పండుగ వేళ... నోరూరేలా...

దీపావళి రోజున చేసుకునే వంటకాల్లో స్వీటూ హాటూ తప్పనిసరిగా ఉండాల్సిందే కాబట్టి... ఈసారి ఆ పదార్థాల్లో ఇలాంటి వంటకాలనూ చేర్చుకుంటే సరి.

Published : 22 Oct 2022 23:24 IST

పండుగ వేళ... నోరూరేలా...

దీపావళి రోజున చేసుకునే వంటకాల్లో స్వీటూ హాటూ తప్పనిసరిగా ఉండాల్సిందే కాబట్టి... ఈసారి ఆ పదార్థాల్లో ఇలాంటి వంటకాలనూ చేర్చుకుంటే సరి.


మసాలా బాదం

కావలసినవి: సెనగపిండి: అరకప్పు, బియ్యప్పిండి: రెండు టేబుల్‌స్పూన్లు, మొక్కజొన్నపిండి: రెండు టేబుల్‌స్పూన్లు, పసుపు: పావుచెంచా, కారం: చెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద: అరచెంచా, ఇంగువ: చిటికెడు, ఉప్పు:
అరచెంచా, బాదం గింజలు: ఒకటిన్నర కప్పు, నూనె: వేయించేందుకు సరిపడా, చాట్‌మసాలా: అరచెంచా.  

తయారీ విధానం: ఓ గిన్నెలో బాదం, నూనె, చాట్‌మసాలా తప్ప మిగిలిన పదార్థాలన్నీ తీసుకుని బాగా కలపాలి. తరువాత బాదం, రెండు చెంచాల నూనె వేసి కలపాలి. ఇందులోనే రెండు పెద్ద చెంచాల నీళ్లు చల్లి... గట్టి పిండిలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి వేయించేందుకు సరిపడా నూనె వేయాలి. అది వేడెక్కాక ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకుంటూ ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. వేడి చల్లారాక పైన చాట్‌మసాలా చల్లితే సరి.  


డ్రైఫ్రూట్స్‌ హల్వా

కావలసినవి: మొక్కజొన్నపిండి: కప్పు, నీళ్లు: మూడున్నర కప్పులు, చక్కెర: రెండుకప్పులు, నెయ్యి: అరకప్పు, జీడిపప్పు-బాదం-పిస్తా-కిస్‌మిస్‌ పలుకులు: అన్నీ కలిపి ముప్పావుకప్పు, యాలకులపొడి: అరచెంచా.
తయారీ విధానం: ఓ గిన్నెలో మొక్కజొన్నపిండి, రెండున్నర కప్పుల నీళ్లు తీసుకుని ఉండలు కట్టకుండా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి మిగిలిన నీళ్లు పోసి, చక్కెర వేసి కలపాలి. చక్కెర పూర్తిగా కరిగాక మొక్కజొన్నపిండి మిశ్రమాన్ని వేసి స్టౌని సిమ్‌లో పెట్టి... మధ్యమధ్య కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం దగ్గరకు అవుతున్నప్పుడు కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ... కలుపుకోవాలి. రెండుమూడు నిమిషాలయ్యాక డ్రైఫ్రూట్స్‌ పలుకులు, యాలకులపొడి వేసి కలిపి దింపేయాలి. ఈ హల్వాను నెయ్యిరాసిన ప్లేటులో పరిచి...ఓ గంట సేపు ఫ్రిజ్‌లో పెట్టి... బయటకు తీసి ముక్కల్లా కోసుకోవాలంతే.


సేమియా బర్ఫీ

కావలసినవి:సేమియా: కప్పు, నెయ్యి: రెండు టేబుల్‌స్పూన్లు, కొబ్బరితురుము: రెండు టేబుల్‌స్పూన్లు, డ్రైఫ్రూట్స్‌ పలుకులు: టేబుల్‌స్పూను, యాలకులపొడి: పావుచెంచా, కండెన్స్‌డ్‌మిల్క్‌: ముప్పావుకప్పు.

తయారీ విధానం: ముందుగా సేమియాను చిన్నచిన్న ముక్కల్లా చేసుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక సేమియా వేసి అయిదు నిమిషాలు వేయించుకోవాలి. తరువాత అందులో కొబ్బరితురుము,యాలకుల పొడి, డ్రైఫ్రూట్స్‌  పలుకులు వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలయ్యాక కండెన్స్‌డ్‌మిల్క్‌ కూడా వేసి స్టౌని సిమ్‌లో పెట్టి.. మధ్యమధ్య కలుపుతూ ఉంటే... కాసేపటికి ఈ మిశ్రమం
దగ్గరకు అవుతుంది. అప్పుడు దింపేసి... నెయ్యిరాసిన ప్లేటులో పరిచి... అరగంటసేపు ఫ్రిజ్‌లో పెట్టి.. ముక్కల్లా కోస్తే సరి.  


క్రిస్పీ బటన్స్‌

కావలసినవి:బియ్యప్పిండి: కప్పు, మినప్పప్పు: టేబుల్‌స్పూను, సెనగపప్పు: టేబుల్‌స్పూను, పెసరపప్పు: టేబుల్‌స్పూను, కారం: అరచెంచా, కొబ్బరితురుము: రెండు చెంచాలు, ఉప్పు: పావుచెంచా, నూనె: వేయిచేందుకు సరిపడా.

తయారీ విధానం: మినప్పప్పు, పెసరపప్పు, సెనగపప్పును కుక్కర్‌లో వేసుకుని అవి మునిగేలా నీళ్లు పోసి స్టౌమీద పెట్టి... మూడు కూతలు వచ్చాక కట్టేయాలి. తరువాత నీటిని వంపేసి పప్పును మాత్రం ఓ గిన్నెలో వేసుకుని మెత్తగా చేసుకోవాలి. ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలను వేసుకుని కలుపుకోవాలి. తరువాత కొద్దికొద్దిగా నీళ్లు చల్లుకుంటూ గట్టి పిండిలా  కలపాలి. ఈ పిండిని చిన్నచిన్న బిళ్లల్లా చేసుకుని ఓ ప్లేటులో వేసుకోవాలి. వీటిపైన ఉన్న తడి కొద్దిగా ఆరాక కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.


పోహా లడ్డు

కావలసినవి: అటుకులు: కప్పు, బెల్లం తరుగు: ముప్పావుకప్పు, యాలకులపొడి: పావుచెంచా, కొబ్బరి తురుము: అరకప్పు, నెయ్యి: పావుకప్పు, జీడిపప్పు పలుకులు: పది, కిస్‌మిస్‌ పలుకులు: పది.

తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి అటుకుల్ని దోరగా వేయించుకుని తీసుకోవాలి. అదే బాణలిలో కొబ్బరితురుమును కూడా రెండు నిమిషాలు వేయించుకుని తీసుకోవాలి. ఈ రెండింటి వేడి పూర్తిగా చల్లారాక మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఇందులోనే బెల్లం తరుగు, యాలకులపొడి కూడా వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక జీడిపప్పు, కిస్‌మిస్‌ వేయించుకుని అటుకుల మిశ్రమంలో వేసి కలపాలి. తరువాత కొద్దికొద్దిగా తీసుకుంటూ లడ్డూల్లా చుట్టుకుంటే సరిపోతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..