బెల్లం... బోల్డన్ని ఫ్లేవర్లలో..!

చక్కెరతో పోలిస్తే బెల్లం మంచిదంటారు. భోంచేశాక చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు బాగుంటుందనీ చెబుతారు.

Updated : 21 May 2023 04:39 IST

చక్కెరతో పోలిస్తే బెల్లం మంచిదంటారు. భోంచేశాక చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు బాగుంటుందనీ చెబుతారు. ఇలా ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలుచేసే బెల్లాన్ని రోజూ కొద్దిగానైనా తీసుకోవాలనుకునే వారికోసమే ఇప్పుడది బాదం, జీడిపప్పు మొదలు చాక్లెట్‌ వరకూ రకరకాల ఫ్లేవర్లలో దొరుకుతోంది. అదీ చటుక్కున నోట్లో వేసుకునేలా చిన్నచిన్న ముక్కల రూపంలోనే సుమా...

చక్కెరతో చేసే తినుబండారాల్లో చాక్లెట్లు మొదలు మిఠాయిల వరకూ ఎన్నో రకాలు ఉంటాయి. వేడివేడి కాఫీ లేదా టీలో రెండు చెంచాల చక్కెర వేసుకుని తాగుతుంటే ఎంత బాగుంటుందో చెప్పక్కర్లేదు. కానీ చక్కెర ఆరోగ్యానికి అంత మంచిది కాదనేది వైద్యులు ఎప్పటి నుంచో చెబుతున్నమాటే. అందుకే చాలామంది దానికి ప్రత్యామ్నాయంగా బెల్లం వాడుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పైగా అది కూడా సులువుగా వాడుకునే విధంగా పొడి, పాకం రూపంలోనూ దొరుకుతోంది. ఇప్పుడు... తయారీదారులు మరో అడుగు ముందుకేసి కోరిన రుచుల్లో, ఫ్లేవర్లలో బెల్లాన్ని తీసుకుని రావడంతో అది మరింత నోరూరించేస్తోంది. అంటే... చిన్న బెల్లంముక్కలోనే బాదం, జీడిపప్పు మొదలు చాక్లెట్‌ వరకూ ఎన్నో రుచులూ ఉంటాయన్నమాట.

తినేయడం సులువు

బెల్లంతోచేసే పల్లీచిక్కీలూ, పప్పుండలూ, సున్నుండలూ, నువ్వులుండలూ ఎప్పటినుంచో ఉన్నాయి కదా... అవీ ఇవీ ఒకటేనా అనే సందేహం కలగొచ్చు కానీ... వాటితో పోలిస్తే ఇవి భిన్నం. పల్లీచిక్కీ, పప్పుండల్లో పల్లీలూ, పప్పులూ స్పష్టంగా కనిపిస్తుంటాయి. కానీ... వీటిలో అలా ఉండదు. బాదం, జీడిపప్పు, నువ్వులు, అవిసెగింజల్లాంటివాటిని వాడినా.. కేవలం వాటి సారాన్ని మాత్రమే తీసుకోవడం వల్ల చూడ్డానికి బెల్లంలానే అనిపిస్తుంది కానీ.. రుచి ఆయా పదార్థాలను బట్టి మారుతుంటుంది. అంటే... ఇవి చూడ్డానికి నోట్లో చప్పరించేంత చిన్నగా, బెల్లం అచ్చుల రూపంలో ఉన్నా... బాదం, జీడిపప్పు, యాలకులు, సోంపు, అల్లం, నువ్వులూ, అవిసెగింజలూ.. వంటి పదార్థాల రుచినీ అందిస్తాయి. అదేవిధంగా చిక్కీలూ, పప్పుండలు వంటివాటికి ప్రత్యామ్నాయంగా పల్లీలూ, ఫూల్‌మఖానా బెల్లం కోటింగ్‌తోనూ వస్తున్నాయిప్పుడు. ఇక... చాక్లెట్లలో ఎక్కువ మోతాదులో ఉండే చక్కెర ఆరోగ్యానికి హాని చేస్తుందని తెలిసినా పిల్లలు వాటినే తినడానికి ఇష్టపడుతుంటారు. అలాంటి వారికోసం కూడా ఇప్పుడు బెల్లంతో ప్రత్యేకంగా చేసిన లాలీపాప్‌లూ, చాక్లెట్లూ, క్యాండీలూ దొరుకుతున్నాయి. వీటన్నింటిలో డార్క్‌చాక్లెట్‌ను కొంత మోతాదులో వాడుతూనే... తీపికోసం చక్కెరకు బదులు బెల్లాన్ని వేస్తారు. ఇవి  కూడా... దాల్చినచెక్క, అల్లం, పుదీనా వంటి రుచుల్లోనూ వస్తున్నాయి. నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ చాక్లెట్లూ, క్యాండీలూ పిల్లలకు నచ్చేవిధంగానే తయారుచేయడంతో ఇప్పుడు వీటికి డిమాండూ ఎక్కువగానే ఉందంటున్నారు తయారీదారులు. కాబట్టి... ఈసారి బెల్లంలోనే కొత్త రుచిని కోరుకున్నప్పుడు... వీటిల్లో నచ్చిన ఫ్లేవర్‌ను ప్రయత్నించి చూస్తే సరి. అదేవిధంగా ఎవరి ఇంటికైనా వెళ్లేటప్పుడు పిల్లలకు బెల్లం చాక్లెట్‌నూ కానుకగా తీసుకెళ్లి ఇచ్చి చూడండి..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు