మంచివాడు

పరంధామ పనిచేస్తున్న ఆఫీసు ఆవరణలో చెట్టుకింద స్కూటీ పెట్టి తాళమేశాక ఒక నిమిషం తటపటాయించింది సునంద. ‘తనకు పరంధామతో పెళ్లిచూపులు కూడా జరిగాక తన తండ్రి అతణ్ణి తిరస్కరించాడు. మూడునెలలు తిరక్కుండానే సహాయం కోసం అతని దగ్గరికే వెళ్తోంది...

Updated : 02 Jan 2022 02:27 IST

మంచివాడు

డా. కే.వి.రమణరావు

రంధామ పనిచేస్తున్న ఆఫీసు ఆవరణలో చెట్టుకింద స్కూటీ పెట్టి తాళమేశాక ఒక నిమిషం తటపటాయించింది సునంద. ‘తనకు పరంధామతో పెళ్లిచూపులు కూడా జరిగాక తన తండ్రి అతణ్ణి తిరస్కరించాడు. మూడునెలలు తిరక్కుండానే సహాయం కోసం అతని దగ్గరికే వెళ్తోంది... సబబు కాదేమో’ అనిపించింది.‘పరంధామ చాలా మంచివాడు, అలా అనుకోడు. తప్పకుండా వెళ్లు’ అని వేణు అన్నయ్య చెప్పింది మరోసారి గుర్తు చేసుకుంది. కర్చీఫ్‌తో నుదురు అద్దుకుని ఆఫీసువైపు నడిచింది.

పరంధామ రూము కనుక్కుని వెళ్లేసరికి అతను కంప్యూటర్‌ ముందు దీక్షగా పని చేసుకుంటున్నాడు. వెళ్లి ఎదురుగా నిలబడింది.

అలికిడి అవడంతో తలెత్తి ఒక్కక్షణం చూసి పలకరింపుగా నవ్వి ‘‘కూర్చోండి’’ అన్నాడు పరంధామ. ఏమీ జరగనట్టు అతను చిరునవ్వుతో పలకరించడం ఆమెకు ఆశ్చర్యమైంది.

‘‘మానాన్నకు వైరల్‌ ఫీవర్‌, రాలేక పోయారు. పక్క ఆఫీసులో ఆయన పెన్షన్‌కు సంబంధించిన పని ఉంది’’ అని వివరాలు చెప్పింది సునంద అస్థిరంగా నిలబడి.

‘‘పదండి’’ అని అతను పని ఆపేసి బయలుదేరాడు. పక్క ఆఫీసులో సునంద తండ్రి పని చూసే మనిషి పరంధామను చూడగానే లేచి నిలబడి సాదరంగా ఆహ్వానించాడు.

అతనికి తాము వచ్చిన పని గురించి చెప్పాడు పరంధామ.

అతను కాంతయ్య ఫైలు తీసి చూసి కావలసిన వివరాల లిస్టు, మెయిల్‌ అడ్రస్‌ రాసిచ్చి ‘‘ఈ వివరాలు మెయిల్‌ చెయ్యండి. వారం రోజుల తరువాత ఆర్డరు కాగితం తీసుకెళ్లండి. పరంధామ చెప్పాక ఇక ఆగేదేమీ ఉండదు’’ అన్నాడు నవ్వుతూ.

అతనికి కృతజ్ఞతలు చెప్పి బయటకు వచ్చారు. ఆఫీసు ఆవరణలో పరంధామను అందరూ అభిమానంగా పలకరించడం గమనించింది సునంద.

‘నాన్న ఇతణ్ణి అప్రయోజకుడి కింద కొట్టేశాడు. ఇతనలా అనిపించడం లేదే?’ అనుకుంది. అతని గురించి ఇంకా తెలుసుకోవాలనిపించింది సునందకు.

‘‘మీకు అభ్యంతరం లేకపోతే కాఫీ తాగుదామా’’ అంది సునంద దూరంగా ఉన్న క్యాంటీన్‌ వైపు చూస్తూ. ఎత్తైన చెట్ల నీడల్లో ఆ మధ్యాహ్నం చల్లగాలి వీస్తోంది. క్యాంటీన్‌ పైకప్పంతా రాలిన గుల్మొహర్‌ పూలు పరుచుకున్నాయి.

క్యాంటీన్‌ ఖాళీగా ఉంది. పరంధామ కనిపించగానే ఓనరు వచ్చి మర్యాదగా వాళ్లను తీసుకెళ్లి కూర్చోబెట్టి కాఫీ తీసుకురావడానికి వెళ్లాడు.

కాసేపు ఒకదానికొకటి అతకని విషయాలు మాట్లాడాక ‘‘మీ సంబంధం మా నాన్నకూ అమ్మకూ ఇష్టం లేకపోయింది’’ అంది సునంద అతనివైపు చూడకుండా...

‘మరి మీ అభిప్రాయమేంటి?’ అని పరంధామ అడగలేదు. అలా అడుగుతాడని ఆశించి భంగపడినట్టు ఆమె ఒకసారి కిటికీ అవతలి పసుప్పూల చెట్టు వైపు చూసింది. అతనివైపు తిరిగి ‘‘నేను మీకు నచ్చానని చెప్పారట. నేనంత అందంగా ఉండను కదా, పైగా ప్రైవేటు స్కూల్లో టీచర్ని. పరిహారంగా పెళ్లికొడుకులు కట్నమెక్కువ అడిగారు. అది నాకిష్టం లేకపోవడం వల్ల నాకింకా పెళ్లి కాలేదు. మీకెలా నచ్చాను?’’ అంది.

‘‘అందం, రంగుల గురించి నాకంతగా తెలియదు. కొంతమంది కొలమానాలు ఏర్పరిస్తే మిగతావాళ్లు ఇతర కట్టుబాట్లలాగే వాటిని అనుసరిస్తారనుకుంటా. ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి జీవించడానికి ఇద్దరూ ఇష్టపడడం మినహా మిగతావన్నీ అంత ముఖ్యమని నేననుకోను’’ అన్నాడు పరంధామ.

‘‘మానాన్న అబ్బాయిని ఎంపిక చేసేటప్పుడు అతని ఆస్తిపాస్తులూ, ఉద్యోగం, బాధ్యతల గురించి తెలుసుకునేవాడు’’ అంది.

పరంధామ చిన్నగా నవ్వి ‘‘వాటన్నింటిలో నేను మీ కనీసస్థాయి కంటే కిందనే ఉన్నట్టున్నాను’’ అన్నాడు. అతని ముఖంలో ఏ భావమూ లేదు.

‘దేని గురించీ ఇతను ఎక్కువగా ఆలోచించడేమో’ అనుకుంటూ ఆమె అతణ్ణి కన్నార్పకుండా చూసింది. సాదా దుస్తులూ, వెనక్కిదువ్విన జుట్టు, చల్లని పెద్దకళ్లు, తీరైన ముక్కు, స్వచ్ఛమైన నవ్వు... ‘తీరిగ్గా చూస్తే బాగానే ఉన్నాడు’ అనుకుంది.

కాఫీ తాగడం అయింది. ఓనరు పరంధామకు నమస్కారం పెట్టి డబ్బులు తీసుకోలేదు. బయటికి వచ్చాక ఆమె ధన్యవాదాలు చెప్పి తన స్కూటీ వైపు నడిచింది.

వేణు- సునందకీ పరంధామకీ కామన్‌ చుట్టం... పెళ్లి సంబంధం తెచ్చినప్పుడు వేణు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఆమెకి. ‘‘పరంధామది గవర్నమెంటు ఉద్యోగం, నిజాయతీగల మనిషి, ఇతరుల విషయాల్లో తల దూర్చడు, అందరికీ చేతనైనంత సాయం చేస్తాడు. పక్షపాతంతో పదేళ్లుగా మంచంమీదున్న తల్లిని అన్నివిధాలా అతనే చూసుకుంటున్నాడు. చాలా మంచివాడు’’ అని.

పెళ్లిచూపులయ్యాక కాంతయ్య విడిగా సమాచారం సేకరించి ‘పరంధామకు డబ్బు లక్ష్యం, కుదురూ లేవు. కష్టాల్లో ఉంటే కొత్తవాళ్లైనా సరే సొంత డబ్బు ఖర్చుపెడతాడు. పేద విద్యార్థులకు ఫీజులు కడతాడు. ప్రభుత్వాసుపత్రిలో పేదరోగులకు సేవచేస్తాడు. నెలాఖర్న మిగిలేదేమీ ఉండదు. నూటయాభై గజాల జాగాలో మూడు గదుల పాతయిల్లు తప్ప మరో ఆస్తి లేదు. ఇంకో స్థలమో, ఇల్లో కావాలన్న దృష్టే లేదు. వట్టి అప్రయోజకుడు’ అని తేల్చి ఈ సంబంధం వద్దన్నాడు.

‘ఇతను అప్రయోజకుడిలా లేడే? నాన్న అంచనా వేయడంలో పొరపాటు జరిగినట్టుంది’ అనుకుంది సునంద స్కూటీ స్టాండు తీస్తూ...

వారంరోజుల తర్వాత పరంధామ నుంచి సునందకు ఫోన్‌ వచ్చింది. ‘‘మీ నాన్నగారి పని అయింది. అతను ఆర్డరు కాగితం నాకిచ్చివెళ్లాడు. మీరెప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు. మీ ఫోన్‌ నంబరు మీ వేణు అన్నయ్య ఇచ్చాడు’’ అని చెప్పాడు.

అతనికి ధన్యవాదాలు చెప్పి ‘‘స్కూలు పనులతో పగలు కుదరడం లేదు. సాయంత్రం మీఇంటికొచ్చి తీసుకోవచ్చా?’’ అనడిగింది సునంద. ‘అలా వెళ్తే ఇల్లు కూడా చూడొచ్చు, అతణ్ణి ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు’ అనుకుంటూ...
‘‘మీ ఇష్టం’’ అని ఫోన్‌ పెట్టేశాడు పరంధామ.

‘పని చేయించడమే కాక తన నంబరు కనుక్కుని ఫోన్‌ చేశాడు, జడపదార్ధం కాదు’ అనుకుంది సునంద.

మూడోరోజు సాయంత్రం సునంద పరంధామ ఇంటికి వెళ్లింది. అప్పుడే అతను తనతల్లి మంగమ్మను చక్రాలకుర్చీలో పార్కులో తిప్పి తెస్తున్నాడు. పరంధామ మంగమ్మకు సునందను పరిచయం చేసి ఆమె వచ్చిన పని చెప్పాడు.

సునంద ఆ మూడుగదుల ఇంటిని పరిశీలనగా చూసింది. మధ్యలో హాలు, ఒకవైపు పడగ్గది, రెండోవైపు వంటిల్లు. పుస్తకాలు తప్ప వాషింగ్‌ మిషన్‌, కంప్యూటర్‌, సోఫాలాంటి సామాన్లేవీ లేవు. పడగ్గదికి మంగమ్మకోసం ఏసీ పెట్టించి ఒక ఆసుపత్రిగా మార్చాడు. తలవైపు పైకిలేచే ఆసుపత్రి మంచం, ర్యాకుల నిండా మందులూ, బట్టలూ, డైపర్ల డబ్బాలూ ఉన్నాయి. అటాచ్డ్‌ బాత్‌రూమ్‌లోంచి సన్నగా ఫినాయిల్‌ వాసనొస్తోంది.

పరంధామ వంటగదిలోకి వెళ్లాడు. సునంద మంగమ్మ దగ్గరే కుర్చీలో కూర్చుని ‘‘ఎలా ఉంది మీ ఆరోగ్యం’’ అని అడిగింది.

‘‘క్రితం జన్మలో ఏం పాపం చేశానో తల్లీ రోగం బాగవకుండా, ప్రాణం పోకుండా ఇలా వాడినెత్తిన కూర్చున్నాను. నన్ను వెంటనే తీసుకుపో స్వామీ అని రోజూ మొక్కుతున్నా ఆ భగవంతుడికింకా దయరాలేదు’’ అంది మంగమ్మ.

‘‘పరంధామ మిమ్మల్ని కంటికిరెప్పలా చూసుకుంటున్నారు కదా... త్వరలోనే మీ ఆరోగ్యం బాగైపోతుందిలెండి’’ సానుభూతిగా అంది సునంద.

‘‘పాపం బిడ్డ... నా పనంతా వాడే చేస్తాడు. వంట చేసి పొద్దున్నా రాత్రీ తినిపిస్తాడు. మందులు వేస్తాడు. రాత్రిళ్లు ఇక్కడే మడత మంచం వేసుకుని సాయంగా పడుకుంటాడు. చెప్పడానికి నాకే సిగ్గుగా ఉంటుంది. అర్ధరాత్రిళ్లు బాత్‌రూమ్‌కి తీసుకెళ్తాడు. డైపర్లు మార్చుకోవడంలో కూడా సాయం చేస్తాడు. వాడి మనసు అద్దం తల్లీ అద్దం.’’

‘‘మరి ఆయన ఆఫీసుకెళ్లినప్పుడు?’’

‘‘మరో ఆడమనిషి లేని ఇల్లు. వాడు లేనప్పుడు నా పనులు చేయడానికి ఒకామెను పెట్టాడు. ఆమెనూ తల్లిలాగే చూసుకుంటాడు.’’

‘‘మీరు చాలా అదృష్టవంతులు. ఆరోగ్యంగా ఉన్న తల్లిదండ్రులనే పిల్లలు సరిగ్గా చూడని ఈ రోజుల్లో ఇంత బాగా చూసుకుంటున్నారంటే మాటలా..?’’

‘‘అదే వాడికి శాపమైంది. ఒక్క పెళ్లి సంబంధమూ కుదరడం లేదు. పిల్లవాడు ‘ఎంతో మంచివాడు’ అని ఎవరు చూస్తున్నారు? ‘నన్ను తీసుకెళ్లి ఏ వృద్ధాశ్రమంలోనో పడెయ్యరా’ అంటే వినడు’’ అంది మంగమ్మ సునంద కళ్లలోకి చూస్తూ.

పరంధామ బిస్కట్లూ, బాదంపాలూ తీసుకొచ్చి ఇచ్చాడు. మంగమ్మ పాలు తాగాకా ఆమె కుడిచేతికీ కాలుకీ మృదువుగా తైలం మర్దన చేశాడు. అతను తల్లి పనులన్నీ మనసుపెట్టి చేస్తున్నట్టు సునంద గమనించింది.

పరంధామ వారిస్తున్నా వినకుండా ఖాళీ కప్పులు తీసుకెళ్లి పెరట్లో పెట్టింది సునంద. పెరట్లో జాజితీగ, మల్లె, నందివర్ధనం, నైట్‌ క్వీన్‌ మొక్కలున్నాయి. ‘ఇతనికి తెల్లపూలంటే ఇష్టమా’ అనుకుంది.

పరంధామ వచ్చి సునందకు కాంతయ్య ఆర్డరు కాగితం ఇచ్చాడు.

సునంద థాంక్యూ చెప్పి ‘‘మీరు మీ అమ్మగారిని చాలా శ్రద్ధగా చూసుకుంటున్నారు’’ అంది.

‘‘అమే నాకు తల్లీ, తండ్రీ, అక్కా, చెల్లెలు అన్నీ అయి నానా యాతనలు పడి పాతికేళ్లు పెంచింది. నేను చేస్తున్నదెంత?’’ అన్నాడు.

అతని సమక్షంలో ప్రశాంతంగా ధైర్యంగా ఉన్నట్టు అనిపించింది సునందకు.

సునంద మంగమ్మకు వీడ్కోలు చెబుతుండగా ఇంటిముందు ఆగిన పెద్దకార్లోంచి తెల్లకోటూ, సెతస్కోపుతో ఒక డాక్టరు లోపలికొచ్చాడు. పరంధామ సునందకు ఆయన్ని ఆ ఊరిలో పేరున్న తీరికలేని న్యూరాలజిస్టుగా పరిచయం చేస్తూ ‘‘వీరు మా అమ్మను చూడ్డానికి వద్దన్నా ప్రతి సాయంకాలం వస్తారు’’ అన్నాడు నవ్వుతూ.

డాక్టరు నవ్వి మంగమ్మను పరీక్షిస్తూ ‘‘ఇవాళ ఒంట్లో ఎలా ఉంది మామ్మగారూ’’ అని అడిగాడు.

‘‘మొండి ప్రాణం బాగానే ఉంటుంది బాబూ. నాకోసం యమభటులూ రావడం లేదు, వాడికి పెళ్లీ అవడం లేదు’’ అంది మంగమ్మ నిరసనగా.

