Published : 22 May 2022 01:37 IST

ఊరంతా కలిసి పెళ్లి చేస్తారు!

పెళ్లి చేసి అప్పులపాలైన కుటుంబాలెన్నో... కట్నాలు ఇవ్వలేక ఇబ్బంది పడ్డ సంఘటనలు మరెన్నో... కానుకల పేరిట అనవసరంగా ఖర్చు చేసి అవస్థలు పడ్డవారెందరో... కానీ తమ ఊళ్లో ఆ బాధలు లేకుండా ఉండేందుకు ప్రత్యేకమైన కట్టుబాట్లు పెట్టుకున్నాయి కొన్ని ఊళ్లు. పాత ఆచారాలు పాటిస్తూ ఖర్చు తగ్గించుకుంటున్నాయి ఇంకొన్ని గ్రామాలు.  


పెళ్లి ఖర్చు తగ్గించాలనీ...

పెళ్లంటే మాటలు కాదుగా... కట్నం మొదలు వివాహ వేడుకల ఆడంబరాల దాకా ఎన్నెన్నో ఖర్చులు. ఆ ఇబ్బందులకు పరిష్కారంగా ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలంలోని కొన్ని ఊళ్లన్నీ కలిసి ఓ తీర్మానం చేసుకున్నాయి. వివాహాలు చేసి ఏ కుటుంబమూ అప్పుల్లో మునిగిపోవాల్సిన పరిస్థితి రాకూడదనే ఆలోచనతో పెళ్లిళ్లను వీలైనంత నిరాడంబరంగా చేయాలని నిర్ణయించుకున్నాయి. అంతేకాదు, కట్నకానుకల ప్రసక్తి అసలే ఉండకూడదనే నిబంధనలూ పెట్టుకున్నాయి. భీంపూర్‌ మండలంలోని అందర్‌ బంద్‌, బెల్సరీ రాంపూర్‌, మర్కగూడ, గుంజాల, కైరిగూడ, వడ్గామ్‌, ఇందూర్‌ పల్లి... ఇలా 23 ఊళ్ల్లన్నీ కలిసి ఇప్పుడు అదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. సాధారణంగా ఇక్కడి సంప్రదాయం ప్రకారం- ఇంట్లో పెళ్లి జరిగితే, పెళ్లికొచ్చిన బంధువులందరికీ దుస్తులుపెట్టాలి. దీనివల్ల ఇరుకుటుంబాలకీ వేలల్లో ఖర్చు అయ్యేది. ఇలాంటి అనవసర ఖర్చుల వల్ల చాలా కుటుంబాలు ఇబ్బంది పడేవట, అప్పుల్లో మునిగిపోయేవట. అది గమనించి ఈ ఊళ్ల ప్రజలందరూ కలిసి ఈ కట్టుబాట్లను పెట్టుకున్నారట!


ఊరంతా పెళ్లి సందడే!

‘ఇల్లు కట్టి చూడు... పెళ్లి చేసి చూడు’ అన్న సామెత తెలిసిందేగా. ఈ రెండు పనుల్ని చేయడం అంత సులువేం కాదు మరి. అందుకే ఆ భారం ఒకే కుటుంబం మీద పడకూడదనే ఉద్దేశంతో ఓ ఊరు ప్రత్యేక పద్ధతిని పాటిస్తోంది. అదే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా నువ్వలరేవు. ఈ ఊరి ప్రజలు దాదాపు 400 ఏళ్లుగా సామూహిక వివాహాల ఆచారాన్ని పాటిస్తున్నారు. ఏ ఊళ్లో అయినా తమ తమ వీలును బట్టి పెళ్లి చేసుకుంటారు కదా. కానీ ఇక్కడ అలా కాదు. రెండూ లేదంటే మూడూ సంవత్సరాలకోసారి మాత్రమే ఈ ఊళ్లో పెళ్లి బాజాలు మోగుతాయి. పెళ్లి చేసుకునే జంటలన్నీ కలిసి ఒకే ముహూర్తం పెట్టుకుని ఇంటింటా పచ్చని పందిళ్లు వేసుకుని ఒకే దగ్గర ఘనంగా జరుపుకుంటాయి. అలా ఒకేసారి వంద నుంచి రెండొందల జంటలు పెళ్లి చేసుకుంటాయట. అసలీ ఆనవాయితీ ఎలా పుట్టిందీ అంటే... ఈ ఊరివాళ్ల ప్రధానవృత్తి చేపలు పట్టడం. వాళ్లకు అంతంత మాత్రమే వచ్చే ఆదాయంతో విడివిడిగా పెళ్లి చేస్తే చాలా ఖర్చు అవుతుంది కదా. అలా అవ్వకుండా అందరికీ ఉపయోగకరంగా ఉండేందుకు ఊరంతా కలిసి ఇలా సామూహిక వివాహాల పద్ధతిని పాటిస్తున్నారు. మిగతా ఊళ్లకీ ఆదర్శంగా నిలబడ్డారు.    


పండగరోజే పెళ్లి...

చాలా గ్రామాల్లో శివరాత్రి రోజున పండగ చేసుకుంటారు. కానీ తెలంగాణ కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని మహాగాంలో మాత్రం పండగతో పాటూ పెళ్లిళ్లూ చేసుకుంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ శివరాత్రి రోజున కాబోయే జంటలు ఒకే దగ్గర చేరి సామూహికంగా పెళ్లిచేసుకుంటాయి. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వధూవరులకు పెళ్లి ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో ఈ గ్రామంలో సురోజీ మహరాజ్‌ అనే ఆయన 1971 నుంచీ ఉచితంగా సామూహికంగా పెళ్లిచేసే పద్ధతిని మొదలుపెట్టాడట. ఆయన మరణించిన తర్వాత కూడా సురోజీ మహరాజ్‌ ఏర్పాటు చేసిన సేవాశ్రమం ద్వారా ఈ ఊళ్లో అదే ఆనవాయితీ కొనసాగుతోంది. పెళ్లి తంతులకు కావాల్సిన వస్తువులూ, పెళ్లి బట్టలూ, మంగళసూత్రమూ లాంటివి అందిస్తుంటారు. ఉచితంగా పెళ్లిభోజనాలూ ఏర్పాటు చేస్తారు. ఈ ఊరివాళ్లే కాదు, ఎవరైనా సరే శివరాత్రి రోజున ఇక్కడికి వచ్చి ఉచితంగా వివాహం చేసుకోవచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని