తెలిసిన రుచులే సరికొత్తగా!

పాయసం, మ్యాగీ, కొబ్బరి... అందరికీ తెలిసినవే. అందరూ తినేవే. కానీ, వాటికే ఆ మూడు సంస్థలు కాస్త కొత్త రుచులు అద్దాయి. నోరూరించే వాటి ప్రయోగాలు ఇప్పుడు విజయవంతమైన వ్యాపారాలుగా ఎదిగాయి.

Published : 12 Nov 2022 23:44 IST

తెలిసిన రుచులే సరికొత్తగా!

పాయసం, మ్యాగీ, కొబ్బరి... అందరికీ తెలిసినవే. అందరూ తినేవే. కానీ, వాటికే ఆ మూడు సంస్థలు కాస్త కొత్త రుచులు అద్దాయి. నోరూరించే వాటి ప్రయోగాలు ఇప్పుడు విజయవంతమైన వ్యాపారాలుగా ఎదిగాయి.


ఖీర్‌ కొత్తగా...

పాయసంతో పండుగ చేసుకోవడమంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి? కానీ, మనకు తెలిసిన పాయసాలు ఎన్ని ఉంటాయి? అన్నం, సేమ్యా, సగ్గుబియ్యం... ఇలా మహా అయితే ఏ మూడు నాలుగో ఉంటాయంతే! మరి చాక్లెట్‌ పాయసం, న్యూట్రెల్లా ఖీర్‌, బ్రౌనీ ఖీర్‌, స్ట్రాబెర్రీ పాయసం... ఇలాంటివి ఎప్పుడైనా విన్నారా? భారతీయ సంప్రదాయ పాయసం రుచికే సరికొత్త ఫ్లేవర్లను జోడించిన స్టార్టప్‌ ‘లా ఖీర్‌ డెలి’ (ఎల్‌కేడీ) కస్టమర్ల మనసులను దోచుకుంటోంది. పుణెకు చెందిన అక్కాతమ్ముళ్లు శివిక, శివాంగ్‌ సూద్‌లు 2017లో దీన్ని ప్రారంభించారు. వాళ్ల అమ్మ సోనియా తరచూ చేసి పెట్టే పాయసాన్నే కాస్త కొత్తగా చేస్తే ఎలా ఉంటుందన్న ఈ అక్కాతమ్ముళ్ల ఆలోచనే ‘ఎల్‌కేడీ’కి ప్రాణం పోసింది. పిల్లల సరదా చూసి వంటింట్లో ప్రయోగాలు చేసిన సోనియా- కొత్త కొత్త పాయసాలను తయారు చేసింది. వాటికి గిరాకీ పెరగడంతో స్కూల్‌ టీచర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసేసి మరీ పూర్తి భిన్నరకాల ఖీర్‌ తయారీలోనే నిమగ్నమైంది. మొదట్లో వారాంతాల్లో తమ వంటింట్లోనే ఖీర్‌ను తయారు చేసి తోపుడు బండిపైన అమ్మేవారు. కొన్నాళ్లకి సెంట్రల్‌ కిచెన్‌నూ, పలు దుకాణాలనూ ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకూ తమ వ్యాపారాన్ని విస్తరించి ఖీర్‌ రుచులను పంచిన ఈ అక్కా తమ్ముళ్లు- ఖీర్‌ తిన్నాక, ఆ డబ్బాను పడేయకుండా మొక్కలు పెంచమని ప్రోత్సహిస్తున్నారు. అందుకే ఖీర్‌తోపాటు కూరగాయలు, ఆకుకూరల విత్తనాల్నీ అందించి పర్యావరణంపై తమకున్న ప్రేమను చాటుకుంటున్నారు.  


80 రకాల మ్యాగీలు

చిన్నా పెద్ద అందరికీ బాగా నచ్చుతాయి కదా నూడుల్స్‌. కానీ, అందులో ఎక్కువ మంది లాగించేవి మూడంటే మూడు రకాలే... వెజ్‌, ఎగ్‌, చికెన్‌ నూడుల్స్‌. అదే ముంబైకి చెందిన ఓ రెస్టారంట్‌లో దాదాపు 80 రకాల మ్యాగీలను రుచి చూడొచ్చు. ‘హంగ్రీ హెడ్‌’ పేరుతో... అల్‌ఫ్రెడో మ్యాగీ, ఫైరీ బీబీక్యూ మ్యాగీ, థాయ్‌ కర్రీ మ్యాగీ, హైదరాబాదీ బిర్యానీ మ్యాగీ... ఇలా రెండు నిమిషాల మ్యాగీని విభిన్న రుచులతో అందిస్తూ ఆహారప్రియులను ఆకర్షిస్తోంది. హోటల్‌ మానేజ్‌మెంట్‌, ఫుడ్‌ ప్రొడక్షన్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌లలో అనుభవం ఉన్న అర్పిత్‌ కబ్రా, యశ్‌ పటేల్‌, రాహుల్‌ దగా కలిసి ‘హంగ్రీ హెడ్‌’ స్టార్టప్‌ను ప్రారంభించారు. ఆ ముగ్గురు మిత్రులకూ మ్యాగీ అంటే చాలా ఇష్టం. దాన్నే బిజినెస్‌ అవకాశంగా మార్చుకుని విజయం సాధించారు. వీళ్లు కేవలం రెస్ట్టారంట్‌కే పరిమితం కాలేదు. పార్టీ ఆర్డర్లు సైతం తీసుకుంటూ దేశమంతటా తమ మ్యాగీ రుచుల్ని పరిచయం చేస్తున్నారు.


కొబ్బరి పలు రుచుల్లో...

కొబ్బరి ముక్కలు, కొబ్బరి నీళ్లు, కొబ్బరుండలు... ఇంకా అయితే కొబ్బరి చాక్లెట్లు- కోకోనట్‌ రుచులు అనగానే మనకు గుర్తొచ్చేవి ఇవే కదా. కానీ, కొబ్బరితో షేక్స్‌, స్మూతీస్‌, ఐస్‌క్రీములు లాంటివి ఎప్పుడైనా తిన్నారా? హైదరాబాద్‌లోని ‘కోకోఫిట్‌’ స్టార్టప్‌ నిర్వాహకులను కలిస్తే... వాటన్నింటినీ రుచి చూపిస్తారు. విరివిగా దొరికే కొబ్బరితో ఏం చేయొచ్చా అని ఆలోచించిన వి.శశికాంత్‌, ఎస్‌.పవన్‌ కుమార్‌, టి.సునీల్‌ కుమార్‌లు మూడేళ్ల క్రితం ‘కోకోఫిట్‌’ స్టార్టప్‌ను ప్రారంభించి- ప్రిజర్వేటివ్స్‌ ఏమీ కలపని 110 రకాలకు పైగా సహజమైన కొబ్బరి ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, పాండిచ్చేరి వంటి చోట్ల దాదాపు వందకుపైగా స్టోర్లను తెరిచారు. అలానే ఆయా రాష్ట్రాల్లోని కొబ్బరి రైతుల వద్ద నుంచే నేరుగా కొబ్బరికాయల్నీ కొనుగోలు చేసి వారికి లాభాలు వచ్చేలా చూస్తున్నారు. మరోవైపు వినియోగదారులకు అందుబాటు ధరల్లో కొత్త కొత్త కొబ్బరి వెరైటీలను అందించగలుగుతున్నామనే శశికాంత్‌ బృందం త్వరలో దేశవ్యాప్తంగా 500ల దుకాణాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..