డాక్టరు పెద్దగా నవ్వి ‘‘మీరు పరంధామ సంరక్షణలో ఉండగా రావడానికి యమభటులకు ఎన్ని గుండెలు? ఈ కాలంలో పెళ్లిళ్లు ఆలస్యంగానే అవుతున్నాయి. తొందర్లోనే అన్నీ సర్దుకుంటాయి. మీరు ఉల్లాసంగా ఉండాలి’’ అని ధైర్యం చెప్పి, బయటకి నడిచాడు డాక్టరు. సునంద కూడా బయటకి వచ్చింది.

డాక్టరు ఆగి ‘‘ఈమెకు సేవచేస్తే నా తల్లికి చేసినట్టుగానే భావిస్తాను. ఆరేళ్లక్రితం మా అమ్మకి పెద్దజబ్బు చేసినప్పుడు విదేశాల్లో ఉండి రాలేకపోయాను. నేను వచ్చేసరికి ఆమె పోయింది’’ అని చేతిరుమాలుతో కళ్లద్దుకుని ఆమెకు బై చెప్పి కారెక్కి వెళ్లిపోయాడు. సునంద బయలుదేరుతూ పరంధామ ఇంటివైపు ఒకసారి ఆదరంగా చూసింది.

ఆ మరుసటి రోజు సునంద, వేణు ఇంటికి వెళ్లింది.

వేణుకి జరిగిందంతా చెప్పి... ‘‘అసలు మానాన్న పరంధామ సంబంధాన్ని ఎందుకు వద్దన్నాడు?’’ అని అడిగింది.

‘‘పెళ్లిచూపులయ్యాక నేను మాట్లాడ్డానికి వచ్చిన రోజున నువ్వు ఇంట్లో లేవు. జరిగిందంతా చెబుతాను విను’’ అని ప్రారంభించాడు.

*   *   *

ఆరోజు వేణు వెళ్లేసరికి ఇంట్లో కాంతయ్య, సునంద తల్లి భాగ్యమ్మ ఇద్దరే ఉన్నారు. కాఫీలయ్యాక పరంధామ విషయం ప్రస్తావించి ‘‘మరోసారి ఆలోచించండి’’ అన్నాడు వేణు.

‘‘చేసుకోబోయే మనిషి ఎలాంటివాడు, ఇంటి పరిస్థితి ఎలా ఉంది అనేవే కదా చూస్తాం’’ అన్నాడు కాంతయ్య.

‘‘పరంధామను మీరు వ్యావహారిక దృష్టితో చూసి అతని మంచితనాన్ని అపార్థం చేసుకున్నారు. అతనికి మనుషులంటే అపారమైన ప్రేమ. మంచం మీదున్న తల్లిని ఆప్యాయంగా చూసుకుంటూ అన్ని సేవలూ తనే చేస్తున్నాడు. కోటికొక్కడే అలాంటివాడు ఉంటాడు. పరంధామను ఊళ్లో వాళ్లంతా గొప్ప గౌరవంతో చూస్తారు. డాక్టర్లు ఇంటికే వస్తారు. మార్కెటుకెళ్తే కూరలమ్మేవాళ్లు అతనికి ఉచితంగా ఇవ్వడానికి పోటీ పడతారు. మందులషాపుల్లో అన్నీ తక్కువకే ఇస్తారు. మండీ బజారులో పెద్దసేట్లు అతను షాపులోకెళ్లగానే లేచి నిలబడతారు’’ వివరించాడు వేణు.

‘‘అది సహజమైన గౌరవం కాదు, వాళ్లు చూపించలేని మంచితనాన్నీ, తల్లిపట్ల ప్రేమనీ అతను చూపిస్తున్నాడని అపరాధ భావనతో గౌరవిస్తున్నారు. అతనిపట్ల గౌరవం నిజమే అయితే వాళ్లూ అతనిలాగా ఉండొచ్చుగా? ఏదీ ఎక్కడున్నారూ? అదే రుజువు. పరంధామ మరొకర్ని తప్పుబట్టడు కాబట్టి సరిపోయింది. లేకపోతే వాళ్లందరికీ శత్రువైపోయుండేవాడు’’ జవాబిచ్చాడు కాంతయ్య.

‘‘అయితే పరంధామ మంచితనానికేమీ విలువలేదా?’’

