. మైనంమీద పక్షులూ పువ్వులూ ఇలా రకరకాల డిజైన్లు ఉంటాయి కాబట్టి చూడ్డానికీ అందంగా ఉంటాయి. ముఖ్యంగా ఇవి వెలిగేటప్పుడు- మైనంమీద అమర్చిన రంగుల పూల డిజైన్లు ఎంతో అందంగా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఆకట్టుకుంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..