‘‘ఎందుకు లేదూ? అందరు మంచివాళ్లలాగే అతణ్ణీ మహానుభావుణ్ణి చేసి ఎత్తులో కూర్చోబెట్టి గౌరవిస్తున్నారు. ప్రపంచం మంచిని ప్రభోదిస్తుందిగానీ మంచివాళ్లని కలుపుకోదు. ఇదే లోకం పోకడ’’ అన్నాడు.

‘‘నిజం చెప్పండి. అతను ఊరివాళ్లమీద ఖర్చుపెడతాడనీ, తనకోసం మిగుల్చుకోడనీ, రేపు భార్య కూడా ఆ ఇరుకింట్లో అతని తల్లికి సేవ చేయాల్సి వస్తుందనీ... ఇవేగా మీ అభ్యంతరాలు? భవిష్యత్తులో వాళ్ల పరిస్థితి బావుండొచ్చుగా’’ అన్నాడు వేణు కొంచెం ఆవేశంగా.

‘‘పరంధామ నిజంగా మంచివాడు, అందుకే నాకు భయం. అతని మంచితనం తెచ్చిపెట్టుకున్నది అయ్యుంటే నాకు భరోసాగా ఉండేది. ప్రపంచం ఇప్పట్లో మారదు. అతనికి జీవితాంతం కష్టనష్టాలు తప్పవు. తెలిసీ నా కూతుర్ని కష్టాలపాలు చెయ్యలేను’’ తేల్చి చెప్పాడు కాంతయ్య.

భాగ్యమ్మ కలగజేసుకుని ‘‘ఇంకో సంబంధం కుదిరేట్టుంది వేణూ, అతను విడాకులు తీసుకున్నాడని ఆలోచిస్తున్నాం. కుర్రాడు పెద్ద ఉద్యోగస్తుడు, స్థితిపరుడు. మేం కూతురి సుఖం చూడాలి కదా’’ అంది.

‘‘మంచివాడు రెండో పెళ్లివాడి కంటే తక్కువైపోయాడా? పోనీ పరంధామ విషయంలో సునంద అభిప్రాయం కనుక్కున్నారా?’’ అన్నాడు వేణు ఆఖరి ప్రయత్నంగా...

‘‘మిగతావన్నీ బావున్నప్పుడే కదా అమ్మాయిని సంప్రదిస్తాం’’ అంది భాగ్యమ్మ.

ఆ తర్వాత వేణు కోపంగా వెళ్లిపోయాడు.

*   *   *

‘‘అదీ జరిగింది’’ అని, ‘‘నువ్వు పరంధామను కలిశావు, వాళ్ల ఇంటికి వెళ్లొచ్చావు, అతని గురించి ఏమనుకుంటున్నావు?’’ అడిగాడు వేణు.

‘‘నాకు రెండ్రోజులు టైమివ్వు’’ అని సెలవు పుచ్చుకుంది సునంద.

నాలుగు రోజుల తరువాత ఇంట్లో మేడమీద పేపర్లు దిద్దుకుంటూ కూర్చున్న సునంద ఫోన్‌ మోగింది. చూస్తే వేణు.

‘‘నువ్వు పరంధామ ఇంటికి వెళ్లొచ్చావు కదా... మీ నాన్నతో మరోసారి పెళ్లి విషయం మాట్లాడమని మొన్నటి నుంచీ మా మంగమ్మత్త రోజూ ఫోన్‌ చేసి నా ప్రాణం తీస్తోంది. ఏం చెయ్యమంటావు?’’ అన్నాడు నవ్వుతూ...

‘‘మానాన్న ఈమధ్యే నీరసం నుంచి తేరు కున్నారు. పరంధామను కలిసిన విషయం రేపు చెప్పాలని అనుకుంటున్నాను. నువ్వు కూడా ఓసారి మాట్లాడు’’ అంది సునంద.

‘‘నువ్వేదయినా మీ నాన్నతో సానుకూలంగా చెప్తేనే కదా నేను ఆయనతో మాట్లాడ్డానికి రాగలను’’ అన్నాడు వేణు.

‘‘కష్టమైనా సరే, మంచితనం అంతరించి పోకుండా తోడుగా నిలబడాల్సిన అవసరం గురించి మా నాన్నకు చెబుతాను. వచ్చి మాట్లాడు. ఈసారి మానాన్న

ఒప్పుకోవచ్చు... కాదు, కాదు, ఒప్పుకుంటారు’’ అంది సునంద నవ్వుతూ...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..